ఇంగ్లీషు లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. కొంతకాలం స్కూలు ప్రిన్సిపాల్గానూ పనిచేశారు. తండ్రి నాగభూషణం స్ఫూర్తితో వ్యవసాయం మొదలుపెట్టారు. వ్యవసాయం అంటే అందరూ చేసినట్లు వరి, పత్తి, మిరప, మొక్కజొన్న లాంటివి కాకుండా సరికొత్త ఆలోచనతో సాగు చేయాలని భావించారు. ప్రకాశం జిల్లా ఇలపావులూరులో కొండల దిగువన 25 ఎకరాల్లో దానిమ్మ సాగు చేసి విజయవంతం అయ్యారు. కావ్య ఆగ్రోస్ పేరిట ఆమె ఎవరంటే.. రామరాజు లక్ష్మీసుజాత. లక్ష్మీసూజాత సొంతూరు ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం.వ్యవసాయం చేయాలనుకోవడంతో ఎక్కడ ఎలాంటి పంట పండిస్తే ప్రయోజనం ఉంటుందో అని తాను తన భర్త ముందుగా ఆలోచించామని లక్ష్మీసుజాత చెప్పారు. కొండ దిగువన పలువురు రైతులకు చెందిన భూమి బిట్లు బిట్లుగా ఉందని, రాళ్లు, రప్పలతో నిండి ఉన్న ఆ భూమిని పెద్ద వ్యవసాయ క్షేత్రంగా తయారు చేయడానికి ఏడాది పాటు కష్టపడ్డారు. సమీపంలో ఉన్న చెరువు నుంచి వెయ్యి ట్రాక్టర్ల నల్లమట్టి తీసుకొచ్చి క్షేత్రంలో వేశామన్నారు. క్షేత్రానికి అవసరమైన నీటి సరఫరాకు బోరు మోటార్లకు 4 సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ శాఖ అధికారుల సాయంతో కరెంట్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రకాశం జిల్లాలో నీటి సదుపాయం తక్కువ కనుక తమ దానిమ్మ క్షేత్రానికి డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నామన్నారు.మట్టి, నీరు సిద్దం చేసుకున్న తర్వాత ‘బగువా’ రకం దానిమ్మ రకాన్ని ఎంపిక చేసుకున్నారు లక్ష్మీసుజాత. కాయ వలిచినప్పుడు గింజలు నీట్గా మన చేతిలోకి వచ్చేయడం బగువా రకం దానిమ్మలో విశేషం. నెలరోజుల వయసున్న చిన్న దానిమ్మ మొక్కల్ని తీసుకున్నామని అన్నారు. మొక్క నాటే ప్రదేశంలోని వాతావరణాన్ని తట్టుకునే శక్తి వచ్చే వరకు ఓ 15 రోజుల పాటు అలాగే ఉంచాలన్నారు. ఆ తర్వాత మొక్కను నాటుకుంటే స్థానిక వాతావరణానికి బగువా దానిమ్మ మొక్క అలవాటు పడుతుందని లక్ష్మీసుజాత తెలిపారు. ప్రకాశం జిల్లాలో 250 రోజులు 30 డిగ్రీలకు పైగా ఎండలే ఉంటాయి కాబట్టి తమ క్షేత్రంలో రెండు తోట చెరువులు ఏర్పాటు చేశారు.దానిమ్మ సాగును లక్ష్మీసుజాత దంపతులు ఆర్గానిక్ విధానంలో చేస్తున్నారు. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు వేస్తున్నారు. రసాయనాలు వాడకుండా చేస్తున్న దానిమ్మ పంటకు వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ వస్తోందని తెలిపారు. సహజసిద్ధ ఎరువుల వినియోగం ద్వారా తాము సాగు చేస్తున్న క్షేత్రం బాగా సారవంతం అయిందని, పంట దిగుబడి కూడా పెరిగిందని చెప్పారు. లక్ష్మీసుజాత తమ క్షేత్రంలో దానిమ్మతో పాటు జామ, బత్తాయి, బొప్పాయి, నిమ్మ, కూరగాయలు కూడా విరివిగా పండిస్తున్నారు. లక్ష్మీసుజాత తమ వ్యవసాయ క్షేత్రంలోనే సేంద్రీయ ఎరువులు, కషాయాలు స్వయంగా తయారు చేస్తున్నారు.లక్ష్మీసుజాత ఆర్గానిక్ విధానంలో తయారుచేసే కషాయాల గురించి తెలుసుకుందాం. ఎకరా దానిమ్మ తోటకు 5 కిలోల అరటిపళ్లను మిక్సీలో గుజ్జుగా చేయాలి. దాన్ని ఒక రోజంతా నిల్వ ఉంచాలి. దాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి వడపోసి డ్రిప్ ద్వారా మొక్కలకు సరఫరా చేయాలి. అరటిపండ్ల కషాయాన్ని మార్చి నెలలో రెండు సార్లు మొక్కలకు అందించాలి. అరటి పండ్లలో పొటాష్ ప్రకృతిసిద్ధంగా లభిస్తుందని లక్ష్మీసుజాత చెప్పారు. రెండో కషాయంగా 2 కిలోల బెల్లాన్ని 200 లీటర్ల నీటిలో నానబెట్టి వారం రోజుల పాటు ఫర్మంట్ చేయాలి. దీన్ని ఇవ్వడం వల్ల బెల్లంలో సహజంగా ఉంటే ఐరన్ అంతా మొక్కకు అంది చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. మూడు కషాయంగా కలబంద గుజ్జును ఒక డ్రమ్ములో నీటిలో వేసి వారం రోజుల పాటు కుళ్లబెట్టాలి. దాన్నుంచి వచ్చే నీరు లాంటి ద్రవం నీటిలో బాగా కలిసిపోతుంది. ఐదు లీటర్ల పాలను కొద్దిగా నీటిలో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించడం ద్వారా దానిలో సహజంగా ఉండే లాక్టోజెన్ అందుతుంది. ఆవుపేడ, గోమూత్రం, బెల్లం, శెనగపిండి కలిపిన 2 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి లక్ష్మీసుజాత తమ దానిమ్మ మొక్కలకు డ్రిప్ ద్వారా అందిస్తారు.ఏప్రిల్, మే నెలలు దానిమ్మ మొక్కలకు విశ్రాంతి సమయం. ఆ సమయంలో పూత వచ్చినా కత్తిరించేసి, మొక్క ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని సుజాత చెప్పారు. మే నెలలో 20 నుంచి 25 రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేయాలి. అప్పుడు దానిమ్మమొక్క ప్రూనింగ్ చేసుకోవాలన్నారు. దాంతో చెట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు పువ్వు కూడా చాలా పెద్దగా ఆరోగ్యంగా వస్తుంది. దానిమ్మ మొక్క కాపు కాసి, పంట కోసిన తర్వాత అది పొటాష్ తగ్గి కాస్త డల్ అవుతుంది. అరటిపండ్ల కషాయం ఇస్తే అది మళ్లీ బలంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.పూర్వకాలంలో రైతులు ప్రధానమైన వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడకుండా ఆవులు, గేదెలు, కోళ్లు ఇలా ఇతర జీవాలు కూడా పెంచేవారు. దాంతో ఒక ఏడాది పంట సరిగా రాకపోయినా జీవాల ద్వారా రైతు కుటుంబం ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కేది. కానీ ఆధునిక కాలంలో రైతులు పాడి, కోళ్లు ఇతర జీవాలను పెంచలేకుండా కేవలం వ్యవసాయం మీదే ఆధారపడడం ఇబ్బందులకు కారణం అవుతోందని లక్ష్మీసుజాత చెప్పారు. ఒక్క ఏడాది కాలం కలిసి రాకపోతే నిరాశ చెందకుండా చేసిన తప్పులేంటో గమనించుకుని మళ్లీ సాగు చేస్తే మంచిఫలితాలు రాబట్టవచ్చన్నారు. మనకు ఉన్న భూమిలో ప్రతి నిత్యం డిమాండ్ ఉండే నాలుగైదు రకాల ఆకుకూరలు పెంచితే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందన్నారు. వాటితో పాటు కూరగాయల సాగుకు కూడా ప్రాధాన్యం ఇస్తే ఒక పంట పోయినా మరో పంట ద్వారా ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చన్నారు. తద్వారా రైతు నిలదొక్కుకోవచ్చని తెలిపారు.ఆధునిక కాలంలో వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఉద్యోగం అంటూ వెళ్లిపోతున్నారని, అయితే.. ఒక రైతు పది మందికి ఉపాధి కల్పించగలడనే నిజాన్ని గుర్తించాలని లక్ష్మీసుజాత చెప్పారు.

సన్న చిన్నకారు రైతులకు పీసెంట్ ఆగ్రో సంస్థ ద్వారా మార్కెటింగ్ సౌకర్యాన్ని లక్ష్మీసుజాత కల్పిస్తున్నారు. కావ్య ఆగ్రో పేరుతో దానిమ్మ, స్నాక్ ప్యాక్, జ్యూస్, జామ్ లాంటి ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నారు. సమీకృత సేంద్రీయ వ్యవసాయం ద్వారా తోటి మహిళలకు లక్ష్మీ సుజాత ఆదర్శంగా నిలుస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here