మరఠ్వాడా.. మహారాష్ట్రలో బీడ్‌ జిల్లాలో ఉన్న ప్రాంతం ఇది. నిత్యం తీవ్ర కరువు కాటకాలతో అల్లాడిపోయే నేల.. ప్రతి ఏటా అన్నదాతల ఆత్మహత్యలకు పెట్టిన పేరున్న ప్రాంతం. అలాంటి బీడ్‌ జిల్లాలో ఆర్గానిక్‌ బొప్పాయి పంటతో తళుక్కున మెరుస్తున్నాడో యువరైతు.. పంటలు పండించడం అంటేనే హడలిపోయే చోట ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. వ్యవసాయం అంటే నష్టం, కష్టం కాదు.. లాభాల పంట అని నిరూపిస్తున్నాడు సందీప్‌ గిట్టే అనే యువరైతు. ఎలాంటి రసాయనాలు వాడకుండా, ప్రకృతి వ్యవసాయ విధానంలో, అతి తక్కువ ఖర్చుతో లాభాలు సంపాదిస్తున్నాడు. ఎకరం పొలంలో సుమారు 60 టన్నుల బొప్పాయి పంట దిగుబడి సాధిస్తున్నాడు. బీడ్‌ జిల్లా నందగౌల్‌ గ్రామానికి చెందిన రైతు సందీప్‌ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అనేక ఔషధ విలువలున్న బొప్పాయి పంట పండించడంలో సందీప్‌ వార్తల్లోకెక్కాడు. అనావృష్టి కారణంగా నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సరికొత్త సాంకేతికతను కూడా జోడించి బొప్పాయి పంట పండిస్తున్నాడు సందీప్‌.

సందీప్‌ గిట్టే కుటుంబానికి 40 ఎకరాల భూమి ఉంది. ఆ పొలంలో 2019 నుంచి బొప్పాయితో పాటు పుచ్చకాయల పంట, నిమ్మ, మామిడి, సోయాబీన్‌ పంటలు పండిస్తున్నారు. ఓ 30 ఎకరాల్లో సోయాబీన్‌, కంది, జొన్న పంటల్ని రోటేషన్‌ పద్థతిలో పండిస్తుంటారు. అనావృష్టితో కూనారిల్లుతున్న తమ ప్రాంతంలో ఈ పంటలకు పెద్దగా నీటి వినియోగం అవసరం ఉండది. వీటిలో ఏ పంటకైనా ఎకరానికి వచ్చి 20 నుంచి 23 వేల రూపాయల వరకు మాత్రమే ఆదాయం వస్తోందని సందీప్‌ గిట్టే వివరించాడుసరైన వర్షాలు లేక బీడ్ ప్రాంతం తరచుగా అనావృష్టికి గురవుతూ ఉంటుంది. దాంతో సందీప్ కుటుంబం తమ పొలంలో హార్టీకల్చర్‌ సాగు చేద్దామనుకున్నరు. అయితే.. హార్టీకల్చర్‌కు పెట్టుబడి ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. సందీప్ కుటుంబం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టగలిగే స్థితిలో లేదు. మరి పండ్ల జాతులు పెంచాలనుకున్నా అందుకు ఎక్కువ మోతాదులో నీటి అవసరం ఉంటుంది. పండ్ల వ్యవసాయం కూడా తమ ప్రాంతానికి సరిపడదు. నీరు సరిగా లేనందువల్ల పండ్ల మొక్కలు సరిగా ఎదగవు. ఆరోగ్యంగానూ ఉండవు. ఈ కారణాలతో సరైన పంట దిగుబడులు రావు. తద్వారా నష్టాలు మూటకట్టుకోవాల్సి వస్తుందని సందీప్ విశ్లేషించాడు.

మరఠ్వాడాలోని కరువు పీడిత ప్రాంత రైతులతో గ్లోబల్‌ పార్లీ అనే స్వచ్ఛంద సంస్థలో సామాజిక కార్యకర్త మయాంక్ గాంధీ చేస్తున్న కృషి గురించి 2019లో సందీప్ విన్నాడు. పండ్ల సాగు విషయంలో తమకు సాయం చేయాలని మయాంక్‌ గాంధీని సందీప్‌ కోరాడు. సరైన నారు లభించని మరఠ్వాడా ప్రాంతంలో మంచి నారును సబ్సిడీ ధరకు స్వచ్ఛంద సంస్థ ద్వారా మయాంక్ గాంధీ అందజేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంతో పాటు ఆధునిక సాంకేతికతపైన కూడా ప్రతి 10 నుంచి 15 రోజులకోసారి రైతులకు గ్లోబల్‌ పార్లీ స్వచ్ఛంద సంస్థ ద్వారా మయాంక్‌ గాంధీ శిక్షణ, అవగాహన కల్పిస్తున్నారు.గ్లోబల్‌ పార్లీ సంస్థ మహారాష్ట్రలోని 9 జిల్లాల్లో, మధ్యప్రదేశ్‌లోని 6 జిల్లాల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయం, ఆధునిక సాంకేతికతపై చక్కని శిక్షణ కల్పిస్తోంది. రైతులకు ఎలాంటి సందేహం, అనుమానం కలిగినా తక్షణమే నిపుణులతో తీర్చేందుకు 24/7 హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. పండ్లు, కూరగాయల టోకు వర్తకులతో రైతులను అనుసంధానం చేయడంలో గ్లోబల్‌ పార్లీ ఉపయోగపడుతోంది. ఈ సంస్థ నుంచి కేవలం నాణ్యమైన నారును కొనడంతోనే సందీప్‌ సరిపెట్టుకోలేదు.. తన పొలంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానం ఏర్పాటులో కూడా గ్లోబల్‌ పార్లీ సంస్థ సహాయం తీసుకున్నాడు.

గ్లోబర్‌ పార్లీ నుంచి మార్కెట్‌ ధరలో సగానికే ఒక్కోటి 6 రూపాయలకే లభిస్తున్న నాణ్యమైన బొప్పాయి నారును సందీప్‌ కొనుగోలు చేశాడు. ఆ బొప్పాయి నారు మొక్కల్ని 2.25 ఎకరాల్లో నాటాడు. బొప్పాయి మొక్కలకు జీవామృతం మాత్రమే వినియోగిస్తున్నాడు. జీవామృతాన్ని కూడా సందీప్ కుటుంబం స్వయంగా తమ పొలంలోనే తయారు చేసుకుంటోంది. బొప్పాయి మొక్కలపై రెండు మూడు రోజులకోసారి జీవామృతాన్ని స్ర్పే చేస్తారు. జీవామృతంతో పాటుగా ప్రతి 15 రోజులకు ఒకసారి పులియబెట్టిన మజ్జిగ, గోమూత్రం కలిపిన మిశ్రమాన్ని కూడా స్ర్పే చేస్తుంటారు. బయటి నుంచి ఎలాంటి ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయకపోవడంతో ఖర్చు తగ్గిపోయిందని సందీప్ చెప్పాడు. తమ పొలానికి అవసరమైన జీవామృతం, మజ్జిగ, గోమూత్రం మిశ్రమం తయారీకి కేవలం నాలుగు ఆవులుంటే సరిపోతున్నదన్నాడు.జూలై నుంచి డిసెంబర్ నెల వరకు బొప్పాయి కిలోకు 10 నుంచి 12 రూపాయలు మార్కెట్‌ రేటు పలుకుతుందని సందీప్ చెప్పాడు. ఆ తరువాత రేటు 6 రూపాయలు వస్తుందని తెలిపాడు. ఒక్కో బొప్పాయి చెట్టు నుంచి ఏడాదికి కనీసం 40 కిలోల పంట వస్తుంది. మరొకొన్ని బొప్పాయి చెట్లు 60 కిలోల వరకు కూడా దిగుబడి ఇస్తాయన్నాడు. బొప్పాయి పంటకు తాను పెట్టే అన్ని రకాల ఖర్చులూ పోగా ఎకరానికి కనీసం 3 లక్షల రూపాయల లాభం వస్తోందన్నాడు. అదే పుచ్చకాయ పంట నుంచి ఒక ఎకరంలో ఏడాదికి లక్షన్నర రూపాయలు మాత్రమే రాబట్టగలిగానన్నాడు.

లాభసాటిగా ఉన్నందు వల్లే తాను అంతకు ముందు సాగుచేస్తున్న 2.25 ఎకరాలతో పాటు 2020లో మరో ఐదెకరాల్లో వేశానని సందీప్‌ వెల్లడించాడు. ప్రకృతి వ్యవసాయ విధానంలో బొప్పాయి పంట సాగు చేస్తుండడంతో తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిందని సందీప్‌ గిట్టే సంతోషంగా చెప్పాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here