నిజమే… ఒకసారి మారితే కొన్ని తరాల పాటు లాభాలు పొందవచ్చు. రసాయనాలతో చేసే వ్యవసాయం నుంచి ప్రకృతి పంటల వైపు ఒక్కసారి మారితే వందేళ్ల పాటు ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చు. వన్‌ టైమ్‌ ప్రాసెస్‌ విధానం ఇది. అయితే.. ఇలా రసాయన పూరిత వ్యవసాయం నుంచి సహజ పంటల విధానంలోకి పూర్తిగా మారిపోవడానికి ఏడాదో ఏడాదిన్నరో సమయం పట్టవచ్చు. ప్రకృతి వ్యవసాయ విధానంలోకి మారిన చోట భూమిలో సారం పెరుగుతుంది. అంతే కాదు.. ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా ఆదాయం మూడు రెట్లు పెరుగుతుంది. ఈ మాటలు అన్నదెవరో కాదు ప్రకృతి వ్యవసాయంతో అనేక లాభాలు ఆర్జిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన జగదీశ్‌రెడ్డి.
చిత్తూరు జిల్లా మొగిలి గ్రామానికి చెందిన జగదీశ్‌రెడ్డి 2011లో వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. జగదీశ్‌ కుటుంబం అప్పటికే చేస్తున్న రసాయనపూరిత వ్యవసాయాన్నే మొదలుపెట్టాడు. తమ కుటుంబానికి ఉన్న 20 ఎకరాల్లో 10 ఎకరాలు రసాయన పూరిత వ్యవసాయం కారణంగా అప్పటికే నిస్సారంగా మారిపోయింది. మిగిలిన 10 ఎకరాల్లోనే జగదీశ్‌రెడ్డి కుటుంబం వరి, మామిడి పంటలు రసాయన ఎరువులు, పురుగుమందులతోనే చేస్తోంది. అయితే.. వ్యవసాయం చేయడం మొదలుపెట్టిన జగదీశ్‌రెడ్డికి సంవత్సరం తిరగక ముందే రసాయనాలతో చేసే వ్యవసాయంతో నష్టాలే కానీ లాభం వచ్చే పరిస్థితి లేదని అర్థం అయింది. పెరిగిపోతున్న రసాయన ఎరువులు, పురుగుమందుల ధరలతో వేగలేమనే నిర్ణయానికి జగదీశ్‌రెడ్డి వచ్చేశాడు. రసాయనాలతో చేసే వ్యవసాయానికి నీటి అవసరం కూడా చాలా ఎక్కువ ఉంది.  దీంతో జగదీశ్‌రెడ్డి కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. రసాయనాలతో వేసే పంటలు ఇక పండించడం కష్టం అనుకున్నాడు జగదీశ్‌రెడ్డి.

ఈ క్రమంలోనే 2012లో ప్రకృతి పంటలు, పంట మార్పిడి, ఆవు పేడ, పచ్చ ఎరువులు, బయోలాజికల్‌ పెస్ట్‌ కంట్రోల్‌ విధానంలో సాగు పద్ధతులపై జరిగిన ఓ సెమినార్‌లో జగదీశ్‌రెడ్డి పాల్గొన్నాడు. ఆ సెమినార్‌లో తాను సంపాదించిన అవగాహనతో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేయాలని నిర్ణయించుకున్నాడు. రసాయనాల కారణంగా నిస్సారమై ఖాళీగా పడి ఉన్న తమ మిగిలిన 10 ఎకరాల్లో వరి, మామిడి, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, వేరుశెనగ పంటలు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించాలని నిర్ణయించుకున్నాడు జగదీశ్‌రెడ్డి. దాంతోపాటుగా చుట్టుపక్కల మరో 15 ఎకరాలు కౌలుకు కూడా తీసుకుని ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాడు.నిస్సారమై బంజరుగా పడి ఉన్న తమ పూర్వీకుల భూమిని జగదీశ్‌రెడ్డి ఎలా సారవంతంగా మార్చాడో ఇప్పుడు తెలుసుకుందాం. నిస్సారంగా ఉన్న తమ 10 ఎకరాల భూమిలో దేశీ ఆవు పేడ వినియోగించడం ప్రారంభించాడు. ఆ భూమిపై ఆచ్ఛాదన (మల్చింగ్‌) చేసినట్లు జగదీశ్‌రెడ్డి తెలిపాడు. బంజరుభూమిని సారవంతంగా మార్చడంలో విజయం సాధించేందుకు జగదీశ్‌రెడ్డి జీవామృతం, నవపత్ర కషాయం, ఆచ్ఛాదన విధానాలను అనుసరించాడు. ఆవు పేడ, గోమూత్రం, బెల్లం, పప్పు పిండి, కొద్దిగా మట్టి, నీటిని తగిన మోతాదులో వాడి జీవామృతం తయారు చేశాడు జగదీశ్‌రెడ్డి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని 48 గంటల పాటు నిల్వ ఉంచి, ప్రకృతి వ్యవసాయ విధానంలో వినియోగించేవాడు.

నిస్సారంగా మారిన భూమిని సారవంతం చేసేందుకు జీవామృతాన్ని మొదటి మూడేళ్లు వినియోగిస్తే సరిపోతుందని జగదీశ్‌రెడ్డి అనుభవపూర్వకంగా తెలిపాడు. మూడేళ్ల పాటు జీవామృతం వాడితే రసాయనాలతో నిస్సారమైన భూమి సారవంతంగా మారిపోతుందన్నాడు. వరుసగా మూడేళ్లు జీవామృతం వాడిన ఫలితంగా భూమి ఆపైన స్వీయ నిలకడ సాధిస్తున్నాడు జగదీశ్‌రెడ్డి.

ఒక్కసారి ఆచ్ఛాదన చేసిన భూమి స్వయంగా వానపాములను బాగా ఆకర్షిస్తుంది. వానపాములు నేలను గుల్లగా ఉంచి, ఆరోగ్యవంతంగా మార్చడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ప్రకృతి వ్యవసాయం చేసిన ప్రారంభంలో తమ భూమిలో వరి పంట వేశాడు. ఆ తరువాత క్రమంగా పంట మార్పిడి విధానంలో చిరుధాన్యాలు పండించడం మొదలెట్టినట్టు చెప్పాడు.

సహజ పంటల విధానంలో పండిన వరి బియ్యం రసాయనాలతో పండించిన బియ్యం కన్నా ఎంతో రుచికరంగా ఉన్నట్లు తాను గమనించానని జగదీశ్‌రెడ్డి అన్నాడు. ముందుగా తాను అమన్‌ రకం ధాన్యం పండించానని, ఇప్పుడు దేశీ రకాలైన ఇంద్రాయణి, నవారా, కుల్లాకర్‌ అరిసి విత్తనాలనే వాడుతున్నానన్నాడు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతు ఒక దేశీ ఆవు ఉంటే సరిపోతుందని జగదీశ్‌రెడ్డి చెప్పాడు.

ప్రకృతి వ్యవసాయ విధానంలో వినియోగించే జీవామృతాన్ని జగదీశ్‌రెడ్డి తమ పొలంలోనే స్వయంగా తయారు చేసుకుంటామని వెల్లడించాడు. అతి తక్కువ ఖర్చుతో దేశీ ఆవుపేట, పప్పుల పిండి, గోమూత్రం, బెల్లం తదితరాలతో జీవామృతం తామే తయారుచేసుకుంటున్నట్లు జగదీశ్‌రెడ్డి తెలిపాడు. ఇలా తయారు చేసుకున్న ప్రకృతిసిద్ధ ఎరువు వినియోగించడం వల్ల తమ భూమిలో రెండు, మూడు పంటలు పండేసరికే పూర్తి సారవంతంగా మారిపోయినట్లు చెప్పాడు. దాంతో పాటుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించే పంటలకు తక్కువ నీరు అవసరం అవుతుండడాన్ని కూడా గమనించానన్నాడు. అంతే కాకుండా తమ పంటలకుక్రిమి కీటకాల బాధ అస్సలు రాలేదన్నాడు. రసాయనాలతో వ్యవసాయం చేసేవారు ఒక్కో వరి పంటకు కనీసం మూడుసార్లు యూరియా వేయాల్సి వస్తుందని జగదీశ్‌ తెలిపాడు. తమ ప్రకృతి వ్యవసాయంలో లాభం కలిగించే పురుగులు నష్టం చేసే క్రిమికీటకాలు పెరగకుండా నివారిస్తాయన్నాడు.రసాయనాలతో చేసే గ్రీన్ రివల్యూషన్‌ పంటల విధానానికి ప్రత్యామ్నాయంగా సుభాష్ పాలేకర్‌ 1990 మధ్యలో ఈ జీరో బడ్జెట్‌ వ్యవసాయ విధానాన్ని ప్రాచుర్యంలో తీసుకొచ్చారని జగదీశ్‌రెడ్డి గుర్తుచేసుకున్నాడు. సుభాష్ పాలేకర్‌ తనను ఎంతగానో ప్రభావితుడ్ని చేశారన్నాడు. ఆయన చెప్పిన ప్రకృతి వ్యవసాయ విధానంలోనే తమ పొలాన్ని పూర్తి సారవంతం చేసుకోవడమే కాకుండా మూడు రెట్లు అధిక ఆదాయం సంపాదిస్తున్నానని జగదీశ్‌రెడ్డి సంతోషంగా చెప్పాడు.

జగదీశ్‌రెడ్డి తన పొలంలో వేసే విత్తనాలను శుద్ధి చేయడానికి బీజామృతం, నవపత్ర కషాయం తానే స్వయంగా తయారుచేసుకుంటాడు. మొక్కలకు వచ్చే కొత్త వేర్లకు ఎలాంటి ఫంగస్‌, భూమిలో పుట్టే వ్యాధులు రాకుండా బీజామృతం నివారిస్తుంది.

తమ కుటుంబ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పాత మామిడిచెట్లకు అదనంగా మరి కొన్ని మొక్కల్ని 2012లో జగదీశ్‌రెడ్డి నాటాడు. ఇప్పుడు జగదీశ్‌రెడ్డి మామిడి తోట 12 ఎకరాలకు విస్తరించింది. అందులో బంగినపల్లి, నీలం, ఆల్ఫోన్సో మామిడి పంటలు పండిస్తున్నాడు. మిగతా పొలంలో రొటేషన్ విధానంలో ధాన్యం, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, వేరుశెనగ పంటలు పండిస్తున్నాడు. జగదీశ్‌రెడ్డి మామిడి తోటల నుంచి ఎకరానికి సుమారు 4.2 టన్నులు అంటే మొత్తం 50 టన్నుల వరకు మామిడి పంట దిగుబడిని రాబడుతున్నాడు. తమ మామిడి పండ్లు రసాయన రహితమైనవని, సహజసిద్దంగా ముగ్గినవ కావడంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా కొనుక్కుంటున్నారని జగదీశ్‌ తెలిపాడు. రసాయనాలతో పండించి బియ్యానికి కిలో 40 నుంచి 50 రూపాయలు వస్తుంటే.. తాము పండిస్తున్న ఇంద్రయాని బియ్యం కిలో 100 నుంచి 120 రూపాయలు, నవారా బియ్యానికి 120 నుంచి 130 రూపాయలు ధర పలుకుతోందన్నాడు.ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా తమకు పెట్టుబడి ఖర్చు బాగా తగ్గిపోయిందన్నాడు. కేవలం కరెంట్‌ కోసం, పొలంలో కలుపు తీసే కూలీలకు మాత్రమే డబ్బులు ఖర్చు చేస్తున్నామన్నాడు జగదీశ్‌రెడ్డి. ఇద్దరు కూలీలను మాత్రం శాశ్వతంగా నియమించుకున్నామని, అవసరమైనప్పుడు మరో 20 మందిని తాత్కాలికంగా కూలీకి పిలుస్తుంటామన్నాడు. తమ పంటల కోసం మార్కెట్‌ నుంచి ఇంకేమీ తాము కొనే అవసరమే లేదన్నాడు. ఇలా ప్రకృతిసిద్ధంగా పంటలు పండించడం వల్ల తాము చేసిన ఖర్చు చాలా సులభంగా చేతికి తిరిగి వస్తోందన్నాడు. అంతే కాకుండా రసాయలతో పండించిన పంటల కన్నా తన ఉత్పత్తులకు మార్కెట్లో మూడు రెట్లు అధికంగా ధర పలుకుతోందని ఆనందంగా జగదీశ్‌రెడ్డి చెప్పాడు. రసాయనాలతో పండించే పంటల కన్నా తమ ప్రకృతి వ్యవసాయంలో దిగిబడి కొంచెమే అధికంగా వస్తున్నప్పటికీ ఎక్కువ ధర రావడంతో లాభాలు మూడింతలు వస్తున్నాయన్నాడు. పైగా తాము పండించే పంటలు అధిక పోషక విలువలు కలిగి ఉంటాయని, మరీ ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయన్నాడు.

తాము పండిస్తున్న మామిడి పండ్లకు ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు మార్కెట్లలో ఎక్కువగా అమ్ముడవుతాయని జగదీశ్‌రెడ్డి చెప్పాడు. తమ పంటతో పాటు ఇతర రైతులకు కూడా కొనుగోలుదారులతో పరిచయం కలిగించి వారు కూడా తమ ఉత్పత్తుల సులభంగా విక్రయించుకునేలా జగదీశ్‌రెడ్డి సహాయం చేస్తుంటాడు. జగదీశ్‌రెడ్డి కేవలం తాను సహజసిద్ధ వ్యవసాయం చేయడం, ఆ పంటను అమ్ముకోవడంతోనే సరిపెట్టుకోకుండా చిత్తూరు జిల్లాలోని రైతులు కూడా రసాయనపూరిత వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు మార్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాడు. తన అనుభవాలను జాతీయ స్థాయిలో కూడా సదస్సులు, వెబినార్లు నిర్వహించి వేలాది మంది రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు.

ప్రకృతితో మమేకమైన వారికే జీవన సాఫల్యం సాధ్యమవుతుందని జగదీశ్‌రెడ్డి నిశ్చితాభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here