చిన్నప్పటి నుంచే తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉన్నాడు. దాంతో చదువుకునే అవకాశం రాలేదు. వ్యవసాయంలో సాంకేతికపరమైన శిక్షణ కూడా తీసుకోలేదు. దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్న అనుభవంతో ఆ రైతు ఇప్పుడు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు. అది కూడా సేంద్రీయ వ్యవసాయ విధానంలో మామిడిపంట పండిస్తున్నాడు. లక్షలకు లక్షలు ఆదాయం ఆర్జిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అతడే 71 ఏళ్ల వెల్జీభాయ్‌ బుధియా. గుజరాత్‌ రాష్ట్రం కచ్‌ జిల్లాలోని మాధాపూర్ గ్రామరైతు బుధియా. తండ్రితో పాటు తమ 12 ఎకరాల్లో వ్యవసాయం చేసిన బుధియా ఇప్పుడు 75 ఎకరాల్లో ఆర్గానిక్‌ పంటలే పండిస్తున్నాడు. మనం తినే ఆహారం పండించడం కోసం గతంలో ఎంతగా రసాయనాలు వాడేవారో గుర్తుచేసుకుని గిల్టీగా ఫీలవుతుంటాడు. రసాయనాలతో పంటలు పండించి ప్రజలకు విషాన్ని అందించడం మహాపాపం అంటాడు బుధియా.

తమ పొలంలో చెరకు పండించి, బెల్లం తయారు చేసి, ఎడ్లబండిపై ఊరూరూ తిరిగి అమ్మిన రోజులను బుధియా గుర్తుచేసుకుంటాడు. చెరకు పంట సంవత్సరానికి కానీ చేతికి ఆదాయం వచ్చేది కాదు.. అది కూడా అరకొరగా వచ్చేది. దాంతో ఇల్లు గడవడం కష్టం అయ్యేదని బుధియా చెప్పాడు. ఆర్థిక కష్టాలను తట్టుకునేందుకు కొంత భూమిలో కూరగాయల సాగు ప్రారంభించాడు బుధియా. టమోటా, బెండ, వంగ, కొత్తిమీర, మిర్చి పంటలు పండించి వాటిని సమీప మండీకి తీసుకెళ్లి అమ్మేవాడట. కూరగాయలు అమ్మడం ద్వారా నెలకు 10 నుంచి 12 వేలు వరకు ఆదాయం వచ్చేదట. అలా వచ్చిన ఆదాయం నుంచి డబ్బు ఆదా చేసి తమ పొలానికి సమీపంలోనే 10 ఎకరాలు కొన్నాడు వెల్జీభాయ్‌ బుధియా. కొన్న పొలంతో కలిపి మొత్తం 22 ఎకరాల్లో బుధియా పత్తి, ఆముదం, వేరుశనగ, మొక్కజొన్న, ఆవాల పంటలు పండించాడు. పంటలు బాగా పండాయి. స్థానికంగా భుజ్‌ ప్రాంతంలోనే వాటిని అమ్మితే 5 లక్షల రూపాయలు చేతికి వచ్చిందట. ఆ డబ్బులతో బుధియా మరో 50 ఎకరాలు కొనుగోలు చేశాడు. అలా సంవత్సరాల తరబడి తాను పడిన కష్టం కారణంగా తమ కుటుంబం ఆర్థికంగా మంచి స్థితికి చేరిందని చెప్పాడు.ఎంతగా ఆదాయం వస్తున్నా తనలో ఏదో వెలితిగా అనిపించేదని వెల్జీభాయ్ బుధియా తెలిపాడు. ఏదో తెలియని బాధ తనను తొలిచేసేదన్నాడు. బుధియా వ్యవసాయం ప్రారంభించిన తొలి రోజుల్లో తమ పొలంలో 50 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు లభించేవట. ఆ తర్వాత వాటి స్థాయిలు 500 అడుగుల లోతుకి వెళ్లిపోయాయట. దీంతో ఏమిచేయాలా? అనే ఆలోచనలు బుధియాలో మొదలయ్యాయట. తన తండ్రి వ్యవసాయం చేసిన రోజుల్లో 12 ఎకరాల్లో 3 బస్తాల రసాయన ఎరువులు వాడేవాడట. తాను 72 ఎకరాల్లో 800 బస్తాల ఎరువులు వేసే స్థితికి వెళ్లడం ఎంతో బాధ కలిగించిందని బుధియా అన్నాడు.

అదే సమయంలో రసాయనాలు వాడకుండా చేసే సేంద్రీయ వ్యవసాయ విధానం గురించి బుధియా విన్నాడట. 1995లో రాజ్‌కోట్‌లో జరిగిన రైతుల శిక్షణా శిబిరంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ అశోక్ షాను కలుసుకున్నాడు బుధియా. సాంప్రదాయ వ్యవసాయం పేరుతో రసాయనాలు వాడి పండిస్తున్న పంటలతో ఎంత ప్రమాదమో, నేలతల్లిని అవి ఎంతలా నాశనం చేస్తాయో, మనుషుల ఆరోగ్యాన్ని అవి ఎలా పాడుచేస్తాయో వివరంగా చెప్పారట. ఖర్చు తక్కువ, ఎక్కువ లాభసాటి సేంద్రీయ వ్యవసాయ విధానం గురించి డాక్టర్‌ అశోక్‌ షా చెప్పిన మాటలతో బుధియా బాగా ప్రభావితుడయ్యాట. అయితే.. ఆర్గానిక్‌ సాగు విధానాన్ని బుధియా తొందరగా చేయలేదట. 2001లో గానీ ఆర్గానిక్‌ పంటల సాగు ప్రారంభించడం వీలు కాలేదట. ఆ ఏడాది బుధియా తన 75 ఎకరాల పొలంలో 10 వేల కేసర్‌ మామిడి మొక్కలు నాటాడు.అయితే.. మామిడి మొక్కలకు జీవామృతం, బీజామృతం, బ్రహ్మాస్త్ర లాంటివి వాడేవాడు కాదట. ఆవుపేడ, గోమూత్రం నీళ్లలో బాగా కలిపి మామిడి మొక్కలకు వేసేవాడినని బుధియా తెలిపాడు. దాంతో పాటు బెల్లం, ఆవుపాలు కలిపిన మిశ్రమాన్ని మొక్కలపై పిచికారి చేస్తానని చెప్పాడు. ఈ మిశ్రమం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో.. దాన్ని ఎలా తయారు చేయాలో గుజరాత్‌ రాష్ట్రంలోనే కాకుండా ఆఫ్రికా దేశాల ఔత్సాహిక ఆర్గానిక్ రైతులకు కూడా వివరించి చెపుతానని బుధియా అన్నాడు. ఈ మిశ్రమం క్రిమి కీటకాలను మొక్కల దరి చేరనివ్వదని, దాంతో మొక్కలు బాగా ఎదుగుతాయని వివరించాడు. 100 లీటర్ల నీటిలో రెండు లీటర్ల తాజా ఆవుపాలు, ఒక కిలో దేశీయ బెల్లం కలిపి ఈ మిశ్రమాన్ని తయారు చేస్తానని బుధియా తెలిపాడు. తాను తయారు చేసే మిశ్రమం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకులు పరీక్షించి ఓకే అన్నారని బుధియా వెల్లడించాడు. పంటలకు ఎన్నో ఏళ్లుగా రసాయనాలు వాడి, జీవితాలను నాశనం చేసుకున్నామని, సేంద్రీయ విధానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తన కొడుకులకు సమయం చిక్కినప్పుడల్లా చెబుతుంటాడు. ఇప్పుడు వెల్జీభాయ్‌ మొత్తం పొలాన్ని సేంద్రీయ వ్యవసాయంలోకి మార్చేశాడు.

రసాయనాలతో నిస్సారమైన తమ భూమిని సేంద్రీయ విధానంలోకి మార్చే క్రమంలో మూడేళ్ల పాటు ఖర్చులను తట్టుకునేందుకు బుధియా కేవలం కూరగాయలు మాత్రమే పండించేవాడట. సేంద్రీయ విధానంలోకి మారిన తమ పొలం ఇప్పుడు ఎంతో మృదువుగా మారిందని, మట్టిలోకి సూక్ష్మజీవులు తిరిగి వచ్చాయని బుధియా సంతోషంగా చెప్పాడు. దాంతో పాటు డబ్బుల వృథా ఖర్చు తప్పిందని అన్నాడు. సేంద్రీయ సాగు కారణంగా నీటి వినియోగం కూడా బాగా తగ్గిపోయిందని తెలిపాడు. డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానంతో ద్వారా 60 శాతం నీటి వినియోగం తగ్గించినట్లు చెప్పాడు.ఒక్కో కేసర్ మామిడి మొక్క నుంచి తొలిసారి పంటగా ఐదేసి కిలోల దిగుబడి వచ్చిందని బుధియా వెల్లడించాడు. రెండో ఏడాది ఆ దిగుబడి 10 కిలోలకు పెరిగిందట. పంట దిగుబడి మొదలైన ఐదో ఏట నుంచి ఒక్కో చెట్టు నుంచి 30 కిలోల మామిడి కాయల దిగుబడి వస్తోందన్నాడు. బుధియా తన పంటను స్థానిక అమ్మడంతో పాటు టన్నుల కొద్దీ మామికాయల్ని ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండికి పంపిస్తుంటాడు. స్థానికంగా ఒక్కో కిలో మామిడి కాయలను 7 రూపాయలకు అమ్మితే.. ఢిల్లీలో 15 రూపాయల చొప్పున విక్రయిస్తాడు. ఇలా ఒక్కో సీజన్‌లో 6 నుంచి 7 లక్షల రూపాయల వరకూ లాభం ఆర్జిస్తున్నట్లు బుధియా ఆనందంగా తెలిపాడు. 2006లో బుధియా పొలంలో ఒక్కో సీజన్‌కు 100 టన్నుల మామిడి పంట వస్తే.. దాని ద్వారా 60 నుంచి 70 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పాడు. మామిడి పంట ఎక్కువగా వచ్చినప్పుడు దాన్ని నిల్వ చేయడం కోసం బుధియా 25 లక్షలు అప్పు తీసుకుని రెండు కోల్డ్ స్లోరేజ్‌లు నిర్మించాడు. మామిడి గుజ్జు నుంచి జ్యూస్‌ తయారు చేసే యూనిట్‌ కూడా నెలకొల్పాడు. హైవే పక్కనే ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో బుధియా ఓ రెస్టారెంట్‌ ప్రారంభించాడు. ఆ రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లకు ఉచితంగా మేంగో జ్యూస్‌ ఇస్తాడట. మేంగో జ్యూస్‌ను నీట్‌గా ప్యాక్‌ చేసి విక్రయించాలని బుధియా నిర్ణయించుకున్నాడట.

సేంద్రీయ సాగులో విజయాలు సాధించడంతో మాధాపూర్‌, ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులు బుధియా నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. రైతులకు సేంద్రీయ సాగులో వ్యక్తిగతంగా సూచనలు, సలహాలు ఇస్తుండడమే కాకుండా ఆన్‌ లైన్‌లో కూడా అనేక మంది రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. ఆర్గానిక్ వ్యవసాయంలో విజయాలు సాధిస్తున్న బుధియాను 2021లో ‘నవోమెషి క్రిషక్‌ అవార్డు’ ఇచ్చి ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్స్‌ సత్కరించింది. దాంతో పాటుగా నవసారి అగ్రికల్చర్‌ యూనివర్శిటీ, సర్దార్‌ కృషినగర్‌ యూనివర్శిటీ, కచ్‌లోని ది చాంబర్ ఆఫ్‌ కామర్స్‌ అండ్ ఇండస్ట్రీ నుంచి కూడా వెల్జీభాయ్‌ బుధియా అవార్డులు అందుకున్నాడు. ఇప్పుడు బుధియా కొడుకులు, మనవళ్లు కూడా అతని సంప్రదాయాన్నే కొనసాగిస్తుండడం విశేషం. రసాయన పంటలతో చేసిన పాపాన్ని సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆరోగ్యవంతమైన ఆహారం అందిస్తూ కడిగేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వెల్జీభాయ్ బుధియా వినమ్రంగా చెబుతున్నాడు. శెభాష్‌ వెల్జీభాయ్ బుధియా!

 

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here