ఆర్గానిక్‌ వ్యవసాయం పట్ల, ఆర్గానిక్‌ పంట ఆహారం పట్ల ఈ ఆధునిక సమాజంలో అవగాహన బాగా పెరుగుతోంది. విష రసాయనాలు గుప్పించి, ఎక్కువ పంటలు పండించిన దశ నుంచి క్రమేపీ పలువురిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతోంది. రసాయనాలతో పండించిన పంటల ఆహారాలు తిని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం ఎందుకనే ప్రశ్న, స్పృహ అనేక మందిలో కలుగుతోంది. ఈ క్రమంలోనే మన దేశంలోను, ప్రపంచ దేశాల్లో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆర్గానిక్ పంటలు పండించేందుకు ఆరోగ్యాభిలాషులు ముందుకు వస్తున్నారు. ఈ కోవలోనే హైదరాబాద్‌కు చెందిన మైక్రోబయాలజిస్టు ఆర్గానిక్‌ పంటలు పండించే రైతుగా రూపాంతరం చెందారు. తమ ఇంటి టెర్రస్‌ను ఏకంగా ఆర్గానిక్‌ పంటల స్వర్గంగా మార్చివేశారు. ఆ ఆర్గానిక్ పంట ఉత్పత్తుల ద్వారా తమ కుటుంబానికి ఆరోగ్య ప్రదాయనిగా మారారు. ఆమె పేరు సుజనిరెడ్డి. ఖాళీగా కూర్చుని ఉండే కన్నా ఏదో ఒకటి చేయడం మేలు అని సుజనిరెడ్డి నమ్ముతారు. ఈ క్రమంలోనే ఆమె తమ బాల్కనీని తమ కుటుంబం కోసం స్వర్గసీమగా మార్చేశారు. ‘సొంతంగా నాకో గార్డెన్‌ ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. అది కూడా నేనే స్వయంగా కష్టపడి రూపొందించుకున్న స్వర్గంలో ఉన్నంత ప్రశాంతంగా ఉండాలి’ అంటారు సుజనిరెడ్డి.కేవలం 300 చదరపు అడుగుల టెర్రస్‌లో 36 ఏళ్ల సుజనిరెడ్డి ఈడెన్‌ గార్డెన్‌ (టెర్రస్ గార్డెన్‌)ను తయారు చేశారు. ఆర్గానిక్‌ విధానంలో పండించిన తాజా కూరగాయలతో కళకళలాడుతోంది. తాజా కూరగాయలే కాకుండా టెర్రస్‌ గార్డెన్‌ తియతియ్యని పండ్లు, రంగురంగుల పూలగుత్తులతో నిండిపోయి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తమ టెర్రస్‌ గార్డెన్‌లో పండించిన తాజా కూరగాయల్లో 90 శాతం తమ కుటుంబం కోసమే ఆమె వినియోగిస్తున్నారు.చిన్నప్పటి నుంచీ తనకు తోటలంటే ఎంతో ఇష్టం. ప్రకృతికి అత్యంత సమీపంగా జీవించాలనే కోరికా ఎక్కువగా ఉండేదట. ఆ ఇష్టమూ, కోరికే తాను టెర్రస్ గార్డెన్‌ను ఇంత బాగా తయారుచేసుకునేలా ఉపయోగపడుతోందని సుజనిరెడ్డి చెబుతున్నారు. ఇదంతా తనకు మొక్కలు, ఇతర ఫల, పుష్పజాతుల పట్ల ఉన్న ఆకర్షణ, ఆప్యాయతల వల్లే తాను సైన్స్‌ కెరీర్‌ ఎంచుకోడానికి కారణం అంటారు సుజనిరెడ్డి. హైదరాబాద్‌ పుట్టిన సుజనిరెడ్డికి తమ ఇంటిలో పూర్తిస్థాయి గార్డెన్‌ను చూసే, అనుభవించి ఆనందించే అవకాశం లేకపోయిందట. అయితే.. సుజనిరెడ్డి అమ్మమ్మగారి ఇంటి బాల్కనీ మాత్రం చిన్న చిన్న మట్టి పాత్రల్లో పెరిగిన రకరకాల పువ్వులు తనను ఎంతగానో ఆకట్టుకునేవని సుజనిరెడ్డి చెప్పారు. నాలుగేళ్ల క్రితం తాను, వ్యాపారవేత్త అయిన తన భర్త వి.రెడ్డి కొత్త ఇంటిలోకి మారడంతో తన అభిరుచిని ఆచరణలో పెట్టే అవకాశం కలిగిందని అన్నారు. 300 చదరపు అడుగులు ఉన్న తమ టెర్రస్‌లో ఒక్క అంగుళం కూడా వృథాగా ఉంచకూడదని తాను నిర్ణయించుకున్నానని సుజనిరెడ్డి తెలిపారు. తాజాగాను, నాణ్యంగా ఉండే కూరగాయలు, పండ్లు మాత్రమే తమ ఇంట్లో వినియోగించాలనే జాగ్రత్త ఎప్పుడూ తాను తీసుకుంటానని ఆమె అంటారు. అలా రసాయనాలు వాడని తాజా, నాణ్యమైన కూరగాయల కోసం సుజనిరెడ్డి రైతు బజార్లలో వెదకేదాన్నని చెప్పారు. ఆర్గానిక్‌ కూరగాయలు, పండ్లు మార్కెట్లో కొనడం కాస్త ఖర్చుతో కూడినదే అయినా.. తన కుటుంబాన్ని అనారోగ్య సమస్యల రిస్క్‌ నుంచి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో వాటిని మాత్రమే కొనేదాన్నని అన్నారు. తమ టెర్రస్‌పై కొంత స్థలం దొరకడంతో ఆర్గానిక్ పంటలు పంటలు వేసేందుకు చేసే ఖర్చుకు వెనకాడలేదని తెలిపారు. ‘నా కుటుంబ ఆరోగ్యం కోసం రసాయన రహిత పంటల ఆహారం ఎందుకు తయారు చేసుకోకూడదు’ అని తనకు తానే ప్రశ్నించుకున్నానన్నారు. దీంతో టెర్రస్‌ గార్డెనింగ్‌పై హైదరాబాద్‌లో జరిగిన అనేక శిక్షణ శిబిరాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. దాంతో పాటుగా టెర్రస్‌ గార్డెనింగ్‌పై తాను పలు పుస్తకాలు కూడా చదివిన అవగాహనతో తమ ఇంటి టెర్రస్‌పై మొక్కల్ని పెంచడం ప్రారంభించినట్లు చెప్పారు.సుజనిరెడ్డి మొదట 200 చదరపు అడుగుల్లో టెర్రస్‌ గార్డెన్‌ను ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న అర్బన్ గార్డెన్ల నుంచి సేకరించిన దేశీ విత్తనాలు నాటేందుకు పాత కంటెయినర్లను వినియోగించారు. అలా మొదటి సంవత్సరం ఆ పాత కంటెయినర్లలో పొట్లకాయ విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు వేశారట. అయితే.. కంటెయినర్లలో వేసిన మట్టి గట్టిగా ఉండడంతో మొక్కల వేర్లు లోతుగా చొచ్చుకుపోలేదట. దీంతో తన తొలి ప్రయత్నంలో సుజనిరెడ్డి సరైన ఫలితాలు సాధించలేదట. అయినప్పటికీ తాను పట్టు వదలకుండా ట్రయల్‌ అండ్ ఎర్రర్‌ విధానంలో ప్రయత్నాలు చేశారట. ఆ పట్టుదలే మొక్కల సంబంధమైన ఆర్గానిక్ న్యూట్రిషన్లు అభివృద్ధి చేసే ఒక స్నేహితుడిని సుజనిరెడ్డి సంప్రదించేలా చేసిందట. టెర్రస్ గార్డెన్‌లో తాను పెంచే మొక్కలకు 40 శాతం మట్టిని, 40 శాతం వర్మీ కంపోస్టును, 10 శాతం కొబ్బరి పొట్టును మరో 10 శాతం వేపకేకు, ఇతర ఆర్గానిక్ పోషకాలు వినియోగించానని చెప్పారు. దీంతో రెండో ఏడాది మొక్కలు ఎదుగుదలలో కొద్దిగా మెరుగుదల కనిపించిందని అన్నారు. ఇప్పుడు సుజనిరెడ్డి 300 చదరపు అడుగుల టెర్రస్‌పై 200కు పైగా మొక్కలు పెంచుతుండడం విశేషం.సుజనిరెడ్డి టెర్రస్ గార్డెన్‌లో మెక్సికన్‌ స్పైసీ మిర్చి, హీర్‌లూమ్‌ వెరైటీ, నల్ల మిర్చి రకాల మొక్కలు పెంచుతున్నారు. దాదాపు 10 రకాల టమోటాలను కూడా ఆమె పండిస్తున్నారు. తెల్ల వంకాయతో పాటు ఆరు రకాల వంగ మొక్కల్ని పెంచుతున్నారు. పచ్చ, మట్టిరంగు కాప్సికమ్‌ పంట కూడా పండిస్తున్నారు. చైనీస్‌ క్యాబేజ్‌, కాలీఫ్లవర్‌, బ్రొకోలీ, ముల్లంగి, వెల్లుల్లి, ఉల్లి, బీన్స్‌, దోస, బెండకాయలు పెంచుతున్నారు. వాటితో పాటుగా వివిధ రకాల పొట్లకాయలు సుజనిరెడ్డి టెర్రస్ గార్డెన్‌లో ఉన్నాయి. సిరి లీఫ్‌, పాలకూర, మునగ, కొత్తిమీర, ఇటాలియన్ బాసిల్‌, మలబార్‌ పాలకూర, పుదీనా లాంటి అనేక రకాల ఆకుకూరలు సాగుచేస్తున్నారు. పుచ్చకాయ, జామ, దానిమ్మ పండ్లతో పాటు పలు ఇతర రకాల పండ్లు కూడా తమ టెర్రస్ గార్డెన్‌లో సుజనిరెడ్డి పండిస్తున్నారు. సుజనిరెడ్డి టెర్రస్ గార్డెన్‌లో రక రకాల పూల మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మందార, బంతి, చామంతి, గులాబీ, నీల సంపంగి, పొద్దుతిరుగుడు లాంటి అనేక రకాల పుష్పజాతులను పెంచుతున్నారు.తమ వంట ఇంటిలో మిగిలిన వృథా పదార్థాలను ఎరువుగా మార్చి వాడడంతో పాటు మార్కెట్‌ నుంచి ఆర్గానిక్ ఎరువులు కొని మొక్కలకు వేస్తారు. మండు వేసవి కాలంలో వేడి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు కాస్త తెల్లబడుతుంటే వాటికి నీడ కోసం షేడ్‌ నెట్‌లు ఉపయోగిస్తారు. టెర్రస్ గార్డెన్‌ను ప్రారంభించిన కొత్తలో క్రిమి కీటకాల ప్రభావంతో పాడైన మొక్క కాండం కానీ, ఆకులకు కాని కోసి పారేసినట్లు సుజనిరెడ్డి తెలిపారు. ఒక వేళ మొక్క మొత్తం పాడైతే దాన్ని పూర్తిగా తోట నుంచి తొలగించడం తప్ప మరో మార్గం లేదన్నారు. క్రిమి కీటకాలు ఆశించకుండా ఉండాలంటే మొక్కలపై ప్రతి పది రోజులకు ఒకసారి వేపనూనె చల్లితే మేలని తెలిపారు. వేళ్లలో తెగుళ్ళు రాకుండా ఉండాలంటే మొక్కలు నాటేటప్పుడే మట్టిలో వేపపిండి వేయాలన్నారు. పల్చగా చేసిన మజ్జిగను స్ప్రే చేస్తే వర్షాకాలంలో మొక్కలకు వచ్చే ఫంగస్‌ వ్యాధుల నుంచి రక్షించ వచ్చని చెప్పారు.

భవిష్యత్తులో తమ టెర్రస్ గార్డెన్‌లో మరిన్ని కొత్త రకాల మొక్కలు పెంచాలనేది తన ఆశయం అని సుజనిరెడ్డి చెబుతున్నారు.

 

 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here