వాటర్ యాపిల్‌ పండ్లలో సీ విటమిన్‌, విటమిన్‌ బీ1, విటమిన్ ఏ వంటి ఎన్నో పోషకాలు బాగా ఉంటాయి. వాటర్ యాపిల్ తిన్న వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు బాగా మెరుగు అవుతుంది. వాటర్ యాపిల్‌ వేసవి కాలంలో కాస్తుంది. ఎన్నో పోషకాలున్న వీటికి మార్కెట్‌ లో మంచి డిమాండ్ ఉంది. వాటర్ యాపిల్ బాగా పండిన తర్వాత అంటే ఏప్రిల్ చివరి వారం, మేనెలలో కొంచెం తియ్యగా, మరి కొంచెం వగరుగా కూడా ఉంటుంది.వాటర్ యాపిల్ లో ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం లాంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. వాటర్ యాపిల్ లో నీటి శాతం ఎక్కువ. అందుకే వేసవి కాలంలో దీన్ని వినియోగిస్తే.. ఉపయోగాలు ఎన్నో ఉంటాయి. వాటర్ యాపిల్ తింటే డీ హైడ్రేషన్‌ బారి నుంచి కాపాడుతుంది. ఒత్తిడి, మానసిక ఆందోళన, అలసట, నీరసం లాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. ఆరోగ్యానికి వాటర్ యాపిల్ పండు ఎంతో మేలు చేస్తుంది. సుగర్ వ్యాధి ఉన్నవారికి వాటర్ యాపిల్‌ చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది. వాటర్ యాపిల్ తిన్నవారి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. వాటర్ యాపిల్‌ లో ఉండే పీచుపదార్థం మనలోని జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. వీటిని తింటే గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం లాంటివి రావు. శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు సమస్య నుంచి బయట పడవచ్చు.వాటర్‌ యాపిల్ అంటే ప్రస్తుతం చాలా మందికి తెలియకపోవచ్చు కానీ.. దీన్ని వైట్ జామున్‌ అని, జంబూ ఫలం అని, రోజ్‌ యాపిల్‌ అని కూడా అంటారు. వాటర్ యాపిల్స్‌ మలేసియా, ఇండోనేసియా లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే భారతదేశంలో కూడా రైతులు అక్కడక్కడా వాటర్ యాపిల్ పంట సాగు చేస్తున్నారు.

వాటర్ యాపిల్ లేదా జంబో రెడ్‌ పండు పూర్తిగా సీడ్‌ లెస్‌ రకం. వాటర్ యాపిల్ కొనుక్కున్న వారు దాన్ని నూటికి నూరుశాతం తినవచ్చు. ఎక్కడా వేస్ట్‌ అనేదే ఉండదు. వాటర్ యాపిల్ మొక్క నాటిన రెండో ఏడాది నుంచి దిగుబడి వస్తుంది. అయితే.. అప్పటికి వాటర్ యాపిల్ పంట వాణిజ్య పరంగా అంతగా ఉపయోగపడదు. మూడో ఏడాది మరికాస్త ఎక్కువ కాపు కాస్తుంది. నాలుగో సంవత్సరం నుంచి వాటర్ యాపిల్ పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. వాణిజ్యపరంగా మనకు మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. వాటర్ యాపిల్‌ ధర కిలోకు దాని నాణ్యతను బట్టి రూ.40 నుంచి రూ.100 వరకు పలుకుతుంది. మూడో ఏట వాటర్ యాపిల్ మొక్క నుంచి 20 కిలోల వరకూ దిగుబడి ఇస్తుంది. నాలుగో ఏడాది వచ్చేసరికి 50 కిలోలు, ఐదో ఏడు వచ్చేసరిక 100 నుంచి 150 కిలోల వరకూ పంట చేతికి వస్తుంది.వాటర్ యాపిల్ మొక్కలు మార్చి ఆఖరు నుంచి ఏప్రిల్‌ నెలలో హార్వెస్ట్‌ మొదలవుతుంది. అయితే.. ఆ సమయంలో పంట కోసేస్తే పూర్తి స్థాయిలో కాయలో తియ్యదనం ఉండదు. మే నెల నాటికి వాటర్ యాపిల్ పండు పూర్తిస్థాయిలో పండుతుంది. తియ్యదనం పూర్తిగా వస్తుంది. ఎండలు పెరిగే కొద్దీ వాటర్ యాపిల్‌ పండు రుచి పెరుగుతూ ఉంటుంది.

వాటర్ యాపిల్ మొక్కల పెంపకానికి పురుగు మందులు, ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. అంటే ఇది పూర్తిస్థాయిలో సహజసిద్ధంగా పండే పంట అని చెప్పాలి. వాటర్ యాపిల్‌ కు ఫ్రూట్ ఫ్లై సమస్య ఒక్కటి కనిపిస్తుంది. ఫ్రూట్ ఫ్లైస్‌ ను ట్రాప్స్ పెట్టుకుని నివారించడం ఒక్కటే మార్గం. వాటర్ యాపిల్ సాగు చేయడం రైతులకు చాలా సులువు. అయితే.. వాటర్ యాపిల్ పండ్లను మార్కెటింగ్ చేసుకోవడంలోనే లాభాలు ఆధారపడి ఉంటాయి. వాటర్ యాపిల్‌ కూడా మిగతా వస్తువులు, పండ్ల మాదిరిగా డిమాండ్‌ అండ్ సప్లై సూత్రమే వర్తిస్తుంది. హైదరాబాద్‌ లాంటి మార్కెట్లో 100 నుంచి 1000 కార్టన్ల వాటర్‌ యాపిల్ పంపినా కొనేంత డిమాండ్ ఉంది. అందుకే రైతులు వాటర్‌ యాపిల్ మొక్కల్సి సాగు చేసుకోవచ్చు.వాటర్ యాపిల్ 15X15 అడుగుల దూరం పెట్టి ఎకరానికి 200 మొక్కలు నాటుకోవచ్చు.  అదే 12X12 అడుగుల దూరం పెట్టి 300 మొక్కలు వేసుకోవచ్చు. వాటర్ యాపిల్ మొక్క చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే దాన్ని బాగా ఎత్తుగా ఎదగకుండా చూసుకోవాలి. వాటర్ యాపిల్ పండ్లను చేత్తో మాత్రమే కోయాలి. మొక్క నుంచి కోసిన వాటర్ యాపిల్ పండు నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది. అయితే.. పండు కింద పడినా, గాయాలు తగిలినా త్వరగా పాడైపోతుంది. అందుకే చేతికి పండ్లు అందేంత ఎత్తు వరకు మాత్రమే ఈ మొక్కల్ని పెరగనివ్వాలి. కాస్త ఎత్తు ఉంటే కుర్చీయో లేదా చిన్నపాటి నిచ్చెనో వేసుకుని జాగ్రత్తగా పండ్లు తెంపుకోవాలి.వాటర్ యాపిల్ మొక్కలకు డిసెంబర్, జనవరి నెలల్లో పూత మొదలవుతుంది. ఫిబ్రవరి నెలలో పూత అత్యధికంగా వస్తుంది. ఎక్కవ సంఖ్యలో వాటర్ యాపిల్ మొక్కల్ని పెంచేవారు ప్రూనింగ్ ను కాస్త క్రమ పద్ధతిలో చేసుకుంటే దిగుబడి ఆ క్రమంలోనే వస్తుంది. తద్వారా డిమాండ్‌ కు ఢోకా ఉండదు. అన్ని మొక్కలు ఒకేసారి దిగుబడి రాకుండా పదిహేను రోజుల వ్యవధిలో పంట చేతికి వచ్చేలా చేసుకుంటే లాభాలకు కొదవ ఉండదు. ఉదాహరణకు ఒక ఎకరంలో 300 మొక్కలు నాటుకుంటే.. వంద మొక్కలు ఇప్పుడు, మరో 15 రోజులకు మరో వంద మొక్కలు, ఇంకో 15 రోజులకు మిగతా 100 మొక్కల నుంచి పండ్లు తెంపుకునేలా ప్రూనింగ్ చేసుకుంటే ఫలితం మెరుగ్గా ఉంటుంది.ఒక రైతు ఎవరైనా వాటర్ యాపిల్ పంట సాగు చేయడానికి మెయింటెనెన్స్ జీరో అనే చెప్పాలి. వాటర్ యాపిల్ తోట పెట్టుకున్న రైతులు చాలా సౌకర్యంగా సాగు చేసుకోవచ్చు. పురుగు మందుల పనిలేదు. రసాయన ఎరువులు వంద గ్రాములు కూడా వాడే అవసరం ఉండదు. వాటర్ యాపిల్ మొక్క నాటినప్పటి నుంచీ ప్రతి ఏటా పశువుల ఎరువు మాత్రమే వేసుకోవాలి. ఏడాదికి ఒక్కసారే పంట వస్తుంది కనుక రైతన్నలు హడావుడి పడే పని ఉండదు. ఆకులు తినే, కాయలు తినే పురుగే ఉండదు. పక్కను ఉన్న తైవాన్‌ జామ తోటలో ఫ్రూట్ ఫ్లై ఉన్నా వాటర్ యాపిల్ తోటలోకి అది రాదంటే.. దీని ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. వాటర్ యాపిల్ ఫార్మర్‌ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. తొలి దశలో ఒక్కో వాటర్ యాపిల్‌ మొక్కను నర్సరీ యజమానులు వంద రూపాయలకు అమ్ముతున్నారు. పూత దశకు వచ్చిన రెండేళ్ల మొక్కను రెండు వందలకు, మూడేళ్ల మొక్కల్ని రూ. 300కు అమ్ముతున్నారు. పీహెచ్‌ సీ 6 కన్నా తక్కువ ఉన్న నేలల్లో వాటర్ యాపిల్ పంట సాగుకు చాలా అనువైనదని అనుభవజ్ఞులు చెప్పారు. అయితే.. పీహెచ్ 9 వరకు ఉన్న నేలల్లో కూడా వీటిని పెంచుకోవచ్చు.సోషల్ మీడియా, ఫ్లిప్ కార్ట్‌, అమెజాన్ లాంటి ప్లాట్‌ ఫారాలు బాగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో వాటర్ యాపిల్ మార్కెటింట్ సమస్యే కాదని గత నాలుగేళ్లుగా ఈ పంట పండిస్తున్న రైతు సురేంద్ర తెలిపారు. దాంతో పాటా ఇటీవలి కాలంలో నగరాల్లో ఎక్సోటిక్‌ ఫ్రూట్ డీలర్స్‌ ఉంటున్నారు. వారిని సంప్రదించినా వాటర్ యాపిల్ పండ్లను సులువుగానే అమ్ముకోవచ్చు.

 

ఔట్సాహిక రైతులు పెద్దలంక నర్సరీ యజమాని సురేంద్రను 9949614751 నెంబర్ లో మాట్లాడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here