గుత్తులు గుత్తులుగా గులాబీలు, మందారాలు, బంతులు, చేమంతులు, మల్లెలు, సన్నజాజులు, సంపెంగలు, కనకాంబరాలు, సపోటా, సీతాఫలం, నిమ్మ, దానిమ్మ, వంగ, బెండ.. పూలు, పళ్లు, కాయగూరలు ఏకరువు పెడుతున్నారేంటి అనుకుంటున్నారా?  కానే కాదు. పూలు విరబూయాలంటే.. పండ్లు విరగ కాయాలంటే.. కాయగూరంలు గంపల నిండా కాయాలంటే.. ఒకే ఒక దివ్య సహజ ఔషధం ఉంది. ఖర్చు లేకుండా ఇంటిలోనే తయారు చేసుకునే ద్రావణం. అదే.. బియ్యం కడిగిన నీళ్లు. అన్ని రకాల మొక్కలు, చెట్లకు ఎంతో బలవర్ధకంగా ఉంటుంది. మొక్కలు ఏపుగా ఎదిగేందుకు, దిగుబడి ఇబ్బడిముబ్బడిగా ఇచ్చేందుకు ఈ బియ్యం కడిగిన నీరు అంటే ‘కుడితి’ చక్కగా ఉపయోగపడుతుంది. గృహిణి ప్రియ తన అనుభవంతో ఈ విషయం చెబుతున్నారు. బియ్యం కడిగిన నీళ్లేంటో, దాన్ని ఏం చేయాలో, ఎలా తయారు చేసుకోవాలో ఎలా వాడుకోవాలో తెలుసుకుందామా?వేసవి కాలంలో మిద్దెమీద కానీ, పెరట్లో కానీ, తోటలో కానీ, మరెక్కడైనా మనం చక్కగా మొక్కలకు బియ్యం కడిగిన నీటితో చక్కని పోషకాలు అందించవచ్చు. ఇది ఒక మంచి సహజ సిద్ధమైన ఆర్గానిక్ ఫెర్టిలైజర్‌ గా చెప్పుకోవచ్చు.  మరీ ముఖ్యంగా మంచి మంచి పువ్వులు విరబూయాలంటే రూపాయి కూడా ఖర్చు లేకుండా బియ్యం కడిగిన నీటితో సహజసిద్ధమైన ఫెర్టిలైజర్‌ తయారు చేసుకోవచ్చు. పువ్వులు, పండ్లు, కూరగాయలు గుత్తులు గుత్తులుగా పండించుకోవాలంటే జీరోకాస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ అంటే బియ్యం కడిగిన నీటిని మొక్కలకు ప్రతి 15 రోజులు లేదా 20 రోజులకు ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది.జీరో కాస్ట్‌ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. బియ్యం కడిగిన నీళ్లను ఒక రోజంతా అలాగే నిల్వ ఉంచాలి. నీటిని బాగా వెలుతురులో కాకుండా, లేదా బాగా చీకట్లో కాకుండా పెట్టుకోవాలి. లిక్విడ్ కలిపిన పాత్రను పూర్తిగా మూసి ఉంచకుండా, లేదా పూర్తిగా తెరిచి ఉంచకుండా గాలి పారేటట్టు మూత పెట్టుకోవాలి. అప్పుడే లిక్విడ్ ఫెర్టిలైజర్ చక్కడా పులుస్తుంది. ఎండాకాలంలో ఇలాంటి లిక్విడ్ ఇస్తే.. మొక్కలు కూడా చల్లబడతాయి. వాటికి వేడి తాపంతో అంతగా ఇబ్బంది పడవు.ఒక రోజులో ఆ నీళ్లు పులుస్తాయి. పులిసిన బియ్యం నీళ్లపై మీగడ లాంటి ఒక పొర ఏర్పడుతుంది. బియ్యం కడిగిన నీళ్ల అడుగున చిక్కగా ఉంటుంది. దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బాగా మిగలముగ్గి, మనం తినడానికి పనికిరావనుకున్న అరటి పండ్లను తొక్కలతో సహా ముక్కలుగా కోసి, పులిసిన బియ్యం కడిగిన నీటిలో వేసి, బాగా కలిసేలా పిసకాలి. దీన్ని మరో రెండు రోజుల పాటు అలాగే నిల్వ ఉంచాలి. ఇలా తయారైన లిక్విడ్‌ ఫెర్టిలైజర్‌ పూలమొక్కలకు వినియోగించుకుంటే దిగుబడి బాగా ఎక్కువగా వస్తుంది.ఈ లిక్విడ్‌ ఫెర్టిలైజర్‌ ద్వారా మొక్కలకు అత్యధిక స్థాయిలో ఎన్‌ పీకే అంటే నైట్రోజెన్‌, పొటాషియం, కాల్షియం అందుతాయి. దీనితో పూలమొక్కలు మరింత ఎక్కువగా పూలు పూస్తాయి. అందులోనూ వేసవి కాలంలో పూచే సువాసనలు వెదజల్లే పూలమొక్కలకు ఈ జీరో కాస్ట్‌ లిక్విడ్ ఫెర్టిలైజర్ మరింత ఎక్కువ బలాన్నిస్తుంది. వేసవి కాలం అయినా.. పూల మొక్కలు బాగా ఏపుగా, బలంగా, పచ్చగా ఎదుగుతాయి.అరటిపళ్లు బాగా మాగిపోయిన వాటిని ఎండలో బాగా ఎండబెట్టి కూడా బియ్యం కడిగిన నీటిలో కలపవచ్చు. అయితే.. ఈ మిశ్రమం ప్రాసెస్‌ అవడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. కనీసం నాలుగైదు రోజులైనా ఫర్మంట్ చేయాల్సి ఉంటుంది. బాగా మాగిన అరటిపండ్లను ఎండబెట్టి బియ్యం కడిగిన నీటిలో కలిపిన సహజ లిక్విడ్‌ ఎరువు కూరగాయలు, పండ్ల మొక్కలకు వేసుకుంటే మరింత ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఎండబెట్టని మాగిన పండ్లు అయితే.. రెండు రోజులు పర్మంట్ చేస్తే సరిపోతుంది.పండ్లు, పూల మొక్కల్ని నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత మన వాతావరణానికి అలవాటు పడేదాకా అంటే రెండు రోజుల పాటు అప్పటికే మన మిద్దెతోటలో ఉన్న మొక్కలతో కలపకుండా  వాటిని ఓ పక్కన ఉంచుకోవాలి. మన వాతావరణానికి అలవాటు పడిన తర్వాత మన కుండీల్లో వేసుకోవాలి. కొద్ది రోజుల పాటు నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు బాగానే పూలు పూస్తాయి. ఆ తర్వాత మొగ్గలు రావడం ఆగిపోతుంది. అప్పుడు వాటిని బాగా ట్రిమ్మింగ్ చేసి, తర్వాత మనం తయారు చేసుకున్న జీరో కాస్ట్‌ లిక్విడ్‌ ఫెర్టిలైజర్ ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. పువ్వులు పుష్కలంగా పూస్తాయి.జీరో కాస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ను తయారు చేసినది చేసినట్లు నేరుగా మొక్కలకు వాడకూడదు. ఆ లిక్విడ్‌ కు 1:5 రేషియోలో నీళ్లు కలిపి బాగా డైల్యూట్ చేసుకోవాలి. అంటే ఒక వంతు లిక్విడ్‌ కు ఐదు వంతుల నీరు కలిపి బాగా డైల్యూట్ చేయాలి. జీరో లిక్విడ్‌ ఫెర్టిలైజర్‌ ను స్టీలు పాత్రల్లో తయారు చేయకూడదు. ఎందుకంటే.. లిక్విడ్ ఫెర్టిలైజర్‌ ఫర్మెంట్‌ అయ్యే క్రమంలో పాత్రలు పాడైపోతాయి. ముందుగా స్టీలు పాత్రలో కలుపుకున్న తప్పనిసరిగా ప్లాస్టిక్ బకెట్‌ లేదా డ్రమ్ములోనే నిల్వ చేసుకోవాలి.జీరో కాస్ట్‌ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ ను నీటితో డైల్యూట్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొక్కలకు వేసవి కాలంలో ఉదయం ఆరు గంటల లోపు గానీ, సాయంత్రం కానీ ఇచ్చుకోవాలి. మొక్క తీరు, కుండీ సైజును బట్టి మగ్గు లేదా అర మగ్గు డైల్యూట్ చేసిన లిక్విడ్‌ వేసుకోవాలి. ఎక్కువ లిక్విడ్ వేసేస్తే అది కుండీ అడుగు భాగంలోని రంధ్రాల ద్వారా బయటకు వెళ్లిపోయి నిరుపయోగం అవుతుంది. అందుకే.. కుండీలోని మట్టి మొత్తం తడిసేలా లిక్విడ్ వేసుకుంటే సరిపోతుంది. అప్పుడే లిక్విడ్ లోని అన్ని పోషకాలు మొక్కకు పూర్తిగా అంది, ఏపుగా ఎదుగుతుంది. చక్కని ఫలితాలు ఇస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here