ప్రాచీనకాలంలో వ్రాసేందుకు తాళపత్రాలనే ఉపయోగించేవారు. తాటి (తాడి) చెట్టును కల్పవృక్షంతో పోల్చడం కద్దు. పొలంలో తాటిచెట్టు ఇంటి పెద్ద కొడుకుతో సమానమంటారు. లోతైన వేర్లు కలిగి ఉండడం వల్ల తాటిచెట్లు వాననీటిని ఇంకేట్లు చేస్తాయి. దీంతో నేల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా పరిసరాల్లో పచ్చదనం పెరగడానికిది దోహదపడుతుంది. ఈ చెట్టులో పనికిరానిదంటూ ఏదీ ఉండదు. ఈ చెట్టు పిడుగుపాటు నుండి మనల్ని కాపాడుతుంది కూడా. పొడవుగా, నిటారుగా పెరగడం వల్ల పిడుగులను ఇవి ఆకర్షిస్తాయి. దీంతో జనావాసాలపై కాకుండా తాటిచెట్లు ఉన్నచోట్లనే పిడుగులు పడతాయని గుర్తించారు. అందుకే కెన్యా, ఇథియోపియా వంటి అనేక ఆఫ్రికా దేశాల్లో దీన్ని పెంచుతున్నారు. ఒడిశాలో కూడా పిడుగుపాటును నివారించేందుకు తాటిచెట్లను పెంచడం మొదలుపెట్టారు. కాంబోడియాలోనైతే దీన్ని జాతీయ వృక్షంగా గుర్తించారు. తమిళనాడులో తాటి చెట్టు రాష్ట్రవృక్షం. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, గోవా, ఒడిశా, బెంగాల్‌ వంటి రాష్ట్రాల తీరప్రాంతాల్లో తాటిచెట్లు ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో సుమారు 12 కోట్ల తాటిచెట్లు ఉన్నట్టు ఒక అంచనా. మిగతా రాష్ట్రాల కన్నా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తాటిచెట్లు అధికంగా ఉన్నాయి. తాటిచెట్లు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఏ వాతావరణంలోనైనా సులభంగా పెరుగుతాయి. ఈ చెట్టు సుమారు 120 ఏళ్ల దాకా బతకడం విశేషం. ఏటా ఈ చెట్టు ద్వారా ఆరు నెలల పాటు కల్లు వస్తుంది. ఒక్కో తాటిచెట్టు సంవత్సరంలో సగటున వంద లీటర్లకు పైగా కల్లు ఇస్తుంది. కోతుల బెడదను కూడా తాటిచెట్లు నివారిస్తాయి. కోతులకు తాటిపండ్లు దొరికితే చాలు, అవి ఊళ్ల మీదికి రావు. తాటి చెట్లపై భాగంలో కాకులు గూళ్లు కట్టుకుంటాయి. వడ్రింగి పిట్టలు కూడా తొర్రలు చేసి గూళ్లు కడతాయి. ఆ తర్వాత రామచిలుకలు ఆ తొర్రల్ని గూళ్లు చేసుకుంటాయి. ఇలా జీవవైవిధ్యాన్ని తాటిచెట్లు కాపాడతాయి. తాటి చెట్టును పెంచడం కూడా చాలా తేలిక. వర్షాకాలంలో నాటితే నీళ్ల అవసరం లేకుండానే ఇది దానంతటదే పెరుగుతుంది. తాటికాయల్లోని గింజలతో ఈ చెట్లని తేలికగా వ్యాప్తి చేయవచ్చు. తాటి చెట్ల నుంచి వచ్చే కలప ఇళ్ల దూలాలకు పనికి వస్తుంది. చిన్నచిన్న ఊళ్లలో కాలువలు దాటేందుకు తాటి మొద్దులే ఆసరా అవుతాయి. తాటి మానులో మధ్యన ఉండే కలపను తీసేస్తే నీరు పారించే గొట్టంగానూ అది ఉపయోగపడుతుంది. తాటి ఆకులతో బుట్టలు, చాపలు, బొమ్మలు, గొడుగులు, అలంకార వస్తువులు, విసనకర్రలు తయారు చేసుకోవచ్చు. తాటాకులతో పాకలు వేసుకోవచ్చు.

పోషక విలువలు కలిగిన తాటిబెల్లం

తాటిచెట్టు కల్లు మాత్రమే కాదు, మనకు కావలసిన అనేక పోషకాలను కూడా అందిస్తుంది. తాటిచెట్టు ద్వారా లభించే తాటిబెల్లానికి ఇటీవల గిరాకీ పెరుగుతోంది. మధుమేహం నియంత్రణకు తాటిబెల్లం విరివిగా వాడుతున్నారు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తెలంగాణలో గీతకార్మికులకు ఉపాధి కల్పించడం కోసం నీరాను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పామ్ ప్రమోటర్స్ సొసైటీ కూడా తాటిచెట్ల పెంపకం వల్ల ఒనగూరే లాభాలను ప్రచారం చేస్తోంది. తాటిచెట్ల నుంచి తీసే నీరా ద్వారా బెల్లంతో పాటు బెల్లంపొడి కూడా తయారు చేసుకోవచ్చు. ఇది రైతులు, గీతకార్మికుల ఆదాయాన్ని పెంచుతుంది. తాటిచెట్టు నీరాలో 12 నుండి 15 శాతం వరకు చక్కెర ఉంటుంది. స్త్రీవృక్షాల నుంచి లభించే నీరాలో చక్కెర శాతం ఎక్కువ. ఈ చెట్లలో జనవరి నుంచి మే వరకు నీరా లభిస్తుంది. మగచెట్లలో నవంబర్ నుంచే నీరా వస్తుంది. గీత కార్మికులు నీరాతో తాటి బెల్లం, తాటి బెల్లం పొడిని ఇళ్లలోనే తయారు చేసుకోవచ్చు. ఒక తాటిచెట్టు నుంచి సాలీనా 150 లీటర్ల దాకా నీరాను సేకరించవచ్చు. దీంతో మంచి ఆదాయం లభిస్తుంది. నీరాతో తయారయ్యే తాటిబెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజు 76.86, రెడ్యూసింగ్ చక్కెర 1.66, కొవ్వు 0.19, మాంసకృత్తులు 1.04, కాల్షియం 0.86, ఫాస్ఫరస్ 0.05, ఖనిజ లవణాలు 3.15 శాతం, ఐరన్ ఉంటాయి. పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల తాటిబెల్లం ఎంతో ఆరోగ్యకరం. తాటిబెల్లాన్ని క్రమం తప్పకుండా రోజూ 20 గ్రాముల చొప్పున తీసుకోవటం వల్ల అనేక రకాలయిన వ్యాధులు నయం అవుతాయని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. స్త్రీలలోను, చిన్నపిల్లల్లోను ఉండే రక్తహీనతను ఇది తగ్గిస్తుంది. పుష్టి కలిగిస్తుంది. శరీరానికి చల్లదనం ఇస్తుంది. తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం కలిగి ఉండటం వల్ల తాటిబెల్లం రక్తపోటు నియంత్రణకు, గుండె వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
తాటినీరాతో బెల్లం, పాకం (సిరప్‌), పంచదార, పటిక బెల్లం వంటివి తయారు చేసుకోవచ్చు. చక్కెరకు బదులుగా వీటిని వాడుకోవచ్చు. తాటి ఉత్పత్తుల గ్లైసెమిక్‌ ఇండెక్స్‌(జి.ఐ.) తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చని తూర్పు గోదావరి జిల్లా పందిరిమామిడిలోని డా. వై ఎస్‌ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్త పి. సి. వెంగయ్య చెబుతున్నారు. ఇక్కడ తాటి నీరాతో వివిధ ఉత్పత్తుల తయారీ కోసం అత్యాధునిక ప్రాసెసింగ్‌ యూనిట్‌ను సైతం నెలకొల్పారు. గీత కార్మికులు, రైతులు, గ్రామీణులకు ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. సుమారు 100 లీటర్ల నీరా నుంచి 14 కిలోల దాకా బెల్లం పొందవచ్చు. తాటి బెల్లం ధర సుమారు కిలో రూ. 200 వరకూ ఉంటోంది. ఈ విధంగా తాటినీరాతో ఇంటి వద్దనే బెల్లం తయారు చేస్తే ఒక గీత కార్మికుడికి రోజుకు రూ. 1000 వరకు ఆదాయం లభించే అవకాశం ఉంది. నీరా నుంచి బెల్లంతో పాటు బెల్లం పొడిని తయారు చేయవచ్చు. బాణలిలో కాచిన పాకాన్ని అచ్చుల్లో పోస్తే బెల్లం తయారవుతుంది. మంట ఆర్పేసి అలాగే తిప్పుతూ ఉంటే సులువుగానే బెల్లం పొడి లభిస్తుంది. చక్కెరకు బదులుగా బెల్లంపొడిని వాడుకోవచ్చు. ఇది చాలా ఆరోగ్యకరం.

తాటి పటిక బెల్లం తయారీ

తాజా నీరాను 103–105 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద బాగా మరిగించాలి. నీరా బాగా మరిగి దాదాపు మూడో వంతు వరకు ఇగిరిన తర్వాత మంటను ఆర్పివేసి సన్నని దారాలు లేదా తీగలతో తయారు చేసిన క్రిష్టలైజర్‌లో పోయాలి. దీన్ని కదలకుండా, గాలి తగలకుండా ఉన్న చోటనే 35–40 రోజుల పాటు ఉంచాలి. తరువాత దారాలు లేదా తీగలకు అంటుకొని ఏర్పడిన స్ఫటికాలను బయటకు తీసి కడిగి, ఆరబెట్టి నిల్వచేసుకోవచ్చు. ఇదే తాటి పటికబెల్లం.

తాటి బెల్లం తయారీ విధానం

తాటి నీరాను మరగబెట్టడం ద్వారా తాటి బెల్లం తయారు చేస్తారు. సేకరించే సమయంలో నీరా ఉదజని సూచిక (పీహెచ్) 7.5 ఉండాలి. పులియకుండా తాజా నీరాను సేకరించేందుకు సున్నం (1 శాతం) వాడాలి. దీని కోసం సేకరించే పాత్రలో సున్నాన్ని పూతగా పూయాలి. ఇది పులియడాన్ని ఆలస్యం చేస్తుంది. ఈ విధంగా సేకరించిన నీరాను వెంటనే 22-24 గేజ్ గల జిఇ షీట్‌తో చేసిన బాణలిలో పోసి, వేడి చేయాలి. రెండు పొంగులు వచ్చే వరకు మరగబెట్టి, చల్లార్చి, వడపోయాలి. ఈ దశలో పీహెచ్‌ను చూడాలి. కొంచెం సూపర్‌ను కలపడం ద్వారా పిహెచ్ 7.5 ఉండే విధంగా చూసి వేడి చేయాలి. నీరా మరుగుతున్నప్పుడు వచ్చే తెట్టును తీసి వేయాలి. ఇలా చే స్తే సున్నం విరుగుతుంది. ఈ విధంగా దాదాపు 2 నుంచి 3 గంటలు మరగబెడితే.. నీరా బాగా చిక్కబడుతుంది. ఈ దశలో ఒక బొట్టును చల్లని నీటిలో వేసి బెల్లం ఏర్పడే దశను గుర్తించవచ్చు. నీటిలో ఇది పాకంలా ఉండకు వస్తుంది. ఉండకు వచ్చిన వెంటనే బాగా కలపడం ద్వారా చల్లార్చి ఫ్రేములో పోస్తే మనకు కావలసిన ఆకారంలో బెల్లం అచ్చులు పొందవచ్చు. పందిరిమామిడి పరిశోధనా స్థానంలో పరీక్షించబడిన కూలింగ్ బాక్స్ ఉపయోగించి సులువుగా తాజా నీరాను సేకరించవచ్చు. ఈ విధంగా సేకరించిన నీరాను వెంటనే 22-24 గేజ్‌గల జిఇ షీట్‌తో చేసిన బాణలి లేదా పాన్‌లో పోసి వేడి చేయాలి. రెండు పొంగులు వచ్చే వరకు వేడిచేసి చల్లార్చాలి. ఈ విధంగా దాదాపు 2-3 గంటలు మరగబెడితే బెల్లంపాకం బాగా చిక్కబడుతుంది. ఇది నీటిలో పాకంలా ఉండకు వస్తుంది. ఉండకు వచ్చిన వెంటనే బాగా కలపాలి. తర్వాత చల్లార్చి ఫ్రేములో పోయడం ద్వారా కావలసిన ఆకారంలో బెల్లం అచ్చులు పొందవచ్చు. నీరాను మరగబెడుతున్నప్పుడు బాగా కలపడం ద్వారా అడుగు అంటకుండా జాగ్రత్త పడాలి. నీరాను సేకరించినప్పుడు పీహెచ్ 7.5 లేదా 8 ఉండాలి. పెనానికి కొంచెం నూనె పూయటం ద్వారా బెల్లం వృథా కాకుండా ఉంటుంది. చెక్కతో చేసిన ఫ్రేమును నీటిలో నానబెట్టి వాడితే బెల్లం అచ్చులు సులువుగా వస్తాయి. ఇలా తాటిచెట్టుతో ఆదాయానికి ఆదాయం,ఆరోగ్యానికి ఆరోగ్యం సమకూరతాయి. కోట్లాది తాటిచెట్లున్నా ఇంతదాకా వాటిని మనం సరిగా ఉపయోగించుకుంది లేదు. ఇప్పటికైనా దీని ఉపయోగాలను గుర్తిస్తే గీతకార్మికులకు, రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. తాటి చెట్టు ఉపయోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలకు తూ. గో. జిల్లా పందిరిమామిడిలోని ఉద్యాన పరిశోధనా కేంద్రం (డా. వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం) ఆహార – సాంకేతిక విజ్ఞాన శాస్త్ర విభాగం సీనియర్ శాస్త్రవేత్త శ్రీ పి.సి.వెంగయ్యను 94931 28932 నంబరులో సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here