పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అంజలి రుద్రరాజు, కబీర్ కరియప్ప పడుచు జంట కథ వింటే అది ఎంతో నిజమనిపిస్తుంది. ఎందుకంటే వారిద్దరూ పెళ్లి చేసుకుంది మట్టివాసనలు, పిట్టల కువకువల మధ్య పచ్చగ బ్రతకాలనే. ప్రకృతి ఒడిలో దిగులు లేకుండా జీవించాలన్న కోరికే వారిద్దరినీ ఒక్కటి చేసింది. ముచ్చటైన ఈ జంటని పచ్చటి చేల నడుమ చూస్తే వీరిద్దరి మధ్య పడిన ఆ బ్రహ్మముడి సార్థకత ఏమిటో అవగతమౌతుంది.
ఒద్దికైన ఈ ఈడు జోడు.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ మాత్రమే కాదు, మేడ్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా. వీరు తాము కోరుకున్నట్లుగానే యారో వే (Yarroway Farm) పేరుతో తమకంటూ ఒక 100% ఆర్గానిక్ హరిత స్వర్గాన్ని సృష్టించుకున్నారు. ఇది కర్ణాటక రాష్ట్రం హలసూరులోని నాగు రిజర్వాయర్ వద్ద ఉంది. మైసూరు నుంచైతే ఇక్కడికి 52 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు మార్గాన వెళితే గంటలోపే చేరుకోవచ్చు. ఇక్కడ 50 ఎకరాల్లో వారు చెరుకు, ఆవాలు, పొద్దు తిరుగుడు, వేరుశెనగ, రాగి, జొన్నలు, సజ్జలు, వరి, గోధుమ, కందులు, మినుములు, పెసలు, పసుపు, కొత్తిమిర, మెంతులు, మిరప, కూరగాయల వంటి పలు రకాలైన పంటలు సాగు చేస్తున్నారు. ఏడెనిమిది మంది వ్యవసాయ శ్రామికులు వారి ఫామ్‌లో పని చేస్తారు.

know your farmer కాన్సెప్ట్

తమ Yarroway Farm ద్వారానే ఈ జంట తమ పంటలను, విత్తనాలను మార్కెట్ చేస్తూ ఉంటుంది. మీ రైతు గురించి తెలుసుకోండి.. (know your farmer) అన్నది వీరి నినాదం. పండించే రైతులతో వినియోగదారులు నేరుగా సంబంధబాంధవ్యాలు కలిగి ఉండాలన్నది వీరి భావన. అప్పుడు వినియోగదారులకు ఏం కావాలో రైతులకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే తమ పళ్లెంలోని భోజనం ఎంత నాణ్యమైనదో, ఎలా పండిందో వినియోగదారులకూ అర్థమౌతుంది. ఇది ఉభయతారకం.. అని వీరు వివరిస్తారు.
నిజానికి Yarroway Farm ఏర్పాటు అంజలి, కబీర్‌ల ప్రేమఫలం. అంజలి రుద్రరాజు తెలుగు అమ్మాయి. హైదరాబాద్‌లో చదువుకున్నారు. Commerce and Strategyలో పైచదువుల కోసం న్యూ యార్క్ వెళ్లారు. ఫైనాన్షియల్ రంగంలో పని చేస్తూ సుమారు పదేళ్ల పాటు విదేశాల్లోనే గడిపారు. అయితే రానూరానూ కార్పొరేట్ లైఫ్ స్టైల్ తనకి విసుగు తెప్పించడం మొదలుపెట్టింది. ప్రమోషన్లు, డాలర్లు సంపాదించడం కోసమేనా జీవితం అన్న ప్రశ్న అంజలిని ఆలోచనలో పడేసింది. దీంతో 2010లో అంజలి ఉద్యోగం వదిలేసి ఇండియా తిరిగి వచ్చారు. స్వదేశం వచ్చిన ఈ స్వేచ్ఛావిహంగం Biodynamics కోర్సు చేశారు. ఆ తర్వాత (హైదరాబాద్) మేడ్చల్‌ సమీపంలోని తమ పొలంలో ఆర్గానిక్ వ్యవసాయం మొదలుపెట్టడం. సేంద్రియ వ్యవసాయం గురించి అమెరికాలో విని ఉన్న అంజలి దాని మెళకువలు తెలుసుకునేందుకు ఇండియాలో చాలా ప్రాంతాలు తిరిగారు. మారు మూల పల్లెలలకు కూడా వెళ్లారు. రైతులకు సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ కూడా ఇచ్చేవారు. అలా పర్యటిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక ఆర్గానిక్ ట్రైనింగ్ ‌కోర్సులో కబీర్‌తో తనకి పరిచయమైంది.

Yarroway Farm ఏర్పాటు

కబీర్ అప్పటికే వ్యవసాయంలో ఉన్నారు. తండ్రికి తోడుగా చిన్నప్పటి నుంచే వ్యవసాయం చేసిన అనుభవం ఉంది అతడికి. ప్రకృతే తనకు అన్నీ బోధించింది. కబీర్ ప్రత్యేకంగా స్కూలుకు పోయింది లేదు. అలా వ్యవసాయం అంటే ప్రాణం పెట్టే కబీర్ మనసుకు నచ్చడంతో వారి పరిచయం స్నేహంగాను, అది ఆ తర్వాత వివాహబంధంగానూ మారింది. ఇద్దరి అభిరుచులూ ఒక్కటే కావడం ఒక అదృష్టం. అలా అంజలి, కబీర్ కలిసి తమ పొలంలో తమ ఆలోచనలకు అనుగుణంగా సేంద్రియ వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి పరిచారు. Yarroway Farm సంస్థను ప్రారంభించి దాని ద్వారా తోటి రైతులకు కూడా సహకారం అందించడం మొదలుపెట్టారు. అలా వారు బ్రాండ్‌ను సృష్టించి, రైతులను ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సహించారు. వారు పండించే సేంద్రియ పంటలకు మంచి గిరాకీ కూడా ఉంటోంది.
కబీర్, అంజలి జంట ఇప్పుడెంతో హ్యాపీగా ఉంది. ఇక్కడ మనిషికి మనిషి తెలుసు. గజిబిజిగా ఉండే గడబిడ ఇక్కడ లేదు. వాహనాల రొద ఉండదు. జనం రద్దీ బెడదా ఉండదు.. అని చెబుతారు కబీర్ సంతృప్తిగా. ఉదయం 7 గంటలకల్లా వారి దినచర్య ప్రారంభమవుతుంది. పొలం అంతా కలియదిరిగి పంటలను వారు తనివి తీరా చూసుకుంటారు. కాస్త కసరత్తుల్లాంటివి పూర్తయ్యాక వారు బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ఆ తర్వాత కాస్త పొలం పనులు. మధ్యాహ్నం భోజనమయ్యాక కాస్త కునుకు తీసి ఆ తర్వాత Yarroway Farm పనులేవైనా ఉంటే చూసుకుంటారు. ఫ్యూయల్, ఉప్పు, పాస్తా తప్ప వారు బయటి నుండి కొనేదేమీ ఉండదు. కాఫీ, టీ, మిరియాలవంటివి అస్సాంలోని మిత్రుల దగ్గరి నుండి వస్తాయి. బదులుగా వారు బియ్యం, బెల్లం వంటివాటిని పంపిస్తారు. అంతే.

ఆర్గానిక్ సీడ్ బ్యాంక్ ఏర్పాటు

2018లో అంజలి, కబీర్ ఆర్గానిక్ విత్తన బ్యాంకును ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో వారిప్పుడు వందకు పైగా రకాల విత్తనాలను విక్రయిస్తున్నారు. స్థానిక గిరిజన రైతుల నుండి, ఇతర సీడ్ బ్యాంకుల నుండి వారు దేశీ విత్తనాలను సేకరిస్తారు. మెట్ట భూముల్లో పండించే వరి వంగడాలను సంరక్షించడం కోసం వారు రైతుల సహాయం తీసుకుంటారు. రైతులకు ఉచితంగా విత్తనాలను అందించి, పంట వచ్చాక తిరిగి వాటిని ఇతర రైతులకు ఇవ్వాలని కోరతారు.
అంజలి, కబీర్ తమ పొలంలో పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తారు. మన పర్యావరణానికి ప్రతి ప్రాణీ మేలు చేస్తుందని వారి అభిప్రాయం. ప్రకృతిలోని ప్రాణులతో మనిషి సహజీవనం చేయాలని వారు చెబుతారు. అందుకే వారి పొలంలో అన్ని రకాల ప్రాణులూ కనిపిస్తాయి. కాకులు, పిచ్చుకలు, ఎలుకలు, ముంగిసలు, పాములు, కప్పలు, చెవుల పిల్లులు, అడవి పిల్లులు, రకరకాల పిట్టలు వారి పొలంలో తిరుగాడుతూ ఉంటాయి.
రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు వాకడం వల్ల పర్యావరణచక్రం ధ్వంసం అవుతోందని వారు అంటారు. ప్రతి ప్రాణీ మరొక ప్రాణిపై ఆధారపడి జీవించడం ప్రకృతిధర్మమని, పిట్టలు సహజ క్రిమిసంహారకాలని వారు వివరిస్తారు. రైతులు కోళ్లని కాపాడుకోవడానికి ముంగిసలను పట్టుకుంటున్నారనీ, దీంతో పాముల సంచారం పెరుగుతుందని వారు చెబుతారు. పత్తి వంటి వ్యాపార పంటల వల్ల పిట్టలకు, ఇతర ప్రాణులకు ఆహారధాన్యాలు దొరకడం లేదనీ, రైతులు అంతర పంటలుగానైనా సజ్జల వంటివి సాగు చేయాలనీ వారు సూచిస్తారు.
అంజలి, కబీర్ జంట తమ కలల పంటగా సాగిస్తున్న ఈ సేంద్రియ ప్రకృతి వ్యవసాయం నవతరానికి, యువతరానికి ఆదర్శం.. ప్రేరణదాయకం. ఆసక్తిగలవారు మరిన్ని వివరాల కోసం ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.

Yarroway Farm
Halasuru Village, Birwal Post, HD Kote, Taluk, Mysuru, Karnataka 571121 yarrowayfarm@gmail.com
+919902722600

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here