భారతదేశం ప్రపంచంలో రెండవ అతి పెద్ద వ్యవసాయ భూమి కలిగిన దేశం. ఇక్కడ 20 వరకు agro-climatic regions ఉన్నాయి. సుమారు 160 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ప్రస్తుతం వ్యవసాయం సాగుతోంది. మన జనాభాలో 58 శాతానికిపైగా గ్రామీణ కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కాస్త వెనక్కి వెళితే, 1947 నుండి 1960 వరకు మన దేశంలో ఆహార స్వయం సమృద్ధి ఉండేది కాదు. కరువులతో దేశం సతమతమయ్యేది. ప్రజల ఆకలి తీర్చడం ఒక సవాలుగా ఉండేది. దీనికి పరిష్కారంగా 1960వ దశకంలో ఎం ఎస్ స్వామినాథన్ హరిత విప్లవాన్ని ఆవిష్కరించారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా అభివృద్ధి పరచడం హరిత విప్లవం ప్రధానాంశాలు. ముఖ్యంగా వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, బార్లీ వంటి పంటల సాగుపై ఈ హరిత విప్లవం దృష్టి కేంద్రీకరించింది. IR-8 వెరైటీ వరి వంగడాన్ని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు అభివృద్ధి పరచారు. రసాయన ఎరువులతో ఏపుగా పెరగడం ఈ వంగడం ప్రత్యేకత.
ఏమైతేనేం, క్రమంగా మనం ఆహార స్వయం సమృద్ధిని సాధించగలిగాం. కానీ హరిత విప్లవం వల్ల అనేక కొత్త సమస్యలు ఎదురయ్యాయి. అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు, పురుగు మందులతో సాగిన వ్యవసాయం రైతులకు క్రమేపి నష్టదాయకమవుతూ వచ్చింది. మోతాదుకు మించి సాగిన నీటి వాడకం భూగర్భజలాల కొరత సృష్టించింది. దీంతో భూసారం దెబ్బతిన్నది. తద్వారా పర్యావరణ సమతౌల్యం కూడా పాడవుతోంది.

ఒకవైపు వ్యవసాయం ఖర్చులు అమాంతం పెరగడం, మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం రైతాంగాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడం మొదలుపెట్టింది. అలాగే కేవలం అధిక దిగుబడినిచ్చే జన్యుమార్పిడి వంగడాలను సాగుచేయడం వల్ల సంప్రదాయ వంగడాలు నశించిపోయాయి. వరిలో ఇప్పుడు 7000 రకాల వంగడాలు సాగవుతుండగా, లక్షకి పైగా దేశీయ వరి వంగడాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ వంగడాల సృష్టికి వేలాది సంవత్సరాల కాలం పట్టి ఉంటుంది. అలాగే దేశంలో చిరుధాన్యాల సాగు కూడా బాగా తగ్గిపోయింది. వాటి దేశీ వంగడాలు కూడా కనుమరుగయ్యాయి.
ఈ విధ్వంసాన్ని తొలినాళ్లలోనే గుర్తించారు డాక్టర్ గోవింద స్వామి నమ్మాళ్వార్. తెల్లటి గడ్డం, రైతు తలపాగా, ఆకుపచ్చని ఉత్తరీయం, ముఖంలో అనుభవం ఉట్టిపడే తేజస్సు, చెరగని చిరునవ్వు…ఇదీ స్థూలంగా నమ్మాళ్వార్ గురూజీ రూపం. మన దేశంలో కోట్లాది రైతులకు ప్రకృతి సాగు స్ఫూర్తినిచ్చిన నమ్మాళ్వార్ ఒక వ్యవసాయ తత్త్వవేత్త. ఆయనను అంతా నమ్మాళ్వార్ అయ్య అంటూ ఆత్మీయంగా పిలుచుకుంటారు.
రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం, హైబ్రీడ్ వంగడాలు చివరికి వ్యవసాయ సంక్షోభం సృష్టించక మానవని ఆయన ఆనాడే హెచ్చరించారు. జపాన్ వ్యవసాయ శాస్త్రవేత్త మసానోబు ఫుకువోకా స్ఫూర్తితో ఆయన భారతదేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతిపాదించారు.
నమ్మాళ్వార్ 1938 ఏప్రిల్ 16న తంజావూరు జిల్లా ఎళంగడులో జన్మించారు. అన్నామలై యూనివర్సిటీ నుండి 1963లో అగ్రికల్చర్ బీఎస్సీ పట్టా పొందారు. ఆ తర్వాత కోవిల్‌పట్టిలోని ప్రభుత్వ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా చేరారు. అవి హరిత విప్లవం అప్పుడప్పుడే మొదలవుతున్న రోజులు. రసాయన ఎరువులను వాడడం వల్ల భూసారం నాశనమవుతుందని, పెట్టుబడి వ్యయాలు పెరిగి వ్యవసాయం భారంగా మారుతుందనీ నమ్మాళ్వార్ అప్పట్లోనే గ్రహించారు. రసాయన వ్యవసాయాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించారు. హరిత విప్లవం చివరికి కష్టాలను, నష్టాలనే మిగులుస్తుందని హెచ్చరించారు. అయితే ఆయన మాటలు వినే వారెవరు? సైంటిస్టులు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా జన్యుమార్పిడి వంగడాలను ఆమోదించడం, రసాయన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం చూసి ఆయన ఇక ఉద్యోగంలో కొనసాగలేకపోయారు. ఆరేళ్లకే ప్రభుత్వోద్యోగం వదిలి సుస్థిర సేంద్రియ వ్యవసాయోద్యమం వైపు కదిలారు. ఆర్గానిక్ వ్యవసాయం గురించి ప్రచారం చేస్తూ తమిళనాడు అంతా పర్యటించారు. నమ్మాళ్వార్ గారితోనే తమిళనాడులో ఆర్గానిక్ వ్యవసాయ ఉద్యమం ప్రారంభమైంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రతిపాదించడమే కాదు, ఆయన ప్రకృతి సేద్యంలో ఎన్నో ప్రయోగాలూ చేశారు. వ్యవసాయం అన్నది డబ్బు సంపాదించడం కోసం పంటలు పండించే మార్గం కాదు. అది ఒక జీవనవిధానం…అన్నది ఆయన తరచు చెబుతూ వచ్చిన మాట.  పాశ్చాత్యవేష ధారణ వదిలేసి సామాన్యరైతులా దుస్తులు ధరించారు నమ్మాళ్వార్. హాస్యస్ఫోరకమైన తమిళ సామెతలతో, నానుడులతో సులభమైన రీతిలో అందరికీ అర్థమయ్యే భాషలో సాగేది ఆయన ప్రసంగం. ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పమంటూ ఎవరు పిలిచినా కాదనకుండా వెళ్లేవారు నమ్మాళ్వార్. ఆయన జీవితంలో చాలా భాగం బస్సుల్లోనే గడిచింది.

2004లో ప్రకృతి వనరులు, భూసార పరిరక్షణ కోసం నమ్మాళ్వార్ పాదయాత్ర చేపట్టారు. కావేరీ డెల్టా జిల్లాల్లో సుమారు 350 గ్రామాల్లో 550 కిలోమీటర్ల పొడవున నెల రోజుల పాటు సాగిన ఈ పాదయాత్ర సేంద్రియ వ్యవసాయం దిశగా రైతాంగాన్ని కదిలించింది. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల విశిష్టతను వివరిస్తూ నమ్మాళ్వార్ 20 దాకా పుస్తకాలు వ్రాశారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంలో ప్రత్యక్ష శిక్షణనిచ్చారు. రైతులు తమ తరతరాల ఆహారపు అలవాట్లను నిలుపుకోవాలనీ, దేశీయ విత్తనాలను కాపాడుకోవాలనీ ఆయన ప్రబోధించారు. అలా జరగకపోతే కార్పొరేట్ కంపెనీలు ఆ విత్తనాలను సొంతం చేసుకుని వ్యాపారం సాగిస్తాయని హెచ్చరించారు. రైతుకు విత్తనమే ఆయుధమన్నారు.
అమెరికా కంపెనీ ఒకటి మన వేప చెట్టుపై పేటెంట్ క్లెయిమ్ చేసినప్పుడు దాన్ని ప్రతిఘటించిన డాక్టర్ వందనా శివ బృందంలో నమ్మాళ్వార్ ఒకరు. ఆయన వందనా శివతో కలిసి అమెరికా వెళ్లారు. మన ప్రకృతిలో భాగమైన వేపపై పేటెంట్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. చివరకు ఈ కేసులో నమ్మాళ్వార్ వాదనే గెలిచింది.

నమ్మాళ్వార్ మెళకువలు

ఏళ్ల తరబడి రసాయన వ్యవసాయం జరిగిన భూమిలో సారం దాదాపు అంతరించిపోయి ఉంటుంది. అందులో ప్రకృతి వ్యవసాయం చేయాలంటే అంత సులువు కాదు. ఒక్కసారే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకే పంటల ఎదుగుదలకు పశువుల పేడ, మూత్రం,శనగపిండి, బెల్లం వంటివాటితో తయారయ్యే అమృత కరైసల్  (Amirtha Karaisal) వాడమని ఆయన చెప్పేవారు. ఇక తెగుళ్ల నివారణకు పంచగవ్య కషాయం ఉపయోగించాలని నమ్మాళ్వార్ సూచించేవారు. కొబ్బరి పాలు, పులిసిన మజ్జిగ కలిపిన ద్రావణాన్ని ఆయన పంటలకు సహజ ఎరువుగా ఉపయోగించేవారు. 2004లో సునామీ వల్ల దెబ్బతిన్న భూములను తరిగి వ్యవసాయయోగ్యంగా మార్చేందుకు సేంద్రియ విధానాలనే అనుసరించాలని ఆయన రైతులను కోరారు. 
వానాకాలం ఆరంభంలో భూమిని దున్ని 20 రకాల చిరుధాన్యాల (5 ధాన్యపు రకాలు + 5 పప్పు రకాలు + 5 నూనె గింజల రకాలు + 5 పచ్చిరొట్ట రకాలు) విత్తనాలు కలిపి ఎకరానికి 10 కేజీల చొప్పున జల్లి, 45 రోజుల తర్వాత ఆ పంట పూత దశలో వాటిని భూమిలోకి కలియదున్నాలని నమ్మాళ్వార్ సూచించేవారు. అప్పుడు అదంతా కుళ్ళి ఎరువుగా మారుతుందనీ, ఆ తర్వాత కావలసిన పంట వేసుకుంటే భూసారం పెరిగి మంచి దిగుబడి వస్తుందనీ వివరించేవారు. ఒక మూడు నెలల పాటు భూమికి విరామం ఇచ్చి ఈ పద్ధతిని పాటిస్తే భూమిలో క్షారగుణం తగ్గి సారం పెరుగుతుందని నమ్మాళ్వార్ కిటుకులు చెప్పేవారు.
ప్రభుత్వ ఉద్యోగం వదిలేశాక, నమ్మాళ్వార్ పదేళ్ల పాటు బెల్జియం స్వచ్ఛంద సంస్థ ఐలాండ్స్ ఆఫ్ పీస్ (Islands of Peace) సంస్థతో కలిసి పని చేశారు. ఆయన 1970లలో పౌలో ఫ్రెయిరే, వినోబా భావే సిద్ధాంతాలతో విశేషంగా ప్రభావితమయ్యారు. 1979లో ఆయన తన భావాలను ప్రచారం చేయడం కోసం ‘కుడుంబం’ అనే సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత 1990లో సుస్థిర వ్యవసాయ విధానల ప్రచారం కోసం LEISA అనే మరొక సంస్థను స్థాపించారు.

బీడు భూమిలో హరిత వనం

2009లో ఆయన కరూర్‌ సమీపంలోని వాణగం వద్ద పది ఎకరాలపై చిలుకు బీడు భూమిని కొనుగోలు చేశారు. నీటి వసతి ఏ మాత్రం లేని ఆ చౌడు భూమిని ఆయన సారవంతమైన వ్యవసాయక్షేత్రంగా మార్చేశారు. రసాయన ఎరువుల ప్రమేయం లేకుండా ప్రకృతి వ్యవసాయ అధ్యయనానికి దాన్ని కేంద్రం చేశారు. ప్రకృతి తోడ్పాటుతో ఎలాంటి భూమిలోనైనా పంటలు పండించవచ్చునని ఆయన రుజువు చేశారు. Nammalvar Ecological Foundation For Farm Research and Global Food Security Trust (NEFFFRGFST) పేరుతో ఆయన ఇంకో స్వచ్ఛంద సంస్థని కూడా ఏర్పాటు చేశారు. దీన్ని “వాణగం”గా కూడా వ్యవహరిస్తారు. ఇప్పుడీ ‘వాణగం’ సుమారు 70 ఎకరాలకు విస్తరించి నేచురల్ సేద్య పద్ధతుల అధ్యయన కేంద్రంగా పరిఢవిల్లుతోంది.

నమ్మాళ్వార్ కృషికి గౌరవసూచకంగా పలు పురస్కారాలు ఆయనను వరించాయి. దిండిగల్‌లోని ‘గాంధీ గ్రామ్ రూరల్ యూనివర్సిటీ’ నమ్మాళ్వార్‌కు 2007లో డాక్టరేట్ ప్రదానం చేసింది.

జీవితమంతా ఒక సాధువులాగే గడిపిన నమ్మాళ్వార్ ఎంతో లోతుగాను, తాత్త్వికంగానూ మాట్లాడేవారు. “మీరు మీ సమాధిపై వ్రాసే పంక్తులు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు…?” ఒకనాడు నమ్మాళ్వార్ తటాలున ఒకానొక సమావేశంలో అడిగిన ప్రశ్న ఇది. అంతా తలో సమాధానం చెప్పారు. చివరగా నమ్మాళ్వార్ వంతు వచ్చింది. “నా సమాధిపై ఇలా వ్రాస్తే బాగుంటుంది. కొందరిని నిద్ర నుండి లేపిన ఒక వ్యక్తి ఇక్కడ ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు…” అని ఆయన తన మనసులో మాటను వెల్లడించారు. అవును. అది అక్షరాలా నిజం. ఆయన తన ఉద్యమంలో భాగంగా వేలాది మంది రైతులను మేల్కొలిపారు. ఆయన కృషి ఫలితంగానే అనేక రాజకీయ పార్టీలు ఆ తర్వాతి కాలంలో తమ మేనిఫెస్టోల్లో ఆర్గానిక్ వ్యవసాయాన్ని సమర్థిస్తూ హామీలు ఇవ్వడం మొదలైంది. 

వ్యవసాయానికి ఆధారమైన పశుసంపదను కబేళాలు మింగేస్తున్నాయి. అందుకే పశుమాంస విక్రయానికి వ్యతిరేకంగా నమ్మాళ్వార్ ఉద్యమించారు. కేరళకు గోవుల అక్రమ రవాణాను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. దేశంలో బీటీ పత్తి, బీటీ వంకాయ వంగడాలను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమంలో ఆయన చురుకుగా పాలు పంచుకున్నారు. అలాగే చివరి రోజుల్లో కావేరీ డెల్టాలో మిథేన్ గ్యాస్ వెలికితీతకు సంబంధించిన ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనకు సైతం ఆయన నాయకత్వం వహించారు.
మనుషులు, పశువులు, నేల – ఈ మూడింటి మధ్య పరస్పర పోషక సూత్రం ఒకటి ఉందని ఆయన తరచు చెప్పేవారు. రైతు పంట పండిస్తే దాని పైభాగం అంటే ధాన్యం మనుషులకు, మధ్యభాగం అంటే గడ్డి లేదా చొప్ప పశువులకు, క్రిందిభాగం అంటే వేర్లు నేలకు సంబంధించినవని ఆయన సూత్రీకరించారు. కింద ఉండే వేర్లను భూమికే వదిలేయడం వల్ల భూసారం నిలుస్తుందని ఆయన చెప్పారు. ఇలా ప్రకృతి వ్యవసాయ విశిష్టతను తెలియజెప్పడానికి ఒక ఋుషిలా జీవితాన్ని అంకితం చేసిన నమ్మాళ్వార్ అయ్య తన 75వ ఏట 2013 డిసెంబర్ 30న దివంగతులయ్యారు. ఆయన లేని లోటు తీర్చలేనిది. అయితే ఆయన మనకు అందించిన ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తి మాత్రం ఎన్నటికీ సజీవమే.

నమ్మాళ్వార్ అయ్య ఏర్పాటు చేసిన “వాణగం” సంస్థ ప్రకృతి వ్యవసాయంలో రైతులకు శిక్షణను కొనసాగిస్తోంది. షార్ట్ టర్మ్ కోర్సుగా ఈ సంస్థ మూడు రోజుల వర్క్‌షాప్ (3 Day Training Workshop​)లను నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగినవారు మరిన్ని వివరాలకు ఈ చిరునామాను సంప్రదించవచ్చు. VANAGAM – Nammalvar Ecological Foundation: 9884708756, 9445879292

Bird’s eye-view of Vanagam

Dr. Nammalvar’s Vanagam Farm Video

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here