చెట్లు, మొక్కలను నేరుగా నేల మీద పెంచడమే ఉత్తమమైన విధానం అని మీరు అనుకుంటున్నారా? అయితే.. మీ అభిప్రాయాన్ని కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్ప గ్రామానికి చెందిన బిజుమోన్‌ ఆంటోనీ అంగీకరించడు. ఎందుకంటే నేలపై పెంచే చెట్ల వేర్లు చిక్కులు పడిపోయి, పంట ఆలస్యం అవుతుందని ఆంటోనీ అంటాడు. మొక్క నాటిన తొలి రోజుల్లో మనం అందించే పోషకాలు నేరుగా ఆయా మొక్కల వేర్లకు వెళతాయి. నిండా చిల్లులతో గాలి సౌకర్యం పుష్కలంగా ఉండే ఎయిర్‌ పాట్స్‌ లో మొక్కల్ని నాటితే ఒకే చోట కాకుండా ఎక్కడికి తీసుకెళ్లి అయినా పెంచుకోవచ్చు అంటాడు ‘మిరకిల్‌ ఫార్మ్స్‌’ పేరుతో విశేషమైన పండ్ల మొక్కల్ని పెంచుతున్న ఆంటోని. బిజుమోన్‌ కేవలం ఎయిర్‌ పాట్స్‌ లో అపురూపమైన పండ్ల మొక్కలు పెంచే రైతు మాత్రమే కాదు.. ఎయిర్‌ పాట్స్‌ ను తయారు చేసి, విక్రయిస్తుంటాడు కూడా. ఇజ్రాయెల్‌, జపాన్‌, చైనా దేశాల్లో ఈ ఎయిర్‌ పాట్స్‌ పంటల విధానాన్ని బాగా చేస్తున్నారని చెప్పాడు. ఎయిర్‌ పాట్స్‌ విధానంలో పండ్ల మొక్కల్ని పెంచితే వేగంగా ఫలసాయం చేతికి రావడంతో పాటు.. ఉత్పత్తి కూడా అధికంగా వస్తుందని ఆంటోని అంటున్నాడు. ఎయిర్‌ పాట్స్‌ కాస్త ఎక్కువ ఖరీదైనవి కావడంతో మన దేశంలోని రైతులు ఈ విధానాన్ని అనుసరించడం లేదని అంటాడు. ఈ కామర్స్‌ లాంటి వ్యాపార ప్లాట్‌ పాంలలో ఒక్కో ఎయిర్‌ పాట్‌ ఖరీదు సుమారు రూ.650 ఉంటుందని ఆంటోని తెలిపాడు.

బిజుమోన్‌ ఆంటోని వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్‌. తమ ఇంటికి సమీపంలోనే ఓ స్టూడియో నడిపేవాడు. అయితే.. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ 47 ఏళ్ల బిజుమోన్‌ ఆంటోని తన రెండో వ్యాపకంగా వ్యవసాయం చేసేవాడు. అయితే.. ఎయిర్‌ పాట్‌ విధానంలో పండ్ల సాగు ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తుండడంతో ఐదేళ్ల క్రితం పూర్తి స్థాయిలో వ్యవసాయంపైనే దృష్టిసారించాడు. బిజుమోన్‌ ఒకేసారి గొర్రెలు, ఆవులు, నల్లజాతి కోళ్లు, చేపల పెంపకంతో పాటు యాలకులు, మిరియాల పంటల్ని ఏక కాలంలో పండించేవాడు. అయితే.. కేరళ వాతావరణానికి ఎలాంటి కొత్త కొత్త పంటలు సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయో అనే దానిపై బిజుమోన్‌ తరచు అధ్యయనం, పరిశోధన చేస్తుండేవాడు.ఈ క్రమంలో ఆరేళ్ల క్రితం కేరళలోని వేడిని,  వర్షాన్ని తట్టుకుని ఎదిగే కొన్ని ప్రత్యేక విదేశీ పండ్లమొక్కల గురించి తెలిసిన తర్వాత ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బయ్యానని బిజుమోన్‌ తెలిపాడు. ఇప్పుడు బిజుమోన్‌ తన మిరకిల్‌ ఫార్మ్స్‌ లో యాపిల్‌, నారింజ, పీచ్‌, నేరేడు రకానికి చెందిన పియర్‌, బాదం, ఆక్రోటు, నేరేడు లాంటి 25 రకాల పండ్ల జాతులను ఎయిర్‌ పాట్స్‌ లో సాగుచేస్తున్నాడు. అలాగే ఆయా పండ్ల జాతులకు సంబంధించిన మొక్కల్సి కూడా ఎయిర్‌ పాట్స్‌ లో బిజుమోన్‌ పెంచి, అవి కావాలని కొనుక్కున్న వారికి దేశ వ్యాప్తంగా కొరియర్ ద్వారా కూడా సరఫరా చేస్తున్నాడు.

ఎటు వంచితే అటు వంగే గుణం ఉన్న వెడల్పయిన ప్లాస్టిక్‌ షీట్లతో ఈ ఎయిర్‌ పాట్‌ లను తయారు చేస్తారు. ఆ ప్లాస్టిక్‌ షీట్లకు ఒక వైపున ఫ్లాట్‌ గా ఉంటుంది. మరో పక్కన గాలి వచ్చేందుకు వీలుగా చిల్లులతో కూడిన కోన్‌ మాదికి బుడిపెలు ఉంటాయి. ఆ ప్లాస్టిక్‌ షీట్లను కుండీ మాదిరిగా తయారుచేసుకోవాలి. వాటి అడుగు భాగంలో గుండ్రని రౌండ్ షేప్‌ ప్లాస్టిక్‌ షీట్‌ ను అమర్చుకుని, వాటిలో మొక్కలు నాటుకోవాలని మన ఔత్సాహిక రైతు బిజుమోన్‌ ఆంటోని చెబుతున్నాడు. అలా తయారు చేసిన ఆ ఎయిర్‌ పాట్స్ నుంచి మొక్కకు అవసరమైనంత మేరకు గాలి సరఫరా అవుతుందంటున్నాడు. ఎయిర్ పాట్స్‌ లో నాటిన మొక్కల వేళ్లు బుడిపెల రంధ్రాల్లోంచి బయటి వాతావరణంలోకి వచ్చినప్పుడు అవి ఎండిపోయి, పీచుగా మారతాయి. దీంతో మొక్కకు అధికంగా పోషకాలు అందించాల్సిన అవసరం ఉండదు.  పాత వేర్లు ఎండిపోయడంతో ఆ మొక్కకు ఎయిర్ పాట్ లోనే కొత్త వేర్లు పుడతాయి. కొత్త వేర్ల వచ్చినప్పుడు మొక్క మరింత ఏపుగా ఎదుగుతుంది. అలాగా తొందరగా ఫలసాయానికి వస్తుందని బిజుమోన్‌ తెలిపాడు.బిజుమోన్‌ యాపిల్‌ మొక్కలు పెంచాలనుకున్నప్పుడు ముందుగా ఈ ఎయిర్ పాట్స్‌ విధానాన్ని ఆచరించాడు. కొన్ని పాట్లను బిజుమోన్‌ ఆన్‌ లైన్ లో కొనుక్కున్నాడు. వాటిలో యాపిల్ మొక్కలు నాటిన తర్వాత మంచి ఫలితం కనిపించిందని చెప్పాడు. అయితే.. ఎయిర్ పాట్స్‌ ను కొంచెం ఎక్కువ ఖరీదుతో కొన్న కారణంగా తొలుత లాభాలు అంతగా రాలేదన్నాడు. దాంతో తానే స్వయంగా ఎయిర్‌ పాట్స్ తయారు చేసుకోవడానికి దారితీసిందని బిజుమోన్‌ అంటాడు. కోయంబత్తూరులోని ఓ సంస్త సహాయంతో బిజుమోన్ ఇప్పుడు రకరకాల సైజుల్లో ఎయిర్ పాట్స్‌‌ను తయారు చేస్తున్నాడు. తొలి రోజుల్లో ఎయిర్ పాట్స్‌ ను బిజుమోన్‌ ఎలా తయారు చేస్తున్నాడో అని ఎంతో ఆసక్తిగా తన క్షేత్రానికి వచ్చి తయారీ విధానం గురించి తెలుసుకోవడమే కాకుండా తమ కోసం కూడా కొన్నింటిని తయారు చేసి ఇవ్వాలని అడిగేవారని తెలిపాడు. అలా తన ఎయిర్ పాట్స్ తయారీ ఒక వ్యాపారంగా మారిందని వివరించాడు. బిజుమోన్‌ ఎయిర్‌ పాట్స్‌‌ను  ‘మిరకిల్‌ పాట్స్‌’ బ్రాండ్ పేరుతో తయారు చేస్తున్నాడు.

మిరకిల్‌ పాట్స్‌ ను 50 నుంచి 1000 రూపాయల మధ్య వివిధ సైజుల్లో తయారు చేస్తున్నాడు. ఒక మామూలు చెట్టును పెంచాలనుకుంటే.. రూ.350 ఖరీదైన పాట్‌ తీసుకుంటే సరిపోతుందని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా పెద్దమొత్తంలో ఎయిర్‌ పాట్స్‌ ఖరీదు చేయాలను కుంటే వాటి ధర మరి కొంత తగ్గించి ఇస్తానని వెల్లడించాడు. సాధారణంగా తాను తయారు చేస్తున్న ఎయిర్ పాట్స్‌ ను కావాల్సిన వారు స్వయంగా తమ వద్దకు వచ్చి తీసుకెళుతుంటారని, దూరంగా ఉన్న వినియోగదారుల కోసం కొరియర్‌ ద్వారా కూడా తాను పంపిస్తానన్నాడు. ఎయిర్ పాట్స్‌ ను మట్టితో నింపి, మనకు కావాల్సి మొక్కల్ని నాటుకోవచ్చని బిజుమోన్‌ తెలిపాడు. ఎయిర్ పాట్స్‌ లో నాటిన మొక్కలకు ప్రతిరోజూ కాకుండా అప్పుడప్పుడూ నీరు, పోషకాలు అందిస్తే సరిపోతుందంటున్నాడు.

మిరకిల్‌ పాట్స్ లో చెట్లను పెంచుకోవడానికే కాకుండా వాటిలో కంపోస్ట్‌ ఎరువులు కూడా తయారుచేసుకోవడానికి అనువుగా ఉంటాయని బిజుమోన్‌ వివరించాడు. మిరకిల్ పాట్స్‌ లోని రంధ్రాల ద్వారా ఆక్సిజన్‌ మంచిగా లభించడంతో మొక్కలకు మేలుచేసే బాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుందని తెలిపాడు. వీటిలో కంపోస్ట్‌ ఎరువు తయారవడానికి కొద్ది రోజుల సమయం సరిపోతుందన్నాడు. ఎయిర్‌ పాట్స్‌ గార్డెనింగ్‌ విధానంలో గాలి, పోషకాలు సమృద్ధిగా అందడంతో  మొక్కలు ఎప్పుడు చూసినా ఎంతో ఫ్రెష్‌ గా కనిపిస్తాయన్నాడు. అలాగే.. ఆయా మొక్కల ఎదుగుదలకు నిర్ణయించిన దానికన్నా సగం సమయానికి ఎయిర్ పాట్స్‌ లో వేసిన మొక్కలు లేదా చెట్లు మంచి ఫలితాలు ఇస్తాయని వెల్లడించాడు. పైగా ఎయిర్ పాట్స్‌ లో పెంచే చెట్లకు కూలీల అవసరం కూడా పెద్దగా ఉండదని చెప్పాడు. ఎయిర్‌ పాట్స్‌ పెంచే చెట్లను ఎక్కడికైనా సులువుగా తరలించ వచ్చన్నాడు. ఎలాంటి నష్టమూ జరగకుండా ఎయిర్ పాట్స్‌ లోని చెట్లను సులువుగా తరలించవచ్చన్నాడు. ఔత్సాహిక రైతుల నుంచి మిరకిల్‌ ఎయిర్‌ పాట్స్ కు డిమాండ్‌ బాగా ఉండడంతో తయారీని పెంచి, వాటిని స్థానిక వ్యవసాయ షాపుల్లో అందుబాటులో ఉంచాడు.

బిజుమోన్‌ కేవలం 8వ తరగతి వరకు చదువుకున్నాడు. బిజుమోన్‌ ఎయిర్ పాట్స్‌ వ్యాపారంలో అతని కొడుకులు కూడా కలిసివచ్చారు. వారు తమ తండ్రి చేస్తున్న ఎయిర్ పాట్స్‌ వ్యవసాయ విధానాన్ని వెబ్‌ సైట్‌, యూట్యూబ్‌ చానల్‌ ద్వారా బాగా ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఎయిర్‌ పాట్స్‌ తయారీలోను, వాటిలో మొక్కల్ని పెంచుతున్న బిజుమోన్‌ కృషికి గుర్తింపుగా 2019లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ‘కర్షకోత్తమ’, 2020లో ‘కర్షక తిలక్‌’ అవార్డులు అందజేసి సత్కరించింది.

ఎయిర్ పాట్ గార్డెనింగ్‌ అంటే అభిరుచి ఉన్నవారు బిజుమోన్‌ ను 9048505848 నెంబర్‌ లో సంప్రదించవచ్చు.

 

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here