రాళ్లలోనే కూరగాయలు పండిస్తూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాడీ యువకుడు. కొంచెం కూడా మట్టి వాడకుండా, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులతో పని లేకుండా సహజసిద్ధంగా పలు రకాల కూరగాయల పంటలు పండిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సేంద్రీయ వ్యవసాయాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. సహజసిద్ధంగా తాను సాగుచేసే కూరగాయలు, ఆకుకూరల మొక్కలకు చేపల వ్యర్థాలలో ఉన్న పోషక విలువలతో కూడిన నీటిని మాత్రమే వినియోగించి సాగుబడిలో చక్కని ఫలితాలు రాబడుతున్నాడు ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన అందే జాన్‌ రాబర్ట్‌ సన్‌ అనే ఈ ఔత్సాహిక యువ రైతు.

రాబర్ట్‌ సన్‌ కు చిన్నతనంలోనే పోలియో సోకి ఎడమకాలు చచ్చుబడింది. చేతికర్రల సాయంతో నడవగలిగే రాబర్ట్‌ సన్‌ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాడు. తాను చదివిన చదువును వృథా కానివ్వకుండా ఆక్వా పోనిక్స్‌ విధానంలో కుండీల్లో సేంద్రీయ ఇంటిపంటలు పండిస్తున్నాడు. రాబర్ట్‌ పండించే పంటల్లో పచ్చిమిర్చి, వంకాయ, బీర, బెండ, సొర, కాకర వంటి కాయగూరలు, తోటకూర, గోంగూర, పుదీనా లాంటి ఆకు కూరలతో పాటు బొప్పాయి పంట కూడా సహజసిద్ధ విధానంలో చక్కగా పండిస్తున్నాడు.తమ ఇంటి ఆవరణలో ట్యాంకును రాబర్ట్‌ సన్‌ ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ట్యాంకును నీటితో నింపి, ఫిలాసఫీ అనే ఇజ్రాయిల్‌ జాతి, మన దేశంలో జిలేబీ పక్కే అని పిలుచుకునే చేపలను పెంచాడు రాబర్ట్‌ సన్‌. ఆ చేపలకు మునగాకును మేతగా వేసినట్లు రాబర్ట్‌ చెప్పాడు. మునగాకును తిన్న ఆ చేపలు విసర్జితాలతో ట్యాంకులోని నీరు పోషక జలంగా మారుతుందని అన్నాడు. చేపల వ్యర్థాల ద్వారా విడుదలైన నత్రజని, బాస్వరం లాంటి పోషకాలతో కూడిన పోషక జలాలను కుండీల్లో నాటిన మొక్కలకు సరఫరా అయ్యేలా చేసినట్లు తెలిపాడు.

ఆక్వాపోనిక్స్‌ సాగు కోసం తాను రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు రాబర్ట్‌ వివరించాడు. మొక్కలను పెంచేందుకు 250 లీటర్లు నీరు పట్టే ప్లాస్టిక్‌ డ్రమ్ములను వినియోగిస్తున్నాడు. ఒక్కో ప్లాస్టిక్‌ డ్రమ్మును నిలువుగా రెండు ముక్కలుగా చేసి, వాటిలో గులకరాళ్లు నింపుతామని రాబర్ట్‌ వెల్లడించాడు. అలా నింపిన గులకరాళ్లలో రెండు అంగుళాల లోతులో విత్తనాలు నాటుతామన్నాడు. చేపల ట్యాంకు నుంచి మొక్కలకు నేరుగా నీరు సరఫరా అయ్యేలా మళ్ళీ ఆ నీరు తిరిగి ట్యాంకులోకి రీసైక్లింగ్‌ విధానంలో వెళ్లిపోయేలా పైపుల్ని అమర్చాడు రాబర్ట్‌. అందు కోసం నీటి మోటార్లు అమర్చినట్లు చెప్పాడు. ఈ పద్ధతి వల్ల మొక్కలకు రోజుకు పది గంటల పాటు పోషక జలం ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా అయ్యేలా చేశాడు. మొక్కలకు నీరు సరఫరా చేయడం కోసం సౌర విద్యుత్‌ ను రాబర్ట్‌ సన్‌ వినియోగిస్తున్నాడు. తమ కుటుంబంలోని అందరికీ సరిపడినంతగా ఆకు, కాయగూరలను సహజ పంటల విధానంలో రాబర్ట్‌ సన్‌ పండిస్తున్నాడు. రాబర్ట్‌ సన్‌ సహజ సిద్ధంగా పండిస్తున్న కాయగూరలు, ఆకుకూరలను తాము వినియోగించగా మిగిలి వాటిని చుట్టుపక్కల వారికి సరసమైన ధరలకు విక్రయిస్తున్నాడు. రాబర్ట్‌ పండించిన పంటలు తిన్న తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నామని, ఆనందం కలుగుతోందని స్థానికులు సంతోషంగా చెబుతున్నారు.అంతేకాకుండా తమ ట్యాంకులో ఏడాదిన్నరలో విడతకు 15 కిలోల చొప్పున ఐదుసార్లు చేపల దిగుబడి వచ్చిందని రాబర్ట్‌ వివరించాడు. ప్రతి రెండు నెలలకోసారి చేపల ట్యాంకును ఖాళీచేసి, కొత్తనీరు నింపుతున్నట్లు రాబర్‌ట్‌ వెల్లడించాడు. ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటు అందిస్తే.. ఆక్వాపోనిక్‌ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచి, ఇంకా ఎక్కువ రకాల వంగడాలను సేంద్రీయ విధానంలో సాగు చేయాలని ఉందని రాబర్ట్‌ చెప్పుకున్నాడు.

2014లో తాను నేల మీదే వ్యవసాయం చేసే వాడినని రాబర్ట్‌ సన్‌ చెప్పాడు. ఆ ఏడాది తన అన్న, ఇతర మిత్రుల సహాయంతో ఇజ్రాయెల్‌ టెక్నాలజీతో ఆక్వాపోనిక్స్‌ సాగు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. పంటల సాగును కొత్త పుంతలు తొక్కించిన రాబర్ట్‌ సన్‌ కృషిని ప్రత్యక్షంగా చూసిన పలువురు ఔత్సాహిక రైతులు కూడా ఈ ఆక్వాపోనిక్స్‌ సాగు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరోగ్యాన్ని రక్షించుకోవాలనుకునే వారికి ఇలాంటి సహజ పంటలను అందుబాటులో ఉంచాలని, రాబర్ట్‌ సన్‌ లాంటి వారికి చేయూత అందిస్తే.. మరిన్ని ఫలితాలు రాబట్టవచ్చని వ్యవసాయ అధికారులు కూడా అభిప్రాయపడుతుండడం గమనార్హం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here