స్పిరులినా… దీన్నే సముద్ర నాచు అంటారు. ఉప్పు నీటిలో బాగా పెరుగుతుంది. స్పిరులినా సాగుకు మట్టితో పనిలేదు. సూర్యరశ్మి ఎంత ఎక్కువగా ఉంటే అంత అధికంగా స్పిరులినా దిగుబడి పెరుగుతుంది. పొలంలోనే కాకుండా ఇంటి వద్ద ట్యాంకుల్లో కూడా స్పిరులినా పంట పండించవచ్చు. స్పిరులినాలో 60 నుంచి 70 శాతం ప్రొటీన్‌ ఉంటుంది. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. అనేక మందుల్లో స్పిరులినాను వినియోగిస్తుంటారు. టాబ్లెట్‌ రూపంలో కూడా స్పిరులినా మార్కెట్లో లభిస్తుంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడించిన నేపథ్యంలో అత్యధికంగా ప్రొటీన్‌ లభించే స్పిరులినా పట్ల ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పెరిగింది. సాంప్రదాయ పంటల్ని కాకుండా కాస్త వెరైటీగా పంటలు పండించాలని, తద్వారా అధిక ఆదాయం, ప్రతిరోజూ డబ్బులు పొందాలనుకునే రైతులకు స్పిరులినా సాగు మంచి ఆప్షన్‌ అనే చెప్పాలి.

స్పిరులినా సాగును ఉప్పునీటిలో చేయాలి. సాగుచేసే ప్రాంతంలో 15 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రత ఉండాలి. స్పిరులినా సాగుచేసే నీటిలో పీహెచ్‌ 9 కంటే అధికంగా ఉండాలి. అంత స్థాయిలో పీహెచ్‌ లేని నీటిలో కూడా దీన్ని సాగుచేయాలనుకునేవారు. సోడియం క్లోరైడ్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు కలిపి పీహెచ్‌ ను 9కి తీసుకురావచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.స్పిరులినా సాగుచేసేందుకు ముందుకు వచ్చే రైతులు ముందుగా తమ పొలంలో కానీ, లేదా ఇంటి వద్ద ఉండే ఖాళీ స్థలంలో పొడవైన ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి. ఆ ట్యాంకుల్లో లోతు అన్ని వైపులా ఒకేలా ఉండేలా నిర్మించాలి. ఆ ట్యాంకుల అడుగున నైలాన్‌ 50 మైక్రాన్స్‌ తో ఉండే ప్లాస్టిక్ కవర్‌ వేసి, దాంట్లో నీరు నింపాలి. తర్వాత తల్లి స్పిరులినా తీసుకొచ్చి దాన్ని ఒక వస్త్రంలో ఉంచి, ట్యాంక్‌ మొత్తంలో తిప్పాలి. ఆ తర్వాత 15 రోజుల పాటు ట్యాంకు జోలికి వెళ్లకూడదు. అయితే.. నీటిలో టైమర్‌ తో పనిచేసే చిన్న మోటారు సాయంతో పెడల్స్‌ తిరిగేలా చేసుకోవాలి. పెడల్స్‌  తిరగడం వల్ల స్పిరులినా సీడ్‌ ట్యాంక్‌ లోని నీరంతా తొందరగా వ్యాప్తి చెందుతుంది. అలా 15 రోజులు ఊరుకుని 16వ రోజు నుంచి ఆల్గేని ప్రతిరోజూ సేకరించుకోవచ్చు. ఆల్గేని ప్లాస్టిక్‌ కవర్‌ వడకట్టి నీటిని మళ్లీ ట్యాంకులోకి పంపించేలా పైపులు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ప్లాస్టిక్‌ కవర్‌ లో మిగిలిన ఆల్గేని ప్రతిరోజూ సేకరించుకోవచ్చు.

స్పిరులినా సాగు కోసం మనం అంతగా కష్టపడాల్సిన పని ఉండదు. ట్యాంకులు తవ్వి, ప్లాస్టిక్ కవర్‌ వేసి, దాంట్లో నీరు నింపడం, తల్లి స్పిరులినా ఆ నీటిలో తిప్పడం, ఆపైన పెడల్స్‌ తిరిగే ఏర్పాటు చేయడం వరకు మాత్రమే మన కృషి, ఖర్చు ఉంటుంది. స్పిరులినా సూర్యరశ్మి సాయంతో దానంతట అదే ఎదుగుతుంది. నీటిలో ఎదిగిన స్పిరులినాను తీసి, ప్రాసెస్‌ చేసి, విక్రయించుకోవచ్చు.స్పిరులినా సాగును అతి తక్కువ పెట్టుబడి అంటే 10 వేల రూపాయల నుంచి కూడా చేసుకోవచ్చు. ఇంత తక్కు ఖర్చుతో టెర్రస్‌ పైన కూడా స్పిరులినా సాగు చేసుకోవచ్చు. నేలపై మాదిరిగా టెర్రస్‌ పైన ట్యాంకుల ఏర్పాటు వీలు పడదు. అందుకే స్పిరులినాను టెర్రస్‌ పై పండించాలంటే మార్కెట్‌ లో లభించే అజులో బెడ్స్‌ కానీ, వర్మీ కంపోజ్‌ బెడ్స్‌  కాని వినియోగించవచ్చు. బెడ్స్‌ లో నీరు నింపి, స్పిరులినాను పెంచవచ్చని ఇప్పటికే ఈ పంటలో ప్రతిరోజు ఆదాయాన్ని కళ్ల జూస్తున్న యువరైతు భరత్‌ చెబుతున్నారు.పొడవు 50 మీటర్లు, వెడల్పు 5 మీటర్లు ఉండే రెండు ట్యాంకుల్లో స్పిరులినా సాగు చేయాలంటే సుమారు 3 నుంచి 5 లక్షల రూపాయల దాకా ఖర్చవుతుంది. అయితే.. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ఆ తర్వాత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. స్పిరులినాను సేకరించుకునేటప్పుడు తప్ప ఇంకెప్పుడూ పని ఉండదు. మెయింటెనెన్స్‌ కూడా అవసరం లేదు. ట్యాంకు అడుగు భాగంలో కప్పే ప్లాస్టిక్‌ షీట్‌ చదరపు అడుగు సుమారు రూ.11 ధర ఉంటుంది. ట్యాంకులను సమానంగా ఏర్పాటు చేసుకోవడం కోసం మధ్యలో నిర్మించుకునే సిమెంట్‌ వాల్స్‌ కోసం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు టైమర్‌ మిషన్‌, పెడల్స్ కోసం కూడా మొదటిసారి మరి కొంత ఖర్చు చేయాలి. స్పిరులినా సాగుకు ఎలాంటి నేల అయినా పర్వాలేదు. ఎందుకంటే.. నేలపైన ప్లాస్టిక్‌ షీట్‌ కప్పి ఉంచుతాం కనుక అది ఎలాంటి నేల అయినా ఇబ్బంది లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్పిరులినా సాగులో ఎంత ఎండ ఎక్కువగా ఉంటే అంత బాగా దిగుబడి వస్తుంది. మామూలు కాలంలో కంటే ఎండాకాలంలో రెట్టింపు దిగుబడి లభిస్తుంది. అయితే.. మనం తీసుకునే స్పిరులినా సీడ్‌ ఎంత ఉష్ణోగ్రతను తట్టుకోగలదనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తులు గుర్తుచేస్తున్నారు. మదర్‌ కల్చర్‌ తీసుకునేటప్పుడే కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మదర్ కల్చర్ ఎంత బాగుంటే దిగుబడి మరింత ఎక్కువగా వస్తుంది. అందుకే మంచి నాణ్యమైన మదర్ కల్చర్‌ నే ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.స్పిరులినా బాగా తయారైందనేందుకు సూచనగా నీరంతా ఆకుపచ్చగా మారిపోతుంది. ఆ నీటిని ప్లాస్టిక్‌ షీట్‌ ఫిల్టర్ చేస్తుంది. దాంతో స్పిరులినా ఆ షీట్‌ లో ఉండిపోతుంది. ఆ స్పిరులినాను తీసుకుని నీటితో బాగా శుభ్రం చేయాలి. ఆ తర్వాత స్పిరులినా నుంచి నీరు మొత్తం పోయేలా వడకట్టాలి. వడకట్టిన స్పిరులినాను అలాగే నేరుగా కూడా తినవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లేదా దాన్ని బాగా ఎండబెట్టి, పొడి చేసి వాడుకోవచ్చు. కాదంటే టాబ్లెట్లుగా తయారు చేసుకుని, నిల్వ  చేసుకుని కూడా వినియోగించవచ్చంటున్నారు.

రెండు ట్యాంకుల్లో 16వ రోజు నుంచి రోజుకు 60 కిలోల వరకు తడి స్పిరులినా దిగుబడి తీసుకోవచ్చు. అది పూర్తిగా ఎండిన తర్వాత 7 కిలోల బరువుకు తగ్గుతుంది. బాగా ఎండిన స్పిరులినాకు మార్కెట్‌ లో కిలోకు కనీసం 600 రూపాయలు ధర పలుకుతుంది. అంటే రోజు రూ.4,200 చొప్పున నెలనెలా లక్షా 20 వేల రూపాయల ఆదాయం మన జేబులో చేరుతుందన్నమాట. వచ్చిన ఈ ఆదాయంలో నెలకు మనం పెట్టిన అన్ని ఖర్చులూ పోగా కనీసం 70 నుంచి 80 వేల రూపాయల వరకు లాభం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇక స్పిరులినా మార్కెట్‌ విషయానికి వస్తే.. మన దేశంలో దీనికి మంచి డిమాండ్ ఉంది. కొనే కంపెనీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రొటీన్ ఎక్కువగా ఉండే స్పిరులినాను చేపలు, రొయ్యలు, కోళ్ల వ్యాపారులు ఎక్కువగా కొంటారు. స్పిరులినాను మేతగా వేయడం ద్వారా తక్కువ సమయంలోనే అవి బరువు ఎక్కుగా పెరుగుతాయి. అందుకే చేపలు, రొయ్యలు, కోళ్ల వ్యాపారులు ఎగబడి కొంటున్నారు.

సో.. తక్కు ఖర్చు, అంతే తక్కువ కష్టం, ఎక్కువగా ప్రొటీన్ లభించడమే కాకుండా.. ప్రతిరోజూ చేతినిండా డబ్బులు సంపాదించిపెట్టే స్పిరులినా సాగుద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాయానికి ఆదాయం కూడా పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here