సహజ పంటలు పండించే రైతులకు మరింతగా మంచి కాలం రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహజ పంటలు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు, చిరుధాన్యాల పంటలకు ప్రోత్సాహం అందించాలని అధికారులను ఆదేశించడమే ఇందుకు కారణం. నేచురల్‌ ఫార్మింగ్‌పై రైతులకు మరింతగా అవగాహన కల్పించాలని, సహజ పంటలు పండించే రైతులకు చేదోడువాదోడుగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ మంత్రి తదితరులతో వ్యవసాయరంగపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ 2021 సెప్టెంబర్‌ 1న సమగ్ర సమీక్ష నిర్వహించారు.

చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు చేప‌ట్టాల‌ని ఈ సమీక్షా సమావేశంలో అధికారుల‌ను సీఎం జగన్‌ ఆదేశించారు. బోర్ల కింద, వర్షాధార భూముల్లో చిరుధాన్యాలు సాగుచేసేలా రైతులను మరింతగా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. వరిధాన్యానికి బదులుగా చిరుధాన్యాలు సాగుచేసినా ఆదాయాలు ఎక్కువగా వస్తాయనే అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. చిరుధాన్యాలు పండించే రైతులు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చిరుధాన్యాలు సాగుచేస్తున్న రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా భరోసా కల్పించాలని, దాంతో రైతులు చిరుధాన్యాల పంటల సాగుకు మరింత ఉత్సాహం చూపుతార‌ని సీఎం జగన్‌ అన్నారు.నేచురల్‌ ఫార్మింగ్‌పై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు నేచురల్‌ ఫార్మింగ్ విధానాలను ప్రదర్శించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. రైతులకు ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ సమాచారం అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇందుకు అవసరమైన సామాగ్రి కావాలనే రైతులకు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

ఆర్గానిక్‌ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌

ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌ వచ్చేలా చూడాలని సీఎం జ‌గ‌న్ అధికారులను ఆదేశించారు. ఆర్గానిక్‌ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటల సాగులో రైతులకు అవగాహన కల్పించేలా రూపొందించిన వీడియోలను యాప్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులకు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్షపాతం, పంటల సాగు, ఇ–క్రాపింగ్, వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు, ఆర్బీకేల నిర్మాణ ప్రగతి తదితర అంశాలపైన సీఎం జగన్‌ ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు.ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కే.కన్నబాబు, వ్యవసాయంలో ప్రభుత్వ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, ఏపీ ఆగ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుక్కపట్నం నవీన్‌ నిశ్చల్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, జెడ్‌బీఎన్‌ఎఫ్‌ స్పెషల్‌ సీఎస్‌ విజయ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్, మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ పి.ఎస్‌.ప్రద్యుమ్న, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ వీసీ, ఎండీ గెడ్డం శేఖర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here