గ్రోబ్యాగ్స్‌లో పసుపు పంట.. హైడ్రోపోనిక్స్‌ విధానంలో దండిగా పసుపు పంట పండిస్తూ వార్తలకెక్కాడు కర్ణాటకకు చెందిన మాజీ నావికాదళం అధికారి. పసుపు పంటలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధమైన పంట పండిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సీవీ ప్రకాష్‌. వేలాది మంది రైతులకు ప్రపంచ స్థాయి నాణ్యమైన పసుపు పంట ఎలా పండించాలో చక్కగా శిక్షణ కూడా ఇస్తున్నారు. ‘మిషన్ టర్మరిక్‌ 2021’ పేరిట అంతర్జాతీయ పసుపు మార్కెట్‌లోకి కూడా ప్రకాష్‌ అడుగుపెట్టారు.

సీవీ ప్రకాష్‌ పసుపు విప్లవం గురించి తెలుసుకుందాం..

సీవీ ప్రకాష్‌.. భారత నావికాదళంలో అధికారిగా పనిచేసి రిటైరయ్యారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో రైతులకు పసుపు పంటలో మరింతగా లాభాలు వచ్చేలా ఏమి చేయాలా అని మార్గాలు అన్వేషించారు. నిజానికి నావికాదళం ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ప్రకాష్‌ తన ఖాళీ సమయాన్ని వ్యవసాయం మీద మరీ ముఖ్యంగా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లోనే గడిపేవారు. మట్టి అవసరం లేకుండా చేసే వ్యవసాయ విధానాలపై 12 వేల మంది రైతులకు 2008 నుంచీ సీవీ ప్రకాష్‌ ఇచ్చారు. ఇప్పటికీ ఆ విధానంలో ప్రతి ఏటా వేలాది మంది రైతులకు శిక్షణ ఇస్తున్నారు.బెంగళూరులోని చిక్కసంద్రలో ఉన్న సీవీ హైడ్రో ట్రైనింగ్‌ సెంటర్‌లో సేలం వెరైటీ పసుపై పలు పరిశోధనలు చేశారు. ఆ క్రమంలో తాను అనుసరిస్తున్న ప్రత్యేకమైన, అపూర్వమైన సేలం పసుపు పంట విధానంలో ఊహించని స్థాయిలో దిగుబడి రావడాన్ని గమనించారు. సేలం పసుపు రకంలో ఒక్కో గ్రో బ్యాగ్‌ నుంచి అత్యధికంగా 8.17 కిలోల దిగుబడి రాబట్టారు. నిజానికి ఈ దిగుబడి సాధారణం కంటే మూడు రెట్లు అధికం కావడం విశేషం. మే 2020 నుంచి జనవరి 2021 మధ్య చేసిన హైడ్రోపోనిక్‌ పంట విధానంలో ఇంత భారీ స్థాయిలో దిగుబడి సాధించారు ప్రకాష్‌.

నిజానికి తమిళనాడులోని ఈరోడ్‌ రైతులు తమ పొలాల్లో ప్రధానంగా సేలం రకం పసుపు పంట పండిస్తుంటారు. అయితే.. ఒక్కో పసుపు మొక్క నుంచి 500 నుంచి 700 గ్రాముల దిగుబడి మాత్రమే తీయగలిగేవారు. సాంప్రదాయ వ్యవసాయ విధానంలో ఎక్కడైనా ఒక రైతు ఒక పసుపు మొక్క నుంచి ఒక కిలో దిగిబడి రాబట్టాడంటే అదే గొప్పగా చెప్పుకునేవారు అని సీవీ ప్రకాష్‌ వెల్లడించారు.హైడ్రోపోనిక్‌ విధానంలో ప్రకాష్‌ పండించే పసుపులో పసుపు కలిగిన పదార్థం అత్యధికంగా ఉందని, రసాయన పురుగుమందుల అవశేషాలు మచ్చుకు కూడా లేవని, హెవీ మెటల్స్‌ ఏవీ లేవని బెంగళూరులోని యూరోఫిన్స్‌ ల్యాబ్‌ నిర్వహించిన పరీక్షల్లో తేటతెల్లం అయింది. అలాగే మైక్రో బయాలాజికల్‌ కాలుష్యం అస్సలు లేదని స్పష్టం అయింది. సీవీ ప్రకాష్ పండించే పసుపు నూటికి నూరు శాతం ప్రజలు వినియోగించ దగినది అని యూరోఫిన్స్‌ ల్యాబ్‌ ధృవీకరించింది.

యూరోఫిన్స్ ల్యాబ్‌ ధృవీకరణ ప్రోత్సాహంతో మరింతగా ఉత్సాహం పొందిన సీవీ ప్రకాష్‌ ప్రకటించిన ఆరెంజ్‌ రివల్యూషన్‌ ప్రకారం 2021 జనవరి ఆఖరి వారంలో ‘మిషన్‌ టర్మరిక్‌ 2021’ను ప్రారంభించారు. మిషన్ టర్మరిక్‌ 2021 ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది రైతులకు గ్రో బ్యాగ్‌ విధానంలో సేలం పసుపు పంట ఎలా పండించాలో అవగాహన, శిక్షణ ఇస్తున్నారు.

గ్రో బ్యాగ్‌లను సీవీ ప్రకాష్‌ మట్టికి బదులుగా కోకో పీట్‌ (కొబ్బరి పొట్టు)తో నింపుతారు. పసుపు నీడలో బాగా పెరిగే స్వభావం ఉన్నది కనుక సాధారణమైన వలతో ఏర్పాటు చేసిన షెడ్లలో సేలం పసుపు పంట పండిస్తారు.

సీవీ ప్రకాష్‌ గ్రో బ్యాగ్‌ పసుపు పంట ప్రయోగం ఎప్పుడు ప్రారంభించారంటే.. ఆయన స్నేహితుడొకరు సుమారు 8 కిలోల సేలం పసుపు దుంప విత్తనాలను గత ఫిబ్రవరిలో పంపించారు. అప్పుడు ప్రకాష్‌ ఇలా గ్రో బ్యాగ్‌ విధానంలో పసుపు పంట పండించడం ప్రారంభించారు. ఒక్కో గ్రో బ్యాగ్‌లో ప్రకాష్‌ సుమారు 60 గ్రాముల విత్తనం చొప్పున నాటారు. అలా 100 గ్రో బ్యాగ్‌ల్లో మట్టికి బదులుగా కొబ్బరి పొట్టు నింపి ఆయన పసుపు పంట విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. అలా 9 నెలల్లో ప్రకాష్‌ ఊహించని స్థాయిలో దిగుబడి రావడాన్ని గ్రహించారు.పసుపు పంట నీడలో బాగా పెరుగుతుంది. వేడి వాతావరణం, కొంచెం తేమ ఉంటే మరింత ఏపుగా ఎదుగుతుంది. బెంగళూరులో వేడి మధ్యస్థంగా ఉంటుంది. ఎక్కువ సమయం పొడిగా ఉంటుంది. ఇలాంటి వాతావరణం పసుపు పంటకు అనువైనది కాదు.. ఇలాంటి అననుకూల వాతావరణంలో కూడా ప్రకాష్‌ చేసిన గ్రో బ్యాగ్‌ విధానం పంట దిగుబడికి బాగా ఉపయోగపడిందనేది గమనార్హం.

మామూలుగా పొలంలో పండించే పసుపులో క్రిమి కీటకాలు, ఫంగస్‌ వ్యాధులు ఆశించడం వల్ల సగం పంట వృథా అయిపోయే అవకాశం ఉందని సీవీ ప్రకాష్‌ అంటారు. పసుపు మొక్కల వేర్లు చక్కగా ఎదుగుతున్నాయని, ఫంగస్‌, పెస్ట్‌ వ్యాధులేవీ లేవని గ్రో బ్యాగ్‌ విధానంలో ప్రకాష్ గమనించారు. గ్రో బ్యాగ్‌ పసుపు పంట దిగుబడి అధికంగా రావడానికి సూక్ష్మజీవులు, సేంద్రియ ఎరువులు ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రకాష్‌ చెప్పారు. గ్రో బ్యాగ్‌ పసుపు పంట విధాన ప్రయోగంలో ఎలాంటి రసాయన పురుగుమందులూ వినియోగించకపోవడం కూడా ముఖ్యమే అంటాను ప్రకాష్‌.గ్రో బ్యాగ్‌ విధానంలో పండిన పసుపులో క్యాన్సర్‌ను నివారించగల లక్షణాలు ఎక్కువగా కనిపించాయని యూరోఫిన్‌ ల్యాబ్‌ పరిశోధన వెల్లడించింది. ఇలాంటి పసుపు పంటకు మందుల తయారీ కంపెనీల నుంచి మంచి డిమాండ్ ఉంటుందని పేర్కొంది. నేలలో పండించే పసుపులో సుమారుగా 2.5 నుంచి 3 శాతం వరకు ఫలదీకరణ ఉంటుందని, గ్రో బ్యాగ్‌ విధానంలో పండించిన పసుపులో 5.91 శాతం ఉందని ప్రకాష్‌ పేర్కొన్నారు.

రైతు ఎంత బాగా పంట పండించినా మార్కెటింగ్‌ సౌకర్యం సరిగా లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతుంటాడు. అయితే.. పసుపు పంటను మంచి ధరకు కొలుగోలు చేసే వారిని అన్వేషించడంలో ప్రకాష్‌ నేతృత్వంలోని సీవీ హైడ్రో సంస్థ రైతులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. రోజుకు 11 గంటలు తన గ్రీన్‌ హౌస్‌లో ఉండి మొక్కల్ని కన్నబిడ్డల్లా చూసుకునే సీవీ ప్రకాష్‌ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here