ఆర్గానిక్ పద్ధతిలో.. సేంద్రీయ విధానంతో ఓ యువ రైతు జామ పంట ద్వారా దండిగా లాభాలు గడిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా రాయచోటి మండలం శిబ్యాల గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన యువరైతు శివప్రసాద్‌ ఇప్పుడు లాభాల పంట పండిస్తున్నాడు. నిజానికి శివప్రసాద్‌ పట్టు వదలని విక్రమార్కుడనే చెప్పాలి. అడవి లాంటి ప్రాంతంలో ఏ పంట పండించినా అడవి జంతువులతో రైతన్నకు కష్టాలు తప్పవు కదా. పైగా పంటలు పండించేందుకు అనువైనది కాదని ఉద్యానవనశాఖ అధికారులు రూఢిగా నిర్ధారించిన ప్రాంతం అది. ఉన్నత చదువులు చదివిన శివప్రసాద్‌ అక్కడే ఎలాగైనా మంచి పంటలు సాగుచేసి చక్కని దిగుబడి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తనకు తెలిసిన వ్యవసాయ మెళకువలతో జామపంట సాగుచేశాడు శివప్రసాద్‌. ఆర్గానిక్‌ జామ పంటలో ఊహించని లాభాలు ఆర్జిస్తున్న శివప్రసాద్‌ ప్రకృతి వ్యవసాయ విధానంలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..

అడవిని తలపించే ప్రాంతం అది. అక్కడ ఏ పంట సాగుచేసినా అడవి జంతువులతో కష్టాలు తప్పదు. పంటల సాగుకు అది అనువైన ప్రాంతం కాదని ఉద్యానవన శాఖ అధికారులు నిర్ధారించారు. అయినా అక్కడే పంటసాగుకు సంసిద్ధుడయ్యాడు. మంచి దిగుబడి రాబట్టాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాడు శివప్రసాద్‌. ఈ క్రమంలో శివప్రసాద్‌ జామపంటను ఎంచుకున్నాడు. అసలే అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో సోలార్ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఎకరా పొలంలో ఐదు రకాలకు చెందిన దాదాపు 2,400 జామ మొక్కలు నాటి, ఆర్గానిక్‌ పద్ధతిలో పెంచాడు. ఇప్పుడు తాను కూడా ఊహించని విధంగా అత్యధిక దిగుబడి రాబడుతున్నాడు. తద్వారా మంచి లాభాలు కూడా పొందుతున్నాడు. శివప్రసాద్‌ ఇప్పుడు కడప జిల్లాలో పది మందికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.మన యువరైతు శివప్రసాద్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేశాడు. అల్ట్రా హైడెన్సిటీ పద్ధతిలో ఎకరా పొలంలో జామ మొక్కలు నాటాడు. వాటిలో ఐదు రకాల తైవాన్ వైట్, తైవాన్ పింక్, ఆర్గా కిరణ్, గులాబ్ జామున్, అలహాబాద్ సఫిదా రకాల జామ మొక్కలున్నాయి. శివప్రసాద్‌ రెండేళ్లుగా జామసాగు చేస్తున్నాడు. శివప్రసాద్‌కు ఏడాదికి జామపంట నాలుగు కోతల దిగుబడి వస్తోంది. జామ మొక్కల్ని పూర్తిగా ఆర్గానిక్ ఫామ్ విధానంలోనే పండిస్తున్నాడు.

‘ఎకరా పొలంలో జామ పంట పండించేందుకు లక్షన్నర రూపాయల ఖర్చు చేశాం. ఒక పంట దిగుబడిలోనే మేం పెట్టిన పెట్టుబడులు మొత్తం వచ్చేశాయి. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహకారం అందడం లేదు. జామపంట సాగుకు అనువైన ప్రాంతం ఇది కాదని, అందువల్ల ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందించలే’మని అధికారులు చెప్పేశారన్నాడు శివప్రసాద్‌ సోదరుడు భాస్కర్‌. ‘కనీసం ఓజిడి బాక్సులైనా ఇవ్వలని తన సోదరుడు ఉద్యానవన శాఖ అధికారులకు మొరపెట్టుకొన్నా ఫలితం లేదన్నాడు. తాము జామపంట సాగుచేసి రెండేళ్లయినా ఒక్క అధికారి కూడా రాలేదని భాస్కర్‌ చెప్పాడు.తమ కష్టంతో.. తమకు తెలిసిన మెళకువలతోనే ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే దిగుబడులు సాధించగలిగామని యువరైతు శివప్రసాద్ కుటుంబ సభ్యులు సంతోషంగా చెప్పారు. సేంద్రియ పద్ధతిలో సాగుచేయడం వల్ల జామకాయలు మంచి రుచికరంగా ఉన్నాయన్నారు. దీంఓ చుట్టు పక్కల వారు తమ జామతోట వద్దకే వచ్చి కాయలు కొనుక్కుంటున్నారని తెలిపారు. ఇక దూరప్రాంతాల వారికైతే ఒకేసారి 10 కేజీలకు తక్కువ కాకుండా కొంటే పార్సిల్ చేసి కొరియర్ ద్వారా పంపుతున్నామన్నారు.ఒక ఎకరంలో 3 నెలలకు ఒకసారి రెండు లక్షలు ఆదాయం వస్తుంటే.. ఉద్యోగం ఎందుకు? నేను చదివిన చదువు ద్వారా నా తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చేలా చూడలన్నది నా ఆకాంక్ష. ఈ రోజు నేను జామసాగులో లాభాలు ఆర్జిస్తున్నానంటే నా కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని శివప్రసాద్‌ ఆనందంగా చెబుతున్నాడు. జామపంట సాగుచేస్తూ తమ సోదరుడు నలుగురికి ఉపాధి కల్పించడమే కాకుండా నాటినప్పటి నుండి మొక్కల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడని శివప్రసాద్ సోదరుడు భాస్కర్‌ తెలిపాడు. జామ సాగుకు ఈ ప్రాంతం అనువు కాదని, సీతాపలం వెయ్యండని అధికారులు చెప్పడంతో ముందు శివప్రసాద్‌ కొంత నిరాశ చెందాడని సోదరుడు చెప్పాడు. అయినప్పటికీ శివప్రసాద్‌ తన తెలివితేటలతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు అర్జిస్తుండడం తమకు ఎంతో సంతోషంగా ఉందని శివప్రసాద్ సోదరుడు భాస్కర్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

చూశారుగా రైతన్నలూ.. అనువుగాని చోట కూడా మన యువరైతు శివప్రసాద్‌ పట్టుదలతో అధికుడిగా నిరూపించుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here