హైదరాబాద్‌లోని ‘పీపుల్స్‌ ప్లాజా’లో ‘ఆల్ ఇండియా హార్టికల్చర్, అగ్రికల్చర్, నర్సరీ ఎక్స్‌పో’ (All India Horticulture Agriculture and Nursery Expo) నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు జనవరి 28న లాంఛనంగా ప్రారంభించిన ఈ ప్రదర్శన ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఇది ఏటా జరుగుతూ వస్తున్న వరుసలో ఇది తొమ్మిదవ ప్రదర్శన.
కాక్టస్, బోన్సాయ్, సకలెంట్ ప్లాంట్స్, ఇండోర్, అవుట్ డోర్ మొక్కలు, వివిధ జాతుల పండ్ల మొక్కలు, పూల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు కూడా ఇక్కడ లభిస్తాయి. వీటిల్లో సకలెంట్ మొక్కలకు పెద్దగా మెయింటెనన్స్ అవసరం లేకపోవడంతో వాటికి గిరాకీ ఎక్కువగా ఉంది. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని నిలుస్తాయి. వీటిని ఎవరికైనా బహుమతిగా కూడా ఇవ్వవచ్చు కూడా. రొటీన్‌గా కుండీల్లోనే కాకుండా సృజనాత్మకంగా కారు ఆకృతి కలిగివున్న కుండీల వంటి డిజైన్లలో వీటిని అందుబాటులో ఉంచారు. ఇలా పలు రకాల మొక్కలు ఒక్కచోటే దొరకడంతో హార్టికల్చర్ ప్రదర్శనకు రద్దీ పెరిగింది. ఇక్కడ సుమారు 130 దాకా స్టాళ్లను ఏర్పాటు చేశారు. కోవిడ్ 19 తర్వాత నగరవాసులు తమ ఇళ్లలో ఆకుకూరలు పెంచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇదిలావుండగా ఈసారి ఆర్గానిక్ ప్రాడక్టులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ‘మిత్రా ఆర్గానిక్స్‌’కు చెందిన సమీర, న్యూమన్ ఈ ప్రదర్శనలో పలు రకాల ఆర్గానిక్ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. ఆర్గానిక్ నువ్వుల విత్తనాలు. జీడిపప్పు, బియ్యం ఇక్కడ లభిస్తున్నాయి. తూర్పు గోదావరికి చెందిన మిత్రా ఆర్గానిక్స్ కేవలం సేంద్రియ వ్యవసాయ విధానాలనే అనుసరిస్తుంది. వారు తమ వ్యవసాయక్షేత్రంలో తయారుచేసిన వెర్మికంపోస్టును కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇక ‘గ్రీన్ నౌ’ సంస్థ వినూత్నంగా ఆలోచించి ‘ప్లాంట్ బాక్సు’ను రూపొందించింది. సుమారు 20 అంగుళాల వెడల్పు ఉండే ఈ బాక్సు ప్రత్యేకత ఏమిటంటే, మొక్కలకు కావలసిన తేమను నిరంతరం అందించడం. సెలవుల్లో మనం వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇంట్లో మొక్కలు ఎండిపోకుండా, వాడిపోకుండా ఉండాలన్న ఆలోచనతో దీన్ని తయారు చేశారు ‘గ్రీన్ నౌ’ డైరెక్టర్ రాహుల్. పది లీటర్ల నీటిని ఈ బాక్సులో పోసి ఉంచితే, ఆ నీరు 30 రోజుల వరకు మొక్కలకు రోజూ కాస్త కాస్తగా అందుతూనే ఉంటుంది. వీటిని పొలాల్లో కూడా ఉపయోగించుకోవచ్చునని రాహుల్ చెబుతున్నారు. అలాగే ఇక్కడ పర్యావరణ అనుకూల ఉత్పత్తులు కూడా లభిస్తున్నాయి. ‘ఆన్ క్రాప్ ఆగ్రో సొల్యూషన్స్’ కొబ్బరి చిప్పలతో తయారు చేసిన కుండీలను ప్రదర్శనలో ఉంచింది.


ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలను ఏర్పాటు చేసినవారికి మరింతగా అవకాశాలు కల్పించడం కోసం ఒకే చోట పలు రకాల మొక్కలను ప్రదర్శించేందుకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని ఎక్స్‌పో నిర్వాహకులు ఖలీద్ అహ్మద్ చెప్పారు. కరోనా లాక్‌డౌన్ టైములో చాలా మంది బాల్కనీల్లోనూ, మిద్దెలపైనా కూరగాయల పెంపకం పట్ల ఆసక్తి చూపారని ఆయన వివరించారు. అందుకే ఇప్పుడు కూరగాయల మొక్కలను డిమాండ్ పెరిగిందన్నారు. మొక్కలు పెంచేవారికి ఇక్కడ నాణ్యమైన విత్తనాలు, ఆర్గానిక్ ఎరువులు, క్రిమిసంహారకాలు, సెరామిక్-ఫైబర్ ప్లాంటర్ స్టాండ్లు, ఇతర వ్యవసాయ పరికరాలు లభిస్తాయని ఆయన చెప్పారు. ఈ ప్రదర్శనలో రూ. 20 నుంచి రూ.1.5 లక్షల దాకా ధర ఉండే పలు రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. సాధారణంగా బోన్సాయ్ మొక్కల ధర ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. కాగా, ఈ సారి వివిధ జాతుల మొక్కలను ప్రదర్శనలో ఉంచడంతో పాటు వర్టికల్ గార్డెన్, టెర్రాస్ గార్డెన్, కిచెన్ గార్డెన్, బాల్కనీ గార్డెన్, హోమ్ గార్డెన్‌ల వంటి ప్రత్యేక విభాగాలను కూడా నిర్వహిస్తున్నారు. వీటిని కుండీల్లో సైతం పెంచుకునేందుకు వీలుగా రూపొందించారు. ఇవేకాక ప్రత్యేకంగా ఔషధ మొక్కల కోసం స్టాళ్లను ఏర్పాటు చేశారు. మధుమేహ నియంత్రణలో ఉపయోగించే కాలా జామూన్, మానసిక ప్రశాంతతకు తోడ్పడే స్టీవియా ఆకుల వంటివి ఇక్కడ లభిస్తాయి.
తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచే కాకుండా కడియం, పుణే, బెంగళూరు, ముంబై, డార్జిలింగ్‌, హర్యాణా, ఫరీదాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు వెళితే వివిధ మొక్కల పెంపకందారుల చిరునామాలు కూడా లభ్యమవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here