తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన రంగమ్మాళ్‌కు ఇప్పుడు 105 సంవత్సరాలు. పప్పమ్మాళ్‌గా ప్రసిద్ధి పొందిన రంగమ్మాళ్‌కు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. వ్యవసాయ రంగంలో కృషి చేసినందుకుగాను పప్పమ్మాళ్‌ను ఈ అవార్డు వరించింది. తమిళనాట ఆర్గానిక్ వ్యవసాయ వైతాళికురాలు కావడం పప్పమ్మాళ్ ప్రత్యేకత.
సుమారుగా 1915లో దేవలపురంలో జన్మించిన పప్పమ్మాళ్ నిజానికి స్కూలుకు వెళ్లి చదువుకున్నది లేదు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు గతించడంతో ఆమెను, ఆమె ఇద్దరు తోబుట్టువులను తెక్కలంపట్టిలో ఉండే నానమ్మే పెంచి పెద్దచేసింది. ఆ రోజుల్లో చదువుకునేందుకు అవకాశాలు తక్కువ కాబట్టి పళ్లాంగుళి వంటి సంప్రదాయ ఆటల ద్వారా లభించిన జ్ఞానమే పప్పమ్మాళ్ చదువు. ఈ ఆటలతోనే ఆమె లెక్కలు నేర్చుకున్నారు. కొన్నాళ్లకు నానమ్మ కూడా గతించడంతో పచారీ కొట్టు పప్పమ్మాళ్ జీవనాధారమైంది. అలాగే ఆమె ఒక చిన్నపాటి హోటల్‌ కూడా నడుపుతూ వచ్చారు. నెమ్మదిగా కాస్త డబ్బు పోగుచేసుకుని ఊళ్లోనే పది ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అలా తన ముప్పైవ పడిలో రంగమ్మాళ్ సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు.
ఇప్పుడు పప్పమ్మాళ్ భర్త కూడా కాలంచేశారు. తనకు పిల్లలు లేకపోవడంతో తన సోదరి కుమార్తెలను పెంచుకున్నారు. వారికి 7.5 ఎకరాల భూమిని కూడా ఆస్తిగా ఇచ్చారు. ప్రస్తుతం పప్పమ్మాళ్ 2.5 ఎకరాల పొలం సాగు చేస్తున్నారు. భవానీ నది ఒడ్డున ఉన్న ఈ భూమిలోనే ఆమె పప్పులు, పలు రకాల చిరుధాన్యాలు, కూరగాయలు పండిస్తారు.

డిఎంకె నేత స్టాలిన్‌తో పప్పమ్మాళ్

పప్పమ్మాళ్‌కు వ్యవసాయమంటే మొదటి నుంచీ ఎంతో ప్రీతి. అందుకే అందులోని మెళకువలను ఎంతో ఓపిగ్గా నేర్చుకున్నారు. ఆర్గానిక్ సాగుపై జరిగే సదస్సులకు, సమావేశాలకు హాజరై అక్కడ తెలుసుకున్న విధానాలను ఆమె తన పొలంలో ప్రయోగించడం మొదలుపెట్టారు. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతుల కోసం నిర్వహించే శిక్షణ తరగతులకు కూడా పప్పమ్మాళ్ తరచుగా హాజరౌతుంటారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్లు అందరూ పప్పమ్మాళ్‌ను ఒక వైతాళిక రైతుగా గౌరవించడం విశేషం. మొదటి నుంచీ రసాయనాలకు దూరంగా ఆర్గానిక్ వ్యవసాయమే చేస్తూ వచ్చిన పప్పమ్మాళ్ నేటికీ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. సేంద్రియ సాగు పద్ధతులను ఆమె గట్టిగా సమర్థిస్తారు.

రాజకీయాల్లో కూడా రాణింపు

మొదట్లో ఆమె రాజకీయాల్లో సైతం చురుకుగా పాల్గొనేవారు. తొలుత తెక్కంపట్టి గ్రామపంచాయతీలో ఆమె వార్డు మెంబర్‌ అయ్యారు. ఆ తర్వాత 1959లో కరమడై పంచాయత్ కౌన్సిలర్‌గా కూడా ఆమె ఎన్నికయ్యారు. అలా తమిళనాడులో మొట్ట మొదటి మహిళా కౌన్సిలర్‌గా కూడా ఆమె గుర్తింపు పొందారు. పప్పమ్మాళ్‌కు దివంగత డీఎంకే అధినేత కరుణానిధి అంటే ఎంతో అభిమానం, గౌరవం. డీఎంకే పార్టీలో ఆమె సభ్యురాలు కూడా. పద్మశ్రీ అవార్డు ప్రకటించగానే చెన్నై బయలుదేరి వెళ్లి ఆమె డీఎంకే నేత స్టాలిన్‌ను కలుసుకున్నారు. స్టాలిన్ కూడా ఒక ట్వీట్‌ చేస్తూ భూమితాయి పప్పమ్మాళ్‌కు అభినందనలు తెలిపారు. లోగడ ఆర్ వెంకట రామన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పప్పమ్మాళ్‌ను రెండు సార్లు ఢిల్లీలో తేనీటి విందుకు ఆహ్వానించడం చెప్పుకోవలసిన మరో విశేషం.

శతాధిక వృద్ధురాలైన రంగమ్మాళ్‌కు (పప్పమ్మాళ్) ఆర్గానిక్ సాగు పట్ల ఆసక్తి మెండు. వయసుదేముందీ.. మనసుంటే చాలు.. అన్నది రంగమ్మ భావన. తను సాధించదలుచుకుంది తను పట్టుదలతో సాధించే తీరతారు. పప్పమ్మాళ్ రెండు ప్రపంచ యుద్ధాలకు సాక్షి. 1947లో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని కూడా చూశారు. ఎన్నో ప్రాకృతిక విపత్తులూ ఆమె కళ్లెదుట కలలా కదిలిపోయాయి. చివరికి కోవిడ్ 19 కూడా.

కష్టించి పని చేయడమే ఆరోగ్య రహస్యం

పప్పమ్మాళ్‌ నేటికీ ఎంతో ఆరోగ్యంగా చలాకీగా ఉంటారు. కష్టించి పని చేయడమే తన ఆరోగ్య రహస్యమని చెబుతారు పప్పమ్మాళ్. నిరాడంబరంగా, నిజాయితీగా, చీకూ చింతా లేకుండా జీవించడం తన దీర్ఘాయుష్ఠుకు కారణమంటారు. జీవితంలో సాధించవలసినవి ఎన్నో ఉన్నాయనీ, అందుకే ఊరకే నిద్రపోతూ సమయం వృథా చేసుకోకూడదనీ నవతరానికి సలహా ఇస్తారు పప్పమ్మాళ్. ఇప్పుటికీ ఆమె వ్యవసాయానికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. తమిళనాడు మొత్తంమీద అత్యధిక వయసు కలిగిన మహిళగా కూడా పప్పమ్మాళ్ గుర్తింపు పొందారు.

పొలం వద్ద పప్పమ్మాళ్

పద్మశ్రీ అవార్డు ప్రకటించినందుకు పప్పమ్మాళ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. పప్పమ్మాళ్‌కు పద్మశ్రీ రావడంతో తెక్కపట్టి గ్రామం సంబరాల్లో మునిగిపోయింది. తమ ఊరికి జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టినందుకు పప్పమ్మాళ్‌ను అంతా అభినందనల్లో ముంచెత్తుతున్నారు. గతంలో గ్రామస్థులు పప్పమ్మాళ్ శతజన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకలకు మూడు వేల మందికి పైగా హాజరయ్యారు. గ్రామంలోనూ, ఆ చుట్టుపక్కల ఊళ్లలోనూ ఎక్కడ పెళ్లి జరిగినా ఆశీస్సుల కోసం పప్పమ్మాళ్ వెళ్లి తీరవలసిందే. ఇదిలావుంటే, పప్పమ్మాళ్ ఇప్పటికీ 105 ఏళ్ల వయసులో కూడా రోజూ పొలం పనులు చేయడం అసలు విశేషం. ఇలా నేటి యువతరానికి పప్పమ్మాళ్ స్ఫూర్తిగా నిలుస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here