రాజశేఖర్ పాటిల్ వెదురు చెట్లని పెంచడం మొదలుపెట్టినప్పుడు ఊళ్లో చాలామంది పెదవి విరిచారు. కొందరు ఎగతాళి చేశారు. ఇంకొందరు అసలు వెదురు మొక్కలు నాటడమేమిటీ? వాటిని ప్రత్యేకంగా పెంచడమేమిటీ? అని ఎకసెక్కాలాడారు కూడా! కానీ రాజశేఖర్ పాటిల్ మౌనంగా తన పని తాను చేసుకుపోయారు. అయితే ఆయన శ్రమ వృథా పోలేదు. మూడేళ్లు తిరిగేసరికి పది లక్షల వెదురు బొంగులు ఎదిగి చేతికొచ్చాయి. మంచి ధర కూడా పలికింది. దీంతో అప్పుల ఊబి నుండి బయటపడడమే కాకుండా, రాజశేఖర్ పాటిల్ ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయారు. ఈసారి ఆశ్చర్యపోవడం వెక్కిరించినవారి వంతైంది. ఇప్పుడు రాజశేఖర్ దేశంలోనే టాప్ బాంబూ డీలర్లలో ఒకరు. వెదురు పెంపకానికి సంబంధించి పదిమందికీ మెళకువలు చెబుతూ ఆయన ఎంతో ప్రసిద్ధి పొందారు. వెదురు సాగులో పలు విజయాలు సాధించినందుకుగాను ఆయన 40 దాకా అవార్డులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రశంసలూ అందుకున్నారు. ఆయన స్ఫూర్తితో వేలాదిమంది రైతులు వెదురు పెంపకం మొదలుపెట్టి ప్రయోజనం పొందుతున్నారు. అసలు ఇదంతా ఎలా జరిగిందంటే…
రాజశేఖర్ పాటిల్ (50) మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని నిపానీ గ్రామానికి చెందినవారు. అది కరువు ప్రాంతం. రాజశేఖర్ పాటిల్ వ్యవసాయంతో అప్పులపాలైన ఒక రైతు కుమారుడు. 23 ఏళ్ల కిందట రూ. 10 లక్షల దాకా అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబమది. వ్యవసాయంతో పాటు అన్నిటా విఫలమైన కుటుంబంగా గ్రామస్థుల చేత ముద్ర వేయించుకుంది కూడా.

చుట్టుముట్టిన కష్టనష్టాలు

రాజశేఖర్ పాటిల్ 1992లో వ్యవసాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కుటుంబం ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. పులిమీద పుట్రలా తండ్రికి పక్షవాతం వచ్చింది. ఇక కేవలం వ్యవసాయం ద్వారా అప్పులు తీర్చలేమని భావించిన రాజశేఖర్ పాటిల్ సివిల్ సర్వీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కాంపిటిటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. అయితే అందులోనూ నిరాశే ఎదురైంది. ఆ దశలో చేసేది లేక రాలేగణ్ సిద్ధి గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక ఉద్యమడు అన్నా హజారే వద్ద రూ. 2 వేల వేతనానికి ఉద్యోగంలో చేరారు. అన్నా చెప్పిన శ్రద్ధగా పనులు చేస్తూ పలు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో చురుకుగా పాలుపంచుకున్నారు. 1999లో అన్నా హజారే ఆయన వేతనాన్ని రూ. 6 వేలకి పెంచారు. అప్పటికి రాజశేఖర్ పాటిల్‌కు 27 ఏళ్లు. ఇక చాలు, ఇంటికి తిరిగి వచ్చేయమంటూ కుటుంబం నుండి ఒత్తిడి పెరిగింది.
దీంతో గ్రామానికి తిరిగి వచ్చి తమ కుటుంబానికి చెందిన 16 ఎకరాల భూమిలో కూరగాయలు, పండ్లు సాగు చేయడం మొదలుపెట్టారు రాజశేఖర్ పాటిల్. మొదట ఒక ఎకరంలోనే సాగు ప్రారంభించి ఆ తర్వాత నెమ్మదిగా విస్తరిస్తూ పోయారు. మామిడి, సపోటా, ఉసిరి, నేరేడు వంటివి సాగుచేశారు. దీంతో ఆయన మొత్తంమీద కాస్త తెరిపినపడ్డారు. రోజూ 5 వేల నుండి 10 వేల రూపాయల దాకా కళ్లజూడగలిగారు. అనుభవం మీద కూరగాయల కంటే పండ్ల సాగే నయమనిపించింది. కూరగాయలు సాగు తగ్గించడం వల్ల రోజూ మార్కెట్‌కు తిరగడం, కూలీలకు చెల్లింపులు తగ్గాయి.

వెదురు సాగు అలా మొదలైంది…

ఇదిలావుండగా, 2002లో గ్రామంలో ఒకరైతు తన 40 వేల వెదురు పిలకలను పారేయాలనుకుంటున్నారని రాజశేఖర్ పాటిల్‌కు తెలిసింది. వెదురు మొక్కల నర్సరీ ప్రారంభించాలనుకున్న ఆ రైతు, కొనేవారెవరూ లేకపోవడంతో వాటిని వదిలించు కోవాలనుకున్నారు. తన రెండున్నర ఎకరాల స్థలాన్ని ఖాళీ చేసుకోవడం కోసం 40 వేల వెదురు మొక్కలను ఎవరికైనా ఇచ్చేయాలనుకున్నారు. రాజశేఖర్ పాటిల్ అతడి దగ్గరకు వెళ్లి తాను ఆ మొక్కలన్నిటినీ తీసుకుంటానని చెప్పారు. ఆ రైతు కూడా వాటిని ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో రాజశేఖర్ పాటిల్ వాటిని తెచ్చుకున్నారు. నిజానికి ఆనాటికి రాజశేఖర్ పాటిల్‌కు వెదురు పెంపకం ఆలోచన లేదు. కేవలం తన తోటలో పండ్ల చెట్లకి మధ్య వెదురు చెట్లు ఉంటే పర్యావరణపరంగా సహజమైన రక్షణగా ఉంటుందనే ఉద్దేశ్యంతో వాటిని తెచ్చుకుని నాటారు. వాటికి నీరు పెట్టడంకోసం రాజశేఖర్ పాటిల్ తన తోటలో 10 కి.మీల మేర ట్రెంచ్ కూడా తవ్వించారు. అలా ఆయన వెదురు సాగు ప్రారంభమైంది. 2005 వచ్చేసరికి ఆ వెదురు చెట్లు ఏపుగా ఒక వనంలా ఎదిగాయి. కస్టమర్లు కూడా దొరికారు. వాటిపై ఏటా 20 లక్షల రూపాయల ఆదాయం రావడం మొదలైంది. దీంతో రాజశేఖర్ పాటిల్ ఉత్సాహంగా దేశంలోని పలు ప్రాంతాల్లో తిరిగి ఆయా వాతావరణ పరిస్థితులకు అనువైన వివిధ వెదురు రకాలను తెచ్చి నాటారు. అలా ఒక మంచి వెదురు నర్సరీని ఆయన అభివృద్ధి పరచారు. ఇప్పుడు ఆయన నర్సరీలో 50 రకాలదాకా వెదురు మొక్కలున్నాయి. వీటికి మంచి గిరాకీ కూడా ఉంటోంది.

నిపానీ గ్రామంలో తన వెదురు వనంలో రాజశేఖర్ పాటిల్

వెదురును గడ్డిజాతుల్లో చేర్చిన మోదీ ప్రభుత్వం

మోదీ ప్రభుత్వం 2017లో వెదురును ఒక చెట్టుగా డీ క్లాసిఫై చేసి, గడ్డిజాతుల్లో చేర్చింది. ఈ మేరకు 1927 భారత అటవీ చట్టానికి సవరణ కూడా తెచ్చింది. విధానపరమైన ఈ మార్పు వల్ల వెదురును ఎలాంటి అనుమతులతో నిమిత్తం లేకుండా లీగల్‌గా పెంచేందుకు, విక్రయించేందుకు వీలు కలిగింది. ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటు తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో రైతులు వెదురును సాగుకు ఆసక్తి చూపడం మొదలైంది. అలాంటివారికి వెదురు పిలకలను అందించడమే కాకుండా వాటి పెంపకంలో సైతం ఆయన సహాయపడుతున్నారు. ప్రస్తుతం తన 54 ఎకరాల్లో ఆయన వెదురు వనం పెంచుతున్నారు. వెదురు పెంపకం చాలా తేలిక అనీ, దానికి ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం ఉండదనీ ఆయన చెబుతున్నారు. గడ్డి మొలిచే ప్రతిచోటా వెదురు పెరుగుతుందనీ, దీనికి తక్కువ నీటి వసతి ఉన్నా సరిపోతుందనీ ఆయన వివరిస్తారు. మూడు నుంచి నాలుగు మీటర్ల దూరంలో నాటుకుంటే చాలు, అవే చక్కగా ఎదుగుతాయని ఆయన అంటారు. వెదురు పెంపకంలో గడించిన అనుభవం రాజశేఖర్ పాటిల్‌కు ఎంతో ఉపయోగపడుతోంది. జాతీయ వెదురు పెంపకం మిషన్‌ సలహాదారుగా ఉండి ఆయన రైతులకు సలహాలు ఇస్తున్నారు. ఊరకే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల వైపు చూడకుండా, వెదురు పెంపకంతో లక్షలు గడించవచ్చని ఆయన రైతులకు సూచిస్తున్నారు.
అలాగే అన్నా హజారే మార్గదర్శకత్వంలో నేర్చుకున్న నీటి నిర్వహణ విధానాలను యువత శ్రమదానంతో ఆయన ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అమలు చేశారు. దీంతో ఇప్పుడు నిపానీ చుట్టుపక్కల ఉన్న 13 గ్రామాల్లో కూడా పుష్కలంగా నీటి వసతి పెరిగింది. అన్నట్టు, రాజశేఖర్ పాటిల్ గ్రామం పేరు నిపానీ. అంటే నీరు లేనిదని అర్థం. కానీ అది నేడు జలకళ సంతరించుకుని వెదురు సాగుకు కేంద్రంగా ప్రసిద్ధి పొందడం విశేషం. ఎన్ని కష్టాలు ఎదురైనా కృంగిపోకుండా వెదురు చెట్టులా నిటారుగా నిలిచిన రాజశేఖర్ పాటిల్ నేటి యువతకు గొప్ప స్ఫూర్తి.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.

Rajshekhar Patil Bamboo Farm,
Post: Nipani, District: Osmanabad,
MAHARASHTRA (MH), India (IN),
Pin Code:- 413534,
Mobile: 9860209283.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here