మారుతున్న నేటి యువతరం ఆలోచనలకు అన్నం చంద్రశేఖర్ రెడ్డి ఒక ఉదాహరణగా నిలుస్తారు. MBA (marketing) పూర్తి చేసి, ఒక ప్రముఖ కంపెనీలో మంచి వేతనంతో మంచి ఉద్యోగంలో చేరిన ఈ యువకుడు స్వతంత్రంగా ఎదగాలన్న ఆకాంక్షతో దాన్ని వదిలిపెట్టి కుటుంబ వృత్తిని ఎంచుకున్నారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం నుస్తుల్లాపూర్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి విజయగాథ ఇది. నిజానికి చంద్రశేఖర్ రెడ్డి ఎంచుకున్న మార్గం సులువైనదేమీ కాదు. అయినప్పటికీ కుటుంబ వృత్తిని వృద్ధి చెందుతున్న వ్యాపారంగా మలిచేందుకు చంద్రశేఖర్ రెడ్డి పట్టుదలతో ముందుకు సాగారు. పగలూ రాత్రులు శ్రమించారు.
చంద్రశేఖర్ రెడ్డి తండ్రి బాల్ రెడ్డి మూడు గేదెలను పెంచడం ద్వారా జీవనం సాగిస్తూ వచ్చారు. కరీంనగర్ డెయిరీకి ప్రతిరోజూ రెండు లీటర్ల పాలను సరఫరా చేసే బాల్‌రెడ్డి, తన కుమారుడు చంద్రశేఖర్ రెడ్డికి మంచి చదువు చెప్పించేందుకు చాలా కష్టపడ్డారు. ఆ తండ్రి కష్టం వృథాపోలేదు. కొడుకు చేతికంది వచ్చాడు. మంచి చదువు చదివాడు. నగరంలో మంచి జీతం వచ్చే ఉద్యోగం సైతం సంపాదించాడు. కానీ చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి కలకి విరుద్ధంగా తన గ్రామీణ మూలాలకు తిరిగి రావాలని ఆశపడడం ఈ కథలోని మలుపు. ఏ ఐటి ప్రొఫెషనల్‌తోనైనా సమానంగా ఆదాయం పొందగల డెయిరీని నిర్వహించాలని కలలు కన్నారు చంద్రశేఖర్ రెడ్డి.
కరీంనగర్ డెయిరీ పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం చూసి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి మంచి ఆవులను కొనుగోలు చేసి 2012లో పాడిపరిశ్రమను ప్రారంభించారు చంద్రశేఖర్ రెడ్డి. ప్రస్తుతం, ఆయనకు మూడు గేదెలతో పాటు మొత్తం 11 పాలిచ్చే పశువులున్నాయి. ప్రతిరోజూ ఆయన 80 లీటర్ల పాలను కరీంనగర్ డెయిరీకి Milk Producer Institute (MPI) ద్వారా సరఫరా చేస్తారు. ఇప్పుడు ఆయన నెలసరి ఆదాయం రూ. 80,000 లకు చేరింది. ఇక మీదట రోజూ 150 లీటర్ల పాలను సరఫరా చేసి నెలకి రూ .1.5 లక్షలు సంపాదించాలని చంద్రశేఖర్ రెడ్డి యోచిస్తున్నారు.

గ్రామస్తులకు ఆదర్శంగా నిలిచిన చంద్రశేఖర్ రెడ్డి గత మూడేళ్లుగా గ్రామానికి చెందిన Milk Producer Institute (MPI) కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు కూడా. అంతేకాదు, పాడి పరిశ్రమ చేపట్టడానికి ఆయన ఇతర యువకులను ప్రేరేపించారు. ఎంపిఐ ద్వారా కరీంనగర్ డెయిరీకి రోజూ జరిగే 250 లీటర్ల పాల సరఫరాను ఆయన పర్యవేక్షిస్తారు రాగల కొద్ది కాలంలో రోజుకు 500 లీటర్ల దాకా పాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కరీంనగర్ డెయిరీ అందించే రాయితీలను వేటినీ తన తండ్రి బాల్ రెడ్డి ఆ రోజుల్లో వినియోగించుకోలేదని చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేసుకుంటారు.
చంద్రశేఖర్ రెడ్డి తమ భూమిలో పశువుల మేత కోసం పశుగ్రాసం పెంచుతారు. అలాగే విద్యుత్తు, వంట గ్యాస్ ఉత్పత్తి చేయడానికి ఆవు పేడను ఉపయోగించి బయో-గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఆయన తమ రెండు ఎకరాల భూమిలో వరి, కూరగాయలు, ఆకు కూరగాయలు వంటివి కూడా సాగు చేస్తున్నారు. ఒకవైపు వ్యవసాయం, ఇంకోవైపు పాడితో చంద్రశేఖర్ రెడ్డి అన్ని విధాలా సంతృప్తికరమైన జీవనం సాగిస్తున్నారు.
భర్త పాడి పరిశ్రమలో ప్రవేశించడాన్ని మొదట్లో చంద్రశేఖర్ రెడ్డి భార్య లావణ్య వ్యతిరేకించారు. ఇంత చదువుకునీ, మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకునీ పాలు అమ్ముకునే పని చేయడమేమిటని ఆమె మొదట్లో సంశయించారు. కానీ త్వరలోనే ఆమె తన మనసు మార్చుకుని భర్త పనుల్లో భాగం పంచుకోవడం మొదలుపెట్టారు. “పాడి పెంపకంలో నేను సంతోషంగా ఉన్నాను. మా ఆవులు మా ఇద్దరు బాబులకు మంచి స్నేహితులుగా మారాయి కూడా” అని లావణ్య మెరిసే కళ్లతో చెబుతారు.
కరీంనగర్ డెయిరీ (కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ) చైర్మన్ సి హెచ్ రాజేశ్వరరావు మాట్లాడుతూ, వివిధ పంటల సాగుతో పాటు పాడి రైతులకు అదనపు ఆదాయం సమకూర్చగలదన్నారు. పాడిపరిశ్రమను చేపట్టి, జిల్లాలో రోల్ మోడల్‌గా ఎదిగినందుకు చంద్రశేఖర్ రెడ్డిని ఆయన ప్రశంసించారు. పాడి రైతులకు భరోసా ఇచ్చే ఆదాయాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పాల రైతులకు, పాలిచ్చే పశువులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కరీంనగర్ డెయిరీ ముందంజలో ఉందని ఆయన చెప్పారు.
ఇదిలావుండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాడి రైతులకు 2019 జనవరి నుంచి లీటరుకు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 2021 మార్చి 17న మంత్రి కేటీ రామారావు ఈ మేరకు భరోసా ఇస్తూ ఇందుకోసం రూ. 26.19 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కరీంనగర్ డెయిరీ పరిధిలోని పాడి రైతులకు లబ్ధి చేకూరింది. నాణ్యమైన పాలసరఫరాలో ముందంజలో ఉన్న కరీంనగర్ డెయిరీ దేశవాళీ పశువుల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తే అది దేశీ జాతుల సంరక్షణకు తోడ్పడుతుందని పలువురు సూచిస్తున్నారు.