వ్యవసాయాన్ని ఒక వృత్తిగా ఎంచుకోవడంపై విద్యావంతులైన యువజనుల్లో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పైగా దాని పట్ల ఎగతాళితో కూడిన వ్యతిరేకతను చాలా మంది వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒడిశాలోనూ ఇంతే. అయితే ఈ ప్రాంతంలో కొంత మంది టెకీలు వ్యవసాయ వ్యాపార వెంచర్‌‌లను చేపట్టి లాభదాయకంగా నిర్వహించడం చూశాక యువత దృక్పథంలో క్రమంగా మార్పు వస్తోంది. అలాంటి టెకీల్లో సంబిత్ నందా ఒకరు. సామాజిక సమస్యలు, యువజన వ్యవహారాలు, ఆర్థికశాస్త్రంపై ఆయన చేసే సమీక్షలు అందరినీ ఆలోచింపజేస్తాయి. సోషల్ మీడియా సర్కిల్‌లో ఆయన సుపరిచితులు. ఒడిశా Cuttack-Sambalpur (NH 55) మార్గంలో ఉండే ధేన్‌కనల్ (Dhenkanal) ఆయన సొంతూరు. ప్రముఖ విశ్వవిద్యాలయమైన KIIT నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత, తన సొంత ప్రాంతంలో చిన్న తరహా ఆహార ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే నిధుల కొరత వల్ల అది సరిగా నడవలేదు. తరువాత ఆయన తన ప్రధాన క్షేత్రంలో కొంత అనుభవం గడించేందుకు రుంగ్తా మైన్స్ లిమిటెడ్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా చేరారు. ఆపై, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి handmade చాక్లెట్ ప్లాంట్ L’amour De Chocolatను స్థాపించారు. కోవిడ్ మహమ్మారి లాక్‌డౌన్ వల్ల అది కాస్తా దెబ్బతింది. దానిని తాత్కాలికంగా మూసివేసిన సంబిత్ నందా, కుటుంబానికి చెందిన అగ్రి-బిజినెస్‌ను నిర్వహించడంలో తన తండ్రికి తోడుగా ఉండేందుకు ఊరికి తిరిగి వచ్చారు. ఆయన పనులు చూసుకోవడం మొదలుపెట్టాక అతి తక్కువ సమయంలోనే, వారి వ్యవసాయ వ్యాపారం లాభాల బాట పట్టింది. తమ అగ్రి-బిజినెస్ కోసం ఐదు మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కోల్ట్‌స్టోర్‌ను ఆయన సొంతంగానే ఏర్పాటు చేసుకోవడం విశేషం.

తన పొలంలో సంబిత్ నందా

“ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా 2016లో ఉద్యోగం వదిలిపెట్టిన తరువాత, నేను, నా భార్యతో కలిసి handmade చాక్లెట్ తయారీ యూనిట్ స్థాపించాను. కానీ కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా పెద్ద ఎదురుదెబ్బ తప్పలేదు. అయితే అంతదాకా ఇది మంచి విజయాన్నే సాధించిందని చెప్పుకోవాలి. కరోనా దెబ్బకు దానిని తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చింది. దాంతో ఇక నా తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి నేను నా సొంత ప్రాంతమైన Dhenkanalకు తిరిగి వచ్చాను. ఇక్కడ నేను నా తండ్రి వ్యవసాయ అనుభవాన్ని స్వయంగా చూశాను. దాన్ని లాభదాయకంగా మార్చేందుకు కొన్ని సాంకేతికతలను జోడించాలని అనుకున్నాను. అక్కడి నుండి, వ్యవసాయ రంగంలో నా కొత్త ప్రయాణం ప్రారంభమైంది” అని సంబిత్ నందా వివరించారు.
రైతు కుటుంబంలో పుట్టినా నిజం చెప్పాలంటే ఆయన ఈ రంగానికి కొత్తవారే. అయితే హైడ్రోపోనిక్స్, బయోఫ్లోక్ ఫిష్ ఫార్మింగ్, పోస్ట్-హార్వెస్ట్, కోల్డ్ చైన్ మేనేజ్‌మెంట్ వంటి ఆధునిక వ్యవసాయ విధానాలను తెలుసుకోవడానికి కరోనా లాక్ డౌన్‌ కాలంలో ఆయనకు కావలసినంత సమయం చిక్కింది. వ్యవసాయ రంగంలో ఆయన గమనించిన ఏకైక అవరోధం లేబర్ సమస్య. ఇక వ్యవసాయంలో మిగతా సమస్యలను ఎలా ఎదుర్కోవాలో సంబిత్ నందా తండ్రిగారికి బాగా తెలుసు.
ఆ కుటుంబానికి ఒక మామిడి తోట, ఒక నిమ్మతోట, కూరగాయలు, వరి సాగు కోసం కొంత వ్యవసాయ భూమి ఉన్నాయి. ఈ వనరులతో ఒక కార్పొరేట్ కంపెనీ ఇచ్చే వేతనం కంటే ఎక్కువ సంపాదించగలిగితే దానినే కెరీర్‌గా ఎందుకు ఎంచుకోకూడదు? అని ఆలోచించి ఆయన వ్యవసాయంలోకి దిగారు. తన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వ్యవసాయ వ్యాపారాన్ని నిర్వహిస్తూ వచ్చారు. అది మంచి ఫలితాలనిచ్చింది. తమ తోటల్లో కాసే పండ్లు, పొలంలో పండే కూరగాయలను మంచి ధర లభించేవరకు కొన్నాళ్ల పాటు కోల్ట్ స్టోరేజ్‌లో నిల్వచేసుకోవడం మంచిదని భావించిన సంబిత్ నందా సొంతంగానే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
“చాలా మంది నిపుణులు 3 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల కోల్డ్‌స్టోర్‌ను మా అవసరాల కోసం ఇన్‌స్టాల్ చేయడం సాధ్యం కాదని చెప్పారు. దానికి 4 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. కానీ మా మామిడి తోటలు, ఇతర కూరగాయల దిగుబడిని అంచనా వేసుకుని నా లెక్కలు నేను వేసుకున్నాను. 5 మెట్రిక్ టన్నుల చిన్నపాటి మినీ కోల్డ్‌స్టోరును ఏర్పాటు చేసుకోవాలని మా తండ్రిగారికి సూచించాను. అలా దాన్ని మేము సమకూర్చుకున్నాము…” అని ఆయన చెప్పారు.
“పెద్ద లాభాలు పొందడానికి మీకు పెద్ద పెట్టుబడులు అవసరం లేదు. నేను నా మొదటి handmade చాక్లెట్ యూనిట్‌ను కేవలం 10 వేల రూపాయలతో ప్రారంభించాను. కేవలం 3 సంవత్సరాలలో 25 లక్షల రూపాయల విలువైన ఆస్తిగా దాన్ని మార్చాను. కాబట్టి, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి. ప్రతికూల వ్యాఖ్యలను వేటినీ మీరు పట్టించుకోనే కూడదు…” అని ఆయన సలహా ఇస్తారు.

మీ విజయ మంత్రం ఏమిటి? అని అడిగితే తానింకా పూర్తి విజయం సాధించానని అనుకోవడం లేదంటారు సంబిత్ నందా. తాను విజయం సాధించే మార్గంలో సాగుతున్నాననీ, ప్రతి వైఫల్యం తర్వాత వెనకడుగు వేయకపోతేనే విజయం సిద్ధిస్తుందని తాను నమ్ముతున్నాననీ ఆయన బదులిచ్చారు.
మార్కెటింగ్ కోసం చింతించకుండా ఎవరైనా ఏ పంటనైనా వేసుకోవడానికి ప్లాన్ చేయగల వ్యవసాయ నమూనాను అభివృద్ధి చేయాలని సంబిత్ నందా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కోల్డ్ చెయిన్స్, ఆధునిక వ్యవసాయ పద్ధతులైన అక్వాపోనిక్స్, పాలీహౌస్ ఫార్మింగ్, పోస్ట్ హార్వెస్ట్ క్రాప్ మేనేజ్‌మెంట్ యూనిట్లు, మినిమల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సౌర విద్యుత్ సరఫరా వ్యవస్థలు మొదలైనవి ఇందులో భాగంగా ఉంటాయి. విద్యావంతులైన యువజనులు వ్యవసాయంలోకి అడుగుపెడితే పరిస్థితులు తప్పక సానుకూలంగా మారతాయనడానికి సంబిత్ నందా విజయగాథ ఒక తార్కాణం.
మరిన్ని వివరాలకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సంబిత్ నందాను సంప్రదించవచ్చు.
https://www.instagram.com/just_sambit/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here