పవర్‌ స్టార్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ప్రకృతి వ్యవసాయం అంటే గౌరవం. వ్యక్తిగతంగా తనకు వ్యవసాయం అంటే చాలా మక్కువ అంటారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలని, భావితరాలు ఆరోగ్యంగా ఉండాలని తాను కోరుకుంటానన్నారు. ఆరోగ్యకరమైన ప్రజలు ఉంటేనే దేశం బలంగా ఉంటుందని పవర్‌స్టార్‌ తెలిపారు. ఎరువులు లేకుండా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాలనేది తన తపన అన్నారు పవన్‌ కళ్యాణ్‌. భూమ్మీద ప్రజలు మాత్రమే కాకుండా చాలా జీవాలు బ్రతకాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో తనకు తన సోదరుడు నాగబాబు జర్మనీ శాస్త్రవేత్త రాసిన ‘గడ్డిపరకతో విప్లవం’ అనే పుస్తకం బహూకరించారన్నారు. వ్యవసాయం ఆదాయంతో పాటు మనకు విజ్ఞానం కూడా ఇవ్వాలనేది ఆ పుస్తకం చదివాక తెలిసిందన్నారు. అంతే కాకుండా వ్యవసాయం ద్వారా మానసిక ఆనందం కూడా పొందాలనేది ‘గడ్డిపరకతో విప్లవం’ చదివాక తెలిసిందన్నారు. వ్యవసాయం ద్వారా మంచి మనుషులు, మంచి సమాజం ఏర్పడాలనేది జర్మన్‌ శాస్త్రవేత్త రాసిన పుస్తకం సారాంశమన్నారు పవన్ కళ్యాణ్‌. ఆ పుస్తకం ద్వారా ప్రభావితం అయిన తాను తన వ్యవసాయ క్షేత్రంలో కొంతమేరకు సాధన కూడా చేసినట్లు వెల్లడించారు. ప్రకృతిపరంగా ఏవేవి మొక్కలు సహజంగా ఎదగాలో వాటిని పెంచడం ప్రారంభించానన్నారు.యువతకు ఉపాధి కావాలి, అందులోనూ ఆ ఉపాధి ఆనందాన్నిచ్చేది కావాలని పవన్‌ కళ్యాణ్‌ అంటున్నారు. ‘చారెడు నేల బతుకుబాట’ ఆలోచన ద్వారా కొద్దిపాటి నేలలో ఎక్కువ సాగు ఎలా చేయాలో రైతులకు అవగాహన కల్పించేందుకు పవన్ కళ్యాణ్‌ ముందుకొచ్చారు. 250 గజాల్లో 81 మొక్కలు ఓ క్రమ విధానంలో నాటి సాగుచేయడం ద్వారా ఏ విధంగా ఫలసాయం పొందవచ్చో ఈ కార్యక్రమం ద్వారా పవన్‌ కళ్యాణ్ తెలియజేస్తున్నారు.పవన్ కళ్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో మామిడి సహా అనేక రకాల పండ్ల చెట్లు, మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు సహజ వ్యవసాయ విధానంలో పెంచుతున్నారు. వాటన్నింటిని సేంద్రీయ విధానంలో సాకుతున్నారు. ఆర్గానిక్‌ వ్యవసాయ విధానంలో దేశవాళీ ఆవుల ద్వారా తయారు చేసిన కంపోస్టు ఎరువులతో పంటలు పండిస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో పండిన మామిడి పండ్లను ప్రతి ఏటా కొందరు ఆప్తులకు, మిత్రులకు పంచిపెట్టడం పవన్‌ కళ్యాణ్‌ ఆనవాయితీగా మార్చుకున్నారు. తాను స్వయంగా చేసిన సహజ వ్యవసాయంలో పవన్‌ కళ్యాణ్ కలియ తిరుగుతూ ప్రతి మొక్కను, చెట్టును ఆప్యాయంగా నిమిరి ఆనందిస్తుంటారు.ప్రకృతి వ్యవసాయం విధాన కర్త సుభాష్ పాలేకర్ మోడల్‌ను కొన్ని ఏళ్లుగా అనుసరిస్తున్న విజయరామారావు పరిచయం అయ్యారన్నారు. సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి? గోవును మన దేశంలో ఎందుకు పూజిస్తాం? గోవు మనల్ని తల్లిలా ఎలా కాపాడుతుంది? ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? అనేది విజయరామారావు తనకు వివరంగా చెప్పారన్నారు.
కరోనా విపత్తు పరిస్థితుల్లో వేలాది మంది పట్టణాలు, నగరాలు వదిలి తమ తమ సొంతూళ్లకు వెళ్లిపోయారని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అలాంటివారు తమ ఊళ్లోనే ఉపాధి పొందేందుకు వ్యవసాయ సాగు నమూనాలు రూపొందిస్తున్నామని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ఈ సందర్భంలో విజయరామారావు తనకు ఓ అద్భుతమై నమానా గురించి వివరించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఒక కుటుంబానికి 50X50 అడుగుల చతురస్రాకారపు భూమిలో ఎంత పంట పండుతుంది? ఓ కుటుంబంలోని నలుగురు కలిసి ఆ భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎంత ఆదాయం వస్తుందనేది విజయరామారావు వివరించారని పవన్‌ కళ్యాణ్ చెప్పారు. విజయరామారావు చెప్పిన మాటలు విన్నాక తన వ్యవసాయ క్షేత్రంలోనే ఐదారు నమూనాలు తయారుచేసి, అందరికీ ముఖ్యంగా యువతకు తెలియజేస్తే మంచిదని భావించానన్నారు.నేలతల్లి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాగస్వాములు అవుదామని ప్రకృతి ప్రేమికుడు, సహజ పంటల సాగుదారు విజయరామారావు పిలుపునిచ్చారు. మన ముందు అతి పెద్ద సవాళ్లు రెండు ఉన్నాయని అవి భూతాపాన్ని తగ్గించడం, భవిష్యత్తరాలకు సూక్ష్మపోషకాలు అందించడం అని విజయరామారావు వివరించారు. ఈ సవాళ్లను అధిగమించడం సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. ఒక ఆవుతో 30 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయొచ్చనే వార్తను ఓ ప్రధాన పత్రికలో చదివి ప్రభావితుడ్ని అయ్యానన్నారు. ఈ భూమ్మీద ఉండే ఏ ఒక్క జీవరాశినీ చంపే హక్కు మనకు లేదనేది పాలేకర్‌ హితబోధ అన్నారు. ప్రకృతి వ్యవసాయం పూర్తిగా అహింసామార్గమైనది, పోషకాలతో కూడిన స్వయం సమృద్ధితో నిండి ఉన్నదని పాలేకర్‌ తెలిపారన్నారు. ఎవరి మీదా ప్రకృతి వ్యవసాయ రైతు ఆధారపడకూడదన్నది పాలేకర్‌ విధానం అన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసిన ఏ రైతు తన అవసరాల కోసం తన గ్రామం నుంచి డబ్బులు పట్టుకుని పట్టణాలు, నగరాలకు రావాల్సిన అక్కర ఉండదన్నారు. ప్రకృతి వ్యవసాయంపై ఎవరికి ఎన్ని సందేహాలున్నా.. రెండు నిమిషాలు ప్రకృతి వ్యవసాయ పొలంలో గడిపితే అన్నీ నివృత్తి అవుతాయన్నారు. ప్రకృతి వ్యవసాయ భూమి ఎంత మృదువుగా తయారవుతుందో మన పాదానికి తెలుస్తుందన్నారు. రసాయన వ్యవసాయ విధానంలో మనం ఏం కోల్పోయామో రెండో తరగతి చదివిన రైతుకు కూడా అర్థం అవుతుందన్నారు.
అనంతకోటి జీవ వైవిధ్యంతో ఈ భూమ్మీద మనిషి మనుగడ ఉందని విజయరామారావు అన్నారు. వానపాములు, సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తాయన్నారు. భూమి పుట్టినప్పుడు ఎలాంటి పోషకాలతో ఉందో.. పారిశ్రామికీకరణ వచ్చిన తర్వాత ఆరోగ్యం విషయంలో ఎంతో వెనక్కి వెళ్లిపోయామన్నారు. మన తండ్రులు, తాతలు, ముత్తాతలు ఉన్నంత ఆరోగ్యంగా మనం లేకపోవడానికి పారిశ్రామికీకరణే ప్రధాన కారణం అన్నారు. ప్రకృతిని వదిలేసి, ప్రకృతిలో లేని అసహజ విధానాల్లో పంటలు పండించడమే ఇందుకు కారణమన్నారు. తిరిగి మన ఆరోగ్యాన్ని మనం పొందాలంటే ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లడం ఒక్కటే మార్గమని విజయరామారావు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here