సేంద్రియ సాగులో ఎక్కువ ఆదాయం లభించే పంటలు కొన్ని ఉన్నాయి. వాటిలో నిమ్మ ఒకటి. తమిళనాడు నమక్కళ్ జిల్లాకు చెందిన రైతు పి శివకుమార్ (పై ఫోటోలో ఉన్న వ్యక్తి) సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో నిమ్మ సాగు చేస్తున్నారు. ఇది తనకు ఎక్కువ మార్కెటింగ్ అవకాశాలను సృష్టించిందని, చాలా మంది కొనుగోలుదారులను ఆకర్షించిందని ఆయన చెబుతున్నారు. ఇతర నిమ్మ రైతులతో పోలిస్తే తనకు సేంద్రియ సాగు వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరిందని ఆయన అంటున్నారు.
సేంద్రియ వ్యవసాయ ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, దిగుబడి, రాబడి అధికంగా ఉన్నాయని శివకుమార్ తన అనుభవాలను వివరిస్తున్నారు. శివకుమార్ జిల్లా కేంద్రమైన నమక్కళ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అండగార్లుర్గేట్ సమీపంలోని కూనవెలంపట్టి పూదూర్ నివాసి. తన ఐదు ఎకరాల భూమిలో 400 నిమ్మ, కొబ్బరి మొక్కలు నాటానని, ఇవాళ నిమ్మ తన ప్రాథమిక ఆదాయ వనరుగా ఉందని ఆయన చెప్పారు. సంవత్సరానికి సుమారు 10 లక్షల రూపాయల వరకు నిమ్మసాగు ద్వారా రాబడి వస్తోందని ఆయన తెలిపారు.
నమక్కళ్ జిల్లాలో సేంద్రియ సాగు ద్వారా నిమ్మకాయలను పండించే కొద్దిమంది రైతులలో తానూ ఒకడినని ఆయన అన్నారు. “ఖర్చుతో కూడిన అధిక ఉత్పాదకాలు అవసరమయ్యే ఇతర నగదు పంటలతో పోలిస్తే, సేంద్రియ పద్ధతులను అనుసరించే రైతులు నిమ్మ సాగు ద్వారా అధిక రాబడిని పొందవచ్చు” అని ఆయన చెబుతున్నారు. ఏటా ప్రతి నిమ్మచెట్టు మీద సుమారు 3,000 నుండి 5,000 రూపాయల దాకా ఆదాయం సంపాదించవచ్చని ఈ 43 ఏళ్ల రైతు వివరిస్తున్నారు. అంతేకాకుండా, ఒక రైతులు తన పేర్లను సేంద్రియ రైతులుగా నమోదు చేసుకుని, ప్రభుత్వం నుండి ధ్రువీకరణ పత్రాలను కనుక పొందినట్లయితే ఎగుమతి అవకాశాలు కూడా ఉంటాయని శివకుమార్ చెబుతున్నారు.

మధ్యదళారులు వద్దు…

“నేను నా పంట ఉత్పత్తులను మధ్య దళారులకు ఇవ్వను. నాకు రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లతో సహా పలువురు కస్టమర్లు ఉన్నారు. తాజా నిమ్మకాయలను వారికి నేరుగా పంపుతాను. స్థానిక మార్కెట్లో, రెండు పండ్ల ధర సగటున రూ. 10 నుండి 12 రూపాయలు. అయితే, నేను వాటిని రూ. 4 లేదా రూ. 5కి మాత్రమే అమ్ముతున్నాను. దీని ద్వారా వినియోగదారులకు నేరుగా లబ్ధి చేకూరుతుంది. నాకూ లాభం ఉంటుంది” అని శివకుమార్ వివరించారు.
దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం శివకుమార్ నిమ్మసాగు ప్రారంభించారు. రైతు కుటుంబం నుండి వచ్చినప్పటికీ, ఆయన మొదట్లో సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించలేదు. దీని వల్ల ఒక దశలో లాభం చాలా తక్కువగా వచ్చింది. కరువు సీజన్‌లో నష్టాలు పెరిగిపోయాయి. ఆ తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణుల సలహాను అనుసరించి, బిందు సేద్యంతో ఆయన సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరించడం ప్రారంభించారు.
“నిమ్మ అన్ని రకాల నేలల్లోనూ పెరుగుతుంది, అయితే మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించవలసి ఉంటుంది” అని ఆయన అంటున్నారు.

కలుపు నివారణకు చిట్కాలు

కలుపు మొక్కలను తొలగించడానికి సేంద్రియ వ్యవసాయంలో కొన్ని చిట్కాలున్నాయని శివకుమార్ చెబుతారు. పొలంలో మట్టిని కెళ్లగించడం (Burial and cutting the soil surface) అందుకు ఒక మంచి ఉపాయమని ఆయన అంటారు. అలాగే ప్రకృతి సహజమైన పురుగుమందులను వాడటం చాలా ముఖ్యమని ఆయన సలహా ఇస్తారు. మొక్కలను నాటేప్పుడు ఐదు అడుగుల చొప్పున ఖాళీ స్థలం వదలాలని, దీని వల్ల మొక్కల వేర్లు ఆరోగ్యకరంగా పెరుగుతాయనీ శివకుమార్ వివరిస్తారు.

ప్రపంచంలో అత్యధికంగా నిమ్మను సాగు చేస్తున్న దేశం మనదే. ఏటా 30 లక్షల టన్నుల నిమ్మను మనం పండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో నిమ్మ సాగు ఎక్కువగా జరుగుతోంది. వర్షాకాలంలో మొక్కలు నాటుకోవడం నిమ్మ సాగుకు సరైన సమయం. నిమ్మకు పెద్దగా తెగుళ్లు సోకవు. దీనికి వ్యవసాయ నైపుణ్యం కూడా అంతగా అవసరం ఉండదు. ఏటా మే నుండి జూలై వరకు (సీజన్) కాత వస్తుంది. ఒక్కో చెట్టు సగటున 350 నుండి 400 దాకా నిమ్మకాయలు కాస్తుంది. సీజన్‌లో వారానికి ఒక్కో నిమ్మచెట్టు రూ. 3000 నుండి రూ. 5000 వరకు ఆదాయం ఇస్తుంది. కాత ఉండే మిగతా నెలల్లో వారానికి రూ.500 దాకా ఆదాయం ఉంటుంది. కాగా, ప్రకృతి సేద్యం విధానంలో నిమ్మ అధిక దిగుబడిని ఇస్తున్నట్లు వివిధ రాష్ట్రాల నుండి సమాచారం అందుతోంది. ఆర్గానిక్ పద్ధతుల్లో సాగు చేసిన నిమ్మ పచ్చళ్లకు కూడా ఇప్పుడు మంచి మార్కెట్ ఉంటోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here