ఇటీవలికాలంలో మిద్దెపంటలు, పెరటి తోటల పెంపకం క్రమంగా పెరుగుతోంది. ఇంటిపట్టునే కూరగాయలు, పండ్ల వంటివి పండించడం పట్ల నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. పూలమొక్కల సంగతి సరేసరి. అయితే మొక్కల పెంపకానికి మంచి ఎరువు అవసరమవుతుంది. కనుక దాన్ని తరచు మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తుంటారు. కానీ మన ఇంట్లోనే ఏ ఖర్చూ లేకుండా మనం అద్భుతమైన ఎరువును తయారు చేసుకోవచ్చు. మొక్కలు ఏపుగా పెరగడానికి నత్రజని ఎంతో అవసరం. ఆ నత్రజని (nitrogen) మనం నిత్యం వాడే తేయాకు (చాయ్ పత్తా)లో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి టీ పొడిని వాడేసాక దాంతో చక్కగా కంపోస్టు తయారు చేసుకోవచ్చు.
మన దేశంలో టీ తాగే అలవాటు ఎక్కువ. దీంతో రోజూ వేలాది కిలోల టీ పౌడర్‌ వ్యర్థాలు మిగులుతుంటాయి. సాధారణంగా ఇందులో ఎక్కువ భాగం చెత్తడబ్బాలకే చేరుతుంది. అయితే ఈ వ్యర్థాలను పోషకాలు అధికంగా ఉండే కంపోస్ట్‌గా ఉపయోగించవచ్చనీ, మీరు ఇంట్లో గార్డెన్ కనుక పెంచుతూ ఉంటే, ఇది మీ మొక్కలకు సంజీవనిలాగా పనిచేస్తుందనీ బ్రహ్మదేవ్ కుమార్ (పై ఫోటో) చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్ నివాసి అయిన బ్రహ్మదేవ్ తేయాకు వ్యర్థాలతో కంపోస్టు ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు.
టీ పౌడర్‌లో ఫాస్పరస్, పొటాషియంలతో పాటు 4 శాతం నత్రజని ఉంటుందని ఆయన చెబుతారు. అలాగే భూసారానికి తోడ్పడే ఇతర సూక్ష్మపోషకాలు కూడా టీ పొడిలో ఉన్నాయనీ, దీంతో తయారయ్యే కంపోస్టు పూర్తిగా ఆర్గానిక్ అనీ, పైపెచ్చు ఇది పర్యావరణహితకరం కూడాననీ ఆయన వివరిస్తున్నారు. టీ పెట్టుకున్నాక ఆ తేయాకు పొడిని మనం ఊరకే పారేస్తాం. అలా పారేసే బదులు, దాని నుండి అద్భుతమైన కంపోస్టు కనుక తయారైతే దాన్ని ఉపయోగించుకోవడానికి అభ్యంతరమేమిటి అని ఆయన ప్రశ్నిస్తారు.
అర్బన్ గార్డెనింగ్ అంశాలకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న బ్రహ్మదేవ్ కుమార్, తేయాకులోని పోషకాలు మొక్కలను ఏపుగా ఎదిగేలా చేస్తాయని చెబుతున్నారు.
“కంపోస్టు తయారు చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మీరు దానిని ఇతర తడి వ్యర్థాలతో కలపవచ్చు లేదా అలా చేయకుండా కూడా తయారుచేయవచ్చు. రెండు ప్రక్రియలూ సులభమైనవే. కానీ తర్వాత నిల్వ విషయంలో మాత్రం జాగ్రత్త పడవలసి ఉంటుంది”అని ఆయన చెబుతారు.
ఈ ప్రక్రియ కోసం, ఉపయోగించిన టీ పౌడర్, ఒక మట్టి కుండ, కుండను కప్పడానికి ఒక మూత, పాత్రకి రంధ్రాలు చేయడానికి ఒక పాయింటెడ్ సాధనం అవసరమని కుమార్ వివరిస్తారు. బ్రహ్మదేవ్ కుమార్ పద్ధతిని అనుసరించి టీ పొడర్ కంపోస్టు తయారీ పద్ధతి ఈ క్రింది విధంగా ఉంది.

టీ పొడర్ కంపోస్టు ప్రక్రియ ఇదీ…

మనం ఉపయోగించే టీ పౌడర్‌లో తరచుగా తులసి, అల్లం, ఏలకులు, చక్కెర వంటివి ఉంటాయి. వీటిని పాలతో కలుపుతారు. కనుక వాడేసాక టీ పొడర్‌ని నీటితో కడగాలి. దుర్వాసన రాకుండా ఉండడానికి, మిశ్రమంలోకి చీమలు చొరకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది చాలా ముఖ్యం. టీ పొడిని కడిగాక ఆ మిశ్రమాన్ని గట్టిగా చేతితో ఒత్తడం ద్వారా ఎక్కువగా ఉండే నీటిని కూడా తీసివేయాలి. అప్పుడు, ఆ మిశ్రమాన్ని నేరుగా ఒక మట్టి కుండలో ఉంచాలి. మట్టి కుండలు సాధారణంగా గాలి ఆడే విధంగానే ఉంటాయి. అయినప్పటికీ కుండకు ఇరువైపులా రెండు చిన్న రంధ్రాలు చేసుకుంటే వెంటిలేషన్‌కు సహాయపడతాయి. ఇలా ఉంచిన టీ పొడి మిశ్రమం దానికదే నెమ్మదిగా కుళ్ళిపోతుంది. ప్రతిరోజూ మీరు ఉపయోగించిన టీ పొడిని కుండ నిండేంత వరకూ అందులో వేస్తూనే ఉండండి. టీ పౌడర్ కాస్త తేమతోనే ఉంటుంది కాబట్టి మళ్లీ నీటిని జోడించాల్సిన అవసరం లేదు. ఆ కాస్త తేమనే decomposes ప్రక్రియకు అవసరమైన ద్రవాన్ని కలిగి ఉంటుంది. ఈగల వంటివాటిని నివారించడానికి ఆ కుండపై అన్ని సమయాల్లోనూ మూత పెట్టే ఉంచాలి. సుమారు 30 నుండి 45 రోజులకు ఫంగస్ తాలూకు తెల్లని పొర కుండలో కనిపిస్తుంది. ఇది సహజమైన ప్రక్రియ. ఇందులో ఆందోళన చెందడానికేమీ లేదు. ఇది మన ప్రక్రియ పనిచేస్తుందనేదానికి ఒక సంకేతం మాత్రమే.
ఇలా మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఒక నెల నుండి 90 రోజుల వరకు సమయం పడుతుంది. కుండ లోపల పొడి పూర్తిగా ఎండిపోయి, మిశ్రమం సగం అయినప్పుడు ఈ ప్రక్రియ పూర్తయిందని గ్రహించాలి. ఆపై కుండలోని మిశ్రమాన్ని వాడటానికి ముందు కొన్ని రోజుల పాటు అందులోకి సూర్యరశ్మి పడేలా చేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని గాని, రోలులో వేసిగాని మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు కంపోస్టు రెడీ. తొట్లలోని మొక్కలకు కానీ, పెరటి తోటలో ఉండే మొక్కల పాదులకు కానీ నాలుగేసి చెంచాలదాకా వేసుకోవచ్చు. వర్మీ కంపోస్టు వంటి ఇతర కంపోస్టులతో పాటు కలిపి కూడా దాన్ని వాడుకోవచ్చు. దీన్ని ఉపయోగిస్తే మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయని బ్రహ్మదేవ్ కుమార్ చెబుతున్నారు.
ఈ ప్రక్రియలో టీ పొడి వేస్తూ వస్తున్న కుండ కనుక నిండిపోతే మరొక కుండను ఉపయోగించాలి. ఇంట్లోనే ఉచితంగా ఇలా నైట్రోజన్ కంపోస్టును తయారు చేసుకోగలిగినప్పుడు మార్కెట్ నుండి వేరే ఎరువులు కొనుక్కోవలసిన అవసరం ఉండనే ఉండదు.

(betterindia.com, CITY GARDENING సౌజన్యంతో)

ఉపయోగించిన టీ పౌడర్ కంపోస్టు తయారీ పద్ధతిని ఈ వీడియోలో చూడవచ్చు:

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here