తొలితరం ఆర్గానిక్ మహిళా రైతు పప్పమ్మాళ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. 105 ఏళ్ల పప్పమ్మాళ్‌కు ఇటీవల ‘పద్మశ్రీ’ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. తమిళనాడు తెక్కంపట్టికి చెందిన పప్పమ్మాళ్‌ ఎన్నికల ప్రచారానికి కోయంబత్తూరు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
తమిళనాడు బిజెపి వ్యవసాయ విభాగం అధ్యక్షుడు జి.కె. నాగరాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాని మోదీ CODISSIA Trade Fair Complex groundsలో పప్పమ్మాళ్‌‌‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని కాసేపు మాట్లాడారు. ఈ సమావేశం ఐదు నిమిషాల సేపు కొనసాగింది. కాగా, పప్పమ్మాళ్‌తో జరిగిన సమావేశం తాలూకు ఫోటోను ప్రధాని తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో షేర్ చేశారు.”ఈ రోజు (2021 ఫిబ్రవరి 25) కోయంబత్తూరులో, మాన్య ఆర్. పప్పమ్మాళ్‌జీని కలుసుకున్నాను. వ్యవసాయంలోను, సేంద్రియ వ్యవసాయంలోను అసాధారణమైన కృషి సల్పినందుకుగాను ఆమెకు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించబడింది” అని మోదీ పేర్కొన్నారు.
పప్పమ్మాళ్ తొలి నుంచీ డీఎంకే మద్దతుదారుగా ఉంటూ వచ్చారు. డీఎంకే తరఫున లోగడ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆమె దివంగత ద్రావిడ నేత కరుణానిధి అభిమాని. అయితే తనకు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించినందుకుగాను కృతజ్ఞతలు తెలుపుకునేందుకు పప్పమ్మాళ్ స్వయంగా ప్రధాని మోదీని కలుసుకున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా శతాధిక వయోధికురాలైన పప్పమ్మాళ్‌ తనకు ఆశీస్సులు అందజేస్తున్న ఫోటోను పీఎం మోదీ షేర్ చేయడం విశేషం. ఇదిలావుండగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆర్గానిక్ వ్యవసాయం పార్టీ మేనిఫెస్టోలో చోటు చేసుకోనుందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్గానిక్ రైతు పప్పమ్మాళ్‌ను ప్రధాని మోదీ కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here