దేశీ విత్తనాలను సంరక్షిస్తూ, తృణధాన్యాల పంటలను ప్రోత్సహించడంలో దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డి.డి.ఎస్) విశేషంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్ర గ్రామీణ మహిళలదే కావడం మరో విశేషం. జహీరాబాద్‌, ఝరాసంగం, న్యాల్‌కల్‌, కోహీర్‌, రాయికోడ్‌ మండలాల్లోని దాదాపు 75 గ్రామాల్లో సుమారు 5 వేల మంది మహిళలతో సంఘాలను ఏర్పాటు చేసి డీడీఎస్ సంప్రదాయ వ్యవసాయం నిర్వహిస్తోంది. తృణధాన్యాల పరిరక్షణ కోసం ‘పాతపంటల జాతర’ పేరుతో ఏటా సంక్రాంతి పండగ నుంచి నెల రోజుల పాటు ఒక కార్యక్రమాన్ని డీడీఎస్ మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సారి 2021 ఫిబ్రవరి 15న సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మచ్నూర్‌లో ఈ జాతర ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకల్లో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్.) విభాగం వైస్-చైర్మన్, సినీ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సంగారెడ్డి జిల్లాలోని మహిళా వ్యవసాయదారుల జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకుగాను అపోలో హాస్పిటల్స్ ఒక ప్రణాళికను అమలు చేయదలచిందని ఉపాసన ప్రకటించారు. మన ఆహారంలో తృణధాన్యాల ప్రాముఖ్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ఆమె చెప్పారు. ఇందులో భాగంగా అపోలో హాస్పిటల్స్‌ క్యాంటిన్ల మెనూలో చిరుధాన్యాలతో తయారు చేసే ఆహారపదార్థాలను చేరుస్తున్నామని ఆమె తెలిపారు. ప్రొటీన్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండే తృణధాన్యాల వంటకాలను ఇకపై అపోలో ప్రోత్సహిస్తుందన్నారు. ఇందులో భాగంగా దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ నుండి ఇప్పటికే 4000 కిలోల తృణధాన్యాలను అపోలో సేకరించిందనీ, ఇకపై ప్రతి నెలా 1000 కిలోల చొప్పున వాటిని సేకరించడం జరుగుతుందనీ ఉపాసన ప్రకటించారు. దీని ద్వారా సంగారెడ్డి జిల్లాలోని మహిళా వ్యవసాయదారులకు అపోలో హాస్పిటల్స్‌ అండగా నిలుస్తుందన్నారు.

కిలో బియ్యం పండించడానికి 4000 లీటర్ల నీరు అవసరం అవుతుందనీ, దీంతో భూగర్భ జలాలను ఎక్కువగా వాడవలసి వస్తోందనీ ఉపాసన వ్యాఖ్యానించారు. కానీ తృణధాన్యాల పంటలకు వరితో పోల్చితే 25 నుండి 30 శాతం సాగు నీరు సరిపోతుందన్నారు. కనుక ఆరోగ్యకరమైన జీవనం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం తృణధాన్యాల పంటల మీద మనం దృష్టి సారించవలసిన అవసరం ఉందని ఉపాసన పేర్కొన్నారు. చిరుధాన్యాల వినియోగం పెంచడం ద్వారా మధుమేహం సమస్యను కూడా తగ్గించవచ్చని ఆమె అన్నారు. ఉపాసన ఇలా చిరుధాన్యాలను ప్రోత్సహించడంతో పాటు మహిళారైతులకు బాసటగా నిలిచేందుకు పూనుకోవడం అభినందనీయం. వంద మాటల కన్నా ఒక్క మంచి పని శక్తిమంతమైనదని రుజువయ్యేది ఇలాంటి చొరవల వల్లనే.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
DECCAN DEVELOPMENT SOCIETY
101, Kishan Residency, Street No.5
Begumpet, Hyderabad– 500016, Telangana., INDIA
Tel:+91-40-27764577,27764744, Telefax:+91-40-27764722
Email: hyd1_ddshyd@sancharnet.in/ddshyderabad@gmail.com
Project: Pastapur, Zaheerabad – 502 220, Medak Dist., Telangana.INDIA Tel.: +91-2451-282271/282785, Telefax:+91-8451-281725, Email: ddspastapur@gmail.com
Website: www.ddsindia.com

దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ కార్యక్రమంలో ఉపాసన కొణిదెల వీడియో:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here