సృజనాత్మకమైన ఆలోచన ఏదైనా అది ఒక విత్తనం లాంటిది. దాని నుండి పుట్టే మొక్క ఒక మహావృక్షంగా ఎదిగి పదుగురికీ పనికివస్తుంది. కొన్నిసార్లు ఏమీ లేదనిపించే శూన్యం నుంచే సరికొత్త సృష్టి జరుగుతుంది. స్వదేశీ విత్తనాలను వ్యాప్తి చేయాలన్న ప్రియా రాజనారాయణన్ సంకల్పం అలా మొదలైందే. చెత్త పారేసే డంప్ యార్డుల్లో ఎంతో ఆరోగ్యంగా ఎదిగే మొక్కలను చూసాక ఆమెకు వచ్చిన ఒక ఆలోచన అద్భుతమన ఓ దేశీ విత్తనాల నిధిని సృష్టించింది.
గత 12 సంవత్సరాల్లో, కచ్చితమైన నిర్వహణ పద్ధతుల ద్వారా ప్రియా రాజ నారాయణన్ స్వదేశీ వరి వంగడాలతో పాటు కూరగాయల రకాలకు సంబంధించిన 500కి పైగా విత్తనాల రిపోజిటరీని నిర్మించగలిగారు. తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన ప్రియా ఇవాళ దేశీ వంగడాలను కాపాడుకోవాలనే ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆసక్తి కలిగిన ఎందరికో ఆమె దేశీ విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఉద్యోగం పోయినప్పటికీ ప్రియా తన దేశీ విత్తనాల సంరక్షణ పనిని ఆపలేదు.
“సాధారణంగా వారానికి 50 ప్యాకెట్ల దాకా విత్తనాలను అవసరమైనవారికి పంపించేదాన్ని. కానీ ఇప్పుడు 15-20 ప్యాకెట్లు మాత్రమే పంపగలుగుతున్నాను. తిరుపూర్‌లోని ఒక వస్త్ర ఎగుమతి సంస్థలో పని చేస్తూ వచ్చిన నేను కరోనా లాక్‌డౌన్ మూలంగా నా ఉద్యోగాన్ని కోల్పోయాను. దీంతో ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా విత్తనాలు పంపడం కాస్త తగ్గింది” అని చెబుతారు ప్రియా రాజ నారాయణన్.

అలా మొదలైంది…

మొదట్లో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడని కూరగాయల కోసం మాత్రమే ప్రియా తన ప్రయత్నాలు ప్రారంభించారు.
“నేను ఈ నగరానికి (తిరుపూర్) వచ్చినప్పుడు, నాకు సహజంగా పెరిగిన కూరగాయలు దొరికేవి కావు. దీంతో, నేను కొన్ని రకాల ఆకుకూరలు, కొన్ని కూరగాయలతో పెరటి తోట పెంచడం ప్రారంభించాను. అప్పటికి నాకు దీని గురించి పెద్దగా ఏమీ తెలియదు. నేను MBA ఫైనాన్స్ మాత్రమే చదివాను. అయితే, నేను ఒక రైతు కుటుంబంలో పుట్టాను. అలా నాకు అబ్బిన కొద్దిపాటి వ్యవసాయజ్ఞానాన్ని నా పనుల్లో ఉపయోగించుకున్నాను” అని ప్రియా వివరిస్తారు.
2009లో స్వదేశీ కూరగాయల జాతుల పెంపకం అరుదు. కూరగాయలు పెంచాలనుకున్నవారికి హైబ్రిడ్ విత్తన రకాలు మాత్రమే దొరికేవి. నాకేమో దేశీ జాతులు కావాలి. దాంతో నెమ్మదిగా నేను దేశీ విత్తనాలను సేకరించడం మొదలుపెట్టాను. వంకాయ, టమోటా, మిరపకాయలు వంటివాటికి సంబంధించిన విత్తనాలు సంపాదించి ఆ మొక్కలను మా మిద్దెపై పెంచడం ప్రారంభించాను. ఆ తర్వాత, ఇంటికి సమీపంలోని ఖాళీస్థలంలో వాటిని పెంచడం మొదలైంది” అని ప్రియా గుర్తు చేసుకుంటారు.
ఆ రోజుల్లో, సేంద్రియ వ్యవసాయానికి ఇప్పట్లో ఉన్నంత ఆదరణ ఉండేది కాదు. జనం స్థానిక దేశీ జాతుల కూరగాయలు, ఆహార ధాన్యాల కోసం పెద్దగా ప్రయత్నించేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో దేశీయ రకాలను వీలైనంత ఎక్కువ మందికి అందించేందుకు తన వంతు కృషి చేయాలనుకున్నారు ప్రియా రాజనారాయణన్. ఆ విధంగా ‘విత్తనాలను పంపండి’ (send the seeds) పేరుతో ఆమె ప్రయత్నం ప్రారంభమైంది. మొదట్లో ఈ విత్తన ప్యాకేజీలను ఆమె తన స్నేహితులు, బంధువులు, తోటి దేశీ విత్తనాల పునరుజ్జీవనవాదులకు పంపేవారు. అక్కడ నుండి ఆమె సేకరణ కూడా పెరిగింది. స్వదేశీ వంగడాలు ఎక్కువగా ఉన్న కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని స్నేహితులు, వారు సేకరించిన వాటిలో కొన్నింటిని ఆమెకు పంపడం ప్రారంభించారు. మరికొందరు ఆమె ప్రయత్నం తెలిసి దేశీ విత్తనాల సేకరణకు సహాయం అందించారు. అలా ఇప్పుడు, ఆమె 500 రకాల దేశీయ విత్తనాల నిధిని నిర్మించగలిగారు. మరోవైపు దేశీ విత్తనాల ప్యాకేజీ సేవలను కూడా ఆమె ఉచితంగా కొనసాగిస్తూ వచ్చారు.
“నా ప్రయత్నంలోని ప్రత్యేకత ఏమిటంటే, విత్తనాల స్వచ్ఛతను నేను కాపాడుతున్నాను. నేను అన్ని రకాలను ఒకేసారి పెంచను. అలా చేయడం వల్ల సంకరం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే రకానికి ఒక్క మొక్క మాత్రమే నా పెరటితోటలో ఉంటుంది” అని ఆమె చెబుతారు. పొరపాట్లు జరినప్పుడల్లా వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ పలు ప్రయోగాలతో ప్రియా రాజనారాయణన్ తన దేశీ విత్తనాల ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

దేశీ విత్తనాలపై శిక్షణ

వ్యర్థాల నుండి అద్భుతాలు…

మొక్కల పెంపకంలో కుప్పైమేడు ఆమెకు విలువైన పాఠాలు నేర్పింది. చెన్నైలో ఉన్న రోజుల్లో తను పనిచేసే చోటికి కుప్పైమేడు డంప్ యార్డు గుండా వెళ్లవలసి వచ్చేది. అక్కడ వ్యర్థాలతో నిండిన ప్రదేశంలో టమాట, మిరపకాయ, కాకరకాయ, బీరకాయ వంటి మొక్కలు ఏపుగా పెరగడాన్ని ప్రియా గమనించారు. మానవ ప్రయత్నం ఏదీ లేకుండా, బ్యాగ్-టు-పాట్ లాంటి పద్ధతులు అక్కర్లేకుండా, మరీ ముఖ్యంగా పురుగుమందులతో నిమిత్తం లేకుండా మొక్కలు సహజంగా ఎదగడాన్ని ఆమె చూశారు. మొక్కల పెరుగుదలలో వ్యర్థాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె ఇక్కడే గ్రహించారు. మొక్కలు పెరిగేందుకు ఎక్కువ తేమ, తక్కువ నీరు అవసరమని ఆమె అనుభవంతో తెలుసుకున్నారు.
దీంతో ప్రియా కూరగాయల మార్కెట్లకు, చెరకురసం బండ్ల దగ్గరకు వెళ్లి వారు పారేసే వ్యర్థాలను ఇంటికి తెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఆ వ్యర్థాలను ఆమె తన మొక్కలకు వాడడం ప్రారంభించారు. ఆమె ప్రయత్నం అద్భుత ఫలితాలనిచ్చింది. ఇప్పటికీ ఇస్తూనే ఉంది. మిద్దెపంట, పెరటి తోటలు పెంచాలనుకునేవారికి ఈ వ్యర్థాలు బాగా పనిచేస్తాయని ప్రియా చెబుతారు. గత ఆరేళ్లుగా టెర్రస్, కిచెన్ గార్డెన్స్ పెంచాలనుకునేవారికి ప్రియా తన సలహాలను, సూచనలను అందిస్తున్నారు. మొదట పొరుగు మహిళలకు సలహాలివ్వడంతో ఇది ప్రారంభమైంది. అయితే త్వరలోనే అది విస్తరించింది. Iyarkkai Vazhi Veettu Thottam (ఇయర్కై వళి వీట్టు తొట్టం) పేరుతో ఆమె మొక్కల ఎదుగుదలపై శిక్షణనివ్వడం మొదలుపెట్టారు. ‘ప్రకృతి సహజ గృహ ఉద్యానం’ అని దీని అర్థం. ఇందులో ఎనిమిది గ్రూపులు ఉంటాయి. బ్యాచీలవారీగా ప్రియా రాజనారాయణన్ వారికి శిక్షణ ఇస్తుంటారు. సీనియర్ బ్యాచెస్‌కు చెందినవారు కొత్తగా వచ్చే జూనియర్లకు శిక్షణ ఇస్తారు. ఇదంతా ఏ రుసుమూ లేకుండానే జరగడం విశేషం.

తన మొక్కలతో ప్రియా రాజనారాయణన్

అప్పటిదాకా ప్రియా ప్రయత్నాలన్నీ సొంతంగా చేసినవే. అవన్నీ వ్యక్తిగత పరిశీలన ఆధారంగా జరిగినవే. అయితే 2019 ఫిబ్రవరిలో గో ఆధారిత ప్రకృతి సాగు వైతాళికుడైన సుభాష్ పాలేకర్ గారు తిరుచ్చిలో నిర్వహించిన తొమ్మిది రోజుల వ్యవసాయ వర్క్‌షాప్‌కు ప్రియా హాజరయ్యారు. తను ఇన్నేళ్లుగా అనుసరిస్తూ వచ్చిన సహజ వ్యవసాయ విధానాలు సరైనవేనని ప్రియా అక్కడ స్వయంగా ధ్రువీకరించుకున్నారు.
“నేను ఇతరుల నుండి వ్యవసాయ విధానాల గురించి వినడం అదే మొదటిసారి. అప్పటిదాకా నేను చేస్తూ వస్తున్న పనులకి మాత్రమే నాకు సమయం చిక్కేది. నా పద్ధతులతో మంచి ఫలితాలను పొందుతున్నప్పుడు, నేను వేరేవాటి వైపు ఎందుకు చూస్తాను? కానీ, పాలేకర్ గారి వర్క్‌షాప్‌‌లో పాల్గొన్నాక నేను అనుసరించే పద్ధతులు నూటికి నూరు శాతం సరైనవేనని గ్రహించాను. ఇది నా సంకల్పాన్ని మరింత బలీయం చేయడానికి సహాయపడింది. కుప్పైమేడు డంప్ యార్డ్ నాకు పుష్కలమైన జ్ఞానం అందించిందని నేను గ్రహించాను” అని ఆమె చెబుతారు.
కరోనా లాక్‌డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయిన ప్రియా తన సేవలను కొనసాగించడానికి తాను పొదుపు చేసుకున్న డబ్బుపై ​​ఆధారపడుతున్నారు. విత్తన ప్యాకేజీలను పంపడం నుండి కూరగాయలను పెంచడం, అవసరమైన వారికి ఇవ్వడం వరకు ప్రియా ఎక్కడా వ్యాపార పద్ధతులకు తావివ్వరు. తన పనిని వ్యాపారం చేయకూడదన్నదే తన దృఢనిర్ణయం. అయితే మొక్కల పెంపకం, విత్తనాల సంరక్షణలో స్నేహితులు, ప్రయోజనం పొందేవారు సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఇది ఆమెకు కొంత ఉపశమనంగా ఉంటోంది. కానీ, ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ తన పనిని కొనసాగిస్తానని ప్రియా దృఢంగా చెబుతారు. అన్నట్టు ప్రియా రాజనారాయణన్ మొక్కల పెంపకం మెళకువలను తెలియజేసేందుకు ఒక యూ ట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తున్నారు. పది పన్నెండేళ్లుగా ఒక యువతి పట్టుదలతో దేశీ విత్తనాలను సేకరిస్తూ సంరక్షించడం, వాటిని ఉచితంగా పదుగురికీ అందించడం, తనకు తెలిసిన విషయాలను ఇతరులకు తెలియజేయడం అభినందనీయం, ప్రేరణదాయకం.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది ఈమెయిల్‌ని సంప్రదించవచ్చు.
seedsisland2020@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here