రైతే రాజు.. దేశానికి రైతే వెన్నుముక. మనందరి కడుపు నింపేది అన్నదాతే.. నిజమే.. అది అప్పటి మాట.. మధ్యలో మనం నేలతల్లిని విష రసాయనాలతో నింపేశాం. తద్వారా అధిక దిగుబడులు సాధించిన మాటా వాస్తవమే. రసాయన పూరిత పంటలతో ఆరోగ్యాలు అతలాకుతలం అయిపోయిన ఈ ఆధునిక సమాజం మళ్లీ సహజ పంటల వైపు మనసు పెడుతోంది.

ఈ క్రమంలో అన్నదాత విలువేంటో ఓ చిన్నపిల్ల మనందరికీ మరోసారి గుర్తుచేస్తోంది. పంట పండించేందుకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాల్ని బాల్యం నుంచీ కళ్లారా చూసింది. ఆరుగాలం కష్టపడినా సరైన ఫలసాయం అందక తమ కుటుంబం ఎదుర్కొనే ఇబ్బందుల్నీ చవిచూసింది. అయినా వ్యవసాయమే ప్రాణంగా భావిస్తోందా బాలిక. అందులోనూ ప్రకృతి వ్యవసాయం పట్ల మరింత మక్కువ పెంచుకుంది. ఆరో తరగతి చదివే రోజుల నుంచీ వనిత అనే గేన్యా నాయక్‌ తండా బాలిక వ్యవసాయమే ఊపిరిగా జీవిస్తోంది. వనిత ఆశావహ జీవనం పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. 

సూర్యాపేట జిల్లా నాగార్జున సాగర్‌కు సమీపంలో గేన్యా నాయక్‌ తండా ఉంది. వనిత తల్లిదండ్రులు రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసేవారట. రసాయనాలతో చేసిన సాగులో వారికి బాగా నష్టాలొచ్చాయి. నష్టాల నుంచి బయటపడే దారేదీ కనిపించని ఆ దంపతులు తమ పిల్లల్ని తీసుకుని ప్రకాశం జిల్లాకు వలస వెళ్లారు. వారి ముగ్గురు పిల్లల్లో మధ్య బిడ్డ వనిత. వనిత ఆరో క్లాసుకు వచ్చినప్పుడు తమ స్కూల్లోని డ్రాయింగ్‌ మాస్టారు మాల్యాద్రి పంట పండించే విధానం ఆమెలో స్ఫూర్తి నింపింది. ఆయన చేసే సేంద్రియ వ్యవసాయం పట్ల ఆకర్షణ పెంచుకుంది. క్షేత్ర పర్యటనల్లో భాగంగా విద్యార్థుల్ని ఆయన తన వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లేవారు. రైతుబిడ్డ వనితకు అక్కడి ప్రకృతి పంటలు, వ్యవసాయ పరిసరాలు బాగా నచ్చేశాయి. అందుకే ఎక్కువ సమయం వ్యవసాయ క్షేత్రంలోనే గడుపుతోంది. 

మాల్యాద్రి తన పొలంలో శ్రీగంధం, టేకు చెట్లు పెంచారు. అంతర సేద్యంగా జామ, దానిమ్మ, బత్తాయి లాంటి పండ్ల చెట్లతో పాటు వరిని కూడా సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తారు. తన పొలంలో కేవలం కషాయాలను మాత్రమే వాడతారాయన. కషాయాలతోనే వైరస్‌లు సోకకుండా కట్టడి చేస్తారు. చేనుకు చేవ కోసం ఘనజీవామ్రుతాన్ని వాడతారు.

 మాస్టారు అనుసరించే వ్యవసాయ విధానాలు వనితను ఎంతగానో ప్రభావితం చేశాయి. శక్తికి మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి ఆమె తల్లిదండ్రులు నష్టాలు మిగుల్చుకున్న వైనం కళ్లారా చూసింది అనిత. సేంద్రియ వ్యవసాయమే ఎంతో మేలు అని అర్థం చేసుకుంది. అప్పటి నుంచీ వ్యవసాయంలో అన్ని పద్ధతులు తెలుసుకోవాలనే కుతూహలం వనితలో పెరిగింది. 

వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనుల్నీ గురువు మాల్యాద్రి సహాయంతో వనిత నేర్చుకుంది. పాదులు, కలుపు తీయడం, పలు విధాల గార్డెనింగ్‌లోనూ మెళకువలు వంటబట్టించుకుంది. కరోనా కారణంగా గత ఏడాది వనిత తల్లిదండ్రులు స్వగ్రామం గేన్యా నాయక్‌ తండా వెళ్లారు. దీంతో గురువు ఇంట్లోనే వనిత ఉండి, వ్యవసాయంలో లోటు పాట్లు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మా నాన్న పడిన కష్టాలు చూశాను. ఆ బాధలు భరించలేకే వారు పొట్ట చేతపట్టుకుని వలస వచ్చారు. నాన్న ఆటో నడుపుతాడు. అమ్మ అపార్టుమెంటులో వాచ్‌ ఉమెన్‌. అన్న హాస్టళ్లో ఉంటాడు. తమ్ముడు ఏడో తరగతి. సేంద్రియ వ్యవసాయమే చాలా మంచిది. రసాయన పదార్థాలు వాడటంతో అందరి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. రసాయనాలు వేసిన పంటల జోలికే వెళ్లకూడదు. అందరూ ప్రకృతి పద్ధతుల్లో పంటలు పండించాలి. అప్పుడే మన దేశం ఆరోగ్యవంతం అవుతుంది. సేంద్రియ పంటలు పండించి మంచి ఆహారం అందించాలన్నదే నాకలఅంటోంది వనిత.

సహజ విధానంలో పండించిన పంటల్ని మాల్యాద్రి తమ స్కూల్‌ పిల్లల తల్లిదండ్రులకు అమ్ముతుంటారు. ప్రధానంగా జామ, నిమ్మ, ఆకుకూరలు ఎప్పుడూ అందుబాటులో ఉంచుతారు. సహజ పద్ధతిలోనే ఆయన వరి సాగు చేస్తారు. వనితకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అన్ని వ్యవసాయ పనులూ నేర్చుకుంది. వనిత తల్లిదండ్రులు ఆమె ఇష్టాన్ని గుర్తించారు. రైతులను బతికించాలని.. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతం చేయాలనే ఆలోచనలతో అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ కావాలన్నది వనిత కల.. ఆమె ఆశయం నెరవేరాలని నా ఆకాంక్షఅని టీచర్ చెప్పడం ముదావహం.


        

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here