ఓక్రా.. బెండీ.. లేడీస్ ఫింగర్.. బెండకాయ.. అమెరికాలో దీన్ని ఓక్రా అంటారు. ఉత్తర భారతదేశంలో బెండీ అని పిలుస్తారు. ఇంగ్లీషు పాఠాల్లో దీనికి లేడీస్ ఫింగర్ అని పేరు. ఏ పేరుతో పిలిచినా అది బెండకాయే. తోటల్లో, పెరట్లలో, పొలం గట్ల మీద, ఇంటి మిద్దెల పైనా ఎక్కడైనా సులువుగా బెండపంట పండించవచ్చు.

బెండకాయ పంటను ప్రపంచంలోని అనేక దేశాల్లో పండిస్తున్నారు. బెండకాయల సీడ్ ప్యాడ్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆసక్తికరమైన బెండ మొక్క శాస్త్రీయ నామం అబెల్మొస్చుస్. బెండకాయల్ని ఊరగాయ వెజిటబుల్ గా ఉపయోగించవచ్చు. సూప్, సైడ్ డిష్ లలోనూ బెండకాయను వినియోగిస్తారు. బెండకాయల నుంచి కొన్ని చోట్ల నూనె కూడా తీస్తారట!

సాంప్రదాయ వెజిటబుల్ అయిన బెండకాయతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. బెండకాయలో ఉండే ఖనిజాలు, విటమిన్లు, సేంద్రీయ పదార్ధాలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో. బెండలో A,B,C,E,K విటమిన్లు ఉన్నాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ లాంటి ఖనిజాలు బెండలో కూడా పుష్కలంగా లభిస్తాయి. బెండకాయలో ముసిలగినౌస్ ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటుంది. ఈ ముసిలగినౌస్ ఫైబర్ మన జీర్ణ వ్యవస్థ మార్గంలో ఆహారం జరిగేందుకు సహాయం చేస్తుంది. ఉబ్బరం, తిమ్మిరి, మలబద్ధకం, అదనపు వాయువు (గ్యాస్ ట్రబుల్) లాంటి జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది. అసాధారణ డయేరియా, నీళ్ల విరేచనాలను బెండకాయ అరికడుతుంది. శరీరంలో పేరుకున్న అదనపు కొలెస్టరాల్ తొలగించడానికి బెండకాయ తోడ్పడుతుంది. బెండకాయలో లభించే అన్ని విటమిన్ల ప్రయోజనాలతో పాటు ఎక్కువగా సి విటమిన్ మనలో రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.

మనకు ఎన్నో ప్రయోజనాలు కలిగించే బెండ పంటను ఎంతో సులువుగా పండించవచ్చు. వేరే పనులకు పనికిరావనుకున్న పాత కంటైనర్లలో బెండ సాగు విధానం ఏమిటో చూద్దాం.

వేస్ట్ గా ఉన్న 20 లీటర్ల కెపాసిటీ గల కంటైనర్లను సేకరించుకోవాలి. లేదా బెండమొక్క పడిపోకుండా పట్టి ఉంచగల మరేదైనా పాత టిన్, లేదా కుండను కూడా ఇందుకు వాడుకోవచ్చు. మట్టి, ఇసుక, కంపోస్ట్.. ఈ మూడింటినీ సమాన మోతాదులో తీసుకుని ఆ టిన్ లేదా కుండలో వేసుకోవాలి. ఈ మూడింటి మిక్చర్ ను టిన్ లో మూడింట ఒక వంతు మాత్రమే వేసుకోవాలి. దాంట్లో బెండ విత్తనం నాటాలి. విత్తనం నాటిన 15 నుంచి 20 రోజుల్లో బెండమొక్క ఎదుగుతున్న తీరుకు అనుగుణంగా కొద్దికొద్దిగా పైన తయారు చేసుకున్న మిశ్రమం వేసుకోవాలి. అందులో బెండ విత్తనం వేసి, పైన మిశ్రమంతో కప్పేసి, రోజూ కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండాలి.

టిన్ లో లేదా కుండలో మొలిచిన బెండమొక్కను బయటకుతీసి మరో పెద్ద టిన్ లో పాతుకునే ప్రయత్నం చేయకూడదు. ఇతర మొక్కల మాదిరిగా బెండను మరో చోట పాతుకోవడం కుదరదని మంగళూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ హరి ప్రకాశ్ హెచ్చరిస్తున్నారు. మొలిచిన కంటైనర్ లో కాకుండా మరోచోట బెండమొక్కను వేస్తే సరిగా ఎదగదు. అంతే కాకుండా పంట దిగుబడి కూడా తగ్గుతుందని హరి ప్రకాశ్ అనుభవంతో చెబుతున్నారు. పాత కంటైనర్లలో బెండ తదితర అనేక రకాల మొక్కల్ని పెంచడంలో హరిప్రకాశ్ మంచి నైపుణ్యం సాధించారు. ఎల్లప్పుడూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం పట్ల తన కుటుంబం అంతా ఎంతో ఆసక్తిగా ఉంటుందని హరిప్రకాశ్ అంటారు. తమ పొలం గట్టి నేల అని, అందుకే ప్రత్యామ్నాయంగా పాత టిన్ లు, పాత కుండల్లో 2010 నుంచి ఆర్గానిక్ పార్మింగ్ చేయడం ప్రారంభించారట హరిప్రకాశ్.

బెండ మొక్క ఎదిగే క్రమంలో వర్మీ కంపోస్ట్ ను పల్చని ముద్దగా చేసి కంటైనర్ లో వేస్తే మరింత బలం చేకూరి, మొక్క ఏపుగా ఎదుగుతుంది. ఎదుగుదలకు అనుగుణంగా బెండకాయల దిగుబడి కూడా పెరుగుతుందని హరి ప్రకాశ్ చెబుతున్నారు. పాత టిన్ లు, కుండల్లో వేసుకునే బెండ మొక్కలకు వర్మీ కంపోస్ట్ కాకుండా ఘన జీవామ్రుతం వేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అంటారు.

ఆర్గానిక్ బెండ సాగులో చీడ పీడల నిరోధానికి లీటరు నీటిలో 5 మిల్లీ లీటర్ల వేపనూనె, 5 మిల్లీ లీటర్ల వెనిగర్, ఒక చెంచాడు బేకింగ్ సోడాను బాగా కలిపి పిచికారి చేస్తే సరిపోతుంది. అంతే కాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి బెండ మొక్కలపై ఆర్గానిక్ డిటర్జెంట్ చల్లుకోవాలి. పైన చెప్పిన వేపనూనె మిశ్రమాన్ని చీడ పీడలు వచ్చినప్పుడే కాకుండా అప్పుడప్పుడూ చల్లుకోవచ్చు. అలా పిచికారి చేయడం వల్ల బెండ మొక్కల దరికి చీడపీడలు రానివ్వకుండా పనిచేస్తుందని హరి ప్రకాశ్ చెబుతున్నారు.

ఈ విధానంలో పెంచే బెండమొక్కలకు ఎండగా ఉన్న రోజైతే రోజుకు ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది. అదే వర్షాకాలంలో అయితే వాతావరణ పరిస్థితుల్ని బట్టి నీరు రోజు విడిచి రోజు నీరు పోసినా సరిపోతుందట. ఎక్కువ నీరు పోస్తే మొక్క ఎదుగుదలపై ప్రభావం చూపించవచ్చు. ఇలా పెంచిన ఒక్కో బెండ మొక్క కనీసం 1.5 నుంచి 2 కిలోల వరకు ఫలసాయం అందిస్తుంది. బెండమొక్క జీవిత కాలం 6 నుంచి 7 నెలలు ఉంటుంది.

హరి ప్రకాశ్ చెప్పిన విధానంలో మనం కూడా విష రహిత బెండ పంటను మన ఇంటి వద్దే పండించుకోవచ్చు. ముఖ్యంగా ఈ విధానం పట్టణాలు, నగరాల్లో నివసించే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎంత చిన్న స్థలంలో అయినా సహజసిద్ధమైన బెండ పంటను సులువుగా పండించుకోవచ్చు. ఒక హాబీగా కూడా ఈ విధానంలో పంట తీయొచ్చు. నగరజీవిలో పెరుగుతున్న ఒత్తిడిని కూడా ఇలాంటి హాబీ తగ్గిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here