Fruit Cake Movement
Fruit Cake Movement

రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలంటే కొత్త పద్ధతులను అవలంబించవలసి ఉంటుంది. పండించిన పంటలను మార్కెట్‌లో విక్రయించడమే కాకుండా రైతులు ఆ పంటలతో సొంతంగా కొన్ని ఉత్పత్తులను కూడా తయారు చేసుకోగలగాలి. దీని వల్ల ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాచుర్యం లభించడమే కాకుండా రైతుల ఉత్పత్తులకు అదనపు విలువ జోడించినట్లవుతుంది. మహారాష్ట్రలోని కొల్లాపూర్ జిల్లాలోని కాగల్‌కు చెందిన కృష్ణత్ పాటిల్ తన కుమారుడి పుట్టిన రోజును భిన్నమైన పద్ధతిలో జరపుకుని వినూత్నమైన సందేశం ఇచ్చారు. బేకరీ నుండి కేక్ ఆర్డర్ చేయడానికి బదులుగా పుచ్చకాయ, పైనాపిల్, ద్రాక్ష, నారింజలను ఉపయోగించి ఒక కేక్ తయారు చేశారు. దీని సందేశం స్పష్టమే. రైతులు సొంతంగా కేకులను తయారు చేసుకోవాలి. వాటిని మార్కెట్ కూడా చేయాలి. అలా ఇప్పుడు తాజా పుచ్చకాయ, బొప్పాయి వంటి పండ్లతో తయారైన పుట్టినరోజు కేక్‌లు నెమ్మదిగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మహారాష్ట్ర రైతులు దీన్ని ఒక ఉద్యమంగా పేర్కొంటున్నారు. క్రీమ్, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, మామిడి పండ్ల ముక్కలతో ఆ కేకులను అందంగా  అలంకరించి మరీ వారు వాటిని మార్కెట్ చేస్తుండడం విశేషం.

లాక్‌డౌన్ కారణంగా ఇటీవలి కాలంలో పండ్లతోటల పెంపకందారులు భారీగా నష్టపోయారు. వ్యాపారులు పండ్లకు చాలా తక్కువ ధరలు చెల్లిస్తుండడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. అందువల్ల కొంతమంది రైతులు ఫ్రూట్ కేక్ తయారీని ప్రారంభించారు. ఇది సోషల్ మీడియాలో పాపులర్ అయిందనీ, వినియోగదారుల నుంచి మంచి స్పందన కూడా వస్తోందనీ వ్యవసాయ విశ్లేషకులు దీపక్ చవాన్ చెబుతున్నారు.
పుట్టినరోజులు మాత్రమే కాదు, అన్ని సందర్భాలనూ ఈ విధంగా జరుపుకోవాలని నాసిక్ రైతు హరిభావు మహాజన్ అంటున్నారు. సోనాలి, సాగర్ వాడ్నెర్కర్‌ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన వారికి  ఫ్రూట్ కేక్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భాన్ని ఇలా వినూత్నంగా, ఆరోగ్యకరమైన తాజా కేక్‌తో జరుపుకోవడం ఆ దంపతులకు కూడా ఎంతో నచ్చింది.

Fruit Cake
‘హోయ్ అమ్హి శేత్‌కారీ’ అనే సంస్థ ఇటీవల ఫ్రూట్ కేక్ పోటీని ప్రకటించింది. ఇందులో పాల్గొనేవారు తప్పనిసరిగా తమ తమ ప్రాంతాల్లో లభించే పండ్లు, కూరగాయలను ఉపయోగించి కేకును తయారు చేయాలనేది ఈ సంస్థ విధించిన షరతు. బేక్ చేసిన కేక్‌లకు బదులు ఆరోగ్యం అందించే ఫ్రూట్ కేక్‌లను రైతులు ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ కొత్త ఉత్పత్తి కోసం విరివిగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
దీర్ఘకాలిక వ్యాధులను నివారించేందుకు పోషకాహారంలో భాగంగా రోజూ కనీసం 400 గ్రాముల మేరకు పండ్లు, కూరగాయలను తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్యానెల్ సిఫారసు చేస్తోంది. సగటున 80 గ్రాముల చొప్పున రోజుకు ఐదు సార్లు పండ్ల వంటివి తీసుకోవడం ఆరోగ్యదాయకమని సూచించింది. ఇలా చేయడం కోవిడ్ 19 నివారణకు కూడా ఉపకరిస్తుంది. శరీరంలో వ్యాధినిరోధకశక్తి పెంపొందితే కరోనా వంటి మహమ్మారులు సోకవు.
ఇదిలావుండగా, ఇటీవలి కాలంలో లాక్‌డౌన్ వల్ల రైతుల ఆదాయం తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో రైతులు కొత్త మార్కెటింగ్ వ్యవస్థలను ఉపయోగించి తమ ఉత్పత్తులను విక్రయించడానికి కొత్త మార్గాలను కనుగొనవలసి ఉంటుందనీ, అప్పుడే వ్యవసాయం లాభదాయకమవుతుందనీ సంజయ్ చవాన్ అనే రైతు అంటున్నారు.

మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
https://www.facebook.com/teamhas/
http://www.hoyamhishetkari.com/
Phone: 086696 46565

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here