ఏ పంట పండించాలన్నా ముందు కావలసినవి విత్తనాలే. జన్యు మార్పిడి విత్తనాల వల్ల పరాధీనత పెరుగుతుందని చాలాకాలంగా స్వదేశీ పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఆయా కంపెనీలు తయారు చేసే జీఎం విత్తనాలను ఉపయోగించడం వల్ల రైతులు నష్టపోతున్న సందర్భాలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో నెమ్మదిగా సంప్రదాయ దేశవాళీ వంగడాలకు ఆదరణ మళ్లీ పెరుగుతోంది. వందనా శివ, డాక్టర్ దేబల్ దేబ్ వంటి పర్యావరణ ఉద్యమకారులు వేలాది రకాల దేశీ వంగడాలను తమ భగీరథ ప్రయత్నాలతో పునఃసృష్టి చేసి కాపాడుతున్నారు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లోని రైతులు కూడా తమ పంటల కోసం స్థానికంగా అభివృద్ధి చేసిన విత్తనాలను ఉపయోగించడం ప్రారంభించనున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా, సహజ పద్ధతులను ఉపయోగించి విత్తన రకాలను అభివృద్ధి చేయడం కోసం 12 విత్తన అభివృద్ధి క్షేత్రాలను, 130 రైతు సంఘాలను గుర్తించారు.
ప్రస్తుతం హిమాచల్‌లో, ఆహార ధాన్యాలు, కూరగాయల విత్తనాలను ప్రధానంగా బయటి రాష్ట్రాల నుండే సేకరిస్తున్నారు. రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సమాచారం ప్రకారం, రాష్ట్రంలో విత్తనోత్పత్తి క్షేత్రాల విస్తీర్ణం, సాగులో ఉన్న మొత్తం విస్తీర్ణంలో ఒక శాతం కంటే తక్కువగా ఉంది. 2019-20లో, ఈ రాష్ట్రంలో ప్రధాన ఆహార పంటలను పండించడానికి దాదాపు 77,000 మెట్రిక్ టన్నుల విత్తనాలను ఉపయోగించారు, వీటిలో 28,000 మెట్రిక్ టన్నులకు పైగా అధిక దిగుబడినిచ్చే రకాలు (హెచ్‌వైవి) విత్తనాలు ఉన్నాయి. ఈ హెచ్‌వైవి విత్తనాలలో 80 శాతానికి పైగా రాష్ట్రం వెలుపల నుండే వచ్చాయి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, బార్లీ, బఠానీ, కూరగాయలకు సంబంధించి విత్తనాలన్నిటినీ బయటి నుండే సమకూర్చుకున్నారు. ఒక్క బంగాళాదుంప మాత్రమే దీనికి మినహాయింపు.
సుమారు మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయ శాఖ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ప్రారంభించింది. సుమారు 5,000 హెక్టార్ల విస్తీర్ణంలో సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ పద్ధతిని హిమాచల్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. లక్షకు పైగా రైతులు ఈ విధానాలను అనుసరిస్తున్నారు. ఇప్పుడు ప్రారంభించిన విత్తనోత్పత్తి కార్యక్రమం కూడా ఆ ప్రయత్నంలో భాగమని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రకృతి పద్ధతుల ద్వారా విత్తన అభివృద్ధిపై చర్చించడానికి నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో హిమాచల్ ప్రదేశ్ వ్యవసాయ మంత్రి వీరేందర్ కన్వర్ మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాల కోసం ఇతర రాష్ట్రాలపై రాష్ట్రం ఆధారపడి ఉందని అన్నారు. “కానీ మాకు వేర్వేరు వ్యవసాయ-వాతావరణ మండలాలు ఉన్నందున అనుకూలతకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కాబట్టి మనం మన సొంత విత్తనాలను అభివృద్ధి చేసుకోవడం అవసరం”అని ఆయన పేర్కొన్నారు.
ఈ విత్తనోత్పత్తి కోసం పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 12 వ్యవసాయ క్షేత్రాలను గుర్తించారు. 130 రైతు సంఘాలు ఈ విత్తనాభివృద్ధిలో పాలుపంచుకోనున్నాయి. కాగా, వార్షికంగా 333 మెట్రిక్ టన్నుల తృణధాన్యాలు, 120 మెట్రిక్ టన్నుల బార్లీ, జొన్న, సజ్జ, రాగి వంటి తృణధాన్యాలు, 4 మెట్రిక్ టన్నుల తృణేతర జాతుల చిరుధాన్యాలు, 239 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల విత్తనాలను అభివృద్ధి చేయాలని అంచనా వేశారు. ఎర్ర బియ్యం బక్వీట్ (ఓగ్లా, ఫాఫ్రా) వంటి కొన్ని సాంప్రదాయ పంటలను పునరుద్ధరించడానికి కూడా ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందని హిమాచల్ వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు.
2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, స్థానిక పహాడీ (కొండప్రాంతాలకు చెందిన) పప్పులు, సాంప్రదాయ ధాన్యాలు, ఆఫ్-సీజన్ కూరగాయల విత్తనాలను సంరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్త పథకాన్ని ప్రారంభిస్తుందని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న రీతిలోనే హిమాచల్‌లో కూడా సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బండారు దత్తాత్రేయ హిమాచల్ గవర్నర్ హోదాలో ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇప్పుడు దేశీ విత్తనాల అభివృద్ధిలోనూ ముందంజ వేస్తూ హిమాచల్ మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here