అశ్విన్ రాజ్ ఏడవ తరగతి విద్యార్థి. సుమారు పన్నెండేళ్ల వయసు. మామూలుగా అయితే ఈ వయసు పిల్లలకు ఆటపాటల్లోనే కాలం గడిచిపోతుంది. కానీ కేరళకు చెందిన అశ్విన్ రాజ్‌కి మొక్కల పెంపకం అంటే ఎంతో ఇష్టం. మొక్కలే తన స్నేహితులు. మొక్కలతోనే కాలక్షేపం చేస్తుంటాడు. ఈ ఇష్టానికీ, కష్టానికీ అశ్విన్‌కు తగిన ప్రతిఫలం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికిగాను అశ్విన్‌కు “బెస్ట్ స్టూడెంట్ ఫార్మర్” (Best Student Farmer) అవార్డు ప్రకటించింది.
త్రిసూర్ జిల్లా పొరాతిస్సెరీలోని మహాత్మా స్కూల్‌లో చదువుకుంటున్న అశ్విన్ రాజ్ ఐదో తరగతి నుంచే తోటపనులు చేస్తూ వస్తున్నాడు. ఈ పిల్లవాడు స్కూల్‌లో మాతృభూమి సీడ్ క్లబ్‌ మెంబర్ కూడా. స్కూల్‌ నుంచే కాకుండా కృషి భవన్ నుంచి కూడా అశ్విన్ ఆసక్తిగా విత్తనాలు, మొక్కలు సేకరిస్తుంటాడు. అలా ఈ బాలరైతు ఐదు సెంట్ల స్థలంలో ఉన్న తమ చిన్నపాటి ఇంటి మిద్దెపై ఒక చక్కని కిచెన్ గార్డెన్ తయారు చేశాడు. ఇంటి పైకప్పుపైనే సొరకాయ, టొమాటో, మిరప, గుమ్మడి, బూడిద గుమ్మడి, ఉల్లి, వంకాయ, కాకర, బీన్స్, క్యారట్, పాలకూర వంటి కూరగాయలు పండించాడు. స్కూలు నుంచి వచ్చీ రాగానే అశ్విన్ నేరుగా వెళ్లేది టెర్రాస్ పైకే. బడి నుండి వచ్చాక మిద్దెపైకి వెళ్లి తన మొక్కలు ఎలా ఉన్నాయో చూసుకుంటాడు. వాటికి నీళ్లు పోస్తాడు. ఎరువు వేస్తాడు. అశ్విన్ కిచెన్ గార్డెన్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. అంత ఏపుగా కూరగాయల మొక్కలు పెరగడం వెనుక ఎంతో కష్టం ఉండి తీరుతుంది. వాటిని ఓ ఏడో తరగతి పిల్లవాడు పెంచాడంటే ఎవరూ నమ్మరు!

అశ్విన్ రాజ్ మిద్దెపంట

తండ్రి ఎం ఏ రాజ్‌కుమార్, తల్లి సరిత, అన్నయ్య అక్షయ్ రాజ్ కూడా అశ్విన్‌కు మిద్దె పంటపనుల్లో సహాయం చేస్తుంటారు. స్కూల్లో సీడ్ కోఆర్డినేటర్ దీప, అగ్రికల్చర్ క్లబ్ కోఆర్డినేటర్ అంబిలి, ఇతర టీచర్లు అశ్విన్‌ను ప్రోత్సహిస్తూ ఉంటారు.
కరోనా లాక్‌డౌన్ సమయంలో అశ్విన్ తన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆ టైములో మిద్దెపై చాలా కూరగాయలే పండించాడు. పాఠశాల లేకపోవడంతో కిచెన్ గార్డెన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించగలిగానని అశ్విన్ ఎగ్జైటింగ్‌గా చెబుతాడు. తను పండించినవాటిలో మొదట ఇంటి అవసరాలకు సరిపడా తీసేసి, మిగిలినవి అశ్విన్ తమ సమీప బంధువులకు, మిత్రులకు ఇస్తుంటాడు. మొక్కల పనులతో పాటు అశ్విన్‌కు వంటలన్నా ఎంతో ఇష్టం. అంతేకాదు, Sudus Vlog పేరుతో అశ్విన్ ఒక యు ట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించాడు. అందులో వంటలు, గార్డెనింగ్ వీడియోలు పెడుతూ ఉంటాడు.
అశ్విన్ తండ్రి రాజ్‌‍కుమార్ ఒక సెక్యురిటీ గార్డు కాగా, తల్లి సరిత ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తారు. అన్నయ్య అక్షయ్ ప్లస్ టు స్టూడెంట్. చిన్నతనం నుంచే పిల్లలను ఇలా తోటపనులు చేసేందుకు ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో అద్భుతాలు సాధించే ఉత్తమ రైతులుగా మారతారు. వ్యవసాయం పట్ల ఆసక్తి, అభిరుచి కలిగి ఉంటారు.

(mathrubhumi సౌజన్యంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here