రసాయన రహిత ప్రకృతి పంటల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త, వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్‌ పాలేకర్‌ ప్రారంభించిన జీరో బడ్జెట్‌ నేచురల్‌ పార్మింగ్‌ పట్ల ముందులో కొద్ది మంది ఆరోగ్యాభిలాషులు మాత్రమే ఆసక్తి కనబరిచారు. ఆధునిక సమాజంలో ప్రజలు అనారోగ్యాలతో కునారిల్లిపోవడానికి విషరసాయనాలతో పండించే పంటల పాత్ర కూడా చాలా ఎక్కువే ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. దీంతో ఇటీవలి కాలంలో మరింత మంది ఔత్సాహికులు సేంద్రీయ వ్యవసాయం మొదలు పెట్టారు. ఒక పక్కన రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం కారణంగా అన్నదాతలకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఏదో విధంగా అప్పో సప్పో చేసి తీరా రసాయనాలతో పంటలు పండించినా.. ఆ పంటల్ని తిన్న వారిని అనారోగ్యాలు పట్టిపీడిస్తున్నాయి. రైతుల సాగు అవసరాలకు కావలసినంత మేరకు రసాయన ఎరువులు, పురుగుమందుల్ని సరఫరా చేయడం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారిపోయింది.ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి సేద్యం పట్ల రైతులను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తుండడం విశేషం. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ రసాయన పరిశోధనాలయాల నుంచి వ్యవసాయాన్ని ప్రకృతి ఒడిలోకి నడపాలని దేశంలోని రైతులను కోరుతున్నారు. కష్టాల కాష్టంలోకి అన్నదాతను నెట్టేస్తూ.. తప్పుదారిలో నడుస్తున్న సాగుబడిని సహజ వ్యవసాయంగా మార్చుకోవాలని, మళ్లీ మనం మన పూర్వీకుల మూలాల్లోకి వెళదామని సూచిస్తున్నారు. మన దేశీయ సంప్రదాయక తెలివికి ఆధునిక శాస్త్ర సాంకేతిక జోడించి, ప్రపంచ జనాభాకు కొత్త టానిక్‌ ఇచ్చి, ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించడంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలుపుదామని పిలుపునిస్తున్నారు. మనిషి జీవనశైలి మార్పు వరకూ మన సాగు విధానాన్ని తీసుకెళదామని అన్నదాతలకు మోడీ సూచిస్తున్నారు.ప్రకృతి వ్యవసాయం వైపు దేశ రైతాంగాన్ని మళ్లించేందుకు ప్రభుత్వం ముందు ముందు చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని మోడీ అంటున్నారు. ప్రకృతి వ్యవసాయంపై వికృత వ్యాఖ్యలు చేసే శాస్త్రవేత్తల ఆలోచనలను సమూలంగా మార్చడం, ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్య భారతాన్ని తయారుచేసుకుందామంటున్నారు ప్రధాని. ప్రకృతి వ్యవసాయంపై కేవలం సానుభూతితో మాట్లాడితే ఒరిగేదేమీ ఉండదని, సేంద్రీయ వ్యవసాయం దిశగా నిజమైన కార్యాచరణ ఉండాలంటున్నారు. జన్యు మార్పిడి విత్తనాలు, విష రసాయన ఎరువులు, క్రిమి సంహారకాల పీడను వదిలించుకుని, సహజసిద్ధ సాగు దిశగా రైతన్నలు దృష్టిసారించాలని కోరుతున్నారు. ప్రకృతి వ్యవసాయం, జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ గురించి సుభాష్‌ పాలేకర్‌ లాంటి వ్యవసాయ నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నా ప్రభుత్వాలు కూడా పట్టించుకోని వైనాన్ని ప్రధాని మోడీ గుర్తుచేస్తున్నారు. అన్నదాతకు గిట్టుబాటు కాని రసాయన సహిత సాగు నుంచి మార్పు అనివార్యమని నీతి ఆయోగ్‌ ఇటీవలి కాలంలో కృషిచేస్తున్నదని మోడీ చెబుతున్నారు. గతంతో పోలిస్తే.. ప్రకృతి వ్యవసాయం స్థిరపడే సూచనలు ఈ మధ్య కాలంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రధాని చెప్పడం ఆ రోజులు ఇంకెంతో దూరంలో లేవని అర్థం అవుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో జీరో బడ్జెట్‌ ప్రకృతి వ్యవసాయం సత్ఫలితాలు ఇస్తోంది.దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై నీతి ఆయోగ్‌ ఇటీవలే జాతీయ స్థాయిలో ఒక సదస్పు నిర్వహించడం విశేషం. ఈ సదస్సులో ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కూడా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం కోసం ఏపీ ఇప్పటికే మంచి చర్యలు తీసుకుందని చెప్పడం గమనార్హం. ఏపీలో 6.30 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేందుకు నమోదు చేసుకున్నారని, ఇప్పటికే ఏపీలో 2.9 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం కొనసాగుతున్నదని చెప్పడం మంచి పరిణామం. ప్రకృతి వ్యవసాయంలో రైతులను ప్రోత్సహించేందుకు కొత్త విధానం తీసుకురావాలని సూచించడం స్వాగతించాల్సిన విషయం. సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు రివార్డులు అందజేయాలని జగన్‌ సూచించడం హర్షణీయం. నేచురల్ పార్మింగ్ చేసే రైతులకు మరింత ప్రోత్సాహం అందించడంలో ఏపీలో రైతు భరోసా కేంద్రాలు విశేషంగా కృషి చేస్తున్నాయని వెల్లడించారు. సేంద్రీయ వ్యవసాయం పట్ల రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా మరింత ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పడం ఆహ్వానించదగ్గ అంశం. ఏపీలో ప్రకృతి సేద్యానికి ప్రోత్సహించేందుకు జర్మనీ ప్రభుత్వం 20 మిలియన్‌ యూరోలు సహాయం చేస్తామని అంగీకరించిందని చెప్పడం హర్షణీయం.మరో పక్కన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ‘కిసాన్‌ భగీదారీ, ప్రాథమిక హమారీ’ ప్రచారం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలోనే వ్యవసాయ పరిశోధన, విద్యాశాఖ సంయుక్తంగా ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో కృషి మేళా, సహజ వ్యవసాయంపై క్షేత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి ప్రచారంలో ప్రాధాన్యం ఇస్తోంది. ఇలా మన దేశంలో ప్రకృతి వ్యవసాయానికి కేంద్రం, ఏపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. భవిష్యత్‌లో ప్రకృతి సేద్యం బంగారు పంటలు పండిస్తుందనడంలో సందేహం ఉండక్కర్లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here