సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి. ఇప్పుడాయన మనకు తెలంగాణ మంత్రిగా మాత్రమే తెలుసు. అయితే.. ఆయన ఇంతకు ముందు హైకోర్టులో పేరుమోసిన న్యాయవాది. ఇంకో విషయం కూడా ఉంది. ఆయన ప్రకృతి ప్రేమికుడు. చాలా ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నిఖార్సయిన కర్షకుడు కూడా. తెలంగాణ ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా, మంత్రిగా ఎంతో బిజీ షెడ్యూల్‌ ఉండే నిరంజన్ రెడ్డి తన ప్రకృతి వ్యవసాయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయరు. తమ క్షేత్రంలోని ప్రతి మొక్కను, ప్రతి చెట్టునూ, ప్రతి ఆవును, ప్రతి లేగదూడను, ప్రతి కోడిని, పనిచేసే ప్రతి మనిషినీ వీలు చిక్కినప్పుడల్లా ప్రేమగా చూస్తారు. అంతే ప్రేమగా పలకరిస్తుంటారు. మనం పెంచుకునే ప్రతొ మొక్కనూ, ప్రతి జంతువునూ వీలైనన్ని ఎక్కువసార్లు దగ్గరగా వెళ్లి చూసుకుంటే వచ్చే తృప్తి వేరు అంటారు. అలాగే మనకు లభించే ఆదాయమూ అదే స్థాయిలో ఉంటుందంటారు.అలాంటి వ్యవసాయశాఖ మంత్రి సహజ వ్యవసాయం గురించి, ఆయన అవలంబించే విధానాల గురించి, క్షేత్రంలో ఆయన వ్యాపకాల గురించి తెలుసుకుందాం.

పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం వనపర్తి జిల్లాలోని పానగల్‌ లో నిరంజన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో పలు రకాల పంటల సాగుతో పాటు ఆవులు, కోళ్లు లాంటి జీవాలను కూడా అంతే ఇష్టంగా పెంచుకుంటున్నారు. నిరంజన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ప్రధానంగా పలు రకాల మామిడి చెట్లు పెంచుతున్నారు. శ్రీగంధం చెట్లు కూడా ఆయన క్షేత్రంలో ఉన్నాయి. పామాయిల్ పంట సాగు కూడా చేస్తున్నారు. ఇంటి అవసరాల కోసం ఇంకా పలు రకాల పంటలు కూడా పండిస్తున్నారు. నిరంజన్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఏ విధమైన రసాయనాలు, పురుగు మందులు వాడరు. కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు మాత్రమే వినియోగిస్తారు. సహజ విధానంలో ఎరువులు తయారు చేసుకోడానికి నిరంజన్ రెడ్డి క్షేత్రంలో 150 ఆవులు పెంచుతున్నారు. ఆ ఆవుల నుంచి వచ్చే పేడ, గోమూత్రంతో కంపోస్ట్‌ ఎరువు తయారు చేసి, తన క్షేత్రంలో వాడడంతో పాటు, మిగిలిన సహజ సిద్ధ ఎరువును విక్రయించడం ద్వారా ఏటా 10 లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తుండడం విశేషం.నిరంజన్ రెడ్డికి మొత్తం 52.5 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. దాంట్లో రెండున్నర ఎకరాలను కేవలం ఆవుల కోసం కేటాయించారు. నికరంగా 50 ఎకరాల్లో నిరంజన్ రెడ్డి వ్యవసాయం చేస్తున్నారు. మొత్తం 50 ఎకరాల క్షేత్రంలో 25 ఎకరాల్లో వివిధ రకాల మామిడి పంట సాగు చేస్తున్నారు. మరో 13 ఎకరాల్లో శ్రీగంధం, సీతాఫలం చెట్లు పెంచుతున్నారు. కూరగాయలు, పలు రకాల పండ్ల జాతులను ఎకరం భూమిలో సాగుచేస్తున్నారు. మూడు ఎకరాల్లో ద్రాక్షతోట పెంచుతున్నారు. ఈ మొత్తం వ్యవసాయంలో నిరంజన్ రెడ్డి కంపోస్ట్‌ ఎరువులే వాడతారు. క్షేత్రం సారవంతంగా  ఉండేలా చూసుకుంటారు.నిజానికి నిరంజన్ రెడ్డి తండ్రి రాంరెడ్డి మంచివ్యవసాయం చేసిన రైతే. తల్లి తారకమ్మ కూడా వ్యవసాయం చేసిన వ్యక్తే. తనను ఎక్కువగా చదువుకోవాలని తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో వ్యవసాయ పనుల గురించి తెలుసుకునే అవకాశం అంతగా రాలేదన్నారు. న్యాయవాదిగా తాను స్తిరపడే సమయానికి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తండ్రి వయస్సు మీదపడడం, కరువు పరిస్థితుల్లో వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దాంతో ఏటేటా కొన్ని కొన్ని పశువులను అమ్మేశామన్నారు. న్యాయవాదిగా తాను బాగా స్థిరపడడం, పంటలు సాగు చేసే పరిస్థితి లేకపోవడంతో బలవంతంగా భూమిని అమ్మించినట్లు తెలిపారు. అయితే.. రైతుకు భూమి పట్ల మమకారం ఉంటుందనే విషయం తనకు అప్పట్లో అర్థం కాలేదన్నారు. రెండు వేల సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభం అవుతున్న తరుణంలో కొంత భూమి కొని దాంట్లో రైస్ మిల్లు నిర్మించినట్లు చెప్పారు. ఉద్యమ అవసరాల కోసం ఐదారేళ్ల తర్వాత రైస్ మిల్లు కూడా అమ్మేశామన్నారు.స్వయంగా తనకు వ్యవసాయం గురించి తెలియకపోయినా.. తెలంగాణ ఉద్యమ సమయంలో రైతుల కష్టాల గురించి తెలుసుకునే అవకాశం వచ్చిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో తనను తెలంగాణ వ్యవసాయమంత్రి పదవి వరించిందన్నారు. తండ్రి మరణించిన తర్వాత తల్లికి తృప్టి కలిగించేందుకు పాన్‌ గల్‌ లో రాళ్లు రప్పలతో, పశువులు మేత మేసే బీడు భూమిని కొన్నట్లు వెల్లడించారు. తాను ఈ భూమిని తీసుకున్నప్పుడు కొందరు ‘నిరంజన్ రెడ్డికి వకాలత్ తెలుసు కానీ వ్యవసాయం గురించి ఏం తెలుసు’ అని వెటకారం చేసేవారని గుర్తుచేసుకున్నారు. అయితే.. తాను వ్యవసాయాన్ని ఒక యజ్ఞంగా తీసుకుని, భూమిలోని పలుగు రాయిని బయటికి తీయించి, బేస్‌ మెంట్లకు, ఇతర నిర్మాణాలకు వినియోగించినట్లు చెప్పారు. భూమి మధ్యలో ఉండే పెద్ద బండరాయిని క్రమేపీ పగలగొట్టిస్తూ.. దానితోనే క్షేత్రం చుట్టూ ప్రహారీ నిర్మించామన్నారు. నిరంజన్ రెడ్డి క్షేత్రం రిజర్వు ఫారెస్టుకు సమీపంలోనే ఉండడంతో పంటలకు అడవి పందుల బెడద ఎక్కువగా ఉండేదని, అందుకే పొలం చుట్టూ రాతి గోడ నిర్మించినట్లు తెలిపారు.నిరంజన్ రెడ్డి తన క్షేత్రంలో 2006లో మామిడి మొక్కల పెంపకం మొదలుపెట్టారు. భూమినంతా శుద్ధి చేసుకోడానికి, వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకోడానికి సుమారు ఏడాది కాలం పట్టిందన్నారు. భూమి సిద్ధం అయ్యాక సంగారెడ్డిలోని ఫల పరిశోధనా కేంద్రం నుంచి మంచి నాణ్యమైన మొక్కలు తెచ్చి నాటారు. ప్రస్తుతం 37 ఎకరాల్లో నిరంజన్ రెడ్డి మామిడి పంట సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా బెనిసాన్‌ మామిడి ఎక్కువగా పండిస్తున్నారు. దాని కంటే కొంచెం తక్కువ హిమాయత్‌ రకం పెంచుతున్నారు. కేసరి, దసేరి, చెరుకురసం, చిన్న, పెద్ద రసాలు, పంచవర్ణం రకాలు సాగుచేస్తున్నారు. నిరంజన్ రెడ్డి క్షేత్రంలో ప్రధానంగా బేనిసాన్‌, హిమాయత్‌ రకాలు అత్యధికంగా ఉంటే.. మిగతా రకాలు 100 లేదా 200 చెట్లు ఉన్నాయి.నిరంజన్ రెడ్డి క్షేత్రంలో వినియోగించేందుకు సహజ ఎరువులు సొంతంగా తయారు చేసుకుంటారు. నిరంజన్ రెడ్డికి సహజ ఎరువుల గురించి మొదట్లో అవగాహన లేదు. వ్యవసాయం చేసే క్రమంలో ఆయన క్రమేపీ సహజ ఎరువుల తయారీ గురించి తెలుసుకున్నారు. తాను వ్యవసాయం ప్రారంభించిన మొదటి రెండు మూడేళ్లు అందరి మాదిరిగానే రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించారు. తరచుగా తాను మొక్కలు ఎదుగుతున్న క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలించేవాడినని చెప్పారు. సహజ ఎరువుల వల్ల ఒక్కసారిగా భూమి సారవంతం కాదని చెప్పారని, ప్రతి ఏటా క్రమం తప్పకుండా సహజ ఎరువులు వాడుతూ ఉంటే భూమి సారవంతం అవుతుందని తెలుసుకున్నానన్నారు. క్షేత్రంలో వచ్చిన ఆకులు, జీలుగ మొక్కల్ని మల్చింగ్‌ గా వాడతామన్నారు. దాంతో పాటు పశువుల ఎరువును కంపోస్ట్ చేసి, మొక్కలు, చెట్లకు వినియోగిస్తామన్నారు. వర్మీ వాష్‌ లా ఉపయోగపడే గోమూత్రాన్ని వాడతామన్నారు. గోమూత్రాన్ని పైప్ లైన్ల ద్వారా ప్రతిరోజూ కొన్ని చెట్లకు వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.భూమికి సహజ ఎరువులు వినియోగిస్తే.. సారవంతం అవుతుందని, సారవంతం అయిన భూమిలో విపరీతంగా వానపాములు ఉంటాయన్నారు. అవి భూమిని ఎప్పటికప్పుడు గుల్లగా మారుస్తుంటాయన్నారు. ఈ విధంగా సాగుచేసిన మొక్కలు, చెట్లకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, దాంతో రోగాలు వచ్చే అవకాశం ఉండదన్నారు. రెండేళ్ల క్రితం మన దేశానికి ఇతర దేశాల నుంచి మామిడి పూతకు నల్లతామర తెగులు వచ్చిందన్నారు.నిరంజన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 150 వరకు ఆవుల్ని పెంచుతున్నారు. వాటికి పుట్టిన కోడెదూడలను ఇతర రైతులు పెంచుకోడానికి ఇస్తుంటారు. ఆడదూడలు తమ క్షేత్రంలోనే పెంచుతామన్నారు.వ్యవసాయ పనులకు మనుషులు దొరకని ఈ రోజుల్లో ట్రాక్టర్‌, స్ప్రేయింగ్ కోసం, కలుపుగడ్డి కోతకు యంత్ర పరికరాలు వాడుతున్నట్లు నిరంజన్ రెడ్డి చెప్పారు. కూలిపనివారి పట్ల కొంత ఉదారంగా ఉండడం వల్ల తనకు మనుషులు దొరకని పరిస్థితి రాదన్నారు.  పదిహేను ఏళ్లుగా వచ్చే పనివారే తన పనికి వస్తారని, ఎవరు ఏం పనిచేయాలో వారే నిర్ణయించుకుని బాధ్యతగా చేస్తాన్నారు. ఏ పని చేసినా తాను సంపూర్ణంగా లీనం అవుతానని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ వ్యవసాయ క్షేత్రం పెట్టినప్పటి నుంచీ అర్ధరాత్రి అయినా సరే తాను క్షేత్రం మొత్తం పరిశీలిస్తానన్నారు. ఉదయం లేవగానే తమ సూపర్ వైజర్‌ కు ఏమేమి పనులు చేయాలో పురమాయిస్తాన్నారు. క్షేత్రంలో తాను అందుబాటులో ఉండని పరిస్థితుల్లో రోజువారీ ఫోన్ కాల్‌ తోనే క్షేత్రం పనులు చక్కబెడతానని చెప్పారు. వ్యవసాయంలో లీనం అయితే తప్ప పూర్తిగా అర్థం కాదంటారు నిరంజన్‌ రెడ్డి. మనం ఎంత శ్రద్ధగా మొక్కలు, చెట్లను చూస్తే.. అవి కూడా మనను అంతే ప్రేమగా అర్థం చేసుకుంటాయని, అదే మోతాదులో ప్రతిఫలం అందిస్తాయంటారు నిరంజన్ రెడ్డి. రైతు తన పొలంలో ఎంత తిరిగితే ఆ భూమి అంత ఆనందిస్తుందని పెద్దలు చెబుతారన్నారు.వ్యవసాయంలో లాభాలు సంపాదించాలంటే వంద, యాభై ఎకరాలు ఉండక్కర్లేదంటారు. ఒక్క ఎకరం ఉన్న రైతు కూడా సమృద్ధిగా లాభం పొందొచ్చని మంత్రి నిరంజన్ రెడ్డి కచ్చితంగా చెప్పారు. తక్కువ పొలం ఉన్నవారు భార్య, భర్త స్వయంగా కష్టం చేసుకుని, పంటల మార్పిడి చేస్తూ, ఏడాది పొడవునా భూమిని ఖాళీగా ఉంచకుండా వ్యవసాయం కొనసాగిస్తే.. ఎప్పటికీ లాభమే కాని నష్టం మాత్రం రాదంటారు నిరంజన్ రెడ్డి. భూమిలో 40 రోజుల పంటలు, రెండు నెలలు, మూడు నెలల పంటలు వేసుకోవాలని చెప్పారు. ఇలా చేసుకుంటే ఒక్క ఎకరంలో కూడా ఒక కుటుంబం సంతోషంగా బ్రతకవచ్చని నిరంజన్ రెడ్డి తన అనుభవంతో చెప్పారు. పొలం విస్తారం పెరిగే కొద్దీ ఖర్చులు, శ్రమ, పనివారి అవసరం ఎక్కువ అవుతుంది. తద్వారా ఎక్కువ ఆదాయం వచ్చినా.. లాభం కూడా పెరుగుందని ఆశించకూడదంటారు నిరంజన్ రెడ్డి.నిరంజన్ రెడ్డి తన క్షేత్రంలో పండించే మామిడి, ద్రాక్షను ఉన్నవి ఉన్నట్లు కాకుండా తన మనవరాలు ‘శ్రీనైనిక ఫాం’ పేరు మీద బ్రాండింగ్ చేసి హైదరాబాద్‌ మార్కెట్లో విక్రయిస్తామన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం ఇంగ్లండ్‌ లోని రిటైల్‌ మార్కెట్‌ కు పంపించినట్లు చెప్పారు. తన మొత్తం క్షేత్రంలో పెట్టుబడి ఖర్చులన్నీ పోగా ఏడాదికి 30 నుంచి 35 లక్షల రూపాయలు లాభం వస్తుందన్నారు.తన క్షేత్రంలో పండిన మామిడి పంటలో మూడు నాలుగు డీసీఎం వ్యాన్ల పండ్లను బంధు, మిత్రులకు పంచిపెడతామన్నారు. శ్రీగంధం మొక్కలకు అనుబంధంగా వేసిన సీతాఫలాలు ఈ ఏడాది ఒక డీసీఎం వ్యాన్‌ నిండా వచ్చాయని వాటిని బంధు మిత్రులకు పంచిపెట్టానన్నారు. ఇతరులకు పంచిపెట్టడంలో తనకు ఆనందం కలుగుతుందన్నారు. వచ్చే ఏడాది తన క్షేత్రంలోని సీతాఫలం కమర్షియర్‌ పంటగా చేతికి వస్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here