మొక్కలకు పోషకాలు అందించేందుకు చాలా మంది కిచెన్ వేస్ట్‌ ను కంపోస్ట్‌ చేసి వాడుతుంటారు. అయితే.. అలా చేయడం వల్ల పోషకాలు కేవలం 25 శాతం వరకు మాత్రమే మొక్కలకు అందే అవకాశం ఉంటుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అదే కిచెన్ వేస్ట్‌ ను పేస్ట్‌ చేసి, దాన్ని లిక్విడ్‌ లా చేసుకుని మొక్కలకు వాడితే పూర్తిస్థాయిలో పోషకాలు అందుతాయి. పైగా కిచెన్ వేస్ట్‌ పేస్ట్‌ వాడిన పూలు, పండ్ల మొక్కలు ఎండాకాలంలో కూడా పచ్చగా, బలంగా, ఆరోగ్యంగా, ఏపుగా ఎదుగుతాయి. వేసవిలో కూడా వాటి నుంచి దిగుబడి అధికంగా వస్తుంది. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ గ్రోత్ ప్రమోటర్‌ గా ఉపయోగపడుతుంది.అదెలాగో చూద్దాం. కిచెన్ వేస్ట్‌ ను కంపోస్ట్‌ చేయాలంటే మూడు నెలల సమయం పడుతుంది. కిచెన్ వేస్ట్‌ ను నీళ్లలో కలుపుని వాడినప్పుడైతే దానిలోని పోషకాలు కేవలం 25 నుంచి 30 శాతం మాత్రమే మొక్కలను అందే అవకాశం ఉంటుంది. కానీ.. కిచెన్ వేస్ట్‌ పేస్ట్‌ లిక్విడ్‌ ఫెర్టిలైజర్‌ ను చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. వారం రోజలు లేదా పది రోజుల కిచెన్ వేస్ట్‌ ను మిక్సీ పెద్ద జార్‌లో వేసి, బాగా మెత్తగాపేస్ట్‌ లా తయారు చేసుకోవాలి. మిక్సీలో పేస్ట్‌ చేసుకునేందుకు ఒక్కో జార్‌ కు రెండేసి కప్పుల నీళ్లు కూడా పోసుకోవాలి.  ఇలా తయారు చేసిన పేస్ట్‌ లు నత్రజని, పోటాషియం, కాల్షియం లాంటి అన్ని పోషకాలు ఉంటాయి. ఒక వేళ్ మన ఇంటి కిచెన్‌ లో సరిపడినంతగా వేస్ట్‌ లభించకపోతే.. రైతు బజార్‌ లాంటి చోట్ల నుంచి వేస్ట్ గా పడేసిన కూరగాయలు, ఆకు కూరలు లాంటివి కూడా తెచ్చుకుని ఈ పేస్ట్ తయారు చేసుకోవచ్చు.కిచెన్ వేస్ట్ నుంచి పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత బెల్లం కలిపిన ఒరిజినల్ వేస్ట్‌ డీ కంపోజర్‌ (ఓడబ్ల్యుడీసీ) ద్రావణం తయారు చేసుకోవాలి. అలా తయారైన 20 లీటర్ల ఓడబ్ల్యుడీసీ ద్రావణం నుంచి ఐదారు లీటర్ల ద్రావణాన్ని వేరేగా తీసిపెట్టుకోవాలి. ఓడబ్ల్యుడీసీ ద్రావణంలో మనం తయారు చేసి పెట్టుకున్న కిచెన్ వెస్ట్‌ పేస్ట్‌ ను పూర్తిగా వేసి మెటల్‌ రాడ్ కాకుండా ఓ పీవీసీ పైప్‌ తో కానీ, కర్రపుల్లతో కానీ బాగా తిప్పి కలుపుకోవాలి. వేరేగా తీసిపెట్టుకున్న ఐదారు లీటర్ల ఓడబ్ల్యుడీసీ ద్రావణంలో కిలో ఆవ పిండి, లేదా ఆవ కేక్‌ లేదా వేరుసెనగ చెక్క గానీ, లేదంటే నువ్వుల పిండితో తయారైన తెలగపిండి కానీ కలుపుకోవాలి. మనం మూడూ అందుబాటులో ఉంటే వాటిని కలపొచ్చు. రెండే దొరికినా రెండూ కలిపి ఒక కిలో పరిమాణంలో తీసుకుని కలపొచ్చు. ఈ మిశ్రమం కాస్త ఎక్కువైనా ఇబ్బందేమీ ఉండదు. ఆ తర్వాత పావు కిలో లేదా 200 గ్రాముల బోన్ మీల్‌ అందులో కలపాలి. నాన్ వెజ్‌ ముట్టుకోని వారు పాస్పరస్ కంటెంట్‌ ఉన్న రాక్ ఫాస్పేట్‌ కలపవచ్చు.ఈ మిశ్రమాలు కలిపిన ఓడబ్ల్యుడీసీ ద్రావణాన్ని పది పదిహేను రోజుల పాటు నిల్వపెట్టాలి. అయితే.. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రెండేసి నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేటప్పుడు కూడా ఓ 200 గ్రాముల బెల్లం కలపాలి. ఆర్గానిక్ బెల్లం అయితే మరీ మంచిది. మనం ముందుగా ఓడబ్ల్యుడీసీ ద్రావణం తయారు చేసుకున్నప్పుడు కలిపిన బెల్లానికి ఇది అదనం అన్నమాట. ఇలా తయారు చేసిన ద్రావణానికి ఒక విశేషం ఉంది. కిచెన్ వేస్ట్‌ పేస్ట్‌ లో మామూలు నీరు అయితే ఓ 30 నుంచి 40 శాతం మాత్రమే పోషకాలను గ్రహిస్తుంది. అదే ఓడబ్ల్టుడీసీ ద్రాణం అయితే.. పోషకాలను పూర్తిగా పీల్చేసుకుంటుంది. రోజూ కలపడం వల్ల కిచెన్‌ వేస్ట్ లోని పోషకాలన్నింటినీ ద్రావణం రూపంలోకి మార్చేస్తుంది. ఎక్వేరియం షాపుల్లో 200 రూపాయలకు దొరికే ఎయిర్ పంపు కొని దాంతో ద్రావణాన్ని కలుపుకుంటే మరింత త్వరగా అంటే పది రోజులకే లిక్విడ్‌ తయారైపోతుంది. దీంట్లో సీవీడ్ ఫెర్టిలైజర్‌ 100 లేదా 200 మిల్లీ లీటర్లు యాడ్ చేసుకోవచ్చు.  లేదా ఒక లీటర్‌ గోమూత్రం అయినా కలుపుకుంటే మరింత ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇవి రెండూ కలపకపోయినా పరవాలేదు.ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎంతో బలవర్ధకమైనది. ఈ ద్రావణానికి వన్‌ ఈస్టూ ఫైవ్ మోతాదులో అంటే 20 లీటర్ల లిక్విడ్ ఫెర్టిలైజర్ కి 100 లీటర్ల నీరు కలుపుకుని, బాగా పలుచగా చేసుకెని మొక్కల మొదళ్లలో పోసుకోవాలి. దీంతో మొక్కలు పచ్చగా, ఏపుగా బలంగా ఎదుగుతాయి. ఎండాకాలం అయినా సరే మొక్కలు అంతే పచ్చగా బలంగా ఉంటాయి. తద్వారా పంట దిగుబడి అధికంగా వస్తుంది.ఈ ద్రావణాన్నితీసుకోగల మొక్క శక్తిని బట్టి, కుండీ సైజును బట్టి పోసుకోవాలి. ద్రావణంలోని పోషకాలన్ని మొక్కలకు చాలా సులువుగా అందుతాయి. ఈ విషయం ఎన్‌సీఓఎఫ్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్ కిషన్ చంద్ర కిచెన్ వేస్ట్‌ ను పేస్ట్ చేసి, లిక్విడ్ గా మార్చి మొక్కలకు వాడితే పూర్తిస్థాయిలో ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఈ విధానాన్ని అనుసరిస్తే.. మొక్కలకు బలం, మనకు అధిక దిగుబడి వస్తుంది. ఈ ద్రావణాన్ని వేసవి కాలంలోనే కాకుండా ఇతర కాలాల్లో కూడా చక్కగా వాడుకోవచ్చు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి మనం వేసుకునే ఆవు పేడ, లేదా వర్మీ కంపోస్టు వేసుకునే వారు వాటిని కూడా కిచెన్ వేస్ట్ పేస్ట్‌ ద్రావణాన్ని వాడుకునే వారు వేసుకోవచ్చు. ఈ ద్రావణాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఎండాకాలం మొదట్లో ఆవుపేడ కానీ, వర్మీ కంపోస్ట్‌ కానీ వేసుకుంటే.. మిగతా మూడు నెలలు కూడా కిచెన్ వేస్ట్‌ పేస్ట్‌ లిక్విడ్ ద్రావణం వేసుకుంటే సరిపోతుంది. మొక్కలు ఎంతో బలంగా, పచ్చగా ఏపుగా ఎదుగుతాయి. ఈ ద్రావణం వాడిన ఎంతో మంది రైతులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here