తోటలో కానీ, పెరట్లో కానీ, టెర్రస్‌ మీద కాని మొక్కల్ని ఏపుగా, బలంగా పెంచడానికి ఏమేమీ పోషకాలు వేయాలో అని బుర్ర బద్దలు కొట్టుకోనక్కర్లేదు. మన చుట్టుపక్కల లభించే ఏ వస్తువైనా మొక్కల పోషణకు బాగా ఉపయోగపడుతుంది. అవేంటో.. ఎలా వినియోగించుకోవచ్చో తెలుసుకుందాం. ఇంట్లో వాడుకునే స్టీలు, ఇనుప సామాన్లకు తుప్పు పడితే మనం బయట పడేస్తాం. అలాంటి వాటిని మొక్కల కుండీల్లో వేసుకుని రోజూ నీళ్లు పోస్తుంటే.. దాన్నుంచి మొక్కలకు ఐరన్‌ బాగా అందుతుంది. మొక్క పెంచుకునే కుండీలో అది చిన్నదైనా పెద్దదైనా కానీ మట్టితో పాటు కొబ్బరి పీచు కూడా వేసుకుంటే.. ఎక్కువ సమయం పాటు మొక్కకు తేమ అందేలా చూస్తుంది.టెర్రస్‌ పైన, లేదా పెరట్లో కుండీల్లో పెంచుకునే మొక్కలకు ఆవు ఎరువును మట్టితో కలిపి వాడుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. మొక్కలు బాగా, ఏపుగా ఎదిగేందుకు కూరగాయలు కడిగిన నీళ్లు, ఉల్లిపాయల తొక్కలు నానబెట్టిన నీళ్లు కూడా బాగా పనికొస్తాయి. పాలగిన్నె కడిగిన నీళ్లు, పెరుగు అయిపోయాక ఆ గిన్నెను కాస్త ఎక్కువగా నీళ్లు పోసి బాగా పలచగా చేసిన నీళ్లు పోసినా మొక్కల పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. మొక్కను పెంచేందుకు కాదేదీ అనర్హం అంటారు. అయితే.. మొక్కలకు వాడాలనుకునే పాలు, పెరుగు నీళ్లను బాగా పలచగా చేయడంలోనే దాని ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది.మనం పెరట్లో, టెర్రస్ పైన పెంచుకునే మొక్కలు, చెట్లు ఇచ్చే ఫలాలు చేతికి అందిన వరకు కోసుకుని తినొచ్చు. కొన్ని బాగా ముగ్గిన పండ్లను మొక్కల మొదళ్లలో వేసి రోజూ నీరు పోస్తుంటే ఆ పండ్లలోని పోషకాలు మళ్లీ మొక్కలు ఏపుగా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. మనం తినగా మిగిలిన జామకాయల్ని మొక్కల కుండీల్లో వేస్తే.. అందులోని కొన్ని గింజలు మొలకెత్తుతాయి. మొలకెత్తని గింజలు ఎరువుగా మారి మొక్క ఏపుగా ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. మనం నర్సరీ ప్లాస్టిక్ సంచిలో పెంచిన ఏ మొక్కనైనా తెచ్చుకుంటే.. అది చనిపోతే కూడా ఉపయోగపడుతుంది. అదే ప్లాస్టిక్ సంచిలో మరో మొక్కను నాటుకుంటే చనిపోయిన మొక్క  ఆకులు మల్చింగ్ లాగా ఉపయోగపడతాయి. నీళ్లు పోస్తున్న కొద్దీ అవే ఆకులు కొత్తగా నాటిన మొక్కకు మంచి పోషకాలు ఉన్న ఎరువుగా పనికొస్తాయి.బాగా ముగ్గిపోయి, మనం తినడానికి పనికిరావనుకునే పళ్లు కూడా మొక్కలకు చక్కని పోషకాలు అందిస్తాయి. కుళ్లిన పండ్లను మొక్కల కుండీల్లో వేసి రోజూ నీరు పోస్తుంటే.. అది మరింతగా కుళ్లి, దాన్నుంచి కొన్ని రకాల యాసిడ్స్‌ విడుదల అవుతాయి. ఆ యాసిడ్లు మొక్క పెరుగుతున్న మట్టిలో బాగా కలిసిపోయి మంచి బలాన్నిస్తాయి.మొక్కల్ని పెంచేందుకు మనం రోజువారీ వాడే నీరు కన్నా.. వర్షం నీరు మరింత బాగా ఉపయోగపడుతుంది. వర్షం నీటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పట్టుకుని, దాని లోపలకు వెళ్లగలిగేంత మరో డబ్బాకు కింద చిన్న చిన్న రంధ్రాలు వేసుకుని, మట్టిపోసి, అందులో నాటిన మొక్క మరింత సజీవంగా ఉంటుంది. ఎంత ఎండ కాసినా ఆ మొక్క ఎండిపోయే అవకాశం ఉండదు. ఆకులు రాలే కాలంలో తప్పితే ఇంకెప్పుడూ వర్షంనీరు వాడిన మొక్క ఎండిపోయే పరిస్థితి రాదు. మనం కుండీల్లో పెంచుకునే మొక్కల్లో అదనంగా పెరిగే ఇతర పీకేయాలి. వాటిని అదే కుండీల్లో వేసుకుంటే.. వాటి ద్వారా కూడా మనం పెంచుకునే మొక్కకు సారం అందిస్తాయి.షాపుల్లో మనం షర్ట్ కొన్నప్పుడు దాని ప్యాకింగ్ లో ఒక స్పాంజ్‌ ఉంటుంది. దాన్ని మనం పెంచుకునే బోన్‌ సాయ్‌ మొక్క మొదలుకు చుట్టి రోజూ నీళ్లు పోస్తుంటే.. ఆ మొక్క మొదలుకు వేళ్లు చాలా తొందరగా వస్తాయి. వేళ్లు బాగా వచ్చిన తర్వాత ఆ స్పాంజ్‌ చివికిపోతుంది. దాన్ని తీసేస్తే.. ఆ మొక్క చాలా బలంగా, పచ్చగా ఎదుగుతుంది. అలాగే.. కోడిగుడ్డు గుల్లలను బాగా పౌడర్‌ గా చేసి మొక్కలకు వేసే మట్టిలో కలుపుకుంటే.. మట్టిలో పోసిన నీరు త్వరగా ఆరిపోవడానికి ఉపయోగపడుతుంది.ఆవు ఎరువు, కొద్దిగా ధాన్యం పైన ఉండే పొట్టు, మరి కొంచెం మట్టి కలిపి కుండీల్లో కానీ, 20 లీటర్ల మినరల్ వాటర్‌ బాటిల్‌ లో కానీ వేసుకుని, జామచెట్టు పెంచుకుంటే అది ఎంతో సమృద్ధిగా పెరుగుతుంది. ఆవు ఎరువు, ఊక, మట్టితో పాటుగా మరికొంత ఆకుల కంపోస్ట్‌ కూడా కలిపి జామ మొక్క పెంచుకుంటే.. చాలా తొందరగా, రుచికరమైన కాయలు చక్కగా కాస్తుంది. ఇలా చేస్తే చిన్న చెట్టు కూడా ఎక్కువ కాయలు కాస్తుంది. కుండీల్లో పెంచుకునే కొన్ని మొక్కలు చనిపోయాయనుకుని పీకేస్తూ ఉంటాం. అలా చనిపోయాయనుకునే కొన్ని రకాల మొక్కలకు బెల్లం, అరటిపండు బాగా చిక్కని జ్యూస్ లా చేసి, ఓ డబ్బాలో 15 రోజులు నిల్వ ఉంచి, తర్వాత దానికి నీరు కలిపి బాగా పలుచగా చేసి పోస్తే.. చనిపోయిందనుకున్న మొక్కలకు కూడా చిగుళ్లు వచ్చే అవకాశం ఉంది.కాకరతీగ ఏడాది పొడవునా బతికే ఉంటుంది. దాని ఆకులు ఎండిపోయిన తర్వాత కుండీల్లోని మొక్కలకు మల్చింగ్‌ మాదిరిగా వేసుకుంటే.. నీటి తేమ ఎక్కువ సమయం ఉండేలా ఉపయోగపడుతుంది. దాంతో పాటు కాకర ఆకు కుళ్లిన తర్వాత మొక్కలకు ఎరువుగా కూడా పనికొస్తుంది. బాగా పండిపోయి, మన వినియోగానికి పనికిరావనుకునే కాకరకాయలు కూడా మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడతాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here