అన్ని కాలాల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్‌ ఉండే కూరగాయ ఏదో తెలుసా? ఏ ఇంట్లో అయినా అనేక కూరల్లో టమోటా వాడకం ఎక్కువనే చెప్పాలి. కూరల్లోనే కాకుండా డైలీ చేసుకునే చెట్నీ మొదలు నిల్వ ఉండే ఊరగాయ దాకా టమోటా వినియోగం చాలా ఎక్కువగానే ఉంటుంది. అందుకే టమోటాకు అంత భారీ డిమాండ్‌ ఉంటుంది.అయితే.. టమోటా ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. ఒక్కో సీజన్‌ లో ఒక్కో విధంగా వాటి ధర మారిపోతుంది. ఒక సారి ఐదు నుంచి పది రూపాయల మధ్య లభించే టమోటాలు కొన్ని సందర్భాల్లో వంద రూపాయలు.. ఆ పైన కూడా పలుకుతుంది. ఇది వినియోగదారుల వైపు నుంచి చెప్పుకునే మాట. నిజానికి మార్కెట్‌ లో టమోటా ధర ఎంత పలికినా దాన్ని ఆరుగాలం కష్టపడి పండించే రైతన్నకు మాత్రం ధర విషయంలో చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. ఒక్కోసారి టమోటా ధర కిలోకు అర్ధ రూపాయికి కూడా పడిపోయిన సందర్భాలు ఉంటాయి. ఇదంతా మార్కెట్‌ మాయాజాలం, మధ్య దళారుల దోపిడీ అని చెప్పుకోవచ్చు. రైతు టమోటాలు పండించి, మార్కెట్‌ కు తెచ్చినప్పుడు ధర మరీ దారుణంగా పడిపోతే.. తమ కష్టానికి, కూలీలకు, రవాణా ఖర్చులు కూడా రాకపోతే.. ఆవేదనతో వాటిని మార్కెట్‌ లో, రోడ్ల మీద పారబోస్తున్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.అయితే.. టమోటా సాగు చేయడం రైతుకు రిస్క్‌ లేనిదని చెప్పొచ్చు. పైగా అన్నీ కలిసి వస్తే.. ఎకరాలో పండించిన టమోటాతో దాదాపు 3 లక్షల దాకా కూడా లాభాన్ని రైతన్నలు కళ్లజూడవచ్చు. రైతన్నకు కిలో టమోటాకు ఐదు రూపాయలు ధర దొరికినా లాభసాటిగా ఉంటుందని కర్నూలు జిల్లాకు చెందిన రైతు గోపాలరెడ్డి చెబుతున్నాడు. ఆపైన అధికంగా వచ్చే ధరతో లాభాలు మరింతగా పెరుగుతాయని అంటాడు గోపాలరెడ్డి. టమోటా విత్తనం ఒకసారి నాటితే.. దానికి నీటి సదుపాయం సరిగా చూసుకోవాలని, అవసరమైతే.. అతి కొద్ది మోతాదులోనే యూరియా వేసుకుంటే సరిపోతుందని వివరించాడు గోపాలరెడ్డి. టమోటా పంటకు చీడపీడల బాధ ఉండదు. శారీరక శ్రమ కూడా మిగతా పంటల మాదిరి ఎక్కువగా ఉండదని గోపాలరెడ్డి చెబుతున్నాడు. టమోటా పంట రోజూ కోతకు వస్తుంది. ఒక పక్క నుంచి టమోటా కోసుకుంటూ వెళితే.. చివరికి వెళ్లే సరికి మొదలు పెట్టిన చోట మళ్లీ కొత్త టమోటాలు కోతకు సిద్ధంగా ఉంటాయి.భారతదేశానికి తొలుత టమోటా అమెరికా నుంచి దిగుమతి అయింది. టమోటా శీతాకాలపు ఉద్యాన పంట. మంచు కురిసే సీజన్‌ లో తప్ప మరే కాలంలో అయినా కాపు కాస్తుంది. అయితే.. రబీ సీజన్‌ టమోటా సాగుకు అత్యంత అనుకూలం అని రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతారు. నీటి వసతి ఉన్న భూమిలో, డ్రిప్‌ ఇరిగేషన్‌ చోట వేసవి కాలంలో కూడా టమోటా సాగు చేయడానికి అనుకూలమైన పంట ఇది. టమోటాలో సుమారు 150 రకాలు ఉన్నాయి.టమోటా విత్తనాలు నాటురకానివి అయితే.. ఎకరాకు 200 గ్రాములు, హైబ్రీడ్‌ విత్తనాలు 100 నుంచి 120 గ్రాములు సరిపోతాయి. టమోటా నారును పొలంలో బోదెలుగా చేసి నాటుకుంటే మొక్కల బాగా ఎదుగుతాయని శాస్త్రవేత్తలు, అనుభవం ఉన్న రైతులు చెబుతున్నారు. టమోటా స్వల్ప కాలిక ఆరుతడి పంట. దీనికి ఎర్రగరప నుంచి బరువైన ఇసుక నేలలు అనువైనవని అంటారు. తేలిక భూముల్లో వర్షాకాలంలో కూడా టమోటా సాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టమోటా మొక్కల్ని నాటేటప్పుడు మొక్కకు మొక్కకు మధ్య దూరం 60 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. భూమి స్వభావాన్ని బట్టి ఐదు లేదా ఆరు రోజులకు ఒకసారి నీరుతడి పెడుతుండాలి. టమోటా కోతకు వస్తుంది. టమోటా పంట కోత మొదలైనప్పటి నుంచి 45 నుంచి 60 రోజుల దాకా దిగుబడి వస్తుంది. నవంబర్‌ పంట అయితే.. ఎకరాకు 12 నుంచి 16 టన్నుల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయ నిపుణులు, రైతులు చెబుతున్నారు. వేసవిలో చేతికి వచ్చే టమోటా పంట అయితే.. 8 నుంచి 12 టన్నుల దాకా దిగుబడి వస్తుంది. రేటు కలిసి వస్తే.. ఖర్చులు పోగా ఎకరాకు 3 లక్షల రూపాయలు నికర ఆదాయం వచ్చే అవకాశం ఉందని వరంగల్‌ జిల్లా భూపతిపేట ఉద్యాన రైతు చెబుతున్నాడు.స్టేకింగ్‌ పద్ధతి అవలంబిస్తే.. టమోటా పంట కాలం మరో నెల రోజులు పెరుగుతుందని, అదనంగా రెండు మూడు కోతలు ఎక్కువ పెరుగుతుందని రైతు నవీన్‌ వెల్లడించాడు. దీంతో టమోటా పండించే రైతులకు మరింత లాభసాటిగా ఉంటుందని చెప్పాడు. టమాటో ముఖ్యంగా మనకు కనిపించేది కాయ పగుళ్లు అని నవీన్‌ గుర్తుచేశాడు. బూరాన్‌ అనే లోపం వల్ల ఇలా టమోటా కాయలకు పగుళ్లు ఏర్పడతాయన్నాడు. బూరాన్‌ లోపాన్ని సరిచేసుకుంటే.. పగుళ్లు రావంటాడు. భూమిలో మెగ్నీషియం, జింక్‌ లోపాలతో టమోటా ఆకులు పసుపురంగులోకి మారి, రాలిపోతాయన్నాడు. మెగ్నీషియం, జింక్‌ లోపాల వల్ల టమోటా కాయ ఆరోగ్యంగా ఎదగదన్నాడు. మంచి ఆకారం రాదని, రంగు కూడా కోల్పోతుందని నవీన్‌ చెప్పాడు. టమోటా సాగు చేసే రైతులు వీటి కచ్చితంగా అవగాహన చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చాడు. భూసారం సరిగా ఉంటే అంతగా మందుల వాడకం ఉండదన్నాడు. భూమిలో పీహెచ్‌ ఎంత ఉందనేది పరీక్ష చేయించుకుంటే.. దానికి తగ్గట్టుగా ఎరువులు ఎంత మోతాడులో వాడాలో అంతే వాడుకోవచ్చన్నాడు. తద్వారా ఎరువుల వృధా ఉండదంటున్నాడు. అందుకే రైతు భూసార పరీక్ష తప్పనిసరిగా చేయించాలన్నాడు.మిర్చి, పత్తి లాంటి పంటల సాగులో రైతులు లాభాలు రాకపోయినా.. ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే.. టమోటా సాగులో అయితే.. నష్టాలు ఉండవని, ఎకరాకు రెండు నుంచి మూడు లక్షల దాకా ఆదాయం వస్తుందని నవీన్‌ అనుభవంతో చెబుతున్నాడు. బాక్సు టమోటాలకు వెయ్యి రూపాయల ధర ఉంటే.. అన్ని ఖర్చులు పోగా ఎకరాకు మూడు లక్షలు లాభం వస్తుందని మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం భూపతిపేట రైతు పోషాల్‌ ధీమాగా చెబుతున్నాడు. తాము 20 ఏళ్లుగా పత్తి, మిర్చి, టమోటా సాగు చేస్తామని మిగతా వాటి కంటే టమోటా సాగు తమకు లాభదాయకంగా ఉందని అన్నాడు. టమోటా సాగు చేసే భూమిని ఐదారు సార్లు దున్ని, ఎకరాకు పది ట్రాక్టర్ల ఎరువు చల్లుతామని తెలిపాడు. అనుష్క రకం టమోటా సాగు చేస్తున్నట్లు పోషాల్‌ చెప్పాడు. తమ పొలంలో టమోటా పంటకు పది పదిహేను తడులు పడతాయని అన్నాడు. టమోటా మొక్క నాటిన 15 రోజులకు కొద్దిగా పచ్చదనం వస్తుందని, మరో 15 రోజుల్లో మరింత పచ్చగా తయారవుతాయని, నెల నెలన్నరకు టమోటా మొక్క పూత దశకు వస్తుందని, రెండు నెలలకు కాయ కోతకు వస్తుందని పోషాల్‌ చెప్పాడు. టమోటా ఒక్కో కోతకు 25 కిలోల చొప్పున 50 బాక్సుల దాకా దిగుబడి ఉంటుందన్నాడు. అలా తమ పొలంలో టమోటా పది నుంచి 20 కోతలు కూడా వస్తాయని చెప్పాడు. ఒక్క ఎకరంలో టమోటా సాగు చేయాలంటే.. అన్నింటినీ కలుపుకుని 50 వేల రూపాయలు ఖర్చవుతుందని పోషాల్‌ చెప్పాడు. వరి కన్నా, పత్తి కన్నా టమోటా సాగే ఎక్కువ లాభసాటి అంటున్నాడు పోషాల్‌.లాభసాటిగా ఉండి, నష్టాలు రాని టమోటా పంట వేయాలనుకునే ఔత్సాహిక రైతులు తప్పనిసరిగా తమ ప్రాంత ఉద్యానవన అధికారిని సంప్రదించి సాగు చేసుకుంటే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here