‘కూరలో కరివేపాకులా తీసిపారేశారు’ అనేది పాతకాలపు సామెత. అయితే.. కరివేపాకును అలా తీసిపారేయలేం అంటున్నారు రైతులు. ముఖ్యంగా కూరలు, ఇతర వంటకాల పోపుల్లో వాడే కరివేపాకు వినియోగం ఈ ఆధునిక కాలంలో బాగా పెరిగింది. కరివేపాకును పొడిగా చేసుకుని డబ్బాల్లో నిల్వ ఉంచుకుని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే.. ఆ రుచే వేరప్పా అంటున్నారు భోజన ప్రియులు. దాంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది కరివేపాకు. అలాగే కరివేపాకును పచ్చడిగా చేసుకుని అప్పటికప్పుడు అన్నంలో కలుపుకుని తినొచ్చు. కరివేపాకును పచ్చడిగా చేసుకుని గాజు సీసాల్లో నిల్వ చేసుకుని కొన్ని నెలల పాటు అన్నంలో.. ఇడ్లీలు, దోశలు, వడలు లాంటి అల్పాహారంతో నంజుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.కరివేపాకును కొద్ది నేలతో పాటు ఎకరాలకు ఎకరాల్లో కూడా లాభదాయక పంటగా సాగు చేయడానికి రైతులకు ఎంతో మేలైనదని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఒకసారి కరివేపాకు విత్తనం నేలలో నాటితే.. మొక్కల నుంచి 15 ఏళ్ల పాటు దిగుబడి తీసుకోవచ్చని అంటున్నారు. దిగుబడికి తోడు మంచి ధర కూడా పలికితే.. మన ఇంట కాసుల పంట పండినట్టే అని అనుభవం ఉన్న ప్రస్తుత బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని చినకొత్తపల్లి రైతు ప్రత్తిపాటి శ్రీనివాసరావు చెబుతున్నారు. రెండేళ్లుగా ఆయన నాలుగు ఎకరాల్లో కరివేపాకు సాగు చేస్తున్నారు. శ్రీనివాసరావు కరివేపాకుతో పాటుగా టమోటా, వంకాయ పంటలు కూడా విజయవంతంగా పండిస్తున్నారు.

కరివేపాకు సాగు ఎలా చేయాలి? సస్యరక్షణ చర్యలు ఎలా ఉండాలి? విత్తు నాటినప్పటి నుంచి ఎన్ని రోజులకు మొదటి దిగుబడి వస్తుంది? ఎన్ని రోజులకు ఒకసారి పంట కోసి ఎక్కడ అమ్మాలి? ఎంత ఖర్చు పెడితే.. ఎంత దిగుబడి వస్తుంది? కష్టనష్టాలు ఎలా ఉంటాయి తదితర విషయాలు తెలుసుకుందాం.గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని వడ్లమూడిలో నాణ్యమైన కరివేపాకు విత్తనాలు కిలో రెండు లేదా మూడు వందల రూపాయలకు దొరుకుతాయి. విత్తనాలను సాలుకు సాలుకు మధ్య 40 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. మొక్కల వరసల్లో సుమారు ఐదు నుంచి ఆరు అంగుళాల దూరంలో నాటుకోవాలి. ట్రాక్టర్‌ తో బోదెలు దున్నించి.. బోదెలకు రెండు వైపులా మనుషుల్ని పెట్టి విత్తనాలు నాటించాలి. నాలుగు ఎకరాల్లో నాటిన రెండున్నర క్వింటాళ్ల కరివేపాకు విత్తనాలకు లక్షా 50 వేల రూపాయలు ఖర్చు అయిందని శ్రీనివాసరావు వెల్లడించారు. సాళ్లలో డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానం ఏర్పాటు చేసుకుని, విత్తనాలకు నీరు సరఫరా చేసుకోవాలన్నారు. విత్తనం నాటిన 15 రోజుల నుంచి నెల రోజుల వరకు కరివేపాకు మొలుస్తూ ఉంటాయని వెల్లడించారు. మొక్కలు వచ్చిన తర్వాత సాగుపద్ధతుల్లో డ్రిప్‌ ద్వారా పోషకాలు అందించాలని చెప్పారు. కలుపు తీయించాలన్నారు. వానాకాలంలో అంటే జూలై, ఆగస్టు నెలల్లో విత్తనాలు నాటుకుంటే మొలకెత్తడం సులువుగా ఉంటుంది. మొక్కలు వచ్చిన తర్వాత కనీసం వారానికి ఒకసారి డ్రిప్‌ ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది.కరివేపాకు విత్తనాలు నాటిన ఆరు నెలలకు మొదటి పంట కోతకు వస్తుంది. మొక్కలు సుమారు ఐదు అడుగుల ఎత్తు పెరిగిన తర్వాత కోసుకుంటే మంచిదని శ్రీనివారావు, వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. కరివేపాకు తొలి కోతలో దిగుబడి అంతగా రాదు. అప్పటికి ఒక్క పిలకే వస్తుంది కనుక ఎకరానికి రెండు నుంచి మూడు టన్నుల దాకా దిగుబడి వస్తుందని శ్రీనివాసరావు తెలిపారు. కరివేపాకును మొక్క మొద్దులు మాత్రం ఉంచి కొమ్మల దాకా కోసుకోవాలన్నారు. అలా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కరివేపాకు కోత కోసుకోవచ్చని చెప్పారు. మొక్కల పోషణను బాగా చేస్తే.. తెగుళ్లు, చీడపీడలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మూడు నెలలకు కూడా కరివేపాకు కోతకు వస్తుందన్నారు శ్రీనివాసరావు. భూమికి బలం కోసం డ్రిప్‌ లో కరిగే మూడు 19లు, సీఎన్‌ లాంటి ఎరువులు ఇస్తామన్నారు. ఇటీవలి కాలంలో దొరుకుతున్న లిక్విడ్‌ ఎరువులు కూడా డ్రిప్‌ ద్వారా మొక్కలకు అందేలా చూసుకోవచ్చని శ్రీనివాసరావు చెప్పారు. మొక్క మొడళ్లలోని మట్టి ఎప్పుడూ పదునుతో ఉండాలన్నారు.

కరివేపాకుకు ఆకుమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులు, పురుగు లాంటివి వస్తుంటాయని, వాటి నివారణ కోసం మందులు స్ప్రే చేసుకోవాలని శ్రీనివాసరావు అన్నారు. ప్రతి పది రోజులకు ఏదో ఒక మందు వేయాలని, తద్వారా మొదట్లో పెట్టుబడి కాస్త ఎక్కువే అవుతుందన్నారు. విత్తనం నాటినప్పటి నుంచి కోతకు కోతకు మధ్యన నాలుగు ఎకరాలకు లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు పెట్టుబడి వస్తుందని చెప్పారు. దాంట్లోనే కూలీలు, మందుల ఖర్చు అంతా కలిపి ఉంటుందన్నారు. ఒక పట్టుకు డ్రిప్‌ లో ఎకరానికి 5 కిలోల మందు బలం కోసం అందిస్తే సరిపోతుందని వెల్లడించారు. డ్రిప్‌ లో పెట్టే బలం మందు కట్టకు రెండు వేల నుంచి నాలుగు వేల వరకు అమ్ముతున్నారని చెప్పారు.కరివేపాకు కోత కోసినప్పుడు రేటు బాగా ఉంటే మంచి లాభాలు ఉంటాయని శ్రీనివాసరావు చెబుతున్నారు. తాము తొలి కోత కోసినప్పుడు టన్నుకు 32 వేల రూపాయలు వచ్చిందన్నారు. ఆ తర్వాతి కోతలో నాలుగు ఎకరాల్లో తమకు 28 టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. ఒక్కోసారి డిమాండ్‌ లేకపోతే.. కరివేపాకును కోసేసి వృథాగా పడేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయన్నారు. అలాంటప్పుడు ఆ నాలుగు నెలల పాటు పెట్టిన పెట్టుబడి నష్టం అవుతుందన్నారు. ఒక్కోసారి కరివేపాకు ధర కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని, అలాంటప్పుడు ఎంత ఎక్కువ దిగుబడి వచ్చినా పెద్దగా లాభం ఉండకపోవచ్చన్నారు. మధ్య దళారులు వచ్చి కరివేపాకును తమ దగ్గరకొని, హైదరాబాద్‌, చెన్నై, ముంబై లాంటి నగరాలకు ఎగుమతి చేస్తారని శ్రీనివాసరావు తెలిపారు. కరివేపాకు కటింగ్‌, లోడింగ్‌, రవాణా ఖర్చులు వారే పెట్టుకుని, తమకు టన్నుకు ఇంత అనిచెప్పి నికరంగా ధర ఇస్తారని చెప్పారు. కరివేపాకుకు ధర స్థిరంగా ఉండడక పోవడం అనేది పెద్ద సవాల్‌ గా నిలుస్తుందని శ్రీనివాసరావు అన్నారు.కరివేపాకు కోత కోసిన తర్వాత వెంటనే కానీ, నాలుగైదు రోజుల వరకు గానీ వర్షం కురవకూడదని శ్రీనివాసరావు చెప్పారు. పచ్చి మొద్దు మీద నీరు పడితే మొదలు కుళ్లిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఒకసారి కరివేపాకు విత్తు నాటిన తర్వాత.. వాతావరణం అనుకూలిస్తే.. 15 నుంచి 20 ఏళ్ల వరకు పంట దిగుబడి ఇస్తూనే ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. కోత కోసిన తర్వాత నాలుగైదు రోజులు ఎండకాస్తే.. మొదలు బిగుస్తుందని, దాంతో మొద్దు లోపలికి నీరు వెళ్లి, కుళ్లిపోయే ప్రమాదం తప్పుతుందని చెప్పారు. కోత కోసిన తర్వాత నాలుగు రోజు ఆగి కలుపు మందు కొట్టుకోవాలన్నారు.

కరివేపాకు నాణ్యంగా ఉంటే.. ధర కాస్త ఎక్కువే పలుకుతుందని, నాసిరకంగా ఉంటే.. దళారులు కొనేందుకు ముందుకు రారని శ్రీనివాసరావు అన్నారు. అందుకే సస్యరక్షణ చర్యలు జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here