సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి తెలిపారు. మార్చి 20 శనివారం శాసనమండలిలో ఎస్ సుభాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనను కేబినెట్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కూరగాయల వినియోగం 10,000 మెట్రిక్ టన్నులుగా ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో డిమాండ్‌ను తీర్చడానికి కూరగాయల ఉత్పత్తిని అదనంగా 17,500 మెట్రిక్ టన్నుల మేరకు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం 2.73 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రజలు 40 రకాల కూరగాయలను వినియోగిస్తున్నారనీ, వీటిలో 24 రకాలను రాష్ట్రంలో సాగు చేస్తుండగా, మిగిలినవి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయని ఆయన వివరించారు.
క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కలిగించడం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి సబ్సిడీపై నాణ్యమైన కూరగాయల విత్తనాలను సమకూర్చడం, ఉత్పాదకతను, నాణ్యమైన ఉత్పత్తిని పెంచడానికి మల్చింగ్ కోసం సబ్సిడీలను అందించడం వంటి చర్యల ద్వారా కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన శాఖకు రూ. 242 కోట్లు, కూరగాయల సాగును ప్రోత్సహించడానికి రూ. 50 కోట్లు కేటాయించిందని నిరంజన్ రెడ్డి వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here