గొర్రెల్లు, నాటుకోళ్లు, గిన్నికోళ్లు, బోడకాకర, బీర, కాకర, బంతి, బొప్పాయి, మామిడి, జామ, పనస, సీతాఫలం, యాపిల్‌, అంజూర, డ్రాగన్‌ ఫ్రూట్‌, దానిమ్మ, కొబ్బరి, అరటి, సీతాఫలం, వైట్‌ పుట్టగొడుగులు, వర్మీ కంపోస్ట్‌.. ఈ పేర్లన్నీ చెప్పుకోడానికో కారణం ఉంది. ఒక రైతు ఈ పంటలన్నింటినీ కేవలం ఒకటిన్నర ఎకరం నేలతో విజయవంతంగా పండిస్తున్నాడు. నెలకు సగటున రూ.30 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాడు. ఆ రైతు కథేంటో.. ఆయన కృషి ఏంటో.. ఖర్చు ఎంతో… లాభం ఎంతో.. ఆ రైతుల చేస్తున్న సాగు విధానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..ఒక రైతుకు ఒక ఆదాయమే మాత్రమే కాకుండా.. పలు అంచెల ఆదాయ విధానంతో లాభసాటి సేద్యం చేస్తున్న మన రైతు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా సిరిపురం గ్రామ వాసి శేషుకుమార్‌. ఒకటిన్నర ఎకరాల భూమిలో దాదాపు 50 రకాల పంటలు పండిస్తున్నారు. ఒక దాంట్లో నష్టం వచ్చినా.. మరో దాంట్లో కవర్ చేసుకోవడం ఆయన చేస్తున్న సమీకృత సాగు విధానంలో కీలకమైన అంశం. ఒక చిన్న సన్నకారు రైతు కేవలం ఎకరంనర భూమిలో ఎలా అభివృద్ధి సాధించవచ్చో నిరూపించేందుకు ఈ సమీకృత విధానంలో సాగుచేస్తున్నట్లు వెల్లడించారు.తమ పొలం చుట్టూ ముందుగా బోదె వేసి, 400 బోడకాకర మొక్కలు పెట్టినట్లు శేషుకుమార్‌ వెల్లడించారు. మూడు నెలల్లో రూ.90 వేల దాకా ఆదాయం వచ్చిందని చెప్పారు. మరో ఆరు అడుగుల దూరం మరో బోదె వేసి బోడకాకరకు అనుసంధానంగా 3 వేల బంతి మొక్కలు నాటారు. తర్వాత బీర, కాకర సాగు చేస్తే.. రూ. 20 వేలు వచ్చిందని, మధ్యలో రెండుసార్లు వేసిన బంతి నుంచి మరో రూ.20 వేలు ఆదాయం తీసుకున్నట్లు చెప్పారు.శేషుకుమార్‌ విధానంలో పొలంలో 15 నుంచి 20 సెట్లలో ఒక వెల్వేటెడ్‌ షెడ్‌ వేసుకోవాలి. ఆ షెడ్‌ లోపల పై అంచెలో గొర్రెలు లేదా మేకలు పెట్టుకోవాలి. దాని కింది అంచెలో నాటుకోళ్లు పెట్టుకోవాలి. గొర్రెలకు రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి.. వాటిని పై అంచెలో పెంచుకుంటే రోగాలు వాటికి రాకుండా నిరోధించుకోవచ్చు. వెల్వేటెడ్‌ షెడ్‌ వల్ల గొర్రెలకు వ్యాధులు సోకే అవకాశాలు తగ్గిపోతాయి. గొర్రెలు వేసిన పెంట, మూత్రం ఎప్పటికప్పడు కిందికి పోతుంది. కొద్దిగా ఊడ్చేస్తే.. గొర్రెలు ఉన్న అంచె ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. నాటుకోళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకే కింది అంచెలో స్వచ్ఛమైన నాటుకోళ్లు పెంచాలి. పైన గొర్రెలకు వేసి దాణాలో కొంత కింద పడుతుంది. ఆ దాణాతో పాటు కిందికి పడిన పురుగుల్ని నాటుకోళ్లు తింటాయి. వెల్వేటెడ్ షెడ్‌ వేసిన పలువురు రైతులు పైన గొర్రెలు, మేకల్ని పెట్టినా కింద అంచెను ఖాళీగా ఉంచేస్తారని శేషుకుమార్‌ చెప్పారు. అయితే.. తాను మాత్రం రెండు రకాలా ఆదాయం తీయాలనే ఉద్దేశంతో కింద నాటుకోళ్లు పెంచుతున్నట్లు వివరించారు. వెల్వేటెడ్‌ షెడ్ కోసం మనం పెట్టే పెట్టుబడి ఒకసారే ఉంటుంది. దాంట్లో ఒకే ఆదాయం కాకుండా రెండు రకాల ఆదాయం తీయడమే తన రెండు అంచెల విధానం అంటారు శేషుకుమార్‌.వెల్వేటెడ్ షెడ్‌ చుట్టూ పలు రకాల పళ్ల మొక్కలు వేసుకోవాలి. మొక్కలు పెరిగి పెద్దవయ్యాక షెడ్‌ కు రక్షణగా ఉంటాయని, వాటి నీడ వల్ల లోపల పెరిగే జీవాలను ఎండ వేడి తగలకుండా కాపాడుకోవచ్చు. గొర్రెలు, కోళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను ఆర్గానిక్‌ ఎరువు తయారు చేసుకుని మొక్కలకు వినియోగించుకోవచ్చని శేషుకుమార్ చెబుతున్నారు. అలా మొక్కల పెంపకానికి ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసం ఉండదంటున్నారు. షెడ్ చుట్టూ తాము 14 మామిడి, 12 జమచెట్లు, రెడ్ పనస, బొప్పాయి, జామ, సీతాఫలం లాంటి అనేక రకాల పండ్ల మొక్కల్సి పెంచుకోవచ్చు. మిగతా భూమిలో గడ్డి, కూరగాయలు కూడా శేషుకుమార్ పెంచుతున్నారు. షెడ్‌ లో పెంచే గొర్రెలకు దాణా బయటి నుంచి కొనక్కర్లేదు. గొర్రెల కోసం సూపర్ నేపియర్‌, హెడ్స్‌ లూసర్, జొన్న రకాలను పెంచుతున్నారు. కూరగాయలతో ప్రతిరోజూ ఆదాయం వస్తూనే ఉంటుంది.సమీకృత వ్యవసాయంలో భాగంగా శేషుకుమార్‌ ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ పంటల విధానంలో తెల్ల పుట్టగొడుల పెంపకం కూడా చేపట్టారు. వెల్వేటెడ్ షెడ్‌ లోనే కింద వర్మీ కంపోస్ట్‌ తయారీ కోసం వేసిన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఒక డార్క్‌ రూమ్‌ ఏర్పాటు చేసి దాంట్లో పుట్టగొడుగులు పెంచుతున్నారు. అది కూడా పలు యూట్యూబ్ చానల్స్ లో పరిశీలించి, ప్రత్యేకంగా డ్రమ్ములు తయారు చేయించారు. వాటి ద్వారా పుట్టగొడుగుల పెంపకాన్ని స్టీమింగ్ విధానంలో చేస్తున్నారు. పుట్టగొడుగులకు మార్కెట్‌ లో మంచి డిమాండ్ ఉంది. పుట్టగొడుగుల సాగు సక్సెస్‌ అయితే.. నెలకు 30 నుంచి 40 వేల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని శేషుకుమార్‌ చెబుతున్నారు.శేషుకుమార్‌ నిర్వహిస్తున్న వర్మీ కంపోస్ట్‌ యూనిట్‌ నుంచి తమ పొలంలో మొక్కలు, చెట్లకు ఎరువు వేస్తున్నారు. వర్మీ కంపోస్ట్‌ ఒక బస్తా 400 నుంచి 500 రూపాయల వరకు ఖర్చవుతుంది. తామే వర్మీకంపోస్ట్‌ తయారు చేసుకోవడం ద్వారా ఆ ఖర్చు లేకుండా డబ్బును ఆదా చేసుకోవచ్చన్నారు శేషుకుమార్‌. గొర్రెల పెంట, కోళ్ల నుంచి వచ్చే వ్యర్థాలతోనే వర్మీ కంపోస్ట్‌ తయారు చేసుకోవచ్చు. ఆర్గానిక్ విధానంలో తయారు చేసుకునే వర్మీ కంపోస్ట్‌ లో పోషక విలువలు బాగా ఎక్కువగా ఉంటాయని శేషుకుమార్‌ వివరించారు. వర్మీ కంపోస్ట్‌ ను జీవామృతంలో కలుపుకుని మొక్కలకు వేస్తే.. మరింత ఏపుగా.. ఆరోగ్యంగా ఎదుగుతాయి.వెలివేటెడ్‌ షెడ్, దాని చుట్టూ ఫెన్సింగ్‌, నెట్‌ అన్నింటి కోసం శేషుకుమార్‌ రూ.6 లక్షలు ఖర్చుపెట్టారు. చిన్న చిన్ప పాకలు వేసుకుని కూడా ఫార్మింగ్ చేయొచ్చని, అయితే.. కొద్దిగా ఖర్చు ఎక్కువైనా వెలివేటెడ్ షెడ్‌ వేసుకుంటే పైన, కింద కలిపి రెండు విధాల ఆదాయం వస్తుందన్నారు. వర్మీ కంపోస్ట్‌ యూనిట్లకు 80 వేలు అయిందన్నారు. పుట్టగొడుగుల యూనిట్‌ కు రూ.30 వేలు ఖర్చు చేసినట్లు శేషుకుమార్‌ తెలిపారు. ఒక వేళ గొర్రెల పెంపకం సరిగా కలిసి రాలేదంటే.. పైన కోళ్లు పెట్టుకుని, కింద చేపల పెంపకం చేసుకోవచ్చరు. పైన కోళ్లకు వేసిన దాని నుంచి కింద పడే దానా తిని, కోళ్లు వేసే రెట్టలు తిని చేపలు పెరుగుతాయన్నారు.మగ గొర్రెల కంటే ఆడగొర్రెల్ని పెంచితే ఆదాయం రెట్లకు రెట్లు పెరుగుతుంది. ఉదాహరణకు 50 గొర్రెల్సి పెంచుకుంటే.. వాటికి మరో 50 పిల్లలు పుడతాయి. ఆడగొర్రెల్ని పెంచితే ఒక ఏడాది వరకూ ఆదాయం రొటేషన్‌ కాదు. అయినప్పటికీ గొర్రెల సంఖ్య పెరగడం వల్ల ఏడాది తర్వాత ఆదాయం బాగా ఎక్కువ వస్తుంది. తమ పొలంలో సొంతంగా పెంచే గడ్డినే గొర్రెలకు దాణాగా ఇస్తున్నారు. బయటి నుంచి ఎలాంటా దాణా కొనే అవసరం రాలేదన్నారు. కానీ.. గొర్రెలకు ఎండిన దాణా వేయడం ఉత్తమం అంటున్నారు శేషుకుమార్‌. గొర్రె్ల్ని పెంచాలనుకుంటే.. ముందుగా కాస్త ఎక్కువ ఖరీదైనా కొంత పెద్దవైన గొర్రెల్ని తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు. మూడు నెలల దాకా తల్లి సంరక్షణలో ఉండే చిన్న పిల్లల్ని తీసుకోకూడదని అంటున్నారు.. పాలు తాగే దశలో ఉండే గొర్రెపిల్లకి ఆహారం వేసినా సరిగా తీసుకోలేదని, దాంతో గొర్రెపిల్లలో ప్రోటీన్లు తగ్గిపోయి, సరిగా ఎదగవని, చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. గొర్రెల ఫాం పెట్టాలనుకునే వారు మార్కెట్‌ నిలదొక్కుకునే వరకు కొంచెం పెద్ద గొర్రె పిల్లల్సి తెచ్చుకుంటేనే మంచిదన్నారు. గొర్రెల్ని తీసుకురాగానే ముందుగా వాటికి డీ వార్మింగ్‌ చేయించి, ఆ తర్వాత పీపీఆర్‌ అనే ఇంజెక్షన్‌ వేయిస్తానని శేషుకుమార్ తెలిపారు. తదుపరి రెండు మూడు రకాల వ్యాక్సిన్లు వేయిస్తే.. ఇబ్బందులు తలెత్తవన్నారు. నాటుకోళ్ల బయట తిరుతుగాయి కనుక వ్యాక్సిన్ల అవసరం అంతగా ఉండదన్నారు. వాటికి బెల్లం, వేపాకుతో కలిపిన నీళ్లు పోస్తామన్నారు.కొక్కెర, ఎప్పుడైనా వాటికి గంబూరా అనే వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వ్యాక్సిన్లు వేయిస్తే బాగుంటుందన్నారు.గొర్రెలు, కోళ్లు చనిపోకుండా ఉండాలంటే రైతులు చాలా జాగ్రత్తగా ఫామ్‌ ను చూసుకోవాలని శేషుకుమార్ సూచిస్తున్నారు. షెడ్‌ ఎప్పటికప్పడు శుభ్రం చేసుకోవాలన్నారు. బీరపాదులు, మామిడి, బొప్పాయిలకు పండు ఈగ బెడద ఉంటుందని, వాటి నివారణకు సోలార్‌ ట్రాప్స్‌, లింగాకర్షక బుట్టలు వాడుకోవాలన్నారు. ఒక వేళ పండు ఈగల బెడద మరీ ఎక్కువగా ఉంటే.. ఆవు మూత్రంలో వేపకషాయం కలిపి స్ప్రే చేస్తే.. ఎక్కువ రోజులు ఉండే వాటి ఘాటు వాసనకు పండు ఈగల రావన్నారు. పురుగుమందుల కన్నా గోమూత్రం- వేపకషాయం వాసన ఎక్కువ రోజులుంటుందని శేషుకుమార్‌ తెలిపారు.తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభం తీసుకోవడం అనేది సమీకృత వ్యవసాయ విధానంలో ముఖ్యమైన కారణం అని శేషుకుమార్‌ చెప్పారు. రైతు పంట పండించిన తర్వాత ముందుగా ఎదురయ్యేది మార్కెటింగ్ అన్నారు. అయితే.. ఏ పంట అయినా.. తక్కువ పరిమాణంలోనే ఉంటుంది కనుక స్థానికంగానే అమ్మకం అయిపోయే సౌలభ్యం ఉంటుందన్నారు. నాటుకోళ్లు కూడా 350 నుంచి 400 రూపాయలకు స్థానికంగానే సేల్‌ అయిపోతాయని చెప్పారు. సమీప ప్రాంతాల్లో జరిగే ఫంక్షన్లు, జాతర్ల కోసం గొర్రెల కోసం ఫామ్‌ వద్దకే వచ్చి కొనుక్కుని వెళ్తారని తెలిపారు. దీంతో సమీకృత వ్యవసాయ రైతుతు మార్కెటింగ్‌ చేయడం కష్టం కాబోదన్నారు. మిల్క్‌ మష్రూమ్‌ ఖరీదు ఎక్కువే ఉంటుంది కనుక రోజూ పది నుంచి 15 కిలో పుట్టగొడుగుల దిగుబడి తీయగలిగితే.. లాభం బాగా ఉంటుందన్నారు.

సమీకృత వ్యవసాయం ద్వారా తాము ఖర్చులన్నీ పోగా నెలకు కనీసం 30 వేల ఆదాయం తీస్తున్నట్లు శేషుకుమార్‌ వెల్లడించారు. అనేక రకాల ఆదాయ మార్గాలు లక్ష్యంగా తమ పొలంలో పలు పంటల్ని పండిస్తున్నందున నెలకు 60 నుంచి 70 వేల దాకా ఆదాయం సంపాదిస్తామనే నమ్మకాన్ని శేషుకుమార్‌ వ్యక్తం చేశారు. ఇంతవరకు నష్టం లేదని, చెట్ల నుంచి కూడా రెండు మూడేళ్లలో ఆదాయం మరింత పెరుగుతుందని సంతోషంగా చెప్పారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here