ఆరోగ్యం పట్ల ఇప్పుడు అందరిలోనూ అవగాహన బాగా పెరిగింది. సరి కొత్త శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల కారణంగా మనిషి జీవన ప్రమాణం, ఆయుఃప్రమాణం బాగానే పెరిగాయి. కొత్త తరాల ఉన్నత చదువుల వల్ల కిందిస్థాయి కుటుంబాలు ఆర్థికంగానూ అభివృద్ధి చెందాయి. అయితే.. విష రసాయనాలు వాడి పండించిన పంటలతో చేసిన వంటలు తినడంతో శరీరం రోగాలయంగా మారిపోయింది. చేసిన శ్రమ, సంపాదించిన డబ్బంతా ఆస్పత్రి ఖర్చులకే పెట్టాల్సి వస్తోంది. దీంతో ఇప్పుడు అందరిలోనూ ఆరోగ్యాభిలాష బాగా పెరిగింది. ఎలాంటి ఆహారం తినాలి? ఏయే పదార్థాల జోలికి వెళ్లొద్దనే విషయం సమాచార విప్లవం ఫలితంగా అందరి అరిచేతుల్లోకి మొబైల్‌ ఫోన్ల ద్వారా వచ్చేసింది.రసాయన ఎరువులు అస్సలు అవసరం లేని, చీడపీడల బాధలేని, పురుగు పుట్ర సమస్య లేని కేవలం పది రోజుల్లోనే మన చేతికి, నోటికి అందివచ్చే అసలు సిసలైన సహజసిద్ధ ఆరోగ్య పంట చిన్న మెంతికూర సాగు విధానం తెలుసుకుందాం. మెంతికూరతో పాటు అనేక రకాల ఆకు కూరల సాగులో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న రైతు నూల కోటయ్య మాటల్లో చిన్న మెంతికూర పంట పండించే విధానం తెలుసుకుందాం. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలంలోని చిన్నమాదారంలో కోటయ్య ఆకుకూరల సాగులో ఎంతో అనుభవం గడించాడు. సులువుగా ఆదాయం, లాభం కళ్ల జూస్తున్నాడు.చిన్న మెంతికూర సాగుచేసే చిన్న చిన్న మడులను ముందుగా నాలుగైదు సార్లు మెత్తగా దున్నుకోవాలని కోటయ్య చెబుతున్నాడు. మెంతి విత్తనాలను విత్తనాలు అమ్మే దుకాణాల్లో లభిస్తాయని కోటయ్య తెలిపాదు. మన వంటింట్లో ఉండే మెంతులు కొద్దిగా చిన్న సైజులో ఉంటాయని, సాగు కోసం వినియోగించే మెంతి విత్తనాలు కొద్దిగా పెద్దగా ఉంటాయన్నాడు. ఈ రెండింటి మధ్య తేడా గమనించాలన్నాడు. మెంతి విత్తనాలు కిలో 110 రూపాయలు ఉంటుందని చెప్పాడు. మెంతి విత్తనాలు మిగతా ఆకుకూరల విత్తనాల కన్నా రెట్టింపు చల్లుకోవాల్సి ఉంటుంది. మెంతి మొక్క కోతకు వచ్చినప్పుడు దగ్గర దగ్గరగా ఉంటేనే తీసుకోవడం సులువుగా ఉంటుంది. దూరం దూరంగా ఉంటే.. మొక్క వేరుతో సహా రాకుండా మధ్యలోకే తెగిపోతుందని కోటయ్య వివరించాడు.మడిలో చల్లిన మెంతి విత్తనాలపై అర అంగుళం మందంలో మెత్తని మట్టి కప్పాలని కోటయ్య తెలిపాడు. విత్తనాలు చల్లిన రోజే మడికి నీళ్లు పెట్టాలన్నాడు. మెంతి మొక్క కొద్ది కొద్దిగా భూమిపైకి వచ్చే సమయంలో నేలకు చిన్న చిన్న పగుళ్లు వస్తాయని, అప్పుడు మళ్లీ నీటిని మడి నిండా పెట్టాలని చెప్పాడు. అలా మూడు తడులు నీరు పెట్టేసరికే మెంతి మొక్క పూర్తిగా భూమి పైకి వచ్చేస్తుంది.

మెంతి పంటకు ఎరువుల అవసరమే ఉండదన్నాడు. భూమిని మాత్రం బాగా మెత్తగా దున్నుకుంటే సరిపోతుందని చెప్పాడు. చీడ పీడలు కూడా దీన్ని ఆశించవని చెప్పాడు. మెంతి మడులకు కాల్వ ద్వారానే నీరు అందించాలన్నాడు. డ్రిప్‌ విధానం మెంతి సాగుకు పనికిరాదన్నాడు. డ్రిప్‌ ద్వారా నీరు అందిస్తే.. మెంతిమొక్కలు కుళ్లిపోతాయని కోటయ్య పేర్కొన్నాడు.మెంతిఆకులు మనం తినే ప్రతి ఆహారంలోనూ వినియోగించుకోవచ్చని కోటయ్య అన్నాడు. అనారోగ్యం నుంచి కోలుకున్న వారు పత్యం కోసం మెంతికూర తినవచ్చని చెప్పాడు. కంటి చూపునకు కూడా మెంతికూర ఎంతో మేలు చేస్తుందన్నాడు.

మెంతికూర పంట సాగుకు చలికాలం మేలైనది. నవంబర్‌, డిసెంబర్ నుంచి మార్చి, ఏప్రిల్‌ వరకు అంటే దీపావళి నుంచి ఉగాది వరకు మెంతికూర పంటకు అనువైన కాలం అని, ఆ కాలంలో వేసుకుంటే ఏపుగా ఎదుగుతుందని కోటయ్య వివరించాడు. వర్షాకాలంలో మెంతికూర సాగు చేస్తే మొక్కలు కుళ్లిపోయి దిగుబడి తక్కువ వస్తుందన్నాడు. ఒకవేళ ఎండాకాలంలో కూడా మెంతిసాగు చేయాలంటే.. మడి మీద ఐదు అడుగుల ఎత్తులో నీడ పందిరి వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. మెంతిమొక్క ఎండను కూడా తట్టుకోలేదు.మెంతికూర 100 కట్టలకు పూర్తి సీజన్‌ లో అయితే.. 150 రూపాయల ధర రైతుకు వస్తుందని కోటయ్య తెలిపాడు. పంట తక్కువగా లభించే కాలంలో అయితే.. 200 రూపాయలు వస్తుందన్నాడు. మెంతికూర సాగులో విత్తనాలకు, దుక్కి దున్నడానికి ఓ నాలుగు వందలు, రైతు కష్టం కలుపుని మొత్తం ఐదారు వందలు ఖర్చయిందనుకుంటే.. వెయ్యి రూపాయలు పైనే ఆదాయం వస్తుంది. అదే దిగుబడి మరికొంత ఎక్కువైనప్పు వచ్చే లాభం అదనం అన్నాడు కోటయ్య. కేవలం పది రోజుల్లోనే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం రావడం మెంతికూర సాగులో సాధ్యం అవుతుంది.మెంతికూర ఎదిగిన తర్వాత వేళ్లతో సహా పీకేస్తాం కనుక ఒక్కసారే పంట వస్తుంది. మెంతిసాగు మంచిదే అయినా.. కేవలం దీనిపైనే ఆధారపడకూడదని కోటయ్య సూచించాడు. మిగతా ఆకు కూరలతో పాటుగా మెంతి సాగు చేస్తే.. పది రోజులకోసారి ఆదాయం వస్తుంది కాబట్టి తక్కువ వచ్చినా చేతిలో డబ్బులు నిత్యం ఉంటాయని అన్నాడు. తక్కవ రోజుల పంట కాబట్టి ఎక్కువ సార్లు పంట తీయొచ్చు. మెంతిసాగు ద్వారా నిత్యం ఆదాయం పొందవచ్చు. మెంతికూర పది రోజులయ్యే సరికి తప్పకుండా పీకేయాలన్నాడు. లేదంటే.. ముదిరిందని చెప్పి అందరూ ఇష్టపడరని, తద్వారా రేటు తక్కువయ్యే అవకాశం ఉందన్నాడు. మెంతి ఆకు లేతగా ఉన్నప్పుడే ఎక్కువ మంది ఇష్టపడతారని కోటయ్య వివరించాడు.చీడ పీడల బెడద ఉండని, ఎరువులు, పురుగు మందుల అవసరం లేని, నీటి వినియోగం తక్కువ ఉండే, పది రోజుల్లోనే ఆదాయం తెచ్చిపెట్టే మెంతి సాగు మేలైనదని కోటయ్య చెప్పాడు. తక్కువ ఖర్చుకు తక్కువ లాభం వచ్చినా సహజసిద్ధంగా పండించే మెంతిసాగు సులువైనది… మేలైనది.. మెరుగైనది. ఆరోగ్యాన్నిచేది మెంతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here