ప్రపంచ వ్యాప్తంగా కూరల్లో వాడుకునే కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంది. శాఖాహార కూరల కంటే మాంసాహార వంటల్లో కొత్తిమీర వాడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఘుమఘులాడే వంటల్లో కొత్తిమీర మరింత రుచిని చేరుస్తుందని చెప్పక తప్పదు.

కొత్తిమీరలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కొత్తిమీ ఆకులు, కాడల్లో పీచు పదార్థాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. కొత్తిమీరలో క్యలరీలు తక్కువ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో మనలో పేరుకున్న చెడు కొలెస్టరాల్‌ ను కొత్తిమీర తొలగిస్తుంది. కొత్తిమీరలో ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్పరస్‌, ఆక్సాలిక్‌ యాసిడ్లు, పొటాషియం, ఐరన్, సోడియం తదితరాలు ఉన్నాయి.మనిషికి ఎన్నెన్నో ప్రయోజనాలు చేకూర్చే కొత్తిమీర సాగు గురించి, పెట్టుబడి, ఆదాయం, మార్కెటింగ్‌, కష్ట సుఖాల గురించి తెలుసుకుందాం. తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలోనే ఆదాయం తెచ్చిపెట్టే సులువైనది కొత్తిమీర సాగు. ఏడాది పొడవునా ఏ కాలంలో అయినా కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. ప్రతి నిత్యం వంటల్లో వినియోగించే కొత్తిమీరకు మార్కెట్లో డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. వేసవి కాలంలో అయితే.. ధర ఎక్కువ పలుకుతుంద. దాంతో కొద్దిగా దిగుబడి తక్కువ వచ్చినా లాభమే కానీ నష్టం అనే మాటే ఉండదు.

అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలం ఆర్‌.కొత్తపల్లిలో రైతు వీరభద్రారెడ్డి చాలా ఏళ్లుగా అర ఎకరం భూమిలో కొత్తిమీర సాగుచేస్తూ.. లాభాలు గడిస్తున్నాడు. కొత్తిమీర సాగులో ఒకసారి సరైన లాభం లేకపోయినా.. లేదా నష్టం వచ్చినా దాన్ని మరికొద్ది రోజుల్లోనే మరో పంటలో కవర్ చేసుకోవచ్చంటున్నాడు. అర ఎకరం నేలతో కొత్తిమీర సాగు కోసం పెట్టే పెట్టుబడి తక్కువగానే ఉంటుంది కనుక నష్టం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం లేదంటున్నాడు. కొత్తిమీర సాగులో వీరభద్రారెడ్డి అనుభవాలు ఏమిటో తెలుసుకుందాం.ఏడాది పన్నెండు నెలలూ కొత్తిమీర సాగు చేసుకోవచ్చని ముందుగా వీరభద్రారెడ్డి చెప్పాడు. నల్లరేగడి, ఎర్రనేలలు ఇలా అన్ని నేలల్లోనూ  కొత్తిమీర సాగు చేయవచ్చంటున్నాడు వీరభద్రారెడ్డి. వర్షాకాలంలో పంట కొద్దిగా దెబ్బ తిన్నా మరి కొద్ది రోజుల్లోనే మరో పంట తీసుకోవచ్చు కనుక దాంట్లో లాస్‌ కవరయ్యే అవకాశం ఉంటుందంటున్నాడు.ముందుగా నేలను ఏడు మరకలు తోలి బాగా దుక్కి చేసుకుని, రొటావేటర్‌ వేయించి, కొత్తిమీర విత్తనాలు చల్లిన తర్వాత మళ్లీ రొటావేటర్‌ వేసుకోవాలని వీరభద్రరెడ్డి తెలిపాడు. దుక్కి దున్నేటపుడే అర ఎకరంలో 3 టన్నుల పశువుల ఎరువు, 20:20:0:13 అర బస్తా ఎరువు కూడా వేసుకుని. సింక్లర్‌ లాగించుకుంటే కొత్తిమీర మొలకలు బాగా వస్తాయని, ఏపుగా కూడా ఎదుగుతాయని చెప్పాడు. విత్తనాలను మడి అంతా సమానంగా పడేలా చల్లుకోవాలని తెలిపాడు. ఎక్కువ నేలలో కొత్తిమీర సాగు చేయాలనుకునే ఔత్సాహిక రైతులు అర ఎకరం చొప్పున విడతల వారీగా విత్తనాలు చల్లుకుంటే బాగుంటుందంటున్నాడు. అలా చేస్తే.. కొత్తిమీర పంట తీయడం, మార్కెట్‌ కు పంపి విక్రయించడం వీలుగా ఉంటుందని వీరభద్రారెడ్డి తెలిపాడు. కొత్తిమీర విత్తనాలు వేసినప్పటి నుంచి 35 రోజుల్లోనే పంట చేతికి వస్తుందని వెల్లడించాడు. కొత్తిమీర పంట తీసిన తర్వాత నేలను నెల రోజులు ఖాళీగా వదిలిపెట్టి మళ్లీ పంట వేసుకుంటే తదుపరి పంట దిగుబడి ఎక్కువగా వస్తుందన్నాడు.సోలార్‌ కంపెనీ కొత్తిమీర విత్తనాలు దుకాణంలో కొనుక్కొచ్చి పొలంలో చల్లుతామని వీరభద్రారెడ్డి వెల్లడించాడు. అర ఎకరంలో 10 కిలోల విత్తనాలు పడతాయని చెప్పాడు. కిలో విత్తనాలు సుమారు 400 రూపాయలు ఉంటుందని, అర ఎకరంలో కొత్తిమీర విత్తనాల కోసం 4 వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పాడు. విత్తనాలు చల్లి రొటావేటర్ వేసిన తర్వాత సిక్లయిర్లతో నీరు సరఫరా చేయాలన్నాడు. మామూలు విధానంలో నీటిని పారించినా ఇబ్బందేమి ఉండదన్నాడు. విత్తనాలు చల్లిన 8 రోజులకు మొలక వస్తుంది. మడికి నీటితడి పెట్టిన నాలుగు రోజులకు కలుపు మందు కొట్టాలని వీరభద్రారెడ్డి చెప్పాడు. మందు కొట్టిన 15 రోజుల వరకు మడిలో కలుపు రాదన్నాడు. ఆపైన ఒకటీ అరా కలుపుమొక్కలు కనిపిస్తే.. చేత్తోనే పీకేసుకోవాలని సూచించాడు. రోజు విడిచి రోజు కొత్తిమీర చేనులో నీటి తడి ఇవ్వాలన్నాడు. కొత్తిమీర సున్నితమైన పైరు కనుక రోజు విడిచి రోజు తప్పకుండా నీటితడి పెట్టాల్సి ఉంటుంది.కొత్తిమీర మొక్కలకు 20వ రోజులో ఓసారి అర ఎకరంలో అర కట్ట యూరియా, అర కట్ట 20:20:0:13 కు ఒక కిలో మాక్స్‌ కలిపి వేసుకోవాలని వీరభద్రారెడ్డి తెలిపాడు. మాక్స్‌ లో ఐరన్‌, జింక్‌ లాంటి పోషకాలు ఉంటాయి కనుక కొత్తిమీర ఆకులు ఎర్రగా పండుబారినట్లు, పాలిపోయినట్లు కాకుండా పచ్చగా తయారవుతాయని అన్నాడు.

కొత్తిమీర పంట 30, 32 రోజులకు కోతకు వస్తుందని, మరో మూడు రోజుల్లో మొత్తం కొత్తిమీర తీసేసుకోవాలని వెల్లడించాడు. కూలీలను పెట్టి మొత్తం ఒకేసారి పంట తీసుకుంటే.. ధర ఎక్కువ దొరికే బెంగళూరు, విజయవాడ, బళ్లారి లాంటి పెద్ద మార్కెట్లలో మంచి ధర పలుకుతుందన్నాడు. అర ఎకరానికి 15 మంది కూలీలను పెడితే ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోగా కొత్తిమీర పంట పీకడం పూర్తయిపోతుందన్నాడు. ఒక్కో ఆడ కూలీ 250, మగ కూలీ 300 రూపాయలు కూలి ఉంటుందని వీరభద్రారెడ్డి తెలిపాడు.కొత్తిమీరను పీకి కట్టలుగా కడతామని చెప్పాడు. స్థానికంగా అమ్మాలంటే చిన్న చిన్న కట్టలు కట్టి రబ్బర్‌ బ్యాండ్‌ వేస్తామని, దూరం మార్కెట్‌ కు పంపేటపుడు దారంతో పెద్ద కట్టలు కట్టుకోవాలన్నాడు. గిట్టుబాటు ధర ఉంటే దూర ప్రాంత మార్కెట్‌ కు తీసుకెళ్లినా నష్టం ఉండదన్నాడు. అర ఎకరంలో కొత్తిమీర దిగుబడి రెండు బొలేరో వాహనాల నిండా వస్తుందని, ఒక్కో బొలేరో వాహనానికి తమ ఊరి నుంచి బెంగళూరుకు 8 వేల రూపాయలు, విజయవాడకైతే.. 18 వేలు కిరాయి తీసుకుంటారన్నాడు. అర ఎకరం కన్నా తక్కువ నేలలో కొత్తిమీర సాగు చేస్తే.. కాస్త ధర తక్కువ ఉన్నా స్థానిక మార్కెట్లలోనే అమ్ముకోవాల్సి వస్తుందన్నాడు. పచ్చికూరకు ముందుగానే మార్కెట్ ధర నిర్ణయించే వీలుండదని, మార్కెట్‌ కు వెళ్లిన తర్వాతే అక్కడి డిమాండ్‌ ను బట్టి ధర ఉంటుందని వీరభద్రారెడ్డి వివరించాడు. బెంగళూరు మార్కెట్‌ లో కట్టకు 15 రూపాయలు దొరికితే చాలన్నాడు. పంట బాగా వచ్చినప్పడు అర ఎకరంలో 10 వేల కట్టలు వస్తాయన్నాడు. అప్పుడు లక్షా 50 వేల రూపాయలు ఆదాయం వస్తుందన్నాడు. తద్వారా ఒక పంట నుంచి నికర ఆదాయం 60 నుంచి 70 వేల రూపాయల దాకా వస్తుందన్నాడు. ఒక్కోసారి అర ఎకరంలో నికర ఆదాయం లక్షల రూపాయలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు.దుక్కిదున్నడం, పశువుల ఎరువులు, కొద్దిగా రసాయన ఎరువులు, పంట పీకేందుకు అవసరమైన కూలీల ఖర్చు అంతా కలిపి అర ఎకరానికి 15 నుంచి 20 వేల రూపాయల వరకు అవుతుందని వీరభద్రారెడ్డి వెల్లడించాడు. డిమాండ్ బాగా ఉంటే.. మార్కెట్‌ వ్యాపారులే పొలం వద్దకే వచ్చి కొత్తిమీర కొనుగోలు చేసి, తీసుకువెళ్తారు. వ్యాపారులు పొలం వద్దకు వచ్చినప్పుడు రవాణా ఖర్చు రైతుకు ఉండదన్నాడు. కేవలం మొక్కలు పీకించే కూలీల ఖర్చు మాత్రమే రైతు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.కొత్తిమీర సాగు కోసం పెట్టుబడి పెద్దగా ఉండదని, నెల రోజుల్లోనే మన డబ్బులు మనకు వచ్చేయడమే కాకుండా లాభం కూడా ఎక్కువగా ఉంటుంది. దిగుబడి తగ్గిన ఎండాకాలంలో ధర ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా లాభమే కాని నష్టం వచ్చే అవకాశం లేని కొత్తిమీర పంట సాగు చేసుకోవచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు. పంట పోతే పెట్టుబడి 15 వేలు పోతుందని, లాభం వచ్చినప్పుడు అర ఎకరం నుంచి 50 నుంచి 60 వేల దాకా నికర లాభం ఉంటుందని అంటున్నారు. ఒకవేళ నష్టం వచ్చినా మరో నెల రోజుల్లో చేతికి వచ్చే కొత్తిమీర దిగుబడితో లాభాలు కళ్లజూడవచ్చని పేర్కొంటున్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here