ప్రకృతి సేద్యం చేసే తెలుగు రాష్ట్రాల రైతాంగానికి శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర రావును గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత పదిహేనేళ్లుగా వెంకటేశ్వర రావుగారు ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి, విస్తృతికి కృషి చేస్తున్నారు. ఆయన విశిష్ట కృషికి గుర్తింపుగా ఆయనను 2019లో పద్మశ్రీ పురస్కారం కూడా వరించింది.
వెంకటేశ్వర రావుగారు అచ్చమైన భూమిపుత్రులు. ఆయన నిర్వహిస్తున్న ‘రైతునేస్తం’ మాస పత్రిక తెలుగు రైతులకు ప్రకృతి వ్యవసాయ మెళకువలను తెలియజేస్తూ రైతన్నలకు దిక్సూచిగా ఉంది. స్వయంగా సేంద్రియ వ్యవసాయం చేయడమే కాక, రైతుల కోసం నిరంతరం శిక్షణ తరగతులు నిర్వహిస్తూ యడ్లవల్లి వెంకటేశ్వర రావుగారు ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. భూసారం పెంచడం, ఎక్కువ దిగుబడిని సాధించడం, వ్యవసాయోత్పత్తులకు మార్కెట్ కల్పించడం వంటి అంశాలలో వెంకటేశ్వర రావుగారు విశేషమైన సేవలందిస్తున్నారు. 2016 ఫిబ్రవరి 28న రైతునేస్తం ఫౌండేషన్‌ను స్థాపించిన శ్రీ వెంకటేశ్వర రావు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల మీద వారం వారం రైతులకు రసాయన రహిత వ్యవసాయ విధానాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర రావు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో 1968లో జన్మించారు. పుట్టింది రైతు కుటుంబంలో కాబట్టి వ్యవసాయంలో రైతు పడే బాధలను, కడగండ్లను ఆయన దగ్గరి నుండి చూశారు. కామర్స్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ ఆయన తనకెంతో ఇష్టమైన వ్యవసాయంవైపు మళ్లారు. మొదట్లో చాలామంది వ్యవసాయం నష్టదాయకమంటూ ఆయనను వారించారు. వ్యవసాయం ఎంచుకుంటే కష్టాలు తప్పవన్నారు. వ్యవసాయం నష్టదాయకమై రైతులు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారని హితైషులు హెచ్చరించారు. కానీ వెంకటేశ్వర రావు ఒక రైతుబిడ్డగా సేద్యంవైపే అడుగులు వేశారు. గో ఆధారిత వ్యవసాయం ఆయనను ఆకర్షించింది. ప్రకృతి వ్యవసాయమే రైతుల కష్టాలను తీర్చే మార్గమని ఆయన నమ్మారు. జీవామృతంతో భూసారాన్ని పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాన్ని ఆయన తొలినాళ్లలో తెలుగునాట అమలు చేసి విజయం సాధించారు. పర్యావరణ హిత ప్రకృతి వ్యవసాయం పంట దిగుబడిని పెంచి రైతుకు స్వావలంబన చేకూర్చుతుందని ఆయన నిరూపించారు. రైతులను ప్రకృతి వ్యవసాయం చేపట్టమని ఆయన ప్రోత్సహించారు. తన పత్రిక ద్వారా ప్రచారం చేశారు. మెళకువలు చెప్పారు. సేంద్రియ వ్యవసాయంలో అనేక ప్రయోగాలు చేసి శ్రీ వెంకటేశ్వర రావు సఫలత సాధించారు.
ఇటీవల గుంటూరు జిల్లా పుల్లడిగుంట వద్ద కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రం వద్ద నల్లరేగడి భూమిలో ఆయన పది ఎకరాల్లో ఐదు రకాల సిరిధాన్యాలను సాగు చేశారు. ఘనజీవామృతం, ద్రవజీవామృతం సాయంతో వర్షాధారంగానే ఈ సాగు సాగింది. ఎకరానికి 7.5 క్వింటాళ్ల సామల దిగుబడి వచ్చింది. కొర్రలు, ఊదల కంకులు చాలా పెద్దవిగా పెరిగాయి. ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడిదాకా వచ్చింది. మెట్ట రైతులకు సిరిధాన్య పంటలు వరప్రసాదాలని గుర్తించిన వెంకటేశ్వర రావుగారు ఆ పంటలకు సంబంధించి రైతులకు శిక్షణనివ్వడం మొదలుపెట్టారు. బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, నీమాస్ర్తం, బ్రహ్మాస్త్రం, అగ్నిఅస్త్రం, శొంఠిపాల కషాయం వంటి సేంద్రియ ఎరువులను, పురుగుమందులను తయారు చేయడమెలాగో ఆయన ఆయా పంటల రైతులకు నేర్పుతారు.
ప్రకృతి వ్యవసాయంపై ప్రచారం
సంచార వాహనం ద్వారా గుంటూరు జిల్లాలోని గ్రామాలలో ఆడియో, వీడియో ద్వారా ప్రకృతి వ్యవసాయంపై ఆయన అవగాహన కల్పిస్తుంటారు. జానపద కళారూపాలతో ప్రకృతి సేద్యానికి సంబంధించిన మెళకువలు ప్రచారం చేస్తుంటారు. అలా ఇప్పటిదాకా లక్ష మందిదాకా రైతులకు ఆయన ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడం విశేషం. రైతులు తమ ప్రకృతి వ్యవసాయం పంటలను మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక యాప్‌ను కూడా ఆయన రూపొందించారు.
ఏటా ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఐ.వి.సుబ్బారావు గారి పేరిట ఆయన వ్యవసాయరంగంలో కృషి చేసినవారికి రైతునేస్తం పురస్కారాలు అందిస్తుంటారు. 2020 డిసెంబర్ 16న హైదరాబాద్‌లో.. స్వర్ణభారత్ ట్రస్టుతో కలిసి రైతునేస్తం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఉప రాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.
రైతుల కోసం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై శ్రీ వెంకటేశ్వర రావు పుస్తకాల రూపంలో విలువైన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆయన USA, UK, జర్మనీ, ఇటలీ, సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర దేశాల్లో పర్యటించి అక్కడి వ్యవసాయ విధానాలను ఆకళింపు చేసుకున్నారు. నిత్యం నిద్ర నుండి మేల్కొనగానే ఆయన పచ్చదనాన్ని చూసేందుకు ఇష్టపడతారు. వెంకటేశ్వర రావుగారి సతీమణి కూడా అగ్రికల్చరిస్ట్ కావడం విశేషం. కుమారుడు అమెరికాలో ఎంఎస్ పూర్తి చేయగా కుమార్తె మెడిసిన్ చేస్తున్నారు.
నగరాల్లో ప్రకృతి సేద్యం పద్ధతిలో మిద్దెపంటలు (terrace gardening) వేసుకోవాలనీ, వాటి ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందనీ, కొత్త తరాలకు వ్యవసాయంపై అవగాహన కూడా కలుగుతుందనీ ఆయన సూచిస్తారు. వ్యవసాయదారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలనీ, అందుకు సంబంధించిన యంత్ర సామగ్రిని సమకూర్చేందుకు దాతలు ఉదారంగా ముందుకురావాలనీ వెంకటేశ్వర రావుగారు పిలుపునిస్తారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి తెలుగునాట చుక్కానిగా నిలిచిన శ్రీ వెంకటేశ్వర రావుగారికి రైతాంగం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.