ప్రకృతి వ్యవసాయం రైతులనే కాకుండా విభిన్నవర్గాలవారిని కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. దీనికి డాక్టర్ చెన్నమనేని పద్మ ఒక ఉదాహరణ. ఆమె హైదరాబాద్‌లోని సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయంలో ఒక అసోసియేట్ ప్రొఫెసర్. తను బోధించే సబ్జక్టు తెలుగు సాహిత్యం అయినప్పటికీ డాక్టర్ పద్మ అంతకంటే ఎక్కువగా ప్రకృతి వ్యవసాయ విధానం విశిష్టతను పదుగురికీ చెబుతుంటారు. నేటి తరం తింటున్నది సరైన ఆహారం కాదంటారు డాక్టర్ పద్మ. “మీరు తినే ఆహారమే మీరు” అన్నది ఆమె సిద్ధాంతం. (పై ఫోటోలో గొడుగుతో ఉన్నవారు డాక్టర్ పద్మ)
2018 డిసెంబర్‌‌లో ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు ఆమె గుంటూరుతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో పర్యటించారు. ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో తెలుసుకోవడంతోనే తన ఆర్తి తీరలేదు. దాని విశిష్టతని బోధించాలని కూడా డాక్టర్ పద్మ నిర్ణయించుకున్నారు. గుంటూరులో జీరో బడ్జెట్ వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ నిర్వహించిన 20 రోజుల వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొన్నారు. పాలేకర్ వ్యవసాయ పద్ధతులతో ఆమె విశేషంగా ప్రభావితమయ్యారు.
గుంటూరు నుండి తిరిగి వచ్చాక ఆమె తమ ఇంటి టెర్రాస్‌పై 2,200 చదరపు అడుగుల స్థలంలో అన్ని రకాలైన కూరగాయలు పండించడం మొదలుపెట్టారు. పాలేకర్ పద్ధతిలో మిద్దెపంట వేసిన తర్వాత 2019లో ఆమె ఇక బజారుకెళ్లి కూరగాయలు కొనిందే లేదు. తన ప్రయత్నం సఫలమవటంలో డాక్టర్ పద్మ ప్రకృతి వ్యవసాయంపై ఔత్సాహికులకు అవగాహన కల్పించేందుకు పూనుకున్నారు. ‘సేవాభారతి’ కోసం ఆమె ఒక వర్క్‌షాప్‌ కూడా నిర్వహించారు. సుమారు 200 మందికి ఉచితంగా కూరగాయల విత్తనాలను అందించారు.కాలేజీలో తన విద్యార్థులకు కూడా ప్రకృతి వ్యవసాయం విశిష్టతను ఆమె తెలియజెప్పడం మొదలుపెట్టారు. (తెలంగాణ) జగిత్యాల జిల్లాలోని తమ సొంతూళ్లో డాక్టర్ పద్మకు కొంత భూమి ఉంది. ప్రకృతి వ్యవసాయంపై అక్కడ ఆమె ప్రాక్టికల్‌గా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం మొదలుపెట్టారు. నిరుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పద్మ తన విద్యార్థినులను బృందాలుగా తీసుకువెళ్లి పొలం పనులు నేర్పారు. ఇలా జరిపే ప్రతి ప్రత్యక్ష అధ్యయనం పదేసి రోజుల పాటు కొనసాగుతుంది. వారందరికీ అక్కడే ఉచితంగా వసతి, భోజనం కల్పిస్తారు.
మొదట అసలు ఎలాంటి నేలలను వ్యవసాయానికి ఎంచుకోవాలో ఆమె చూపిస్తారు. ఆ తర్వాత ఆర్గానిక్ మెన్యూర్‌ను ఎలా భూమిలో వేయాలో నేర్పుతారు. సొంతంగా సేంద్రియ ఎరువును ఎలా తయారు చేసుకోవాలో డాక్టర్ పద్మ వారికి చెబుతారు. ప్రకృతికి హానికరంకాని ఎరువులను, పురుగుమందులను ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు ఆమె చూపుతారు. విత్తనాల బంతులను తయారు చేయడం కూడా ఆమె వారికి నేర్పించారు. డాక్టర్ పద్మ నిర్వహించిన కార్యగోష్ఠుల వల్ల వందలాది మంది విద్యార్థినులు సేంద్రియ వ్యవసాయం మెళకులను గ్రహించారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏది ఆరోగ్యకరమో వారికిప్పుడు తెలిసింది. అంతేకాదు, డాక్టర్ పద్మ స్ఫూర్తితో ఒకరిద్దరు సొంతంగా నర్సరీలను కూడా ఏర్పాటు చేసుకోవడం విశేషం.
కుటుంబంలో స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుందనీ, అందుకే వారిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాననీ డాక్టర్ పద్మ చెబుతారు. రసాయన ఎరువుల వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా అది పర్యావరణాన్ని నాశనం చేస్తుందని ఆమె అంటారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి కోతను నివారించవచ్చుననీ, నేలలో నీటిని పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచవచ్చనీ ఆమె వివరిస్తారు.

ప్రకృతి వసాయం అధ్యయనం ద్వారా తనకు లభించిన అనుభవ జ్ఞానాన్ని ఇలా పదుగురితో పంచుకుని, ఇతరులకు అవగాహన కల్పించడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని డాక్టర్ పద్మ సంతృప్తిగా చెబుతారు. విద్యార్థినులను నేరుగా పంటచేలకు తీసుకువెళ్లడం, వారికి ప్రకృతి వ్యవసాయంలోని మెళకువలను తెలియజెప్పడం, ప్రత్యక్షంగా వారంతటవారే ప్రకృతి వ్యవసాయం నేర్చుకునేలా చేయడం డాక్టర్ పద్మ (54) శిక్షణలోని ప్రత్యేకత. సినిమా సంగతులు, ఫ్యాషన్ కబుర్లలో  కొట్టుకుపోకుండా కొత్తతరం అమ్మాయిలను ఇలా నేలతల్లికి ప్రణమిల్లేలా చేస్తున్న డాక్టర్ పద్మ అభినందనీయురాలు. (డాక్టర్ పద్మ ప్రకృతి వ్యవసాయ శిక్షణలో పాల్గొన్న విద్యార్థులను పై ఫోటోల్లో చూడవచ్చు)

  • Seema Rajpal 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here