‘ఈ రోజు నువ్వు అన్నం తింటున్నావంటే.. రైతన్నకు కృతజ్ఞతలు చెప్పితీరాల్సిందే’ ఇది సీసీడీ సంస్థ ప్రధాన నినాదం. ‘కలిసి వ్యవసాయం చేసుకుంటే కలదు లాభం’ అనేది దీని ముఖ్య ఉద్దేశం. గ్రామీణ స్థాయిలో చిన్న సన్నకారు రైతులతో రైతు సహకార సంఘాలను, జిల్లా స్థాయిలో ఫెడరేషన్‌ ఆఫ్‌ గ్రూప్స్‌ ఆఫ్ కో ఆపరేటివ్స్‌ సీసీడీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తోంది. సీసీడీ సోదర సంస్థ ఫార్మ్‌ వేద రైతులకు లాభాలు తెచ్చిపెట్టే సంస్థ. రైతుల నుంచి తాజా ఉత్పత్తులు తీసుకుని వాటిని ఆకర్షణీయమైన ప్యాకేజ్డ్‌ ఆహార ఉత్పత్తులుగా రూపొందిస్తుంది. ఈ రెండు సంస్థలను డాక్టర్‌ త్రిలోచన్ శాస్త్రి 2003 స్థాపించారు. 2005 నుంచి ఈ ఎన్జీఓ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫార్మ్‌ వేద 2016లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ లోని అనంతపురం జిల్లా మక్కాజిపల్లెకు చెందిన త్రిలోచన్ శాస్త్రి బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మేనేజ్‌ మెంట్‌ (ఐఐఎం-బీ) డీన్‌.సెంటర్ ఫర్‌ కలెక్టివ్‌ డెవలప్‌ మెంట్‌.. (సీసీడీ). హైదరాబాద్‌ కేంద్రంగా 2003లో ఏర్పాటైంది. చిన్న సన్నకారు రైతుల జీవితాల్లో విప్లవాత్మకమైన వెలుగులు నింపుతున్న ఎన్జీఓ సంస్థ ఇది. చిన్న సన్నకారు రైతులు పంట సాగులో ఖర్చు తగ్గేంచుకునేలా, ఆదాయం పెంచుకునేలా సీసీడీ తోడ్పడుతుంది. రైతు పండించే పంటలను ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ గా మార్కెటింగ్‌ చేసి వారికి సీసీడీ సోదర సంస్థ ‘ఫార్మ్‌ ప్రెన్యూర్‌’ సహాయం చేస్తుంది.

ఎంతో ఉత్సాహంతో రైతులు భాగస్వాములు కావడం సీసీడీ, ఫార్మ్‌ వేద సంస్థలకు బలం. డాక్టర్ శాస్త్రి అంకితభావంతో చేసే కృషి ఈ రెండు సంస్థలకు మూలస్తంభం అని చెప్పొచ్చు. చిన్న చిన్న రైతుల త్యాగాలే తమ సంస్థల విజయానికి ప్రధానం కారణం అని చెప్పడం డాక్టర్ శాస్త్రిలోని నిరాడంబరతకు నిదర్శనం. తమ సంస్థల అభివృద్ధికి రైతుల సామూహిక కృషే మూలం అంటారు. తమ సంస్థ సభ్యులైన రైతుల్లో సవాళ్లను ప్రేమించే గుణం ఉందని, అదే వారికి మంచి గౌరవం తెచ్చిపెడుతోందని డాక్టర్ శాస్త్రి సంతోషంతో వివరించారు.42 వేల మంది చిన్న సన్నకారు రైతులతో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించడానికి బీజం పడిన ఆలోచన గురించి డాక్టర్ త్రిలోచన్ శాస్త్రి వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రం ఆనంద్‌ జిల్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌ మెంట్‌ ఆనంద్‌ (ఐఆర్‌ఎంఏ) మాజీ డైరెక్టర్‌ డాక్టర్ తుషార్‌ షా రాసిన ‘కేటలైజింగ్ కో ఆపరేషన్‌’ పుస్తకం తనను బాగా ప్రభావితం చేసిందంటారు. ఆ పుస్తకంలోని ఆలోచన తనకు బాగా నచ్చిందంటారు శాస్త్రి. పాడి రంగమే కాకుండా ఇతర రంగాల్లోనూ రైతుల సహకార వ్యవస్థను ఏర్పాటు చేయొచ్చనే ఆలోచన ఆ పుస్తకం తర్వాతే తనకు వచ్చిందని చెప్పారు.

ఏడాది పాటు తాను క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయం చేశానని, అభివృద్ధి రంగంలో పనిచేస్తున్న పలువురిని స్వయంగా కలుసుకుని విషయాలు తెలుసుకున్నానని డాక్టర్ శాస్త్రి వెల్లడించారు. ఆ తర్వాత చిన్న రైతుల కోసం సీసీడీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రైతుల్లో సామూహిక ‘ఉత్పత్తి- విక్రయం’, ప్రాసెసింగ్‌, మార్కెట్‌ లింక్స్‌ అలాగే స్థిరమైన వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు సీసీడీ అవగాహన కలిగిస్తుంది. సీసీడీ కృషితో రైతుల్లో స్వావలంబన కలిగింది. దీంతో రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపై సన్న చిన్నకారు రైతులకు ఆసక్తి సన్నగిల్లింది. సీసీడీ భాగస్వామ్య రైతులు ఏదీ ఉచితంగా తీసుకోరు. ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో రైతుల కోసం. రైతులే.. రైతులతో చేసుకోవడం సీసీడీ విధానం అని డాక్టర్ శాస్త్రి వివరించారు.మన దేశంలోని చిన్న సన్నకారు రైతులు పంటల సాగులో, వాటిని మార్కెటింగ్‌ చేసుకోవడంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. తమకు రావాల్సిన లాభాల్లో ఎక్కువ శాతంతో తమ జేబులు నింపుకుంటున్న మధ్య దళారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడడం రైతులకు అతి పెద్ద సవాల్‌. పంట చేతికి రాక ముందే దళారులు దాని ధర నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఒక రైతు తన పొలంలో 100 బస్తాల వేరుశెనగ పండించాడనుకుంటే.. దళారి ముందే దాని ధర నిర్ణయించేస్తాడు. దీంతో కేవలం 70 బస్తాలకు మాత్రమే రైతు చేతికి డబ్బు అందుతుంది. అంటే 30 బస్తాల ఆదాయం చిన్న రైతుకు దక్కడం లేదన్నమాట. సన్నకారు రైతులను ఇలాంటి దౌర్భాగ్యకర పరిస్థితుల నుండి బయట పడేయాలనే సదాశయంతోనే సీసీడీని ఏర్పాటు చేసినట్లు డాక్టర్‌ త్రిలోచన్‌ శాస్త్రి వివరించారు.

వంద కోట్ల రూపాయల మూలధనంతో సీసీడీ ఏర్పాటైంది. స్థానిక మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం ఎలా జరుగుతోందో ముందుగా సీసీడీ అధ్యయనం చేసింది. ప్రారంభంలో వంద కోట్లతో మొదలైన సీసీడీ టర్నోవర్‌ ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు రూ.45 కోట్లకు చేరుకుందని డాక్టర్ శాస్త్రి సంతోషంగా వెల్లడించారు. ప్రస్తుతం సీసీడీ ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. సీసీడీ ప్రోత్సాహంతో 1,098 గ్రామాల నుంచి 547 సహకార సంఘాల్లో 42,064 మంది రైతులు సభ్యులుగా చేరారు. వారిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ లోనే 28 వేల మందికి పైగా సన్న చిన్నకారు రైతులు సభ్యులుగా ఉండడం విశేషం. సీసీడీ సంస్థ సభ్యులైన రైతులు ప్రధానంగా మామిడి, ఆవాలు, ధాన్యం, వేరుశెనగ, పత్తి, సోయాబీన్, కంది, మినప, పెసర, సెనగ పంటలు పండిస్తుంటారు.రైతులు పండించిన పంటలను కలిసికట్టుగా అమ్ముకునేలా సహకార సంఘాలు తోడ్పడతాయి. దీంతో రైతు పంట దిగుబడులకు ఎక్కువ ధర వస్తుంది. కలిసి వ్యవసాయం చేసుకుంటే రైతులు ఎరువులు, విత్తనాలకు అయ్యే ఖర్చు కూడా తగ్గించుకునే వీలుంది. దీంతో రైతులు తమ లాభాలు 50 శాతం పెంచుకోగలుగుతారని డాక్టర్ శాస్త్రి వివరించారు.

అనంతపురం జిల్లా కొత్తూరు సన్నకారు రైతు జే.రామలింగప్ప తన ఐదెకరాల్లో వేరుశెనగ, పెసర, కంది, టమాటా పంటలు పండిస్తాడు. రామలింగప్ప కుటుంబంలోని ఐదుగురు పొలంలో కష్టపడి పనిచేస్తారు. సీసీడీ సంస్థలో చేరక ముందు పంట ఉత్పత్తులను విక్రయించాలంటే అనేక కష్టాలు ఎదురయ్యేవని చెప్పాడు. ఇప్పడు అలాంటి ఇబ్బంది లేదని తెలిపాడు. తాము స్వయంగా పంట ఉత్పత్తులను మార్కెట్‌ కు తీసుకెళ్లినప్పుడు వ్యాపారులు తూకాలు సరిగా తూయకుండా మోసం చేసేవారు. సీసీడీ సభ్యుడైన తర్వాత వారి ఆటలు సాగడం లేదని, తమ పంట నాణ్యతను బట్టి ధర వస్తోందని రామలింగప్ప హర్షం వ్యక్తం చేశాడు. సత్యసాయి ఫార్మర్స్‌ ఫెడరేషన్‌ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు.

మార్కెట్‌ లో ధరల హెచ్చుతగ్గుల కారణంగా రైతులకు ఎలాంటి నష్టం లేకుండా సహకార సంస్థలు దారిచూపిస్తాయి. రైతు ఉత్పత్తులకు సకాలంలో డబ్బులు వచ్చేలా తోడ్పడుతాయి. దీంతో రైతులకు అప్పుల ఒత్తిడి తొలగిపోతుంది. వచ్చే లాభాలన్నీ ఆయా సహకార సంఘాలకు, రైతులకే దక్కుతాయి. అయితే.. ఇలాంటి సేవలకు గాను సీసీడీ ఎలాంటి రుసుమును వసూలు చేయదని శాస్త్రి స్పష్టం చేశారు. సహకార సంఘాల్లో చేరిన రైతుల ఉత్పత్తుల విక్రయానికి పెద్ద పెద్ద వ్యాపారులతో సీసీడీ అనుసంధానం చేస్తుంది. మైయాస్‌, రిలయెన్స్‌, మెట్రో క్యాష్‌ అండ్ క్యారీ, ఓర్కే, హెరిటేజ్‌ రిటైల్, డీమార్ట్‌, నీలగిరీస్‌, సేఫ్ హార్వెస్ట్‌, గ్రీన్‌ ఆగ్రో ఫ్రెష్ ఎక్స్ పోర్ట్స్‌, శ్రీని ఫుడ్ పార్క్‌ లాంటి పెద్ద సంస్థలతో రైతులకు అనుసంధానం కల్పిస్తుంది.రైతులే సొంతంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే.. వారికి మరింత ఎక్కువ లాభాలు వస్తాయని డాక్టర్ శాస్త్రి చెప్పారు. సొంతంగా ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టుకోవాలనుకునే రైతులను సీసీడీ ప్రోత్సహిస్తుందని అన్నారు. సీసీడీకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లోని అనంతపురంలో ఒక ప్రాసెసింగ్ యూనిట్‌, చిత్తూరులో మూడు యూనిట్లు, తెలంగాణలోని ఆదిలాద్‌ లో మరో యూనిట్‌ నిర్వహిస్తోంది. త్వరలోనే అనంతపురంలో, మహారాష్ట్రలోని యావత్మాల్‌ లో కొత్త యూనిట్లు ప్రారంభిస్తామని డాక్టర్ త్రిలోచన్ శాస్త్రి వెల్లడించారు. రైతుల నుంచి నేరుగా ఉత్పత్తులు కొనుగోలు చేసి, నేరుగా వినియోగదారులకు విక్రయించడం తమ సహకార సంస్థ ముఖ్య ఉద్దేశం అని డాక్టర్‌ శాస్త్రి తెలిపారు. ఈ విధానం వల్ల రైతుకు, వినియోగారుడికీ లాభం అన్నారు. తమ సంస్థ ఏడాది పొడవునా సాధించిన లాభాలను సభ్యులకు ఏడాది చివరిలో పంచిపెడతామని డాక్టర్ శాస్త్రి చెప్పారు. సన్న చిన్నకారు రైతుల అభ్యుదయానికి సీసీడీ సంస్థ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 2021లో జీఎన్‌ఈ (గ్లోబల్‌ ఎన్జీఓ ఎక్స్ పో) అవార్డు అందుకుంది.

ఫార్మ్‌ వేద అనేది రైతుల సొంత బ్రాండ్‌. రైతు ఉత్పత్తుల నుంచి ఇడ్లీ, దోశ మిక్స్‌, మసాలా దినుసులు, వేరుశెనగ చిక్కీ, వెన్న, గానుగ నూనె లాంటి అనేక ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఈ ఉత్పత్తులన్నీ జన్యుపరంగా మార్పు చేయని, సహజసిద్ధమైన పంటల నుంచే ఫార్మ్‌ వేద సంస్థ తయారు చేస్తుంది. ఉత్పత్తులను ప్రాసెస్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండడం కోసం ఎలాంటి రసాయన పదార్థాలు వినియోగించదని డాక్టర్ శాస్త్రి వివరించారు. ఫార్మ్‌ వేదలో ఇప్పుడు 30 వేల మంది వరకు రైతులు సభ్యులుగా ఉన్నారు. వారిలో అధికశాతం మంది మహిళలే ఉండడం విశేషం. పొట్ట చేతబట్టుకుని పట్టణాలకు వలస వెళ్లే ఎందరికో ఫార్మ్‌ వేద సంస్థ ఉపాధి కల్పిస్తోంది. యువత పెద్దమొత్తంలో వ్యవసాయం చేయడంలో ఫార్మ్ వేద ప్రోత్సాహం అందిస్తుంది. సీసీడీ, ఫార్మ్‌ వేద సంస్థలు రెండూ ఆర్గానిక్‌, సహజసిద్ధ వ్యవసాయం లాంటి పర్యావరణ హితమైన పంటలను ప్రోత్సహిస్తున్నాయి. ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులు ప్రస్తుతం 10 శాతం మంది మాత్రమే ఉన్నారని, అలాంటి రైతులు మరింత అధికంగా ముందుకు రావాలని సీసీడీ ఆకాంక్షిస్తోంది.

ఆర్గానిక్‌ ఫెర్టిలైజర్ తయారీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. రసాయనాలతో చేసే వ్యవసాయానికి అయ్యే ఖర్చులో సగంతోనే ఆర్గానిక్‌ విధానంలో పంటలు పండించవచ్చని, ఈ పద్ధతిలో నీటి వినియోగం బాగా తగ్గిపోతుందని డాక్టర్ త్రిలోచన్ శాస్త్రి వివరించారు. ఆర్గానిక్ ఫార్మింగ్‌ లో గ్రామీణుల్లో అవగాణ కల్పించేందుకు ప్రదర్శనలు ఏర్పాటు చేయడం సహా పలు విధాలుగా రైతులను సహజసిద్ధ వ్యవసాయం చేసేందుకు కృషి చేస్తోంది.అందుకే సహకార సంఘాల పద్ధతిలో రైతులు సామూహికంగా పంటలు పండించుకుంటే.. వాటిని కలిసికట్టుగా పెద్ద పెద్ద సంస్థలకు విక్రయించుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుంది. అందరికీ అన్నం పెట్టే రైతన్న వెన్నుముక అప్పులు, ఖర్చుల భారంతో వంగిపోదని ప్రతి రైతు తెలుసుకుంటే మేలు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here