లవంగం.. సుగంధ ద్రవ్యాలలో ఒకటి అని చాలా మందికి తెలుసు. లవంగాలు ఉండని వంటిల్లు ఉండదనే చెప్పుకోవచ్చు. లవంగాల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వంటల్లో రుచిని పెంచడమే కాకుండా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని లవంగాలు పెంచుతాయి. నోటిలోని చిగుళ్లకు ఇన్ఫెక్షన్‌ కలిగించే పీరియాంటల్‌ పాథోజెన్స్‌ లాంటి బ్యాక్టీరియాను లవంగం నాశనం చేస్తుంది. పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. లవంగాలను కాస్మొటిక్స్‌ తయారీలో, ఫార్మాస్యూటికల్స్ లో, వ్యవసాయ ఉత్పత్తులలో బాగా వినియోగిస్తారు. కడుపులో సూక్ష్మజీవుల నుంచి, హాని కలిగించే క్రిముల నుంచి లవంగం రక్షిస్తుంది.సూక్ష్మజీవులు, క్రిములను లవంగం నివారిస్తుందనే కీలక విషయం తీసుకుంటే.. మొక్కలను ఆశించే క్రిమి, కీటకాల నివారణలో మాత్రం ఎందుకు పనిచేయదనే ప్రశ్న ఎవరికైనా రావచ్చు. ఈ పాయింట్‌ మీదే శ్రేష్ట గార్డెన్‌ యజమాని సంపూర్ణ కాస్త భిన్నంగా ఆలోచించారు. లవంగాలు, నీటితో పవర్ ఫుల్‌ క్రిమసంహారకాన్ని తయారు చేశారు. తమ మిద్దెతోటలోనే పూలు, పండ్లు, కూరగాయల మొక్కలను ఆశించే క్రిమి కీటకాలను విజయవంతంగా తరిమికొట్టారు. తమ మొక్కలపై చీమలు, మిల్లిబగ్స్ లాంటి వాటిని సక్సెస్ ఫుల్‌ గా నివారించారు.లవంగాలతో ఆర్గానిక్‌ విధానంలో కీటక నాశనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. ఒక లీటర్ నీటిని ఒక గిన్నెలో పోసుకుని, దాంట్లో పది నుంచి పన్నెండు లవంగాలు వేసుకోవాలి. ఆ నీటిని అరలీటర్‌ అయ్యే దాకా సన్నని మంట మీద మరిగించాలి. అప్పటికి లవంగాల్లోని శక్తివంతమైన సారం అంతా నీటిలో కలిసిపోతుంది. అప్పటికి నీరు కూడా రంగు మారి, పలచని టీ డికాక్షన్‌ మాదిరిగా అవుతుంది. అలా తయారైన లవంగ నీటిని చల్లారబెట్టుకుని ఓ సీసాలో పోసుకోవాలి. సీసా మూతకు సన్నని రంధ్రాలు చేసి, నీటిని మొక్కలపై స్ప్రే చేసుకోవాలి. లవంగం నీటి ఘాటుకు మొక్కల మీద ఉన్న క్రిమి కీటకాలు చనిపోతాయి. ఆకుల కింద ఉండే ఫంగస్‌ కూడా నివారణ అవుతుంది. సాధారణంగా జామ, గులాబీ మొక్కలపై ఇలాంటి ఫంగస్ ఏర్పడుతుంది. టమోటా, మిర్చి మొక్కలకు కనిపించే ఆకుముడత తెగులు కూడా లవంగాల ద్రావణం నివారిస్తుంది.లవంగాలతో శక్తివంతమైన కీటక నాశనిని పైన చెప్పిన విధంగా అంతకన్నా ఎక్కువ మోతాదులో కూడా అవసరమైన వారు తయారుచేసుకోవచ్చు.  అయితే.. ఏ పురుగుమందునైనా మొక్కలకు గానీ, పొలంలో గానీ స్ప్రే చేయడానికి ఉదయం, సాయంత్రం వేళలు మాత్రమే అనువైన సమయాలని అర్థం చేసుకోవాలి. ఎండగా ఉన్న సమయంలో ఏ పురుగుమందునైనా మొక్కలపై చల్లకూడదు. లవంగాల కీటక నాశనితో మరో ప్రయోజనం కూడా ఉంది. మొక్కలకు మిల్లిబగ్స్ ఉన్నప్పుడు వాటి కోసం చీమలు తప్పకుండా వస్తాయి. ఆ మిల్లీబగ్స్‌ ను చీమలు ఒక మొక్క నుంచి మరో మొక్కకు చేరవేస్తాయి. లవంగాల ద్రావణాన్ని స్ప్రే చేసినప్పుడు మొక్కల దరిదాపులకు కూడా రాకుండా చీమలు పారిపోతాయి. అంటే చీడపీడలు ఒక మొక్క నుంచి మరో మొక్కకు విస్తరించే అవకాశం ఉండదు.లవంగాల ద్రావణాన్ని మనం మొక్కలపై క్రిమి కీటకాలు ఆశించినప్పుడు మాత్రమే కాకుండా.. అవి రాక ముందు కూడా స్ప్రే చేసుకుంటే.. మరింత మేలు. లవంగాల ద్రావణం చల్లిన మొక్కలను క్రిమి కీటకాలు ఆశించవు. చీమలు కూడా చేరవు. దీంతో మొక్కలకు చక్కని పెస్ట్‌ కంట్రోల్ చేసినట్లవుతుంది. లవంగాల ద్రావణాన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. దానికి అదనంగా నీటిని కలపకుండా నేరుగా మొక్కలకు స్ప్రే చేసుకోవాలి. లవంగాల ద్రావణాన్ని మొక్కల ఆకుల ముందు, వెనక భాగాలు తడిసేలా స్ప్రే చేసుకుంటే ప్రయోజనం మరింత ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మొక్కలకు క్రిమి కీటకాలు ఎక్కువగా ఉన్నట్లయితే.. వారానికి రెండు సార్లు స్ప్రే చేసుకుంటే మరింత ఫలితాన్నిస్తుంది.రసాయనాలతో తయారైన పురుగుమందులు వాడినప్పుడు మనం ఆయా పంట ఉత్పత్తులను ఆహారంగా తింటే కొన్ని కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి.  అయితే.. లవంగాల ద్రావణం వినియోగించిన పండ్లు, కాయగూరలు తిన్నవారికి ఎలాంటి హానీ జరగదని శ్రేష్ట గార్డెన్ సంపూర్ణ చెబుతున్నారు.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే లవంగాలు మన తోటలోని మొక్కలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. లవంగాల ద్రావణం వాడితే మన తోట పెస్ట్‌ ఫ్రీ గార్డెన్‌ అవుతుంది. చక్కని ఫలాలు, ఫలితాలు ఇస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here