పసుపురంగు మిర్చి.. మనం ఇప్పుడిప్పుడే వింటున్న మాట ఇది. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. సాధారణ మిర్చితో పోలిస్తే.. కేవలం ఐదు శాతం మాత్రమే కారంపాళ్లు ఉండే రకం ఇది. పిల్లలంతా ఇష్టంగా తినే ‘లేస్’, చిప్స్‌ లాటి తయారీలో వాడతారు. స్టార్‌ హొటళ్లలో పెప్పర్ పౌడర్‌ మాదిరిగానే కాకుండా వంటకాల్లో కూడా బాగా వినియోగిస్తారు. కాస్మొటిక్స్‌ లో కూడా పసుపుమిర్చిని వాడుతున్నట్లు చెబుతారు. మలేసియా, సింగపూర్‌, థాయ్‌ లాండ్‌ లాంటి దేశాల్లో మంచి డిమాండ్ ఉంది.సాధారణంగా మనందరం వాడుకునే ఎర్రమిర్చి కంటే పసుపు మిర్చి ధర ఎక్కువ పలుకుతుంది. ఎకరం భూమిలో కనీసం 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. పంట చేతికి వచ్చిన వెంటనే అమ్ముకుంటే క్వింటాలుకు రూ.35 నుంచి 40 వరకు ధర లభిస్తుంది. కోల్డ్ స్టోరేజిలో ఒక సీజన్ పాటు నిల్వ చేసుకుని అమ్ముకుంటే 65 వేల నుంచి లక్ష, లక్షా పాతిక వేల దాకా ధర వచ్చే అవకాశం ఉంది. పంట కోసిన వెంటనే ఆరబెట్టి అమ్మేసినా ఖర్చులన్నీ పోగా కనీసం మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకూ లాభం పసుపుమిర్చిలో ఉంటుంది.ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం రైతు పీ.ఉపేందర్‌ పసుపుమిర్చిని ఈ ఏడాదే పండించారు. సుమారు ఎకరం నేలలో తాను వేసిన పసుపుమిర్చి తొలి కాపులో ఎండబెట్టిన తర్వాత మూడు క్వింటాళ్లు వచ్చిందని, రెండో కోతలో పది క్వింటాళ్లు వచ్చిందని, మూడో కోతలో మరో రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని తెలిపారు. కాలాస్‌ అనే పేరున్న పసుపుమిర్చి కాస్త లావుగా ఉంటుంది. దీంట్లోనే కొద్దిగా సన్నరకం కూడా ఉందని అంటారు. అయితే.. దాన్ని ఎక్కడ పండిస్తున్నారో పూర్తి సమాచారం లేదు.ఎర్రమిర్చి పంట వేసుకునే సమయంలోనే పసుపుమిర్చి కూడా సమాంతరంగా సాగు చేసుకోవచ్చు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో తిరుమల నర్సరీలో క్వాలిటీ ఉన్న పసుపుమిర్చి నారు దొరుకుతుంది. ఎరం భూమిలో 8 వేల పసుపుమిర్చి మొక్కలు నాటుకోవచ్చు. ఒక్కో పసుపుమిర్చి మొక్క ధర మూడున్నర రూపాయల ఉంటుంది. తేజ లాంటి మామూలు రకం మొక్కలు రూపాయిన్నర, రెండు రూపాయలకు దొరుకుతాయి. సాధారణ మిర్చి మొక్క కన్నా పసుపుమిర్చి మొక్కకు ధర రెట్టింపు ఉంటుంది. అయితే.. పంట చేతికి వచ్చాక దాని ధర కూడా బాగా ఎక్కువగా లభించడం గమనార్హం.పసుపుమిర్చి సాగు కోసం పెట్టిన పెట్టుబడికి, దానికి వచ్చే ధరను చూసుకుంటే ఎకరంలో పది క్వింటాళ్ల దిగుబడి వచ్చినా లాభదాయకమే అని ఉపేందర్ చెప్పారు. ఆపైన వచ్చే దిగుబడి అంతా బోనస్‌ గా పరిగణించవచ్చు. ఎర్రమిర్చితో పోల్చుకుంటే పసుపుమిర్చి సాగుకు పెద్దగా శ్రమించాల్సి అవసరం ఉండదని ఉపేందర్‌ వివరించారు. మిర్చిని ఆశించే ఎర్రనల్లిని తట్టుకునే శక్తి పసుపుమిర్చికి ఉందని ఉపేందర్ తన అనుభవంతో తెలిపారు. ఎర్రమిర్చికి పెట్టినన్ని పర్యాయాలే పసుపుమిర్చికి కూడా నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది.ఎకరంలో 8 వేల పసుపుమిర్చి మొక్కలు నాటుకుంటే.. సుమారు రూ.25 నుంచి 26 వేలు అవుతుంది. దుక్కి దున్నేందుకు మరో మూడు వేల రూపాయలు ఖర్చు ఉంటుంది. మొక్కలు నాటేందుకు రూ.5 వేలు అవుతుంది. ఎరువులు, పురుగుమందులకు కలిపి 40 నుంచి 50 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. పసుపుమిర్చి పండిన తర్వాత తొలి కోతకు రూ10 వేలు, రెండో కోతకు రూ.15 వేలు వరకు ఖర్చు ఉంటుంది. మొత్తం మీద పసుపుమిర్చి పంట వేసింది మొదలు పంట పూర్తిగా చేతికి వచ్చే వరకూ లక్షా 20 వేల వరకు పెట్టుబడి ఉంటుంది. పసుపు మిర్చి దిగుబడి వచ్చిన వెంటనే అయితే.. క్వింటాలుకు రూ.35 నుంచి 40 మధ్య ధర పలుకుతుంది. ఎకరం పొలంలో సాగుచేస్తే మొత్తం 15 క్వింటాళ్లు దిగుబడి వచ్చిందనుకుంటే.. రూ.5 లక్షల 25 వేలు దాకా ఆదాయం కనిపిస్తుంది. అంటే పెట్టిన పెట్టుబడి లక్షా 20 వేలు తీసేస్తే తక్కువలో తక్కువ రూ.4 లక్షల లాభం ఉంటుంది. కోల్డ్ స్టోరేజిలో నాలుగు నెలలు భద్రపరిచి అమ్ముకుంటే లాభాలు మరింత ఎక్కువగా వస్తాయి. 40 నుంచి 50 కిలోలు ఉండే బస్తా మిర్చికి ఒక సీజన్‌ కాలం భద్రపరిచేందుకు రూ. 200 నుంచి రూ.220 వరకు అద్దె తీసుకుంటారు. కోల్డ్ స్టోరేజిలో పెట్టిన పసుపుమిర్చికి దిగుబడి వచ్చినప్పటి ధర కన్నా మూడు రెట్టు ఎక్కువ లభిస్తుంది.అంతర్జాతీయ మార్కెట్‌ లో పసుపుమిర్చికి భారీ డిమాండ్‌ ఉంది. మలేసియా, సింగపూర్‌, థాయ్‌ లాండ్‌ లాంటి దేశాల్లో పసుపుమిర్చి వినియోగం ఎక్కువగా ఉంటుంది. చిన్పపిల్లలు మొదలు పెద్దవారి వరకు ఇష్టంగా తినే చిరుతిండి ‘లేస్‌’, చిప్స్‌ తయారీలో పసుపుమిర్చి వాడతారంటారు. కాస్మొటిక్స్‌ లో కూడా వాడతారని కొందరు చెబుతారు. ఫైవ్‌ స్టార్ హొటళ్లలో వండే ఆహార పదార్థాల్లో, పెప్పర్ పొడి మాదిరిగా కూడా పుసుపుమిర్చి వాడతారని అంటారు.పసుపుమిర్చి సాగు, దిగుబడి ఇప్పుడు తక్కువగా ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంది. ధర కూడా అదే విధంగా పలుకుతోంది. అయితే.. ఎక్కువ మంది రైతులు పసుపుమిర్చి సాగు చేస్తే.. ప్రస్తుతం ఉన్న ధర రాకపోవచ్చని, కాస్త తగ్గినా తగ్గవచ్చు. పసుపుమిర్చి సాగు గురించి పలువురు ఔత్సాహిక రైతులు తనకు ఫోన్లు చేస్తున్నారని, కొంతమంది రైతులు స్వయంగా వచ్చి చూసి, వివరాలు తెలుసుకుంటున్నారని ఉపేందర్‌ తెలిపారు. ఏదేమైనా పసుపుమిర్చి మీద రైతులకు ఇంకా పూర్తి అవగాహన రావడానికి మూడు నాలుగేళ్లు పట్టొచ్చు. అప్పటి దాకా దీనికి డిమాండ్‌ బాగానే ఉంటుందనడంలో సందేహం లేదు. వరంగల్ మార్కెట్‌ కు ఇటీవలే జనగాం నుంచి కొన్ని బస్తాల పసుపుమిర్చి వచ్చిందని ఉపేందర్‌ తెలిపారు. గుంటూరు మార్కెట్‌ లో పసుపుమిర్చి ఇప్పటికే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.మరిన్ని వివరాలు కావాలంటే రైతు ఉపేందర్‌ ను ఫోన్: 9848372912లో సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here