మన దేశంలో అంతరించిపోతున్న పశు జాతుల్లో పుంగనూరు ఆవులు అతి ముఖ్యమైనవి. క్రీస్తుశకం 610లో పుంగనూరు ఆవులను గుర్తించినట్లు శాసన ఆధారాలున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి తిరుపతి వరకు అప్పుడున్న అభయారణ్యంలో పుంగనూరు ఆవులు అభివృద్ధి చెందేవి. ఈ చిట్టిపొట్టి ఆవుల కోసం ఆ రోజుల్లో యుద్ధాలు కూడా జరిగేవని చరిత్ర చెబుతోంది. యుద్ధంలో గెలిచిన ప్రతాపానికి సూచనగా ఓడిన వారి పుంగనూరు ఆవులను తీసుకెళ్లేవారని చరిత్రకారులు చెబుతారు.పుంగనూరు జాతి ఆవులు మన దేశంలో పుంగనూరులోనే ఎక్కవగా కనిపిస్తాయి. దేశవాళీ ఆవుల్లో ప్రత్యేకమైన జాతి పుంగనూరు ఆవులు. పుంగనూరు జాతి ఆవులు 350 నుంచి 400 మధ్య వరకు ఇప్పుడు ఉన్నట్లు సమాచారం. కేరళలోని కొట్టాయం జిల్లా వేచూరులో కూడా కొన్ని చిట్టిపొట్టి ఆవులు ఉన్నాయి. అవి ఎరుపు రంగులో ఉంటాయి. పుంగనూరు ఆవులు తెల్ల, నల్ల, గోధుమ రంగుల్లో ఉంటాయి. పుంగనూరు ఆవులు రెండున్నర నుంచి 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ జాతి ఆవు తోక నేలకు తగిలేంత పొడవుగా ఉంటుంది.  విశాలమైన నుదురు ఉంటుంది. చర్మం లేతగా ఉండి, చిన్న పొదుగు, చిట్టి కొమ్ములతో చూడముచ్చటగా ఉంటుంది. లేత తమలపాకుల్లాంటి చిన్న చిన్న చెవులుంటాయి. మూపురం మాత్రం పెద్దగా ఉంటుంది. గంగడోలు బాగా కిందికి వస్తుంది. ముందు కాళ్లు కాస్త ఎక్కువ పొడవు ఉండి, వెనక కాళ్లు పొట్టిగా ఉంటాయి. వీటికి రోగనిరోధక శక్తి అధికం. ఎంత కరువు పరిస్థితినైనా, ఎంతటి ఎండ, చలినైనా తట్టుకుంటాయి. ఒక్కో పుంగనూరు జాతి ఆవు బరువు 115 నుంచి 200 కిలోల దాకా ఉంటుంది. రోజుకు 5 కిలోల దాణా తింటాయి. అందుకే పుంగనూరు జాతి ఆవులను పెంచడం రైతులకు ఎంతో సులువు అని చెప్పొచ్చు. పుంగనూరు ఆవులు ఇంటిలో పెంచుకుంటే మంచిదనే సెంటిమెంట్ కూడా కొందరు రైతుల్లో ఉంది.పుంగనూరు ఆవు పాల ధర మామూలు ఆవులిచ్చే పాలకన్నా ఎక్కువ ఉంటుంది. వీటిలో తెలుపు, నలుపు రంగు ఆవుల పాలు, పెరుగు, నెయ్యికి బాగా గిరాకీ ఉంది. పుంగనూరు ఆవు పాలలో ఎక్కువగా ఔషధ గుణాలు ఉండడమే దీనికి కారణం. పుంగనూరు ఆవు పాలలో 8 శాతం కొవ్వు ఉంటుంది. రోజుకు 2 నుంచి 4 లీటర్ల దాకా పాలు ఇస్తుంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి అభిషేకంలో కూడా పుంగనూరు ఆవుపాలు వాడుతున్నారు. మన ఇంట్లోని చిన్న పిల్లల మాదిరిగా మనతో పాటు బాగా కలిసిపోయి ఇంట్లోనే తిరుగుతాయి. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న పుంగనూరు ఆవు ధర రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతుంది.పుంగనూరు జాతి ఆవులను ఇష్టంతో పెంచుతున్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పాత ఊరు రైతు సానబోయిన గోపి అనుభవాలేంటో తెలుసుకుందాం.

పుంగనూరు ఆవులను పెంచడం చాలా సులువు అని గోపి వీటి పెంపకం చేపట్టారు. పూర్వీకుల నుండీ వ్యవసాయ కుటుంబానికి చెందిన గోపి 2015లో తన ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత 2018 నుంచి పుంగనూరు ఆవులను పెంచుతున్నట్లు చెప్పారు. ఒక పుంగనూరు ఆవును, గిత్తను లక్ష రూపాయలతో కొనుక్కుని ఇంటిలో పెట్టుకున్నామన్నారు. ఇప్పుడు తాను పదిహేను పుంగనూరు ఆవులను పెంచుతున్నానన్నారు. పుంగనూరు ఆవులను పెంచేందుకు ఒక్క మనిషి సరిపోతారు. మామూలు జాతి ఆవులను పెంచాలంటే కనీసం ముగ్గురు మనుషులు కావాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడిప్పుడే పుంగనూరు ఆవుల పెంపకం పట్ల పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారని గోపీ చెప్పారు. తమిళనాడు, బెంగళూరు, కేరళ ఇలా పలు రాష్ట్రాల రైతులు పుంగనూరు ఆవుల పెంపకం పట్ల మక్కువ చూపిస్తున్నారు. కాస్త ఖరీదు ఎక్కువే అయినా వారు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసుకుని తీసుకెళ్తున్నారు. వ్యాపార దృష్ట్యా చూసినా పుంగనూరు ఆవుల పెంపకంతో లాభమే కానీ నష్టం లేదని గోపి అన్నారు.స్వచ్ఛమైన తెల్ల రంగు ఒరిజినల్ పుంగనూరు ఆవుకు 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు ధర పలుకుతుంది. దాని ఎత్తును బట్టి క్వాలిటీని నిర్ణయిస్తారు. పుంగనూరు ఆవు హెవీ సైజ్‌ అంటే 35 నుంచి 36 అంగుళాల ఎత్తు ఉంటుంది. అంతకన్నా ఎంత ఎత్తు తగ్గుతుంటే దాని ఖరీదు అంత ఎక్కువ పలుకుతుంది. చెవులు చిన్నగా ఉండాలి, తోక నేలను తగిలేలా ఉండాలి. కాళ్లు లావుగా ఉండాలి. గంగడోలు పెద్దగా ఉంటుంది. పుంగనూరు గిత్త మూపురం నంది విగ్రహానికి ఉన్నట్లు ఉంటుంది. కొన్ని పుంగనూరు గిత్తల మూపురం అయితే.. పక్కకు ఒరిగినట్లు ఉంటుంది.పుంగనూరు ఆవు దూడను ఈనిన తర్వాత తొలి రోజుల్లో తల్లి పాలను పూర్తిగా దూడకే పట్టాలని తెలిపారు. దూడలకు కాస్త వయస్సు వచ్చిన తర్వాత తల్లి ఆవుకు మిల్లర్ మిక్సర్‌ దాణా, కాల్షియం, పోషక విలువలు అందిస్తే సరిపోతుందన్నారు. ఇలా చేస్తే తల్లి ఆవు త్వరగా ఎదకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మామూలుగా పుంగనూరు ఆవు ప్రతి 20 రోజులకు ఒకసారి ఎదకు వస్తుందని గోపి అనుభవంతో చెప్పారు. తొలిసారిగా కొనుక్కున్న పుంగనూరు ఆవు రెండు సార్లు క్వాలిటీ గిత్తల్ని పెట్టిందని, వాటిని ఒక్కోదాన్ని రూ.30 వేలు చొప్పున అమ్మినట్లు గోపి చెప్పారు. పుంగనూరు ఆవు తన జీవిత కాలంలో పది నుంచి 12 ఈతల వరకు ఈనుతుంది.ఒంగోలు లాంటి జాతి ఆవులను పెంచడం ఈ రోజుల్లో అత్యంత ఖర్చుతో కూడుకున్నదని, పుంగనూరు ఆవులైతే అంత కష్టం, ఖర్చు ఉండదని గోపి చెప్పారు. రోజు మొత్తంలో పుంగనూరు ఆవు 8 లీటర్ల నీరు తాగ గలుగుతుందని, రోజంతా తిన్నా నాలుగైదు కిలోల దాణా తింటుందన్నారు. అదే మామూలు జాతి ఆవుకు చాలా రోజుకు 40 నుంచి 50 కిలోల దాణా అందించాల్సి ఉందని చెప్పారు. పుంగనూరు ఆవు బాడీ చిన్నది కాబట్టి తొలిసారి ఈనినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడొచ్చన్నారు. తర్వాతి ఈతల నుంచి ఎలాంటి సమస్యలు ఉండవన్నారు.  పుంగనూరు గిత్తతో ఆవును క్రాస్ చేసినప్పుడు కూడా ఇబ్బంది రాదని, అదే వేరే గిత్త లేదా వీర్యం ఎక్కించినప్పడు ఆవు గర్భంలోని దూడ కాస్త సైజు పెరిగి కష్టం అవుతుందని రైతులు తెలుసుకోవాలన్నారు. పుంగనూరు ఆవుల పెంపకాన్ని పనివారి మీద విడిచిపెట్టకుండా రైతులు స్వయంగా చూసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని గోపి చెప్పారు. పుంగనూరు ఆవులను జాగ్రత్తగా గమనిస్తూ.. అవసరమైన వైద్యం చేయించాలని గోపి సూచించారు. ఈ టిప్స్ పాటిస్తే.. పుంగనూరు జాతి ఆవుల పెంపకంతో లాభమే గానీ నష్టం ఉండదని రైతు గోపి వెల్లడించారు.

 

 

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here