పక్షే గాని ఎగరలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్‌ అయితే.. రెండో అతి పెద్ద జాతి పక్షి. ఒక్కొక్కటి 6 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. 45 నుంచి 50 కిలోల వరకు బరువు ఉంటుంది. శాఖాహారమే బాగా ఇష్టపడుగుంది. చిన్న తల పొడవైన మెడ, మరింత పొడవైన కాళ్లుండే ఈ పక్షి గంటకు 4౦ కిలోమీటర్ల వేగంతో పరుగెట్టగలదు. వీటి మాంసం, గుడ్లు, నూనె, చర్మం, ఈకలు ఇలా ప్రతీదీ మనకు ఉపయోగపడతాయి. అదే ఈము పక్షి.ఈము పక్షి కొవ్వు నుండి ఖరీదైన నూనె తయారు చేస్తారు. ఈ నూనె కీళ్ల నొప్పులు, చర్మవ్యాధుల నివారణ ఔషధాల తయారీలో బాగా పనికొస్తుంది. ఈము మాంసంలో కొలెస్టరాల్‌ తక్కువ ఉంటుంది. ఈము చర్మంతో దుస్తులు, హ్యాండ్ బాగ్‌ లు, బూట్లు తదితర వస్తువులు తయారు చేస్తారు. ఈము పక్షి రకరకాల వాతావరణ శీతోష్ణస్థితులకు తొందరగా అలవాటు పడతాయి. డ్రోమియస్ ఉపజాతికి చెందిన ఈము పక్షులు ఏక సంయోగికాలు. అంటే ఒక మగ ఈము ఒక ఆడ ఈము మాత్రమే ఒక జతగా జీవిస్తాయి. ఒక జంటగా అయిన ఈము మగ, ఆడ పక్షులు ఇంకో ఈము పక్షితో సంగమించవు. 25 నుంచి 30 ఏళ్ల పాటు జీవిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్యలో మాత్రమే గుడ్లు పెడుతుంది. మగపక్షితో సంయోగం లేకపోయినా ఆడ ఈము పక్షి నవంబర్‌- ఫిబ్రవరి మాసాల మధ్య కాలంలో గుడ్లు పెడుతుంది. కాకపోతే మగపక్షితో సంగమించిన తర్వాత పెట్టే గుడ్లు మాత్రమే పిల్లలు తయారవడానికి పనికొస్తాయి.ఈము పక్షులు మనుషులతో చాలా బాగా కలిసిపోతాయి. మన దేశ వాతావరణ పరిస్థితులకు ఇవి చక్కగా ఇమిడిపోతాయి. తక్కువ వైశాల్యం ఉండే చోట్ల కూడా ఈము పక్షులను పెంచవచ్చు. ఎక్కువ పీచుపదార్థం ఉండే ఆహారం ఇచ్చి వీటిని చక్కగా పెంచుకోవచ్చు. ఈము పక్షి లేత ఆకులు, రకరకాల ఆకు కూరగాయలు, పళ్లు, కేరెట్లు, దోసకాయ, బొప్పాయి లాంటి వాటిని తింటుంది. ఈము పక్షులకు జీర్ణం అయ్యే మాంసకృత్తులు, పిండిపదార్థాలు ఉండేలా చూడాలి. లవణం మిశ్రమం, విటమిన్లు సరిపడే పాళ్లలో ఉంచాలి. సంతానోత్పత్తి సమయంలో మగపక్షి చురుగ్గా ఉంటుంది. అయితే.. జంటలో ఆడపక్షే డామినేటింగ్‌ గా ఉంటుంది. ఈము పక్షులకు శుభ్రమైన నీటిని నిరంతరం అందుబాటులో ఉంచాలి. ఈము కోళ్లను పెంచే ప్రదేశం ఎప్పుడూ పొడిగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.ఈము కోళ్లను వాణిజ్యపరంగా పెంచుతున్న రైతు అనుభవాలేంటో తెలుసుకుందాం. ఎన్టీఆర్ జిల్లా నున్నలో పూర్ణచంద్రారెడ్డి వాణిజ్య పంరంగా ఈము ఫార్మ్‌ నిర్వహిస్తున్నారు. ఈము కోడి ఏడాదికి 15 నుంచి 20 గుడ్లు మాత్రమే పెడుతుంది. గుడ్లు పెట్టే సమయంలో ఈము పక్షిమేత సరిగా తినదు. దాంతో బరువు బాగా తగ్గిపోతుంది. ఫిబ్రవరిలో గుడ్లు పెట్టడం ఆపేసిన తర్వాత మిగతా 8 నెలల కాలం అంతా ఈము పక్షి తన బరువును పెంచుకుంటాయి. రోజుకు కిలో దాణా వరకు తింటుంది. ఆ ఎనిమిది నెలలు ఆహారం తినడం, విశ్రాంతి తీసుకోవడమే వాటి పనిగా ఉంటుందని పూర్ణచంద్రారెడ్డి తెలిపారు. ఈము పక్షికి రెండేల్ల వయస్సు వచ్చినప్పటి నుండీ గుడ్లు పెడతాయి. ఈము పక్షికి 18 నెలల వయస్సు వచ్చినప్పటి నుంచి నూనె తయారీ కోసం కటింగ్‌ కు పంపించవచ్చన్నారు.ఈము పక్షిలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఈము పక్షికి ఇచ్చే ఆహారాన్ని బట్టి వైట్‌, యెల్లో రంగుల్లో ఫ్యాట్ తరారవుతుంది. దాంట్లో వైట్ ఫ్యాట్ అయితేనే మంచిదని పూర్ణచంద్రారెడ్డి తెలిపారు. అయితే.. పసుపు రంగులో ఉండే ఫ్యాట్‌ వచ్చిందంటే పాడైందని అర్థం చేసుకోవాలన్నారు. ఈము పక్షుల్లో పేరెంట్ బర్డ్‌ ను కట్‌ చేస్తే.. 13 కిలోల వరకు ఫ్యాట్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే.. ఈము పక్షులను 25 నుండి 26 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాతే కటింగ్ కు పంపిస్తామన్నారు.ఈము పక్షికి వ్యాధి నిరోధక శక్తి అత్యధికం. అందుకే వాటికి అనారోగ్య సమస్యలు చాలా తక్కువ వస్తాయని పూర్ణచంద్రారెడ్డి వివరించారు. అయితే.. వైరల్ డిసీజ్ లు వస్తే ఎన్ని బతుకుతాయో, ఎన్ని చనిపోతాయో అంచనా వేయలేం అన్నారు. అందుకే ఈము పక్షులను పరిశుభ్రమైన వాతావరణంలో, శుభ్రమైన నీరు, ఆహారం అందించి పెంచుకోవాల్సి ఉంటుంది. 2020లో తన ఫాంలోని ఈము పక్షులకు వైరల్ డిసీజ్ వచ్చి మొత్తం ఈము కోళ్లన్నీ చనిపోయాయని పూర్ణచంద్రారెడ్డి చెప్పారు. ఆ నష్టం నుంచి కోలుకుని మళ్లీ లాభసాటిగా ఈము కోళ్ల పెంపకాన్ని మార్చుకున్నట్లు తెలిపారు.కోళ్ల ఫాంలో ఎలాంటి మేత పెడతామో అలాంటి ఆహారాన్నే తాను తన ఫాంలోని ఈము పక్షులకు పెడుతున్నట్లు పూర్ణచంద్రారెడ్డి వివరించారు. మొక్కజొన్న, సోయాబీన్‌, సన్ ఫ్లవర్‌, రేప్ సీడ్‌ వాటితో పాటు అవసరమైన మందులతో కలిపి పెడుతున్నట్లు చెప్పారు. ఆరోగ్యంగా ఉండేపెద్ద ఈము పక్షి రోజుకు 800 గ్రాముల నుంచి కిలో వరకు తింటుంది. ఫీడ్ తీసుకోవడం తగ్గించిందంటే.. దానికేదో అనారోగ్య సమస్య ఉందని అర్థం చేసుకుని, సరైన ట్రీట్ మెంట్‌ చేయించాలన్నారు. ఈము పక్షులకు ఉదయం 6 నుండి 7 గంటల మధ్య, మధ్యాహ్నం 11 నుండి 12 గంటల మధ్య, సాయంత్రం 4 గంటలకు ఫీడ్ ఇస్తామన్నారు. ఇక రాత్రిపూట ఎలాంటి ఫీడ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పరిశుభ్రమైన నీరు ఈము పక్షులకు అందుబాటులో ఉంచితే సరిపోతుంది.2008లో సుమారు 5 నెలల వయసు ఉన్న ఈము పక్షి పిల్లల్ని ఒక్కొక్కటి రూ.7 వేలు చొప్పున తీసుకుని పెంచడం ప్రారంభించారు పూర్ణచంద్రారెడ్డి. తర్వాత కష్టనష్టాలు అనుభవంతో తెలుసుకున్నారు. ఈము పక్షులకు ఫీడ్ సరిగా ఇవ్వలేక ఇబ్బందులు పడ్డట్టు చెప్పారు. 2013 నుంచి అమెరికా ఎగుమతి చేసేందుకు అవకాశం వచ్చినప్పటి నుంచీ లాభాలు చవిచూస్తున్నట్లు వెల్లడించారు. ఈము పక్షుల పెంపకాన్ని వాణిజ్య పరగంగా చేయాలనుకునే కొత్తగా రైతులు ముందుగా మార్కెటింగ్ అవకాశాలను అధ్యయం చేస్తే మంచిదని పూర్ణచంద్రారెడ్డి సూచించారు. ఈము పక్షులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అయినప్పటికీ ముందుగానే ఎగుమతి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటే నష్టాలు ఉండవని, లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. ఈము పక్షుల గుడ్ల నుంచి 60 నుంచి 70 శాతం వరకే పిల్లలు ఉత్పత్తి అవుతాయి. సైజు చాలా పెద్దగా 600 నుంచి 800 గ్రాముల వరకు బరువు ఉండే ఈము పక్షి గుడ్లు కూడా ఆహారంగా తీసుకోవచ్చు. ఆమ్లెట్ లా వేసుకుని తినవచ్చు. ఈము పక్షి గుడ్డు రుచి నాటుకోడి గుడ్డు మాదిరిగా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం ఈము పక్షి గుడ్లను అంతగా వినియోగించడంలేదు. ఈము పక్షి రెండేళ్ల వయస్సు నుంచి గుడ్లు పెడుతుంది. మూడో ఏట నుంచి అవి గుడ్లు ఎక్కువగా పెడతాయి. మగపక్షి లేకపోయినా ఆడపక్షి గుడ్లు పెడుతుంది. కాకపోతే ఆ గుడ్డు నుంచి పిల్ల తయారవదు. ఈము పక్షి వయస్సులో ఉన్నప్పుడు 15 నుంచి 20 గుడ్లు పెడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ గుడ్లు పెట్టడం తగ్గే అవకావం ఉంటుంది. ఈము గుడ్డు 52 రోజులకు పొదిగే సమయం పూర్తవుతుంది.కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం ఈము పక్షి సంతానోత్పత్తి దశలో ఉన్నప్పుడు ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది. జతకట్టే దశలో ఉన్న ఈము పక్షుల జంట ఆహారానికి ఏడాదికి రూ.3,600 ఖర్చు అవుతుందని అంచనా. సో ఖర్చు కాస్త ఎక్కవే అయినా.. ఈము పక్షుల పెంపకంతో లాభాలు కూడా అలాగే ఉంటాయని రైతు పూర్ణచంద్రారెడ్డి చెప్పారు. ఎన్నో ఆరోగ్య లాభాలు, ఉపయోగాలు ఉండే ఈము పక్షుల పంపకాన్ని చేపట్టడం రైతులకు ఆర్థికంగా లాభదాయకం అనే చెబుతున్నారు అనుభవజ్ఞులైన రైతులు. కాకపోతే.. వాటి ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారం, నీటి విషయంలో మరికాస్త ఎక్కువ జాగ్రత్త అవసరం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here