దేశంలో ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ‘ప్రధానమంత్రి వృక్ష ఆయుష్ యోజన’ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆయుర్వేద, యోగా ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి మంత్రిత్వశాఖ సహాయమంత్రి (అదనపు బాధ్యతలు) కిరణ్ రిజిజు ఈ విషయం తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన మంత్రి ఈ పథకానికి ఇంకా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుప వలసి ఉందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా ఆర్ధిక మంత్రిత్వశాఖ ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి 4,000 కోట్ల రూపాయల ప్యాకేజిని ప్రకటించింది. దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ ఈ పథకాన్ని అమలు చేస్తారు. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న జాతీయ ఆయుష్ మిషన్ కింద ఆయా రాష్ట్రాలలో ఎంపిక చేసిన ఆయా జిల్లాల్లో ఔషధ మొక్కలను సాగుచేయడానికి, వాటికి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం ఈ క్రింది మార్గదర్శకాల ప్రకారం అమలు చేయడం జరుగుతుంది.
i) రైతుకు చెందిన భూమిలో ప్రాధాన్యత కలిగిన ఔషధ మొక్కల పెంపకం
ii) నాణ్యమైన మొక్కలను అందించడానికి నర్సరీలను నెలకొల్పడం
iii) కోతల తరువాత పంటలను సంరక్షించడం
iv) ప్రాథమిక శుద్ధి, మార్కెటింగ్ సౌకర్యాల కల్పన
ఈ పధకం కింద 140 రకాల ఔషధ మొక్కల సాగుకు 30%, 50%, 70% వరకు సబ్సిడీగా అందిస్తారు.

కాగా, ఆయుష్ మంత్రిత్వ శాఖ, జాతీయ ఔషధ మొక్కల బోర్డులు అమలు చేస్తున్న ‘ఔషధ మొక్కల పరిరక్షణ, అభివృద్ధి, సుస్థిర యాజమాన్య’ పథకంలో భాగంగా ఈ కింది కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
i) పొలాలు /పొలాల వెలుపల సంరక్షణ
ii) ఉమ్మడి అటవీ నిర్వహణ కమిటీలు (జెఎఫ్‌ఎంసి) / పంచాయతీలు / వాన్ పంచాయతీలు జీవవైవిధ్య నిర్వహణ కమిటీలు (బిఎంసిలు) / స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జి) లతో జీవనోపాధి కార్యక్రమాల అనుసంధానం
iii) శిక్షణ / వర్క్‌షాప్‌లు / సెమినార్లు / సమావేశాలు లాంటి ఐఇసి కార్యకలాపాలు
iv) పరిశోధన-అభివృద్ది
v) ఔషధ మొక్కల ఉత్పత్తులకు ప్రోత్సాహం, మార్కెటింగ్, వ్యాపారం
ఇంతవరకు జాతీయ ఆయుష్ మిషన్ పథకం కింద ఆయుష్ మంత్రిత్వశాఖ 56,396 హెక్టార్లలో ఔషధ మొక్కల సాగుకు సహకారం అందించిందని మంత్రి వివరించారు. 2015-16 నుంచి 2020-21 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించి ఔషధ మొక్కల సాగు జరుగుతున్న భూముల వివరాలను మంత్రి తెలిపారు. ఇదిలావుండగా, ఆయుష్ మంత్రిత్వశాఖ సిద్ధం చేసిన ‘ప్రధానమంత్రి వృక్ష ఆయుష్ యోజన’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించిన తరువాత దేశవ్యాప్తంగా దానిని అమలు చేస్తారు.

మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
National Medicinal Plants Board,
Ministry of AYUSH, Government of India,
Indian Red Cross Society (IRCS),
Annexe Building, 1st & 2nd floor,1 Red Cross Road, New Delhi-110001,
Website : www.nmpb.nic.in
Tel : 011-23721840
E-Mail ID : info-nmpb@nic.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here